Home తాజా వార్తలు సోయితో ఓటేయండి

సోయితో ఓటేయండి

KCR Speech about Vote In public Blessing Meetings

మా పాలన ఫలాలు చూసి గెలిపించండి

ఓటుతోనే మన తలరాత
ఏమరుపాటుతో భవిష్యత్తు ఆగమాగం
వాస్తవాలను ఆలోచించి నిర్ణయించండి
పనిచేసే ప్రభుత్వాన్ని గెలిపించండి
నాలుగేళ్ళ ఫలాలు మీ ముందే ఉన్నాయి
అబద్ధపు మాటలతో మోడీ గోల్‌మాల్
రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు తప్పు
రాజ్యాంగంలో ఎక్కడా 50% దాటొద్దని లేదు

కేంద్రం మెడలు వంచి రిజర్వేషన్లు సాధిస్తాం
కేంద్రం ఈపాటికే సవరించి ఉండాల్సింది
ఫెడరల్ ఫ్రంట్‌తోనే సాధ్యం
ప్రజా ఆశీర్వాద సభల్లో కెసిఆర్

మన తెలంగాణ /ఆదిలాబాద్, ఆసిఫాబాద్, సిర్పూర్ కాగజ్‌నగర్, బెల్లంపల్లి, హైదరాబాద్: “ఓటు మన తలరాతను నిర్ణయిస్తుంది. దీని ద్వారానే మన తలరాతను, భవిష్యత్తును రాసుకుంటం. నాన్ సీరియస్‌గా ఓటు వేయకూడదు. ఎన్నికల్లో మీరు ఇచ్చే తీర్పు కీలకం. రాష్ట్రాన్ని, అభివృద్ధిని, సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలు ఓటు వేయాలి. ఏదో ఒక పార్టీలే అనుకుంటూ ఏమరుపాటుతో ఓటు వేయొద్దు. ఏ పార్టీతో, ఏ ప్రభుత్వంతో మంచి జరుగుతుందో ప్రజలు ఆలోచించాలి. ఓటు వేయడంలో ఏమరుపాటు నిర్ణయం తీసుకుంటే ఐదేళ్ళ మన తలరాత ఆగమాగం. భవిష్యత్తు అంధకారం. ఓటు జారిపోతే ఆ తర్వాత ఏమీ చేయలేం. అందుకే ఓటు వేసే ముందే సోయి ఉండాలి. ప్రజల ఇష్టప్రకారం పార్టీలు గెలిస్తే ఆ తర్వాత పనులు జరుగుతాయి. 58 ఏళ్ళలో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల ప్రభుత్వాలు ఏం చేశాయో, రాష్ట్రం కోసం పద్నాలుగేండ్లు కొట్లాడి నాలుగేండ్లలో చేసిన అభివృద్ధి, అమలవుతున్న సంక్షేమాన్ని పరిశీలించాలి. దురదృష్టవశాత్తూ మన దేశంలో ప్రజాస్వామ్యంలో రావాల్సినంత పరిణతి రాలేదు.

ప్రజలు చైతన్యంతో వ్యవహరించాలి” అని ప్రజలకు ముఖ్యమంత్రి కెసిఆర్ పిలుపునిచ్చారు. ఎన్నికల సందర్భంగా గెలవాల్సింది పార్టీలు, అభ్యర్థులు కాదని, నిజమైన ప్రజాస్వామ్యంలో గెలవాల్సింది ప్రజలు అని అన్నారు. ప్రజల ఆకాంక్షలు, అభీష్టం, కోర్కెలు, ఎజెండా నెరవేరాలని, అప్పుడే ఐదేళ్ళలో అవి అమలుకు నోచుకుంటాయని, ఇందుకోసం చిత్తశుద్ధి, మంచితనం, పనిచేయగల సత్తా ఉన్న పార్టీని, అభ్యర్థిని ఎన్నుకోవాలని కోరారు. 58 ఏళ్ళ నిర్వాకం, నాలుగేళ్ల అభివృద్ధిని చూసి నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా వివిధ పార్టీల నాయకులు చెప్పే మాట లు, చేసే వాగ్ధానాలు, ఇచ్చే హామీలను అక్కడికక్కడే వదిలేయ డం కాకుండా మనసుపెట్టి ఆలోచించాలని, నిదానంగా, ప్రశాంతంగా విశ్లేషించి నిర్ణయం తీసుకోవాలని, ఎటుపడితే అటు ఎవరికిపడితే వారికి ఓటు వేసే ధోరణి మంచిది కాదని సూచించారు. ఎన్నికల్లో ప్రజలు ఇచ్చే తీర్పు కీలకమని, రాష్ట్ర అభివృద్ధికి, సంక్షేమానికి అవసరమన్నారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణకు ఈ నాలుగేళ్ళలో ఒక దారి వేసుకున్నామని, ఈ ప్రగతి ఇదే వేగంతో కొనసాగాలంటే టిఆర్‌ఎస్‌ను మళ్ళీ ఆశీర్వదించాలని కోరారు. తమాషాగా, ఆషామాషీగా ఓటేస్తే ఆ తర్వాత ఐదు సంవత్సరాలో తమాషాగానే ఉంటుందన్నారు.

