Home తాజా వార్తలు కమిషన్లా, రుజువు చేసే దమ్ముందా రాహుల్?

కమిషన్లా, రుజువు చేసే దమ్ముందా రాహుల్?

KCR Fires on Rahul Gandhi in Bhupalapally Public Meeting

 

నువ్వు బెయిల్‌పై ఉన్నది నిజం కాదా?

ఆయకట్టును పెంచడానికే ప్రాజెక్టుల రీ డిజైనింగ్
ఏడాదిలోగా పోడు భూముల సమస్యకు పరిష్కారం
సంక్షేమంలో నెంబర్‌వన్‌గా ఉన్నాం
బిజెపి పాలిత ప్రాంతాలలో రైతుబంధు ఉందా..?
బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ తెచ్చే బాధ్యత నాది
తెలంగాణ దరిద్రానికి కాంగ్రెస్సే కారణం

మన తెలంగాణ/ఇల్లెందు, కొత్తగూడెం, మణుగూరు, ములుగు, భూపాలపల్లి, మంథని, పెద్దపల్లి, హైదరాబాద్: “రాహుల్ గాంధీ! రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులను కమిషన్ కోసం రీ డిజైన్ చేశామంటున్నావ్. మేం కమీషన్ తీసుకున్నట్లు రుజువు చేస్తవా..? నీకు దమ్ముందా? వస్తవా? పోదామా రుద్రకోట దగ్గరికి? మీ నాయన పేరుమీద ఉన్న రాజీవ్‌గాంధీ, ఇందిరాసాగర్, రాజీవ్‌సాగర్ ఎట్ల ఉన్నదో చూద్దామా? నేనే తీసుకపోతా.. రా.. దమ్ముంటే? దేవాదుల కాడికి నేనే తోలుకపోత..రా. నువ్వు పెట్టిన దేవాదుల ఎట్లున్నదో…ఇప్పుడెట్లున్నదో చూపిస్త. ఇష్టమొచ్చినట్లు కుళ్ళు, సొల్లు ఆరోపణలు చేయడం కాదు. తెలంగాణ కాంగ్రెస్ దద్దమ్మలు ఏది చెబితే అది విని పిచ్చి ప్రాజెక్టులు పెట్టారు. వాటిని తీసి అవతల పడేసి మాకు అవసరమైన ప్రాజెక్టుల్ని మేం కట్టుకుంటున్నాం.

నీకు తెలివిలేక దాన్ని కమిషన్ కోసం మార్చామంటున్నావ్. మాకు కావాలా కమిషన్.. కావాలంటే కమిషన్ మేమే ఇస్తాం కదా! ఎవరికి కావాలి నీ కమిషన్? మీ లాగ కమిషన్ల బతుకు కాదు మాది. పోరాటాలు చేసే బతుకు మాది. పదిహేను ఏండ్లు పేగులుతెగేదాక కొట్లాడినం. 15 సంవత్సరాల కితం మేము అన్నం తినకుంట, పస్తులుండి, అటుకులు తినుకుంట ఉద్యమం చేసినం. ఎవడిచ్చిండు మాకు కమిషనర్లు? మీ కుర్చీ గుంజే ప్రయత్నం చేసినం కాబట్టే మాకు తెలంగాణ ఇచ్చారు. నేషనల్ హెరాల్డ్ కేసులో బెయిల్ తీసుకుని బయటకి వచ్చి ఇప్పుడు నిజాయితీగా ఉన్న టిఆర్‌ఎస్ ప్రభుత్వంపై కమిషన్‌లు అని ఆరోపిస్తవా?” అని ముఖ్యమంత్రి కెసిఆర్ వ్యాఖ్యానించి రాహుల్‌గాంధీ చేసిన ఆరోపణలను నిరూపించాలని సవాల్ విసిరారు. ప్రజా ఆశీర్వాద సభ ల్లో భాగంగా ఇల్లెందు, కొత్తగూడెం, మణుగూరు (పినపాక), ములుగు, భూపాలపల్లి, మంథని, పెద్దపల్లి తదితర నియోజకవర్గాల్లో కెసిఆర్ శుక్రవారం అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు. నారాయణపేటను 32వ జిల్లాగా చేస్తామని ఆ నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో వ్యాఖ్యానించిన కెసిఆర్ శుక్రవారం ములుగు నియోజకవర్గంలో జరిగిన ప్రచారంలో 33వ జిల్లాగా చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు.

