Friday, April 19, 2024

జాతీయ రాజకీయాల్లో కొత్త శక్తి

- Advertisement -
- Advertisement -

దేశాభిమానం నాకు కద్దని వొట్టి గొప్పలు చెప్పుకోకోయి
పూని ఏదైనాను వొక మేల్ కూర్చి జనులకు చూపవోయి
మహా కవి గురజాడ అప్పారావు

The rate of increase in unemployment reached 7.6 percent

లోకమంతా చీకటి గుప్పెట్లో విలవిలలాడుతున్నప్పుడు అదే ఆకాశంలో ఉషస్సనే శిశూదయమవుతుంది. దేశం నేడున్న పరిస్థితిని చూస్తున్న వారు అటువంటి ఒక మహోదయం కోసం కల కంటున్నారు. ఈ విజయ దశమి వేళ తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు, ముఖ్యమంత్రి కెసిఆర్ నారి సారించి సంధిస్తున్న అస్త్రం లక్షమేమిటో అందరికీ తెలుసు. దేశ ప్రజలకు పరిపూర్ణమైన మేలు చేకూర్చే ఒక నూతన రాజకీయ శకావిష్కరణ కోసం ఆయన దృఢ సంకల్పం వహించారు. ఈ విషయాన్ని గత కొంత కాలంగా ప్రజలకు సవివరంగా తెలియజేస్తున్నారు. దేశంలో వున్న అపార వనరులకు ఇక్కడ పరచుకున్న దట్టమైన దారిద్య్రానికి బొత్తిగా పొంతన లేదని చెబుతున్నారు. కేంద్ర పాలకుల దుర్విధానాల వల్లనే ఈ దుస్థితి దాపురించిందని సూటిగా వెల్లడిస్తున్నారు. భారతీయ జనతా పార్టీని గద్దె దింపనిదే మంచి భవిష్యత్తు సాధ్యం కాదని ప్రకటించారు. బిజెపి ముక్త భారత్‌ను సాధించడమే తన లక్షమని స్పష్టం చేశారు. ఈ ప్రతిజ్ఞ పాలనలో తొలి అడుగును కెసిఆర్ నేడు వేయబోతున్నారు.
మతం వేరైతేను యేమోయి మనసు లొకటై మనుషులుంటే

దేశమనియెడి దొడ్డ వృక్షం ప్రేమలను పూలెత్తవలెనోయి అని మహా కవి చెప్పినట్టు మతాలకు, కులాలకు, భాషలకు, ప్రాంతాలకు అతీతంగా ప్రజలందరినీ సమీకరించి సంఘటిత పరిస్తే సాధించలేనిదంటూ వుండదు. కాని గత కాలపు వైషమ్యాలను తవ్వితీసి విద్వేషాగ్నులు రగిలిస్తూ దేశమంతటికి హిందుత్వ, మోడీత్వ నిప్పు అంటిస్తున్న ప్రస్తుత పాలకులు సాధించనున్నది విధ్వంసం, వినాశం తప్ప వేరేమీ వుండదు. దేశ జనాభాలో 88 శాతం మంది అంటే 80 కోట్లకు మించి 35 ఏళ్ల లోపు వయసు వారే. జనాభాలో 40 శాతం మంది 13 నుంచి 35 ఏళ్ల వారే. ఇంతటి యువ శక్తి వున్న దేశం ఎందుకిలా నీరసించి నీరుగారిపోయి వుంది? వీరికి ఆధునిక నైపుణ్యాల్లో సమగ్ర శిక్షణ ఇస్తే ఇండియా ఒక అమెరికా కంటే, చైనా కంటే అగ్ర భాగాన వుండదా? ఈ పనిని పక్కన పెట్టి మెజారిటీ మతస్థులను మైనారిటీలపైకి ఉసిగొల్పడం ద్వారా హిందూ ఓటును పెంచుకొని అధికారంలో కొనసాగాలనే కుట్రను అమలు చేయడం దేశ పాలకులకు తగిన పని ఎంత మాత్రం కాదు. కాని ప్రధాని మోడీ ప్రభుత్వం దీనికే విశేష ప్రాధాన్యమిస్తున్నది.

దీని మాటున దేశ ప్రజల శ్రమ ఫలాలైన పబ్లిక్ రంగ పరిశ్రమలను, సంస్థలను పాలకులు తమకు ఆప్తులైన కార్పొరేట్ పెట్టుబడిదారులకు ధారాదత్తం చేస్తున్నారు. ప్రజలను మతోన్మాద మత్తులో ముంచి పట్టపగటి దోపిడీకి సహకరిస్తున్నారు. ద్రవ్యోల్బణం ఎప్పుడూ లేనంతగా పేట్రేగిపోయి వుంది. రైతులను భూమి నుంచి దూరం చేయడానికి చేతనైన కుట్రలన్నీ పన్నుతున్నారు. వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టే పన్నాగం నిర్విరామంగా సాగుతున్నది. డాలరుతో రూపాయి మారకపు విలువ రూ. 81 దాటిపోడం కలలో సైతం ఊహించని ఉత్పాతం. దేశాన్ని ఇంత కంటె దిగజార్చడం సాధ్యం కాదనిపిస్తున్నారు. ధరలు మిన్నంటాయి, క్రూడాయిల్ అంతర్జాతీయ ధరలతో నిమిత్తం లేకుండా దేశంలో పెట్రోల్, డీజెల్ ధరలను శతాధికం చేసేశారు. పర్యవసానంగా రవాణా ఛార్జీలు పెరిగిపోయి అన్ని రకాల సరకులూ సాధారణ ప్రజలకు బొత్తిగా అందుబాటులో లేకుండా పోయాయి.

నిరుద్యోగం తీవ్ర స్థాయికి చేరుకున్నదని బిజెపి పాలకుల సైద్ధాంతిక గురువైన ఆర్‌ఎస్‌ఎస్ స్వయంగా అంగీకరించింది. ప్రజల మధ్య ఆర్థిక వ్యత్యాసాలు మరింత పెరిగిపోయాయని, జనాభాలో పై ఒక్క శాతం చేతిలోనే సంపద కేంద్రీకృతమైందని కూడా ఆర్‌ఎస్‌ఎస్ పెద్దలు స్వయంగా వెల్లడించారు. ఇంకొక వైపు రాష్ట్రాల హక్కులను హరిస్తూ సమాఖ్య వ్యవస్థకు సమాధి కడుతున్నారు. ప్రజాస్వామ్యానికి రక్షా కవచాలుగా వుండవలసిన దర్యాప్తు సంస్థలన్నింటినీ గుప్పెట్లో పెట్టుకొని రాజకీయ ప్రత్యర్థుల మీద ప్రయోగిస్తున్నారు ఇటువంటి లక్షణాలతో దేశాన్ని కాషాయ పాలకులు ఎక్కడికి తీసుకుపోదలచుకున్నారు? ఈ సూకా్ష్మన్ని గ్రహించిన కెసిఆర్ జాతీయ స్థాయిలో సరైన ప్రత్యామ్నాయం లేని శూన్యతను పూరించాలని సంకల్పించడం ఎంతైనా ఆహ్వానించదగినది. ఆయన నేడు ప్రకటించనున్న జాతీయ రాజకీయ పార్టీ జాతి జనుల ఆశలను, ఆకాంక్షలను నెరవేర్చుతుందని, దేశ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించాలని హృదయ పూర్వకంగా ఆశిద్దాం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News