Home తాజా వార్తలు రూ.52,941 కోట్లు ఇవ్వండి

రూ.52,941 కోట్లు ఇవ్వండి

15th Finance Committee Chairmen

 

రాష్ట్రంలోని ఎత్తిపోతల పథకాలు, మిషన్ భగీరథ నిర్వహణకు వచ్చే ఐదు సంవత్సరాల్లో ఇవ్వాలి : 15వ ఆర్థిక సంఘానికి ముఖ్యమంత్రి కెసిఆర్ లేఖ, అందజేసిన మంత్రి హరీశ్‌రావు
ఆర్థిక సంఘం చైర్మన్ సానుకూల స్పందన

హైదరాబాద్ : తెలంగాణకు వచ్చే ఐదు సంవత్సరాలకు(2021-22 నుంచి 2025-26) ఎత్తిపోతల ప్రాజెక్టులు, మిషన్ భగీరథ (తాగునీటి) పథకం నిర్వహణకు రూ.52,941.25 కోట్లు ఇవ్వాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు 15వ ఆర్థిక సంఘం ఛైర్మెన్ నందకిషోర్ సింగ్‌ను కోరారు. ఇందులో లిప్ట్ ఇరిగేషన్ పథకాలకు రూ.40,169 కోట్లు, మిషన్ భగీరథకు రూ.12,772 కోట్లు ఉన్నాయి. ఈ మేరకు సిఎం రాసిన లేఖను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు మంగళవారం ఢిల్లీలో ఎన్.కె. సింగ్‌తో సమావేశమై సమర్పించారు. అన్నదాతల ఆదాయం పెంపునకు, వ్యవసాయ వృద్ధికి నీరు ప్రధానమని, అందులో భాగంగా ఆ సెక్టార్‌కు ఐదేళ్లలో ఏకంగా 1.5 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టినట్లు కెసిఆర్ వివరించారు.

గతంలో హైదరాబాద్ పర్యటనకు వచ్చిన సమయంలో 15వ ఆర్థిక సంఘం తెలంగాణ ప్రభుత్వం మౌళిక సదుపాయల కల్పనలో భాగంగా ముఖ్యంగా నీటి పారుదల రంగానికి, తాగు నీటికి (మిషన్ భగీరథ) స్థిరమైన పెట్టుబడులు పెట్టడాన్ని ప్రశంసించిందని లేఖలో గుర్తు చేశారు. గోదావరి, కృష్ణా నదులు ప్రవాహం భూస్థాయి కంటే కిందకు ఉందన్నారు. అందువల్లనే నీటి పారుదల బహుళ దశ ఎత్తిపోతల ద్వారానే సాధ్యమవుతుందని వివరించారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి రూ.80, 500 కోట్లతో తక్కువ కాల వ్యవధిలో పూర్తి చేశామని, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి రూ.35, 200 కోట్లు అవుతున్నట్లు లేఖలో కెసిఆర్ పేర్కొన్నారు. 15వ ఆర్థిక సంఘం కమిషన్ తన తుది నివేదికకు సలహాలు, సిఫార్సులకు ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలిపారు.

నిర్వహణ ఖర్చులపై సానుకూల స్పందన : హరీశ్‌రావు
ఎన్.కె సింగ్‌తో సమావేశం అనంతరం మంత్రి హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. పథకాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో నిర్వహణ ఖర్చులు ఇచ్చేలా కేంద్రానికి సూచించాలని కోరామని, తాము కోరిన రెండు అంశాలపై ఆర్థిక సంఘం చైర్మన్ సానుకూలంగా స్పందించారని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 83 మీటర్ల నుంచి 618 మీటర్లకు నీళ్లను ఎత్తుతున్నామని, ఈ నిర్వహణ ఖర్చు చాలా ముఖ్యమన్నారు. నీళ్ల కోసమే తెలంగాణ పోరాడిందన్నారు. గత ఐదు సంవత్సరాలలో పాలమూరు ఎత్తిపోతల పథకం, సీతారామ ఎత్తిపోతల పథకం సహా గతంలో పెండింగ్‌లో ఉన్న కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా ప్రాజెక్టులను పూర్తి చేసుకున్నామన్నారు.

దేశంలోనే ప్రతి ఇంటికి నీరు ఇచ్చిన రాష్ట్రం తెలంగాణ అని, మిషన్ భగీరథ పూర్తి చేసి ప్రజలకు నీళ్లు ఇస్తున్నామని వీటి నిర్వహణ ఖర్చులు ఇచ్చేలా కేంద్రానికి సిఫార్సులు చేయాలని కోరినట్లు చెప్పారు. కేంద్రం ఇంటి ఇంటికి తాగునీరు ఇచ్చేందుకు అన్ని రాష్ట్రాలకు నిధులు ఇస్తుందని, అయితే తెలంగాణ, గుజరాత్ రాష్ట్రాలు ఇప్పటికే ఈ పథకాలను పూర్తి చేసినందున నిర్వహణ కింద ఇవ్వాలని కోరామన్నారు. తెలంగాణ కొత్త రాష్ట్రమైన ప్రభుత్వం చాలా బాగా పని చేస్తోందని, ముఖ్యమంత్రి పనితీరును ప్రశంసిస్తున్నామని ఆర్థిక సంఘం ఛైర్మన్ ఎన్.కె సింగ్ అన్నారని మంత్రి తెలిపారు. కమిషన్ కాల పరిమితి పెరిగిన నేపథ్యంలో ప్రాంతీయ సదస్సులు పెట్టాలనుకుంటున్నారని, దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ సదస్సు హైదరాబాద్‌లో నిర్వహించాలని అనుకుంటున్నామని ఛైర్మెన్ చెప్పినట్లు తెలిపారు.

హైదరాబాద్‌లో సదస్సు నిర్వహిస్తే కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శిస్తామని ఆర్థిక సంఘం ఛైర్మన్ నందకిశోర్ సింగ్ అన్నారని మంత్రి తెలిపారు. దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ సదస్సు హైదరాబాద్‌లో నిర్వహణను తెలంగాణ ప్రభుత్వం స్వాగతిస్తుందని ఆర్థిక సంఘానికి స్పష్టం చేశామన్నారు. రాష్ట్రాలకు నిధుల్లో కోత విధించవద్దన్నారు. జిఎస్‌టి చెల్లింపుల అంశంపై కూడా ఆర్థిక సంఘం చైర్మన్ అడిగారని, జిఎస్‌టి రూ. వెయ్యి కోట్లు, ఐజిఎస్‌టిలో రూ. 2,500 కోట్లు కేంద్రం నుంచి రావాల్సి ఉందన్నారు.

KCR letter to 15th Finance Committee Chairmen