ఆయకట్టును పెంచడానికే ప్రాజెక్టుల రీ డిజైనింగ్
ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన లేకుండా సాగునీటి ప్రాజెక్టులకు డిజైన్ చేస్తే తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆయకట్టు విస్తీర్ణాన్ని పెంచడానికి రీడిజైన్ చేయాల్సి వచ్చిందని కెసిఆర్ వ్యాఖ్యానించారు. దేవాదుల ప్రాజెక్టును వరంగల్ జిల్లాకు 100 టిఎంసిల నీళ్లు తీసుకునే ప్రాజెక్టుగా రీడిజైన్ చేశామని స్పష్టంచేశారు. రామప్ప చెరువు నింపే పని పెట్టలేదని, కానీ ఇప్పుడు తాము అది చేపట్టామన్నారు. తెలంగాణ కాంగ్రెస్ దద్దమ్మలు ఢిల్లీకి బానిసలు పిచ్చిపిచ్చి డిజైన్లు చేసి నీళ్లు రాకుండా ఆంధ్ర ముఖ్యమంత్రులుగా, వారికి తొత్తులుగా వ్యవహరిస్తే దాన్ని అంతా మార్చి ఒక్కొక్క బొట్టు నీళ్లు వచ్చేటట్లు మన వాటాను దక్కించుకునేందుకు ఆ ప్రాజెక్టులకు రీడిజైన్ చేశామని కెసిఆర్ వివరించారు. “కమిషన్ల కోసం కాదు, కమిషన్ల బతుకు మీది. మాది కాదు. పచ్చ కామెర్లోడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తది. మీరు దొంగతనం చేసి బతికినోళ్లు కాబట్టి మీకు అందరూ అట్లనే కనిపిస్తున్నరు. కానీ మేం పోరాటం చేసిన బిడ్డలం. మేం అట్ల లేం. న్యాయంగా ఉన్నాం” అని కెసిఆర్ అన్నారు.

ఏడాదిలోగా పోడు భూముల సమస్యకు పరిష్కారం
పోడు భూముల వ్యవస్థ రాష్ట్రంలోని చాలా జిల్లాల్లోని గిరిజన ప్రాంతాల్లో ఉన్నదని, 60 ఏళ్ల కాంగ్రెస్, తెలుగుదేశం పాలనలో పోడు భూములకు పట్టా ఎందుకు ఇవ్వలేదని కెసిఆర్ ప్రశ్నించారు. వారి చేతిలో సంపూర్ణ అధికారం ఉన్నా ఆరోజు చేయలేదని అన్నారు. రాహుల్‌గాంధీకి సిగ్గుండాలె… 40 ఏళ్లు పాలించినా ఎందుకు చేయలేదని కెసిఆర్ ప్రశ్నించారు. ఈరోజు వచ్చి ఆపదమొక్కులు మొక్కుతున్నారని విమర్శించారు. రాహుల్‌గాంధీ ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. తాము అధికారంలోకి వచ్చిన ఐదారు నెలల్లో గిరిజన భూముల సమస్యలు పరిష్కరించి అందరికీ పట్టాలు ఇస్తానని చెప్పారు. తానే స్వయంగా వచ్చి పోడు భూముల సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చా రు. పొడు భూములకు పట్టాలిచ్చే విషయమై శుక్రవారం ఛత్తీస్‌ఘడ్ చీఫ్ సెక్రటరీతో మాట్లాడానని, అక్కడ కూడా పోడు భూములకు పట్టాలిచ్చారని గుర్తుచేశారు. అక్కడ తీసుకున్న చర్యల గురించి చీఫ్ సెక్రటరీ తనకు వివరించారని, అధికారంలోకి రాగా నే గిరిజనులకు పట్టాలను ఇస్తానని తెలిపారు.

సంక్షేమంలో నెంబర్‌వన్‌గా ఉన్నాం
సంక్షేమంలో నెంబర్‌గా ఉన్నామని సిఎం కెసిఆర్ స్పష్టం చేశా రు. రైతుల కోసం రైతుబంధు ఇస్తూ రైతుబీమా అమలు చేస్తున్నామని తెలిపారు. రైతుబీమా కింద అర ఎకరం, పావు ఎక రం ఉన్న రైతుల కుటుంబాలు కూడా లబ్దిపొందాయని అన్నా రు. రైతుల అప్పులు తీరి, వారి బ్యాంకు ఖాతాలలో రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలు నిల్వ ఉండేదాకా ఉచిత కరెంట్ ఇస్తామని స్పష్టం చేశారు. గర్బిణీలకు కెసిఆర్ కిట్టు ఇవ్వడంతో పాటు అమ్మా యి పుడితే రూ.13 వేలు, అబ్బాయి పుడితే రూ.12 వేలు ఇస్తున్నామని చెప్పా రు. రాష్ట్ర సంపద పెంచు తాం, ప్రతి పైసాను పేదలకు పంచుతామని స్పష్టంచేశారు. ప్రస్తుతం రూ.వెయ్యి ఇస్తున్న ఆసరా పెన్షన్లను రూ.2016కు, వికలాంగులకు పెన్షన్‌ను రూ.3016కు పెంచి నిరుద్యోగులకు రూ.3016 నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. నీటి తీరువా పన్నులు రద్దు చేశామని అన్నారు.

