Home Default ధరణిహాసం రెవెన్యూ శకం

ధరణిహాసం రెవెన్యూ శకం

KCR Introduces New Revenue Act Bill In ts assembly

 

చరిత్రాత్మక బిల్లు ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి కెసిఆర్
భూముల తాకట్లకు ఇక చెల్లు, సమగ్ర వివరాలతో ధరణి పోర్టల్

అవినీతి అంతం కోసమే కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చాం. తెలంగాణ వచ్చినప్పుడు ఎంత సంతోషంగా ఉన్నానో, రెవెన్యూ బిల్లును ప్రవేశపెడుతున్నప్పుడు అంతే సంతోషంగా ఉన్నా. ప్రతి కుటుంబానికి వర్తించే బిల్లు ఇది. ఇది సామాన్య విషయం కాదు. ఈ బిల్లు కోసం మూడేళ్లుగా కసరత్తు చేస్తున్నా. నా బాధ్యతగా రెవెన్యూ అధికారులతో చర్చించా. ఏ చట్టం తెచ్చినా గౌరవిస్తామన్నారు. ఈ చట్టంతో ప్రజలకు ఎలాంటి ముప్పు ఉండదు. తరతరాలుగా వాళ్లు అనుభవిస్తున్న బాధలకు చరమగీతం. ఇక భూ మాఫియా ఆటలు కట్టు. రాష్ట్రమంతటా భూసర్వే నిర్వహిస్తాం. ఇక ఎవరు ఇంచు భూమిని ఆక్రమించలేరు. రెవెన్యూ వ్యవస్థను బాగు చేసేందుకు ఆ శాఖ బాధ్యతలు తీసుకున్నా. తెలంగాణ వస్తే భూముల పడిపోతాయని సమైక్య పాలకులు శాపనార్థాలు పెట్టారు. కాని ఇప్పుడు ఎకరానికి కనీసం 10లక్షల రూపాయల ధర పలుకుతోంది.

భూములన్నింటికి ఆయువుపట్టు ‘ధరణి’ పోర్టల్, ప్రపంచంలో ఎక్కడినుంచైనా వెబ్‌సైట్ సందర్శన, రిజిస్ట్రేషన్ కోసం వెబ్‌సైట్‌లో స్లాట్ బుకింగ్ సదుపాయం

వ్యవసాయ, వ్యవసాయేతర భూములుగా విభజన, వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ బాధ్యత ఎంఆర్‌ఒలకు, వ్యవసాయేతర భూముల బాధ్యత సబ్ రిజిస్ట్రార్లకు, మ్యుటేషన్ అధికారం ఆర్‌డిఓ నుంచి తొలగించి ఎంఆర్‌ఓకు అప్పగింత, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్, పాస్‌బుక్, ధరణి కాపీ వెంటనే అందజేత

అసెంబ్లీలో రెవెన్యూ బిల్లు ప్రవేశపెడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ వ్యాఖ్యలు

విఆర్‌ఒలకు ఉద్యోగ భద్రత
అర్హతను బట్టి వివిధ శాఖల్లో సర్దుబాటు
స్వచ్ఛంద పదవీ విరమణకు అవకాశం కల్పించేలా చట్టం, స్కేలు ఉద్యోగులుగా విఆర్‌ఎల పరిగణన

భవిష్యత్‌లో భూముల తగాదాలు ఉండవు, కుటుంబ సభ్యుల నడుమ ఒప్పందం ఉంటేనే భూ వారసత్వ విభజన, రెవెన్యూ కోర్టులు రద్దు, వాటి స్థానంలో ల్యాండ్ ట్రిబ్యునళ్లు, జిల్లాలో ట్రిబ్యునల్ ఏర్పాటు, దాని ఉత్తర్వులే ఫైనల్,రాష్ట్ర వ్యాప్తంగా భూములపై 16,137 కేసులు, కేసుల పరిష్కారానికి ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు, ప్రతి వెయ్యి కేసులకు ఒక ఫాస్ట్‌ట్రాక్ కోర్టు

