Home తాజా వార్తలు అగ్రిబిల్లు తేనె పూసిన కత్తి

అగ్రిబిల్లు తేనె పూసిన కత్తి

KCR directs TRS MPs to vote against farm bills

 

రాజ్యసభలో వ్యతిరేక ఓటేయండి
ఎంపిలకు సిఎం కెసిఆర్ ఆదేశం
కార్పొరేటు గద్దలు దేశమంతంటా విస్తరిస్తాయి

ప్రైవేటు వ్యాపారులకు దారులు బార్లా తెరిచేందుకు బిల్లు ఉపయోగపడుతుంది
దేశ వ్యవసాయ రంగం, రైతుల ప్రయోజనాలకు తీవ్ర విఘాతం
మక్కలపై సుంకాన్ని 15 శాతానికి తగ్గించడం ఎవరి ప్రయోజనం కోసం
ఆర్థిక సంక్షోభ సమయంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడమేంటి? : కెసిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లు రైతు లోకానికి తీవ్ర అన్యాయం చేసే విధంగా ఉందని ము ఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అన్నారు. ఇది తేనె పూసిన కత్తిలాంటి చట్టమన్నారు. రైతులను దెబ్బ తీసి కార్పోరేటు వ్యాపారులకు లాభం చేకూర్చే విధంగా ఉందని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో బిల్లును గట్టిగా వ్యతిరేకించాలని టిఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కె. కేశవరావును ఆదేశించారు. రాజ్యసభలో వ్యవసాయ బిల్లు ప్రవేశపెడుతున్న సందర్భంలో ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించాల్సిన అవసరాన్ని సిఎం వివరించారు. కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన ఈ బిల్లు రైతులు పెద్దఎత్తున నష్టపోనున్నారన్నారు.

పైకి చెప్పడానికి రైతులు తమ సరుకును ఎక్కడైనా అమ్ముకోవచ్చని బిల్లులో చెప్పినప్పటికీ, వాస్తవానికి ఇది వ్యా పారులు ఎక్కడికైనా వెళ్లి సరకును కొనుగోళు చేయడానికి ఉపయోగపడే విధంగా ఉందని సిఎం కెసిఆర్ అభిప్రాయపడ్డారు. కొత్త విధానంతో కార్పోరేట్ గద్దలు దేశమంతా విస్తరించడానికి, ప్రైవేటు వ్యాపారులకు దారులు బార్ల చేయడానికి బిల్లు ఉపయోగపడనుందని కేశవరావుకు సిఎం ఉద్భోదించారు. బిల్లులో రైతులు తమ సరుకును దేశంలో ఎక్కడైనా అమ్ముకునే వెసులబాటు కల్పించాయని కేంద్రం పెద్దలు డబ్బా కొట్టుకుంటున్నారని సిఎం కెసిఆర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. నిజానికి రైతులు తమకున్న కొద్దిపాటు సరుకును ఎన్నో రవాణా ఖర్చులు భరించి లారీల ద్వారా వేరే చోటుకు తీసుకెళ్లి అమ్మడం సాధ్యమేనా? అని ఆయన ప్రశ్నించారు. దీన్ని మన ఎంపిలంతా ఖచ్చితంగా వ్యతిరేకించి తీరాలని సిఎం స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

ప్రస్తుతం మక్కల దిగుమతిపై 50 శాతం సుంకం అమలులో ఉందని సిఎం కెసిఆర్ అన్నారు. దీనిని 15 శాతానికి తగ్గించి కోటి టన్నుల మక్కలు దిగుమతి చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఇప్పటికే 70 నుంచి 75 లక్షల టన్నులను కొనుగోలు చేసిందన్నారు. ఇందులో 35 శాతం సుంఖం తగ్గియడం ఎవరి ప్రయోజనం ఆశించి చేసిందని సిఎం కెసిఆర్ ప్రశ్నించారు. దేశం ఆర్థిక సంక్షోభంలో ఉండే సమయంలో కేంద్రం ఈ నిర్ణయం ఎలా తీసుకుంటుందని నిలదీశారు. మన దేశంలోనే పుష్కలంగా మక్కలు పండుతున్నాయన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సుంకం తగ్గించి మరీ మక్కలు దిగుమతి చేస్తుంటే మన దేశ రైతుల పరిస్థితి ఏమిటి? ‘ అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. కేంద్రం తీసుకొచ్చిన బిల్లు వ్యవసాయ రంగానికి తీవ్ర నష్టం తీసుకొచ్చే విధంగా, రైతుల ప్రయోజనాలను దెబ్బ తీసే విధంగా ఉందన్నారు. కాబట్టి రాజ్యసభలో గట్టిగా వ్యతిరేకించాలని సిఎం చెప్పారు. రాజ్యసభలో ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాలని టిఆర్‌ఎస్ ఎంపీలను ఆదేశించారు.

KCR directs TRS MPs to vote against farm bills