బిజెపి పాలిత ప్రాంతాలలో రైతుబంధు ఉందా..?
ప్రధాని నరేంద్ర మోడీ నిజామాబాద్‌కు వచ్చి అడ్డం పొడుగు మాట్లాడారని సిఎం కెసిఆర్ విమర్శించారు. ప్రధాని మోడీ నిజామాబాద్ వచ్చి కరెంట్ బాగలేదని అబద్దం చెప్పారని అన్నారు. ప్రధాని స్థానంలో ఉన్న ఇలా మాట్లాడతారా.? అని అడిగారు. మనకు కరెంట్ బాగలేదా..? అని ప్రశ్నించారు. బిజెపి అధికారంలో ఉన్న 19 రాష్ట్రాలలో ఒక్క రాష్ట్రంలోనైనా రైతుబంధు ఉందా? రూ.వెయ్యి పెన్షన్ ఇస్తున్నరా? ఎక్కడై నా కళ్యాణలక్ష్మి ఉందా? అంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్, బిజెపిలు పార్టీలు ఢిల్లీని గుప్పిట్లో పెట్టుకుని నిరంకుశత్వం కొనసాగిస్తున్నాయని మండిపడ్డారు. ప్రాథమిక పాఠశాలలు, ప్రాథమిక వైద్యశాలలపై వాళ్ల పెత్తనం ఎందుకు..? అని ప్రశ్నించారు. చేయాల్సిన పనిచేయకుండా రాష్ట్రాల అధికారాలను హరించి వేస్తున్నామని ఆరోపించారు. ఢిల్లీలో కాంగ్రెస్, బిజెపిలు లేని ఫెడరల్ ఫ్రంట్ ప్రభుత్వం రావాలని పేర్కొన్నారు.

భూపాలపల్లికి 2 లక్షల ఎకరాలకు సాగునీరిస్తాం
రాబోయే రోజుల్లో భూపాలపల్లి నియోజకవర్గానికి 2 లక్షల ఎకరాలకు సాగునీరిస్తామని కెసిఆర్ స్పష్టం చేశారు. రామప్ప చెరువు మార్చి నాటికి దేవాదులతో నింపుబోతున్నామని తెలిపారు. రామప్ప చెరువు నిండితే లక్కవరం, ములు గు ఘన్‌పూర్ చెరువులు 365 రోజులు నిండే ఉంటాయని పేర్కొ న్నారు. ఎస్‌ఆర్‌ఎస్‌పి, దేవాదుల, కాళేశ్వరం నుంచి నీళ్లు వస్తాయని తెలిపారు. సింగరేణిలో వెయ్యి క్వార్టర్లు కట్టించి ఇస్తామని హామీ ఇచ్చారు. కెసిఆర్ సిఎం కాకపోతే ఈ జన్మలో భూపాలపల్లి జిల్లా అయ్యేది కాద ని అన్నారు. భూపాలపల్లిని జిల్లా చేసినందుకు కృతజ్ఞతగా మధుసూదనాచారిని గెలిపించి ఇవ్వాలని కోరారు.

బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ తెచ్చే బాధ్యత నాది
ఖమ్మం జిల్లా భూభాగంలో 190 కి.మీ. మేర గోదావరి పారుతున్నా ఈ ప్రాంతం ప్రజలకు నీరు అందడంలేదన్నారు. ఇల్లెందు నియోజకవర్గంలోని గార్ల మీదగా ఇల్లెందు ద్వారా వెళ్లాల్సిన నాగార్జునసాగర్ ప్రాజెక్టును గత పాలకులు పాలేరు మీద నుంచి ఆంధ్రాకు తరలించారని ఆగ్రహం వ్యక్తంచేశారు. బయ్యారం ఉక్కు పరిశ్రమ కోసం కేంద్రమంత్రికి, ప్రధానికి 30 దరఖాస్తులు ఇచ్చామని, అయినా పట్టించుకోలేదన్నారు. ‘ఉక్క ఫ్యాక్టరీ వాని తాత, జేజమ్మ మెడ వంచి తెచ్చే బాధ్యత నాది. ఎవరినీ భిక్షమెత్తుకోం. సింగరేణి ఆధ్వర్యంలో ఈ ఫ్యాక్టరీని ప్రారంభిస్తాం. మనరులను అద్భుతంగా వాడుకుందాం. ఏ పద్ధతిలో తెలంగాణ తెచ్చుకున్నామో ఆ విధంగానే ఉక్కు ఫ్యాక్టరీని కూడా ఏర్పాటు చేసుకుంటాం. తెలంగాణలో మహా నాయకులు ఉన్నా వారి పేర్ల మీద ఏ ప్రాజెక్టులూ రాలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో ఏ ప్రాజెక్టు చూసినా ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ పేర్లతోనే ఉన్నాయని గుర్తుచేశారు.

