Home ఆఫ్ బీట్ కెసిఆర్ కిట్టు సూపర్ హిట్టు

కెసిఆర్ కిట్టు సూపర్ హిట్టు

ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని భావించిన ప్రభుత్వం ప్రజారోగ్య విభాగంలో మౌలిక మార్పులకు శ్రీకారం చుట్టింది. నాలుగే ళ్ళలో ప్రజారోగ్యంలో విప్లవాత్మకమైన మార్పులు చోటుచేసుకు న్నాయి. వైద్యాన్ని పేదలకు అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించి బడ్జెట్లో నిధుల కేటాయింపులను గణనీయంగా పెంచింది. ప్రభుత్వాసుపత్రులకు నూతన భవనాలు, ఐసీయూల ఏర్పాటు, ఆధునిక పరికరాల కొనుగోలు వంటివి జరుగుతూ ఉన్నాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుండి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల వర కు మౌలిక సదుపాయాలు, వసతులు పెంచి, ప్రభు త్వ ఆసుపత్రుల్లో ఉన్న 17,000 బెడ్‌ల సంఖ్యను 20,000కు పెంచింది. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగుల సంఖ్య ఏడాదికేడాది పెరుగుతోంది.

KCR-Kittu

కెసిఆర్ కిట్ : కెసిఆర్ కిట్‌ను ప్రారంభించిన ఏడాదికే 1,83,382 కిట్లను పంపిణీ జరిగింది. అనేక రాష్ట్రాల వైద్య శాఖలు అమలుతీరును అధ్యయనం చేశాయి. ప్రైవేట్ ఆసుపత్రుల్లో సిజేరియన్‌లను నివారించే ఉద్దేశంతో ప్రభుత్వ దవాఖానల్లో సాధారణ ప్రసవం జరిగేలా ప్రభుత్వం దృష్టిపెట్టింది. శిశువుకు బేబీ సోప్, బేబీ ఆయిల్, బేబీ పౌడర్, రెండు బేబీ డ్రెస్సులు, టవలు, దోమతెర, తల్లికి రెండు చీరలతో 16 రకాల వస్తువులను కిట్ రూపంలో అందజేస్తోంది. ఈ పథకం తర్వాత ప్రభుత్వాసుపత్రుల్లో 1,99,600 ప్రసవాలు జరగ్గా వీటిలో సహజ ప్రసవాలు 1,05,868. ఇప్పటివరకు రెండున్నర లక్షల కిట్ల పంపిణీ చేశారు.

డయాలిసిస్ కేంద్రాల ఏర్పాటు : ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని లక్ష్యంతో రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో రూ. 600 కోట్ల వ్యయంతో వైద్య సామగ్రిని సమకూర్చడంతో పాటు దేశంలోనే తొలిసారిగా ప్రభుత్వ దవాఖానల్లో రోగ నిర్ధారణ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసింది. రాష్ట్ర ఆవిర్భావం నాటికి నిమ్స్, ఉస్మానియా, గాంధీ లాంటి దవాఖానాల్లో మాత్రమే డయాలసిస్ కేంద్రాలు ఉండగా అదనంగా 40 డయాలసిస్ కేంద్రాలను నెలకొల్పింది. డయాలసిస్ పేషంట్లకు బస్ పాస్‌లను కూడా ఉచితంగా అందించనుంది. గతంలో రూ.114 కోట్లు ఉన్న మందుల బడ్జెట్‌ను రూ.300 కోట్లకు పెంచింది.

