సిద్ధిపేట : వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై టిఆర్ఎస్ సుప్రీం , సిఎం కెసిఆర్ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో గజ్వేల్ నియోజకవర్గ కార్యకర్తలతో ఆదివారం ఆయన సమావేశమయ్యారు. గజ్వేల్ ప్రజలు తనను మరోసారి గెలిపిస్తారని, మునుపటికంటే ఎక్కువ మెజార్టీతో గెలుస్తానని ఆయన పేర్కొన్నారు. గజ్వేల్లో తాను ఇప్పటి వరకు కొంత అభివృద్ధిని మాత్రమే చేశానని, తొలి విడతలో రాష్ట్రం కోసం పూర్తి సమయం కేటాయించానని, ఈసారి గజ్వేల్ కోసం కూడా మరింత సమయం కేటాయిస్తానని ఆయన హామీ ఇచ్చారు. నియోజకవర్గంలో రోడ్ల నిర్మాణంతో పాటు ఇళ్లు లేని ప్రతి ఒక్కరికి ఇళ్లు నిర్మించి ఇస్తానని ఆయన పేర్కొన్నారు. గజ్వేల్ రాష్ట్రానికే ఆదర్శంగా ఎదగాలని ఆయన తెలిపారు. తాను ఈనెల 14 నామినేషన్ వేస్తానని, నామినేషన్ దాఖలు రోజున కార్యకర్తలు రావద్దని ఆయన తెలిపారు. ఈనెల 15వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటానని ఆయన పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల తరువాత కేంద్రంలో టిఆర్ఎస్ కీలక పాత్ర పోషించనుందని ఆయన చెప్పారు.