ప్రజల అభీష్టం గెలిస్తేనే ప్రజల ఎజెండా అమలు
ప్రజల అభీష్టం గెలిస్తేనే ప్రజల ఎజెండా అమలవుతుందని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు. కులాన్నిబట్టో, బామ్మర్ధి చెప్పాడనో, మద్యం సరఫరా చేశారనో ఓటు వేస్తే రాష్ట్రం అంధకారంలోకి వెళుతుందని, అభివృద్ధి చేసిన పార్టీని చూసి ఓటు వేయాలని సూచించారు. ప్రజలను మోసంచేసే కూటమి నాయకులను ఓటు హక్కుతో తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. రైతుల కోసం నిరంతర విద్యుత్ సరఫరా చేసింది ఒక్క తెలంగాణ రాష్ట్రమేనని, 19 రాష్ట్రాల్లో బిజేపి పార్టీ అధికారంలో ఉందని ఒక్క రాష్ట్రంలో కూడా 24 గంటల విద్యుత్‌ను సరఫరా చేయలేకపోయిందని విమర్శించారు. 24 గంటల కరెంట్ ఉత్తిగా రాలేదని దాని గురించి అందరం కలిసి కష్టపడ్డామని ఆయన పేర్కొన్నారు. టిఆర్‌ఎస్ పార్టీ అమలు చేసిన చాలా పథకాలు ఇండియాలో ఏ రాష్ట్రం కూడా అమలు చేయలేదన్నారు. మానవీయ కోణంలో ఉండే పథకాలను ప్రవేశపెట్టామన్నారు. గత ప్రభుత్వాలు రైతుల గురించి ఆలోచించ లేదని, టిఆర్‌ఎస్ పార్టీ రైతుబీమా, రైతుబంధు పథకాలను ప్రవేశపెట్టిందన్నారు.

తెలంగాణ దరిద్రానికి కాంగ్రెస్సే కారణం
గత కాంగ్రెస్, తెలుగుదేశం పాలకులు తెలంగాణ జిల్లాలను పట్టి,చుకోలేదని, మోసం చేశారని, సాగునీటిలో తీరని అన్యాయం జరిగిందని కెసిఆర్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీకి సొంత వెన్నెముక లేదని, ప్రతీ అవసరానికీ ఢిల్లీకి పోవాల్సిందేనని, ఇప్పుడు తెలంగాణకు పట్టిన ఈ గతి కాంగ్రెస్ పాపమేనని అన్నారు. ఏ ముఖంపెట్టుకుని ఇప్పుడు ప్రజలను ఓట్లడగానికి ఆ పార్టీ వస్తోందని ప్రశ్నించారు. దేశానికి ప్రణాళిక రూపొందించిందీ, రాజ్యాంగం రాసిందీ ఈ పార్టీవారే అయినా పోడు భూముల సమస్యను ఇంతకాలం ఎందుకు పరిష్కరించలేదని ప్రశ్నించారు.

లక్నవరం, ఘనపురం కింద పంటలు పండితే రైతుల నుంచి నీటి తీరువా పన్నును గత ప్రభుత్వాలు వసూలు చేశాయని, వాటిని తమ ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. అబద్ధాలు మాట్లాడడంలో రాహుల్‌గాంధీ, మోదీలు ఇద్దరూ ఒక్కటేనన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అన్ని స్థానాలను గెలిచి ఫెడరల్ ఫ్రంట్‌ను బలోపేతం చేయాలని అప్పుడే కాంగ్రెస్, బిజెపి పార్టీలు భయపడుతాయన్నారు. గిరిజనులను రాజకీయంగా బలోపేతం చేసేందుకు మూడు వేలకుపైగా తండాలను గ్రామ పంచాయితీలుగా మార్చామని, రానున్న రోజుల్లో వారు రాజకీయంగా ముందుకెళుతారన్నారు. ఇక్కడ ప్రజలు నీటి గురించి ఇబ్బంది పడవద్దని, రానున్న రోజుల్లో కాళేశ్వరం ప్రాజెక్టుతో ఇబ్బందులు తొలగుతాయన్నారు. మల్లంపల్లిని మండలంగా చేస్తామన్నారు.