KCR-Kittu1
కొత్త మెడికల్ కాలేజీలు : తెలంగాణ ఏర్పాటు తర్వాత కొత్తగా రెండు మెడికల్ కాలేజీలు ఏర్పడ గా మరో రెండు ఏర్పాటు కా నున్నాయి. దీంతో 700 ఎంబిబిఎస్ సీట్లు అదనంగా అందుబాటులోకి వస్తున్నాయి. పోస్టు గ్రాడ్యుయేషన్ సీట్ల సంఖ్య సైతం 571 నుంచి 792కు పెరిగాయి. వైద్య విద్యార్థుల పరిశోధనల కోసం మెరిట్ స్కీంని దేశంలోనే మొదటిసారి రాష్ట్రంలో ప్రారంభమైంది. ఇప్పటికే వైద్య ఆరోగ్యశాఖలో 2778 పోస్టుల నియమాకాలకు ఆమోదం తెలిపింది. అదనంగా మరో 6180 పోస్టులు రానున్నాయి. ప్రతిష్ఠాత్మకమైన ఎయిమ్స్ ఆసుపత్రి కోసం స్థల సేకరణ పూర్తయింది.
అవయవ మార్పిడులు-అరుదైన ఆపరేషన్లు : కిడ్నీ, గుండె, పాంక్రియాస్, కాలేయ మార్పిడి ఆపరేషన్లు జరుగుతున్నాయి. ఇప్పటికే నిమ్స్‌లో 110 అవయవ మార్పిడులు జరగ్గా ఉస్మానియా చరిత్రలోనే తొలిసారిగా కిడ్నీ మరియు పాంక్రియాటిస్ సర్జరీ జరిగింది. అరుదైన ప్లాస్టిక్ సర్జరీలు, ఇతర శస్త్ర చికిత్సలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరుగుతున్నాయి. కిడ్నీ, గుండె వంటి అవయవ మార్పిడులు జరిగాక అవసరమైన మందుల కోసం ఈ బడ్జెట్ లో ప్రత్యేక నిధిని కూడా కేటాయించింది.

వాహనాలు- వైద్య సేవలు : అత్యవసర సేవల్లో విస్తృతంగా ఉపయోగపడుతున్న 108 సర్వీసు ఆంబులెన్స్‌లకు కొత్తగా 145 కొత్త వాహనాలు అందుబాటులోకి వచ్చాయి. మారుమూల గల్లీలకు వెళ్ళి ఎమర్జెన్సీ సమయంలో రోగులను సలకాలంలో ఆసుపత్రులకు చేర్చడం కోసం 108 బైక్ అంబులెన్స్‌లు కూడా వినియోగంలోకి వచ్చాయి. ‘అమ్మ ఒడి’ కింద 102 అనే నెంబర్ వాహనాలు తల్లిబిడ్డలను వారి ఇళ్లకు చేరుస్తున్నాయి. నెలకు 1000 మంది గర్బిణీలకు సేవలు అందుతున్నాయి. 49 పరమపద వాహనాలు భౌతికకాయాలను వారి ఇళ్ళకు చేరుస్తున్నాయి.
ఆరోగ్యశ్రీ – ఇజెహెచ్‌ఎస్ : రాష్ట్ర ఆవిర్భావం నుంచి ఇప్పటివరకు ఆరోగ్యశ్రీ ద్వారా 91,10,141 మంది రోగులు సేవలు వినియోగించుకున్నారు. వీరి కోసం ప్రభుత్వం రూ.2,320 కోట్లను ఖర్చుచేసింది. ఉద్యోగులు, జర్నలిస్టుల కోసం హెల్త్ స్కీం అమలవుతోంది. అవుట్ పేషంట్స్ సేవలకు ప్రత్యేకంగా వెల్‌నెస్ సెంటర్లు ఏర్పాటయ్యాయి. అన్ని రకాల పరీక్షలు, మందులు ఉచితంగా అందుతున్నాయి. అన్ని జిల్లా కేంద్రాలకూ విస్తరించాలని ప్రభుత్వం భావిస్తోంది.

ఇంటింటికీ కంటి వెలుగు : అంధత్వ నివారణ లక్ష్యంగా రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ కంటి పరీక్షలు నిర్వహించడంతో పాటు ఉచితంగా కంటి అద్దాలు, అవసరమైన శస్త్ర చికిత్సలు చేసే పథకానికి త్వరలో ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. రాష్ట్రవ్యాప్తంగా 41 లక్షల మందికి కళ్ళద్దాలు అవసరమని ప్రాథమిక అంచనా. రెవెన్యూ, పంచాయతీరాజ్, వైద్య శాఖల సమన్వయంతో అన్ని గ్రామాల్లో కంటి పరీక్షా శిబిరాలు ఏర్పాటుకానున్నాయి. వైద్యపరీక్షల్లో వచ్చిన రిపోర్టుల ఆధారంగా అత్యవసర ఆపరేషన్లు అవసరమైన వారికి వెంటనే చికిత్స అందించే ప్రయత్నాలకూ వైద్యశాఖ కసరత్తు చేస్తోంది.

 కమల్‌నాథ్