Home ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాపై కేసీఆర్ వరాల జల్లు

ఉమ్మడి జిల్లాపై కేసీఆర్ వరాల జల్లు

kcr2

ఆదిలాబాద్ జిల్లా తెలంగాణకు కాశ్మీర్ లాంటిదని సిఎం కెసిఆర్ అన్నారు. ఆదిలాబాద్‌లో పెన్‌గంగా నదికి వరదలు వచ్చిన ప్రతిసారీ వందలాది ఎకరాలు నీట మునిగేవని అన్నారు. ఇలాంటి పరిస్థితిలో జిల్లాకు పెన్‌గంగా ప్రాజెక్టు మంజూరు చేయడం జరిగిందని సిఎం తెలిపారు. అంతేకాకుండా సాథ్‌నాల ప్రాజెక్టును రూ.28 కోట్లతో ఆధునీకరించి 25వేల ఎకరాలకు సాగునీటిని అందిస్తున్నామని చెప్పారు. సింగరేణిలో ఎవరైనా లంచం అడిగితే పొట్టుపొట్టున తన్నండని సిఎం కెసిఆర్ అన్నారు. పిల్లల భవిష్యత్ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని కెసిఆర్ కోరారు. 

– కుప్టి ప్రాజెక్టుతో పాటు…
– మరో రెండు రిజర్వాయర్ల మంజూరు
– నిర్మల్, ముధోల్ నియోజకవర్గాలకు…
– కాళేశ్వరం నుంచి సాగునీరు
– బాసర అభివృద్దికి రూ.50 కోట్లు
– మంత్రులపై ప్రశంసలు
– సామరస్యాన్ని కాపాడాలని పిలుపు

మనతెలంగాణ/ ఆదిలాబాద్‌బ్యూరో
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాపై ముఖ్యమంత్రి కేసీఆర్ వరాలజల్లు కురిపించారు. జిల్లాలో తొలిసారి పర్యటించిన ముఖ్యమంత్రి గత పాలకుల నిర్లక్షం కారణంగా వెనుకబాటుకు గురైన జిల్లాను అన్నిరంగాలలో అభివృద్ది చేసేందుకు తీసుకున్న చర్యలను వివరించడంతో పాటు మరిన్ని పథకాలను అమలు చేస్తామని ప్రకటించి జిల్లాపై తనకున్న మమకారాన్ని చాటుకున్నారు. కడెం నదిపై కుప్టి సమీపంలో రూ.870 కోట్లతో ప్రాజెక్టును నిర్మించడంతో పాటు పెన్‌గంగా ప్రాజెక్టు నీటిని సద్వినియోగం చేసుకోవడంలో భాగంగా పిప్పల్‌కోటి రిజర్వాయర్‌తో పాటు గోముత్రి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టనున్నట్లు ప్రకటించారు. ఆదిలాబాద్ జిల్లాలో మరో 18 కొత్త చెరువులకు ప్రతిపాదనలను రూపొందించడం జరిగిందని, వాటిని మంజూరు చేస్తామన్నారు. నిర్మల్, ముథోల్ నియోజకవర్గాలను సశ్యశ్యామలం చేసేందుకు కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి సాగునీటిని అందిస్తామని దీంతో రైతాంగం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పాడి పరిశ్రమను అభివృద్థి చేసేందుకు 18 కోట్ల రూపాయలను మంజూరు చేస్తామని, వాటిని జిల్లాలోని 10 నియోజకవర్గాలలో పాడి పరిశ్రమను అభివృద్ధి చేసేందుకు వినియోగించాలని పాడి పరిశ్రమ రాష్ట్ర చైర్మన్ లోక భూమారెడ్డికి సూచించారు. తలమడుగు మండలం రుయ్యాడి రహదారి నిర్మాణం కోసం 1.95 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించడంతో పాటు 33/11 కేవీ సబ్‌స్టేషన్‌ను మంజూరు చేశారు. ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధి కోసం 25 కోట్లు మంజూరు చేస్తున్నామని, ఈ నిధుల నుంచి కొంత మొత్తాన్ని కేటాయించి టౌన్ హాల్ నిర్మాణం చేపట్టాలని సూచించారు. ఆదిలాబాద్ నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం 75 కోట్ల రూపాయలను మంజూరు చేస్తామని హామి ఇచ్చారు. ఏరోడ్రామ్ నిర్మాణం చేపడతామని, జిల్లాకేంద్రంలో బీఎస్సీ అగ్రికల్చర్ కళాశాలను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గాలలో మరాఠీ సామాజిక ప్రజలు ఎక్కువగా ఉన్న విషయాన్ని పరిగణలోకి తీసుకొని మరాఠీ జూనియర్ కళాశాలను మంజూరు చేయడం జరుగుతుందన్నారు. ఎస్సీల అభ్యున్నతి కోసం 7 కోట్లు, మైనార్టీ సంక్షేమం కోసం 15 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే చదువుల తల్లి కొలువైన బాసర అభివృద్ధి కోసం ప్రత్యేకంగా 50 కోట్ల రూపాయలను మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు.
మంత్రులపై ప్రశంసలు…
జిల్లాకు చెందిన మంత్రులు జోగురామన్న, ఇంద్రకరణ్‌రెడ్డిలతో పాటు డైరీ చైర్మన్ లోక భూమారెడ్డిలపై ప్రశంసల వర్షం కురిపించారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన ఈ నేతలు ప్రజా సంక్షేమం కోసం అహర్నిషలు పాటు పడతారని కొనియాడారు. పెన్‌గంగా ప్రాజెక్టు మంజూరు చేస్తే మళ్లీ ఏమి అడగనని చెప్పిన మంత్రి రామన్న మళ్లీ తనకు పలానా పనికి నిధులు కావాలంటూ లిస్టు జాబితా ముందు పెట్టారని అన్నారు. జిల్లాకు అవసరమైన నిధులను తెప్పించి వాటిని వినియోగించుకోవడంలో మంత్రులు ముందున్నారని కొనియాడారు. ఇటీవల నిర్వహించిన సర్వేలో 106 సీట్లు టీఆర్‌ఎస్‌కు వస్తాయని తేలడంతో దిక్కుతోచని ప్రతిపక్షాలు అనేక కుట్రలు పన్నుతున్నాయని ధ్వజమెత్తారు. తమ ఉనికిని కాపాడుకొనేందుకు
చల్లటి ఆదిలాబాద్ జిల్లాలో చిచ్చు పెట్టి అశాంతిని రేపేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఎలాంటి ఇబ్బందులున్నా పరిష్కరించేందుకు సిద్దంగా ఉన్నామని అనవసరంగా గొడవ పడవద్దని హితవు పలికారు.