33వ జిల్లాగా ములుగు
రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి ఏడాది వివిధ అవసరాలతో పాటు పరిపాలనా సంస్కరణలపై దృష్టి పెట్టామని, ప్రజల అవసరాలకు అనుగుణంగా 21 కొత్త జిల్లాలను ఏర్పాటు చేసుకున్నామని గుర్తుచేసిన కెసిఆర్ ములుగును కూడా ఎన్నికల తర్వాత 33వ జిల్లాగా చేస్తానని హామీ ఇచ్చారు. ములుగు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచార సభలో భాగంగా ప్రజల నుంచి వచ్చిన డిమాండ్ మేరకు ఈ హామీ ఇచ్చారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏర్పడేది టిఆర్‌ఎస్ ప్రభుత్వమే కాబట్టి ములుగును జిల్లా చేయడంపై సత్వరం చర్యలు తీసుకుంటామని, అంతా అనుకున్నట్లు జరిగితే జనవరి 26న గణతంత్ర దినోత్సవం రోజునే ములుగును జిల్లాగా ప్రకటిస్తానని స్పష్టం చేశారు. జిల్లా కార్యాలయాన్ని కూడా తానే ప్రారంభిస్తానన్నారు.

దేశానికి ప్రధాన మంత్రిగా ఉన్న వ్యక్తి అబద్దాలు ఆడటం మన కర్మ. ఇక్కడకు వచ్చి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే వినడానికి తెలంగాణ ప్రజలు ‘హౌలా పోషిగాళ్లా’. సాయి సంసారి, లచ్చి దొంగ అంటూ అవాకులు చెవాకులు పేలితే ఎవ్వరూ భరించరు. మోడీ రూ.30 వేల కోట్లు తిన్నాడని నేను అంటే చెల్లుతుందా. తెలుగుదేశం, కాంగ్రెస్ ఏమైనా ఆకాశం నుండి ఊడిపడ్డాయా? హిమాలయాల్లోకి వెళ్లి ఆకు పసరు తాగొచ్చారా? ఇంత కాలం గోస పెట్టింది వాళ్లే కదా. ఆ రెండు పార్టీల గత చరిత్రను చూసి ప్రజలు విజ్ఞతతో ఆలోచించి నాలుగేళ్ళ అభివృద్ధిని పరిశీలించాలి.

కంటివెలుగు అద్భుతమైన పథకం. త్వరలో ఈఎన్‌టి, పంటి, ఇతర జబ్బులకు సంబంధించి పరీక్షలు నిర్వహించే ఆలోచన ఉంది. ప్రతీ ఒక్కరి రక్త నమూనాలను సేకరించి ‘హెల్త్ ప్రొఫైల్’ తయారు చేసి, దానికి సంబంధించి డేటాను కంప్యూటర్‌లో సిద్ధం చేసి ఉంచుతాం. ఆరోగ్యకరమైన తెలంగాణ నిర్మించడంమే నా విజన్. రెండున్నర నెలలు కష్టపడి, స్వయంగా దృష్టి పెట్టి కంటి వెలుగు కార్యక్రమాన్ని రూపొందించా.

అంగన్‌వాడీల జీతాలు పెంచమంటే అప్పటి ప్రభుత్వం గుర్రాలతో తొక్కించింది, తెలంగాణలో మాత్రం వీరితో పాటు ‘ఆశా’ వర్కర్లు, హోంగార్డులు, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు.. ఇలా అనేక చిన్న ఉద్యోగుల కడుపు నింపడానికి ఎక్కువ జీతం ఇస్తున్నాం. గిరిజనుల జనాబాకు అనుగుణంగా రిజర్వేషన్లను పెంచాలని, అసెంబ్లీ, క్యాబినెట్ తీర్మానం చేసి ప్రధానికి 30 సార్లు ఇచ్చినా పట్టించుకోలేదు. నాన్ కాంగ్రెస్, నాన్ బిజెపిలు కేంద్రంలో అధికారంలోకి రావాలి.

KCR Fires on Rahul Gandhi in Bhupalapally Public Meeting

Telangana Latest News