కొత్త చట్టం ప్రకారం ఏ అధికారికి విచక్షణాధికారాలుండవు, డిజిటల్ రికార్డుల ఆధారంగానే వ్యవసాయ రుణాలు, రుణాల మంజూరుకు పాస్‌బుక్కులు బ్యాంకుల్లో పెట్టుకోవద్దు, ప్రభుత్వ భూములుగా జాగీరు భూములు రిజిస్ట్రేషన్

యావత్ తెలంగాణ డిజిటల్ మ్యాప్, రాష్ట్ర భూభాగం 2కోట్ల 75లక్షల ఎకరాలు, జాగీర్లు ప్రభుత్వ భూములుగా రిజిస్టర్, కొత్త పట్టాదారు పుస్తకం హక్కుల రికార్డుగా గుర్తింపు

అవినీతికి పాల్పడిన తహసీల్దార్లపై క్రిమినల్ చర్యలు, రికార్డులను అక్రమంగా దిద్దితే సర్వీస్ నుంచి తొలగింపు, మోసపూరిత ఉత్తర్వులు జారీ చేయకుండా నిషేధం, రికార్డుల్లో సవరణలు చేస్తే అధికారులపై దావా వేయరాదు

మనతెలంగాణ/హైదరాబాద్ : అవినీతి అంతం కోసమే కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చానని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పుడు ఎంత సంతోషంగా ఉన్నానో, ప్రస్తుతం రెవెన్యూ బిల్లును ప్రవేశపెడుతున్నప్పుడు అంతే సంతోషంగా ఉన్నానని సిఎం తెలిపారు. అసెంబ్లీలో బుధవారం రెవెన్యూ బిల్లును ప్రవేశపెట్టిన సందర్భంగా సిఎం కెసిఆర్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రోజు ఒక చారిత్రాత్మకమైన అద్భుతమైన ప్రగతి బాటలు వేసేట్టువంటి, రైతులకు, ప్రజలకు మేలు చేసే కొత్త చట్టాన్ని శాసనసభలో ప్రవేశపెట్టానని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు. ప్రతి కుటుంబానికి వర్తించే బిల్లు ఇదని, ఇది సామాన్య విషయం కాదన్నారు.

ఈ బిల్లు కోసం మూడేళ్లుగా కసరత్తు చేస్తున్నానని, భూ రికార్డుల ప్రక్షాళనతో కొంత ఫలితం వచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే తన బాధ్యతగా రెవెన్యూ అధికారులతో చర్చించానని, ఏ చట్టం తెచ్చినా గౌరవిస్తామని రెవెన్యూ అధికారులు తనతో తెలిపారన్నారు. ఈ చట్టం వల్ల మంచి జరుగుతుందని,అన్నీ ఆలోచించే ఈ కొత్త చట్టాన్ని తీసుకొచ్చానని సిఎం పేర్కొన్నారు. కొత్త చట్టంతో 99.99శాతం ఆస్తుల తగాదాలు ఉండవని, భూ వివాదాలపై తహసీల్దార్, ఆర్డీఓ, జేసిలు ఆర్డర్ ఇస్తారని ఆయన తెలిపారు. ఈ చట్టంతో ప్రజలకు ఎలాంటి ముప్పు ఉండదని, రెవెన్యూ వ్యవస్థను బాగు చేసేందుకు ఆ శాఖ బాధ్యతలు తీసుకున్నానని సిఎం తెలిపారు.

