Home ఖమ్మం కెసిఆర్ అసమర్ధ, అవినీతి పాలనపై ఎండగడతాం

కెసిఆర్ అసమర్ధ, అవినీతి పాలనపై ఎండగడతాం

కెసిఆర్ పాలనలో ప్రజలకు అష్టకష్టాలు
రైతు కుటుంబాలను రాహుల్‌గాంధీ పరామర్శించినా కెసిఆర్‌కు మాత్రం తీరిక లేదు
కొడుకు కోసమే
వాటర్‌గ్రిడ్‌కు వేల కోట్లు
రుణమాఫీలు ఏకకాలంలో చేయకుంటే ఆందోళనలు
రైతు భరోసా యాత్రలో కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, నేత జానారెడ్డి

kmm3కూసుమంచి/ ముదిగొండ: కెసిఆర్ 18 నెలల కాలంలో అవలం భిస్తున్న అసమర్ధ, అవినీతి పాలనపై ప్రజల్లోకి వెళ్లి క్షేత్రస్థాయిలో ఎండగడతామని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. రైతు భరోసా యాత్రలో భాగంగా గురువారం కూసుమంచి మండల కేంద్రంలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఆత్మహత్యలకు పాల్పడ్డ రైతుల కుటుంబాలను పరామర్శించడానికి ఎఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ ఇటీవల వచ్చి పరామ ర్శించినా కెసిఆర్‌కు మాత్రం తీరిక లేకపోవడం పట్ల ఆయనకు మానవనీయత లేదని విమర్శించారు. తెలంగాణ ప్రజల కోరిక మేరకు సోనియా గాంధీ ప్రత్యేక రాష్ట్రం ఇస్తే మాయ మాటలతో అధికారంలోకి వచ్చిన కెసిఆర్‌కు రాష్ట్ర ప్రజల సంక్షేమం పట్టడం లేదన్నారు. వాటర్ గ్రిడ్ పేరుతో కొడుకుకు రూ.40వేల కోట్లు కేటాయించిన కెసిఆర్ ఏకకాలంలో రైతుల రుణమాఫీకి కేవలం రూ.8వేల కోట్లు కేటాయించమని ప్రతిపక్షాలు అసెంబ్లీలో ప్రశ్నిస్తే సభ నుంచి సస్పెండ్ చేసి గెంటి వేశారని అన్నారు. కెసిఆర్ అవగాహన లేని పాలన వల్ల రాష్ట్రంలో 1400 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని అన్నారు. కెసిఆర్ వ్యవసాయం, రైతాంగాన్ని సంక్షోభంలోకి నెట్టినందుకు నిరసనగా రాజకీయాలకు అతీతంగా అఖిల పక్షం ఆధ్వర్యంలో ఈనెల 10న నిర్వహిస్తున్న రాష్ట్ర బంద్‌కు ప్రజలంతా సహకరించాలని కోరారు. గతంలో యుపిఎ పాలనలో వరికి కనీస మద్దతు ధర రూ.500 నుండి రూ.1400లకు పెంచారని ప్రసుత్త ఎన్‌డిఎ పాలనలో వరికి కనీస మద్ధతు ధర రూ.50 పెంచడం దారుణమన్నారు. కెసిఆర్‌కు కమీషన్లు వచ్చే పనులు తప్ప ప్రజల సంక్షేమం పట్టడం లేదన్నారు.
హమీ అమలు చేయమంటే అలవి కాని కోరికలంటూ విమర్శిస్తారా : కుందూరు జానారెడ్డి
ఎన్నికల సమయంలో మాయ మాటలు, అమలు కాని హమీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కెసిఆర్ ప్రస్తుతం ఆయన ఇచ్చిన రుణమాపీ ఏకకాలంలో అమలు చేయమంటే ప్రతిపక్షాలవి అలవికాని కోరికంటూ విమర్శించడం పట్ల సిఎల్‌పి నేత కందూరి జానారెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం అలవికాని కోరిక అని, ఇవ్వడం కుదరని ఆనాడు సోనియా చెపితే ప్రస్తుతం కెసిఆర్ సిఎం కుర్చీలో కూర్చునే వారా అని ఆయన ఎద్దేవా చేశారు. సమస్యల పరిష్కారం కోసం టిఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని ఎండగట్టేందుకు ప్రజల్లోకి వెళ్లే సమయం ఆసన్నమైందన్నారు. రాష్ట్ర సర్వతోముఖోభివృద్ధి కోసం కృషి చేస్తున్న కాంగ్రెస్‌పై నమ్మకం ఉంచి రైతులు ఆత్మహత్యలకు పాల్పడ వద్దన్నారు. అదే విధంగా రాష్ట్రంలో నాలుగు లక్షల ఇందిరమ్మ ఇళ్లకు బిల్లులు ఇవ్వకుండా డబుల్‌బెడ్ రూంలతో పేరుతో ప్రభుత్వం కాల యాపన చేస్తుందని విమర్శించారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని వణికించేందుకు చేపడుతున్న బంద్‌ను జయప్రదం చేయా లన్నారు.

కాగా అంతకు ముందు ఎంఎల్‌ఎ రామిరెడ్డి వెంకట రెడ్డికి చెందిన ఎండ్లబండిపై ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు అంతా కిలో మీటరు వరకు ప్రదర్శనగా సభాస్థలికి వచ్చారు. పాలేరు ఎంఎల్‌ఎ రామిరెడ్డి వెంకటరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సభలో టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టీ విక్రమార్క, మండలి పక్ష నేత షబ్బీర్ ఆలీ, ఎంఎల్‌ఎలు పువ్వాడ అజయ్ కుమార్, జీవన్ రెడ్డి, బి.కె.అరుణ, సంపత్ కుమార్, వంశీ చంద్ రెడ్డి, ఎంఎల్‌సిలు పొంగులేటి సుధాకర్ రెడ్డి, ఆకుల లలిత, మాజీ ఎంపిలు మధుయాష్కీ, పొన్నం ప్రభాకర్, సోమ్లా నాయక్, మాజీ ఎంఎల్‌ఎలు రామిరెడ్డి దామోదర్‌రెడ్డి, సంభాని చంద్ర శేఖర్, వనమా వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు ఐతం సత్యం, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు రామిరెడ్డి చరణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇదిలా ఉండగా సభ ప్రారంభానికి ముందు కళాకారులు ప్రదర్శించిన కొమ్ము డోలు నృత్యం, డప్పు వాయిద్యం, తదితర కళా రూపాలు ఆకట్టు కున్నాయి. తొలుత కూసుమంచి మండలం లోక్యాతండాకు చెం దిన రైతు వడ్తియా బీరియా కుటుంబానికి పాలేరు ఎం ఎల్‌ఎ రామిరెడ్డి వెంకటరెడ్డి రూ.లక్షన్నర ఆర్థిక సాయం అందజేశారు. కూసుమంచి సిఐ కిరణ్ కుమార్ పర్యవేక్షణలో ముదిగొండ, కూసుమంచి, నేలకొండపల్లి, రూరల్ మండలాలకు చెందిన ఎస్‌ఐలు కరుణా కర్, శ్రీధర్, దేవందర్‌రావు, గోపిల ఆధ్వర్యంలో భారీ బందో బస్తు ఏర్పాటు చేశారు.