Home తాజా వార్తలు కవిత ఏకగ్రీవం

కవిత ఏకగ్రీవం

Kavitha to be elected unanimously to TS legislative council

నిజామాబాద్ స్థానిక సంస్థల ఎంఎల్‌సిగా కల్వకుంట్ల కవిత ఏకగ్రీవ ఎన్నిక ఖాయం
స్వతంత్రుల నామినేషన్లు తిరస్కరణకు గురైన కారణంగా నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఏకగ్రీవం కానున్న మూడు స్థానాలు
ఏడు జిల్లాల్లో జరగనున్న పోలింగ్
కరీంనగర్‌లో 3, మహబూబ్‌నగర్‌లో 6, నల్లగొండలో 3, మెదక్‌లో 3 నామినేషన్ల తిరస్కరణ
ఆదిలాబాద్‌లో 24, ఖమ్మంలో 4 నామినేషన్లు ఓకే
ఉపసంహరణకు రేపు తుది గడువు

మనతెలంగాణ/హైదరాబాద్ : స్థానిక సంస్థల కోటా శాసనమండలి ఎన్నికల్లో నామినేషన్ల పరిశీలన ఘట్టం ముగిసింది. స్వతంత్రుల నామినేషన్లు తిరస్కరణకు గురికావడంతో నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాలో మూడు స్థానాలు ఎకగ్రీవం కానున్నాయి. ఇక మిగిలిన జిల్లాల్లో గురు, శుక్రవారాల్లో నామినేషన్ల ఉపసంహరణకు అవకాశముంది. డిసెంబరు 10న స్థానిక సంస్థల కోటా ఎంఎల్‌సి ఎన్నికల పోలింగ్ జరగనుంది. నిజామాబాద్ స్థానిక సంస్థల ఎంఎల్‌సి ఎన్నిక ఏకగ్రీవం కానుంది. స్వతంత్ర అభ్యర్థి కోటగిరి శ్రీనివాస్ నామినేషన్‌ను అధికారులు తిరస్కరించారు.

శ్రీనివాస్‌కు తాము మద్దతివ్వలేదని ఎంపిటిసి నవనీత, కార్పోరేటర్ రజియా సుల్తానా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దాంతో శ్రీనివాస్ నామినేషన్‌ను అధికారులు తిరస్కరించారు. దీంతో సిట్టింగ్ ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. రంగారెడ్డి జిల్లాలో స్వతంత్ర అభ్యర్థి చలిక చంద్రశేఖర్ నామినేషన్ తిరస్కరించారు. ప్రతిపాదిత వ్యక్తుల సంతకాలు లేవని అధికారులు స్పష్టం చేశారు. పోటీలో టిఆర్‌ఎస్ అభ్యర్థులు పట్నం మహేందర్‌రెడ్డి, శంభీపూర్ రాజు మాత్రమే మిగలడంతో, వారి ఎన్నిక ఏకగ్రీవం కానుంది. ఈనెల 26న ఎన్నికల అధికారులు ఈ మేరకు అధికారికంగా ప్రకటించనున్నారు.

మిగిలిన చోట్ల పోలింగ్..
ఆదిలాబాద్ జిల్లా ఎంఎల్‌సి నామపత్రాల పరిశీలన పూర్తయింది. 24 మంది వేసిన నామినేషన్లు సరిగ్గా ఉన్నాయని అధికారులు తెలిపారు. కరీంనగర్‌లో 27 మంది నామినేషన్లలో ముగ్గురివి తిరస్కరణకు గురయ్యాయి. రెండు స్థానాల కోసం 24 మంది బరిలో ఉన్నారు. మహబూబ్‌నగర్‌లో 10 మంది నామినేషన్లు దాఖలు చేయగా…. ఆరుగురి నామినేషన్లు తిరస్కరించారు. టిఆర్‌ఎస్‌కు చెందిన కసిరెడ్డి నారాయణరెడ్డి, దామోదర్‌రెడ్డిలతోపాటు ఇద్దరు స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్లు ఆమోదం పొందాయి. నల్గొండ జిల్లాలో దాఖలైన 11 నామినేషన్లలో… 3 తిరస్కరణకు గురికాగా… 8 మంది బరిలో మిగిలారు. మెదక్ జిల్లాలో ముగ్గురి నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. ఐదుగురి నామపత్రాలను అధికారులు ఆమోదించారు. ఖమ్మం జిల్లాలో దాఖలైన 4 నామినేషన్లకు అధికారులు ఆమోద ముద్రవేశారు.

రేపటి వరకు ఉపసంహరణకు గడువు
నామినేషన్ల ఉపసంహరణకు గురువారం, శుక్రవారాలలో అవకాశం ఉంది. అభ్యర్థులు పోటీలో ఉన్న స్థానాల్లో డిసెంబర్ 10న పోలింగ్ జరగనుంది.

Kavitha to be elected unanimously to TS legislative council from nizamabad