గత పాలకులు శాశ్వత పరిష్కారం చూపలేదు
నవీన కాలంలో అనేక ఉత్పత్తి సాధనాలు వచ్చాయని సిఎం పేర్కొన్నారు. మనిషి జీవితం భూమి చుట్టూ తిరుగుతుందని, గత ఐదారు వేల సంవత్సరాల నుంచి వ్యవసాయం చేయడం మొదలుపెట్టారని ఆయన తెలిపారు. భూ సంస్కరణలు పద్ధతి ప్రకారం చేయాలన్నారు. ఈ క్రమంలోనే తెలంగాణలో అనేక రెవెన్యూ సంస్కరణలు జరిగాయన్నారు. పివి నరసింహారావు, ఎన్టీఆర్, చంద్రబాబు, వైఎస్‌ల హయాంలో కొన్ని మార్పులు జరిగాయని, గత పాలకులు రెవెన్యూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించలేక పోయారన్నారు. రెవెన్యూ అధికారులపై గతంలో అనేక దాడులు జరిగాయని సిఎం గుర్తు చేశారు.

వ్యవసాయం చేయడం మొదలుపెట్టాక భూములకు ప్రాధాన్యం
30 ఏళ్ల క్రితం ఆటోలు తెలియదు. ప్రభుత్వ ఉద్యోగులు ఒక శాతం ఉండేవారు. వైశ్యులు వ్యాపారం చేసేవారు. మిగిలినవారు భూమిపై ఆధారపడి రైతులుగా, కూలీలుగా ఉండేవారు. భూమి చుట్టూనే బ్రతికేవారు. వ్యవసాయం చేయడం మొదలుపెట్టాక ఉత్పత్తి సాధనంగా దాని ప్రాధాన్యం పెరిగింది. వందలాది సంవత్సరాలుగా దీనిపై ప్రయోగాలు జరిగాయి. పోడుభూములు, అటవీశాఖ దాడులు, హద్దులు సరిగా లేకపోవడం, గెట్ల పంచాయతీ, తలకాయలు హత్యలు జరుగుతున్నాయన్నారు.

త్వరలోనే తెలంగాణ డిజిటల్ మ్యాప్ అందుబాటులోకి
రాష్ట్రంలో త్వరలోనే తెలంగాణ డిజిటల్ మ్యాప్‌ను అందుబాటులోకి తెస్తామని సిఎం కెసిఆర్ ప్రకటించారు. తెలంగాణ భూములపై డిజిటల్ మ్యాప్ ప్రజలకు అందుబాటులో ఉంటుందని, త్వరలోనే సమగ్ర భూ సర్వే చేపడతామ ని, ఒక్క ఇంచు భూ మి కూడా వదలకుం డా సర్వే చేయిస్తామని సిఎం హామినిచ్చారు. ప్రతి సర్వే నంబర్‌కు కో ఆర్డినేట్స్ (లాంగిట్యూట్స్, లాటిట్యూడ్స్) చేపిస్తామన్నారు. భూగోళం ఉన్నంత వరకూ అవి అలాగే ఉంటాయన్నారు. వాటిని మార్చే అధికారం, ట్యాంపర్ చేసే అవకాశం ఎవరికీ ఉండదన్నారు. భూముల రిజిస్ట్రేషన్‌లో అధికారులకు విచక్షణ అధికారాలు కూడా ఉండవు అన్నారు. చట్టానికి లోబడే పనిచేయాల్సి ఉంటుందన్నారు.

ఆదాయం కోల్పోయినా కొత్త విధానం
ఆదాయం కోల్పోయినా కొత్త విధానాన్ని తీసుకురావాలని సంకల్పించామన్నారు. ఇక నుంచి ప్రజలు ఎవరికీ నయా పైసా ఇవ్వొద్దని, కొన్ని అధికారాలు, ఆదాయం కోల్పోయినా ముందుకెళ్తున్నామని సిఎం స్పష్టం చేశారు. కఠినమైనా సరే కొత్త రెవెన్యూ చట్టాన్ని తప్పకుండా అమలు చేస్తామన్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబానికి చట్టాన్ని పారదర్శకంగా అమలయ్యేలా చూస్తామన్నారు. భూ బకాసురులు, భూ మాఫియా నుంచి ప్రజలకు ఈ చట్టం విముక్తి కల్పిస్తుందని సిఎం కెసిఆర్ తెలిపారు.