రిజర్వేషన్లు 50 శాతం దాటకూడదంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తప్పు అని కెసిఆర్ వ్యాఖ్యానించారు. రాజ్యాంగంలో ఎక్కడా 50% అనే నిబంధనలే లేనప్పుడు సుప్రీంకోర్టు ఎలా చెప్తుందని ప్రశ్నించారు. ప్రజల వెనకబాటుతనం, అవసరాలను గుర్తించి ఈ తీర్పుపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సవరణ చర్యలు తీసుకుని ఉండాల్సిందని వ్యాఖ్యానించారు. ఆదిలాబాద్ ప్రజా ఆశీర్వాద సభలో కెసిఆర్ మాట్లాడుతూ, ఈ పని చేయకపోగా తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం, శాసనసభ ప్రస్తుత జనాభా అవసరాలకు అనుగుణంగా గిరిజనులకు, ముస్లింలకు రిజర్వేషన్లు పెంచడంపై ఏకగ్రీవంగా తీర్మానం చేసి పంపిస్తే ‘మేం చెయ్యం, కానివ్వం’ అంటూ ప్రధాని మోడీ పెండింగ్‌లో పెట్టారని, “తెలంగాణ వారి జాగీరా? ఎందుకు చేయరు? మా గిరిజనులకు ఉద్యోగాలు, చదువు వద్దా, పేదరికం కనిపిస్తలేదా?” అని ప్రశ్నించారు. పరిశీలిస్తాం అని అనాలేగానీ ‘చెయ్యం’, ‘కానివ్వం’ అని మోడీ ఎలా అంటారని ప్రశ్నించారు. ఇది ప్రజాస్వామ్య దేశమా లేక రాచరిక రాజ్యమా అని ప్రశ్నించారు.

రాష్ట్రాల అవసరాలకు, హక్కులకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించాలని, రాష్ట్రాల హక్కులను కాలరాచి మున్సిపాలిటీలుగా మార్చి పెత్తనం చేస్తామంటే ప్రజలు సహించరని అన్నారు. రాష్ట్రాలపైన కేంద్ర ప్రభుత్వ పెత్తనం పోవాలంటే కాంగ్రెస్, బిజెపిలు లేని ఫెడరల్ ఫ్రంట్ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తప్పు అని, దీన్ని సవరించాల్సి బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని, ఈపాటికే చేసి ఉండాల్సిందిని, కానీ ఆ పార్టీల ప్రభుత్వాలు చేయవని వివరించారు. ఈ దేశంలో అందరి హక్కులూ గౌరవించబడాలని, గిరిజనులు, ముస్లింల లాగానే బిసిలు, ఓబిసిలు.. ఇలా అనేక సెక్షన్ల ప్రజలకు డిమాండ్లు ఉన్నాయని అన్నారు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, సిర్పూర్ కాగజ్‌నగర్, బెల్లంపల్లి, చెన్నూరు, మంచిర్యాల, రామగుండం నియోజకవర్గాల ప్రజా ఆశీర్వాద సభల్లో గురువారం పాల్గొన్న సిఎం కెసిఆర్ పై విధంగా వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు తెలివి లేదు
సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు కలిపి 58 ఏళ్ళు పాలన సాగించాయని, రాష్ట్ర ప్రజల అవసరాలను తెలుసుకోవడంలో విఫలమయ్యాయని, అందువల్లనే దశాబ్దాలు గడుస్తున్నా అనేక సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయని కెసిఆర్ వ్యాఖ్యానించారు. ఆ రెండు పార్టీల 58 ఏళ్ళ పాలనలో 35 ఏళ్ళుగా విద్యుత్ సమస్య ఉందని, ఏనాడూ దానిని శాశ్వత స్థాయిలో పరిష్కరించలేదని, టిఆర్‌ఎస్ మాత్రమే ఆ పని చేయగలిగిందన్నారు. రెప్పపాటు కరెంటు పోకుండా విద్యుత్‌ను సరఫరా చేయగలుగుతున్నామని, తలసరి విద్యుత్ వినియోగంలో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచామని అన్నారు. వ్యవసాయ రంగానికి 24 గంటల విద్యుత్‌ను ఉచితంగా ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. ఆ పార్టీలకు విద్యుత్ నిర్వహణలో అనుభవం, ఆలోచన, తెలివితేటలు లేవు కాబట్టే ఆ సమస్యను పరిష్కరించలేకపోయారని అన్నారు. ప్రజల అవసరాలను గుర్తించడంలోనే లోపం ఉంది కాబట్టి సంక్షేమ పథకాల అమలులోనూ ఈ నాలుగేళ్ళలో సాధించిన ప్రగతి ఆ పార్టీల పాలనలో సాధ్యం కాలేదన్నారు.

