Home తాజా వార్తలు సిఎంగా కెసిఆర్ నేడు ప్రమాణ స్వీకారం

సిఎంగా కెసిఆర్ నేడు ప్రమాణ స్వీకారం

KCR is sworn as Chief Minister for second time today

 

మధ్యాహ్నం గం.1.25 తర్వాత రాజ్‌భవన్‌లో…
టిఆర్‌ఎస్‌ఎల్‌పి నేతగా ఏకగ్రీవ ఎన్నిక
ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పదవికి చేసిన రాజీనామాను ఆమోదించిన గవర్నర్ 

మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభా పక్ష నాయకుడిగా కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావును ఆ పార్టీ తరఫున గెలిచిన ఎంఎల్‌ఎలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తెలంగాణ భవన్‌లో బుధవారం జరిగిన టిఆర్‌ఎస్ శాసనసభాపక్షం సమావేశంలో టిఆర్‌ఎస్‌ఎల్‌పి నేతగా కెసిఆర్ పేరును ఆలేరు ఎంఎల్‌ఎ గొంగిడి సునీత ప్రతిపాదించారు. దానిని మెదక్ ఎంఎల్‌ఎ పద్మాదేవేందర్‌రెడ్డి బలపరిచారు. ఆ ప్రతిపాదనపై 12 మంది ఎంఎల్‌ఎలు సంతకాలు చేసి కెసిఆర్‌ను టిఆర్‌ఎస్‌ఎల్‌పి నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు చేసిన తీర్మానాన్ని రాజ్‌భవన్‌లో గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్‌కు అందజేశా రు.

గవర్నర్‌ను కలిసినవారిలో మాజీ మం త్రులు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, లకా్ష్మరెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మాజీ డిప్యూ టీ స్పీకర్ పద్మా దేవెందర్‌రెడ్డి, ఎంఎల్‌ఎలు గొంగిడి సునీత, రేఖా నాయక్, దాస్యం వినయ్‌భాస్కర్, శ్రీనివాస్‌గౌడ్, కొప్పుల ఈశ్వర్, రవీంద్రకుమార్ నాయ క్, కాలె యాదయ్య ఉన్నారు. టిఆర్‌ఎస్ ఎంఎల్‌ఏ లు తీర్మానాన్ని సమర్పించిన అనంతరం ప్రభుత్వాన్ని ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా గవర్నర్ నరసింహన్‌కు విజ్ఞప్తి చేశారు. ఇప్పటివరకూ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా వ్యవహరించిన కెసిఆర్, మంత్రివర్గ సభ్యులు రాజీనామా లేఖలను అంతకుముందే గవర్నర్‌కు పంపడంతో ఆమోదం లభించింది.

నేడు సిఎంగా కెసిఆర్ ప్రమాణ స్వీకారం
తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో విజయ నగారా మోగించిన టిఆర్‌ఎస్ పార్టీ అధినేత కె.చంద్రశేఖర్‌రావు గురువారం రెండవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాజ్‌భవన్‌లో మధ్యాహ్నం 1.25 గంటలకు కెసిఆర్‌తో గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో టిఆర్‌ఎస్ గెలుపొందడంతో కెసిఆర్ చేత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించింది కూడా ప్రస్తుత గవర్నర్ నరసింహనే. రాజ్‌భవన్‌లో గురువారం మధ్యాహ్నం జరిగే ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ఇప్పటికే ఏర్పాట్లు జరిగాయి. కెసిఆర్‌తో పాటు ఒకరు లేదా ఇద్దరు ఎంఎల్‌ఎలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. హరీశ్‌రావు పేరు వినిపిస్తోంది. ఎస్‌సి లేదా మైనార్టీ సామాజికవర్గానికి చెందిన ప్రజాప్రతినిధికి సిఎంతో పాటు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం లభించనుందనే వార్తలు కూడా పార్టీ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి.

శాసనసభా పక్ష సమావేశంలో ముఖ్యమంత్రిని నేతగా ఎన్నుకుంటూ ఆలేరు శాసనసభ్యురాలు ప్రతిపాదన చేయడం, దాన్ని మెదక్ శాసనసభ్యురాలు పద్మా దేవేందర్‌రెడ్డి బలపర్చడంతో ఈ ఇద్దరికీ కూడా మంత్రివర్గంలో చోటు లభించే అవకాశం ఉందనే ఊహాగానాలు కూడా ఉన్నాయి. ఎలాంటి ఆర్భాటాలు లేకుండా నిరాడంబరంగా కెసిఆర్ ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలిసింది. 2014లో మొదటిసారి ముఖ్యమంత్రిగా కెసిఆర్ ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో ఆయనతోపాటు 11 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయగా, ఈ సారి మాత్రం ఆయన ఒక్కరే లేదా ఆయనతో పాటు ఒక మంత్రి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వారం రోజుల తర్వాత మరికొంత మంది ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే రెండవ దశలో పూర్తి స్థాయిలో మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారా? లేక కొంతమందే చేస్తారా? అనేది తెలియాల్సి ఉంది.