కొత్త చట్టం ప్రకారం తహసీల్దార్‌లే జాయింట్ రిజిస్ట్రార్‌లు
కొత్త చట్టం ప్రకారం తహసీల్దార్‌లే జాయింట్ రిజిస్ట్రార్‌లుగా వ్యవహారిస్తారని సిఎం కెసిఆర్ స్పష్టం చేశారు. తహసీల్దార్‌లకు వ్యవసాయ భూములు రిజిస్ట్రేషన్‌లు చేసే అధికారం ఉంటుందన్నారు. రిజిస్ట్రార్ కార్యాలయంలో వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్‌లు జరుగుతాయన్నారు. గ్రామకంఠం, పట్టణ భూములను వ్యవసాయేతర భూములుగా పరిగణిస్తామన్నారు. ధరణి పోర్టల్‌లో పంచాయతీ, పురపాలిక, నగరపాలిక, జిహెచ్‌ఎంసి ఆస్తుల వివరాలు ఉంటాయన్నారు. ఎవరూ ఎక్కడున్నా ఉన్న చోట నుంచే ఆస్తుల వివరాలు చూసుకోవచ్చన్నారు.

రిజిస్ట్రేషన్ ప్రక్రియకు ముందే అలాట్ చేయాలన్నారు. అలాట్ చేసిన వివరాలను వెబ్‌సైట్‌లో నమోదు చేయాలన్నారు. రిజిస్ట్రేషన్ కోసం ముందుగానే ప్రజలుఉ స్లాట్ అలాట్‌మెంట్ చేసుకోవాలన్నారు. విద్యావంతులయితే డాక్యుమెంట్లు వాళ్లే రాసుకోవచ్చన్నారు. కావాలంటే ఫీజు చెల్లించి డాక్యుమెంట్ రైటర్ సాయం తీసుకోవచ్చన్నారు. క్రయ, విక్రయాల రిజిస్ట్రేషన్ చేసిన వెంటనే పోర్టల్లో అప్‌డేట్ అవుతాయన్నారు. రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ సేవలు ఏకకాలంలో పూర్తి అవుతాయన్నారు.

విఆర్‌ఓలకు భద్రత కల్పిస్తాం
రాష్ట్రంలోని విఆర్‌ఏలకు తీపికబురు అందిస్తున్నామని ముఖ్యమంత్రి కెసిఆర్ స్పష్టంచేశారు. విఆర్‌ఏలలో 90 శాతం మంది బిసి, ఎస్సీ, ఎస్టీలే ఉన్నారని వారిని స్కేలు ఉద్యోగులుగా పరిగణిస్తామన్నారు. వారికి భద్రత కల్పిస్తామని సిఎం కెసిఆర్ స్పష్టం చేశారు. అనివార్య పరిస్థితుల్లో విఆర్‌ఓ వ్యవస్థను రద్దు చేస్తున్నామని సిఎం పేర్కొన్నారు. విఆర్‌ఓలను వారి అర్హతలను బట్టి వివిధ శాఖల్లో సర్ధుబాటు చేస్తామని ఆయన ప్రకటించారు. 5485 మంది విఆర్‌ఓలు వర్కింగ్‌లో ఉన్నారని, వీరికి ఉద్యోగ భద్రత కల్పిస్తామని ఆయన హామినిచ్చారు.

విఆర్‌ఎస్ లేదా స్వచ్ఛంద పదవీ విరమణకు అవకాశం కల్పించేలా చట్టం తీసుకువస్తామని ఆయన సిఎం తెలిపారు. తహసీల్దార్లు, ఆర్డీఓలు అలాగే ఉంటారని, భూ వివాదాలపై తహసీల్దార్లు, ఆర్డీఓ, జేసిలు ఆర్డర్లు ఇస్తారన్నారు. ఆర్డర్లు ఇచ్చిన రెవెన్యూ అధికారుల వద్దే కోర్టులు ఉన్నాయని, ఇక నుంచి రెవెన్యూ కోర్టులు ఉండవని ఆయన తేల్చిచెప్పారు. రెవెన్యూ సంస్కరణల వలన ఉద్యోగులకు ఎలాంటి సమస్య ఉండదన్నారు. ఈ సంస్కరణల వలన ప్రజల ఇబ్బందులు తొలగుతాయన్నారు.

స్పీకర్ గారు వాళ్లకు అవకాశమివ్వండి

కొత్త రెవెన్యూ బిల్లుపై మాట్లాడేందుకు ప్రతిపక్షాలకు తగిన సమయం కేటాయించాలని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి సిఎం కెసిఆర్ సూచించారు. ఈ బిల్లుపై శుక్రవారం విస్తృతంగా చర్చిద్దామని, ఆ రోజు ప్రతిపక్షాలకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని సిఎం అన్నారు. బిల్లుపై నిపుణులతో చర్చించాలని ప్రతిపక్షాలకు సూచన చేస్తున్నానని సిఎం పేర్కొన్నారు. చర్చలో భాగంగా సూచనలు ఇస్తే స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. ప్రతిపక్షాల గొంతు నొక్కితే తమకేమి వస్తుందన్నారు సిఎం పేర్కొన్నారు. ఎక్కువ మంది సభ్యులున్న మాకే పెద్ద గొంతు ఉందని, సభ్యుల సంఖ్య ఆధారంగా సమయం కేటాయిస్తారని, శాసనసభ నియమ, నిబంధనల ప్రకారం నిర్వహణ ఉంటుందని, రెవెన్యూ బిల్లుపై శుక్రవారం సమగ్ర చర్చ జరుపుతానని ఆయన తెలిపారు.

కుటుంబాల డేటా బేస్ అంతా పోర్టల్‌లోనే

తెలంగాణ కుటుంబాల డేటా బేస్ అంతా పోర్టల్‌లో ఉంటుందన్నారు. ఇక నుంచి లైఫ్ టైమ్ కులధృవీకరణ పత్రాలు మంజూరు చేయిస్తామన్నారు. తెలంగాణ డేటాబేస్ ఆధారంగా ఆదాయ ధృవీకరణ పత్రాలు ఇస్తామన్నారు. ఇకపై ఒకసారి కులం సర్టిఫికేట్ ఇస్తే అదే లైఫ్ టైమ్ ఉంటుందన్నారు. మళ్లీ మళ్లీ తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలకే కులం సర్టిఫికెట్లు ఇచ్చే అధికారం ఇస్తామన్నారు. రెవెన్యూకు ఈ అధికారం ఉండబోదన్నారు. ఇన్‌కమ్ సర్టిఫికెట్లు కూడా ఆన్‌లైన్ డేటా బేస్ ఆధారంగా ఇవ్వనున్నట్టు సిఎం వెల్లడించారు. ఎవరెవరు ఏ ఉద్యోగాలు చేస్తున్నారు, వాళ్ల ఆదాయం ఎంతో ఇప్పటికే ప్రభుత్వం వద్ద ఉందన్నారు. దీన్ని మరింత డెవలప్ చేసి, ఈ డేటా ఆధారంగానే ఇన్‌కమ్ సర్టిఫికెట్లు జారీ చేస్తామన్నారు.

రెవెన్యూ కోర్టులు సరికాదు

ఎమ్మార్వో, ఆర్డీవో, జా యింట్ కలెక్టర్ల ఆధ్వర్యంలో నడిచే రెవె న్యూ కోర్టులను రద్దు చేస్తున్నామని సిఎం ప్రకటించారు. అధికారులే ఆర్డర్లు ఇచ్చి, అధికారులే కోర్టులు నడిపించే విధానం సరికాదన్నారు. రెవెన్యూ కోర్టుల్లో ప్రస్తుతం 16,137 కేసులు ఉన్నాయని ఆయన వెల్లడించారు. ఇందులో 12 వేలకుపైగా ఆర్వోఆర్ కేసులు, 1138 ఇమామ్ అబాలిషన్ కేసులు, 316 ఎన్‌ఎంసీ, 12 భూదాన్, 728 పీవోటీ, 30 భూఅక్రమణ, 136 ల్యాండ్ ట్రాన్స్‌ఫర్ రెగ్యులరైజేషన్, 1165 ఇతర కేసులు ఉన్నాయన్నారు. ఈ కేసులన్నింటినీ వెంటనే రెవెన్యూ కోర్టుల నుంచి తొలగిస్తున్నామన్నారు. ప్రతి వెయ్యి కేసులకు ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి పరిష్కరిస్తామన్నారు. ఇందుకోసం హైకోర్టు సలహాలు తీసుకుంటున్నామన్నారు. ఇకపై భూ వివాదాలు ఏమైనా ఉంటే సివిల్ కోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకు ఎక్కడికైనా వెళ్లొచ్చునన్నారు.

భూములన్నింటికి ధరణి వెబ్‌సైట్ ఆయువు పట్టు

త్వరలో అందుబాటులోకి ధరణి పోర్టల్ వస్తుందని ముఖ్యమంత్రి కెసిఆర్ తెలిపారు. ఈ పోర్టల్ పారదర్శకంగా ఉంటుందన్నారు. ధరణి వెబ్‌సైట్ భూములన్నింటికి ఆయువు పట్టని ఆయన తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి ఇంచు భూమిని సర్వే చేయిస్తామని ఆయన తెలిపారు. ఇకపై ఎవరూ పక్కవారి భూమిపై కన్నెయ్యలేరన్నారు. వ్యవసాయ భూములను తహసీల్దార్‌లే రిజిస్ట్రేషన్ చేస్తారని, నాన్ అగ్రికల్చర్ భూములను సబ్ రిజిస్ట్రార్‌లు రిజిస్ట్రేషన్ చేస్తారని సిఎం తెలిపారు. రాష్ట్ర భూభాగం 2 కోట్ల 75 లక్షల ఎకరాలు ఉంటుందని, ఇందులో కోటి 60 లక్షల వ్యవసాయ భూములు, 66,56,000 ఎకరాల అటవీ భూమి ఉందని ఆయన పేర్కొన్నారు. మిగిలిన భూమి అంతా నివాస ప్రాంతాలు, ప్రభుత్వ కార్యాలయాలు, కంపెనీలు, రోడ్లు, రైల్వే లైన్లు, స్కూళ్లు, కాలేజీలు ఇలా రకరకాలుగా ఉంటుందన్నారు.

ఈ వివరాలన్నీంటిని ధరణి వెబ్‌సైట్‌లో నమోదు చేశామన్నారు. పోర్టల్‌లోకి ఎవరైనా ఎంటరై భూములు, ఇండ్లు, ఆస్తులు ఎవరి పేరిట ఉన్నాయో చూడొచ్చన్నారు. ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఈసీ సర్టిఫికెట్ సహా అన్నింటినీ పోర్టల్‌లో అందుబాటులో ఉంచుతామన్నారు. వీటిని ఎవరైనా డౌన్‌లోడ్ చేసుకోవచ్చన్నారు. ఈ పోర్టల్ సర్వర్లను రాష్ట్రంతో పాటు, ఇతర రాష్ట్రాల్లోనూ పెడతామన్నారు. గతంలో చార్మినార్ వంటి సుప్రసిద్ధ స్థలాలను, రైల్వే స్టేషన్లను కూడా రిజిస్ట్రేషన్ చేసేవాళ్లని కెసిఆర్ ఆవేదన వ్యక్తం చేశారు, ఇకపై ఇలాంటివి ఉండవన్నారు. అసైన్డ్ భూములు, ప్రభుత్వ స్థలాలు, సుప్రసిద్ధ స్థలాలు వంటి వాటిని పోర్టల్‌లోనే లాక్ చేసేస్తామన్నారు. ఇక వీటిని రిజిస్ట్రేషన్ చేసేందుకు ప్రయత్నించినా, పోర్టల్ యాక్సెప్ట్ చేయదని ఆయన తెలిపారు.

సమగ్ర భూ రీ సర్వేకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం

మనతెలంగాణ/హైదరాబాద్ : దశాబ్ధాల కాలం నాటి భూ రికార్డులను ఆధునీకరించడంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర భూ రీ సర్వేకు సిద్ధమవుతోంది. తద్వారా పురాతన భూ రికార్డులను సమస్తం ఆధునీకరించి వివాదాలు లేని సరిహద్దులుగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలని సిఎం కెసిఆర్ ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అందులో భాగంగానే 1940 సంవత్సరంలో జరిగిన పురాతన సర్వేను నేటి కాలానికి అనుగుణంగా రీ సర్వే చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముందుగా రికార్డుల డిజిటలైజేషన్, వెబ్‌ల్యాండ్ రికార్డులను పూర్తి చేసి సమగ్ర భూ సర్వేకు వెళ్లాలని కెసిఆర్ భావిస్తున్నారు. గతంలో భూముల రికార్డుల వివరాలను పక్కాగా రూపొందించి భద్రపరచడంలో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న భూములపై సమగ్ర సర్వే చేయించాలని కేంద్రం నిర్ణయించింది.

అందులో భాగంగానే అన్ని రాష్ట్రాలు భూముల సర్వే చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. రికార్డుల భద్రత, డిజిటలైజేషన్, కంప్యూటరీకరణకు అయ్యే ఖర్చును కూడా తామే భరిస్తామని రాష్ట్రాలతో కేంద్రం తెలిపింది. అందులో భాగంగానే రాష్ట్ర అధికారులు సైతం కొత్త రాష్ట్రంలో సమగ్ర భూ సర్వే ఆవశ్యకతను సిఎంకు వివరించారు. అయితే 2008లో అప్పటి కేంద్ర ప్రభుత్వం దేశంలోని భూములన్నింటిని జాతీయ భూ రికార్డుల ఆధునీకికరణ కార్యక్రమం (ఎస్‌ఎల్‌ఎఆర్‌ఎంయూపి) ఈ దర్తీ పేరుతో మార్చింది. అందులో భాగంగా రాష్ట్రంలోని హైదరాబాద్, నిజామాబాద్ మినహా మిగతా 8 ఉమ్మడి జిల్లాల్లో సమగ్ర భూ సర్వేను చేపట్టాలని ప్రస్తుతం కెసిఆర్ భావిస్తున్నారు.

ప్రతి 40 ఏళ్లకు ఒకసారి రీ సర్వే జరగాల్సి ఉండగా
ఇప్పటికీ తెలంగాణలో నిజాం కాలంనాటి రికార్డులే ప్రామాణికంగా మారాయి. తెలంగాణలో బ్రిటీష్ కాలంలో జరిగిన భూ సర్వే మినహా భూ సర్వే జరగలేదు. ఉమ్మడి ఎపి సర్వే సంపుటి ప్రకారం ప్రతి 40 ఏళ్లకు ఒకసారి రీ సర్వే జరగాల్సి ఉంది. దశాబ్ధాల క్రితం నిర్వహించిన సర్వేలో రూపొందించిన రికార్డులు నేడు అధికారులకు లభ్యం కావడం లేదు. దీంతో రికార్డుల లభ్యత, వాస్తవ స్థితిలు డిజిటలైజేషన్‌కు ఇబ్బందిగా మారాయి. దీంతో మరోసారి సమగ్ర భూ సర్వేతో పాటు గ్రామ మ్యాపులు, ఎఫ్‌ఎంబీలు, ఆర్‌ఎస్‌ఆర్‌లు, భూమి రిజిస్ట్రర్‌లు చేపట్టాల్సి ఉంది. దీనికి గాను రూ.600 కోట్ల నుంచి రూ. 800 కోట్ల వ్యయం కానున్నట్టుగా సమాచారం.

KCR Introduces New Revenue Act Bill In ts assembly