కరెంటు వెనక కష్టాలు
ఒకప్పుడు కరెంటు వస్తే వార్త అని, ఇప్పుడు కరెంటు పోతే వార్త ని వ్యాఖ్యానించిన కెసిఆర్ ఇప్పుడు 24 గంటల కరెంటు సరఫరా చేయడం ఆషామాషీగా జరగలేదని, కఠోర శ్రమ చేయాల్సి వచ్చిందన్నారు. ప్రతీ గంటా కరెంటు కోసం కాపలా కుక్కలాగా పనిచేశామని, రోజుకు నాలుగైదు సార్లు కరెంటుపై సమీక్ష చేస్తూ ప్రతీ గంటా విద్యుత్ డిమాండ్, ఉత్పత్తి, సరఫరా అంశాల్లో ఫోన్‌లో, టాబ్‌లో నిరంతరం పరిశీలించడం ద్వారానే ఇప్పుడున్న 24 గంటల విద్యుత్ సరఫరా సాధ్యమైందన్నారు. కరెంటు పరిస్థితి బాగైతదంటే జానారెడ్డే ఒప్పుకోలేదని, సాధ్యమే కాదన్నారని, ఇప్పుడు ఏం జరుగుతుందో ప్రజలందరికీ స్వీయానుభవమైందని అన్నారు. కరెంటు సమస్యను పరిష్కరించడంతో వ్యవసాయం, పరిశ్రమలు..

మొదలు అనేక రంగాలకు ప్రయోజనం కలిగిందని, రాష్ట్ర సంపద పెరిగిందని, దాని ద్వారా సంక్షేమం రూపంలో ప్రజలకు పంచుతున్నామని తెలిపారు. నిరంతర విద్యుత్ సరఫరాతో రైతులకు కరెంటు మోటార్లు కాలిపోవడం లేదని, ఫలితంగా రిపేర్ల కోసం వెచ్చించే వేలాది, లక్షలాది రూపాయలు ఆదాయ అయ్యాయని వివరించారు. కడుపు నిండా కరెంటు ఇవ్వడంతో రైతులు సంతృప్తిగా సేద్యం చేసుకుంటున్నారని తెలిపారు. మరో రెండేళ్ళలో రాష్ట్రంలో కోటి ఎకరాలకు సాగునీరు ఇచ్చి ఆకుపచ్చ తెలంగాణను ఆవిష్కరిస్తామని, దాని వెన్నంటే ప్రతీ రైతు ఇప్పుడున్న అప్పులన్నింటినీ తీర్చి బ్యాంకు ఖాతాల్లో ఐదారు లక్షల రూపాయలు జమ చేసుకునే స్థాయికి చేరుకుంటారని, అప్పుడే అది బంగారు తెలంగాణ అని వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పడానికే అసెంబ్లీ రద్దు
ఎన్నికలు మరో నాలుగైదు నెలల తర్వాత రావాల్సి ఉందని, అయితే అసెంబ్లీని రద్దు చేసి ఇప్పుడే ఎన్నికలు ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందో కెసిఆర్ వివరిస్తూ, నాలుగేళ్ళలో టిఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన మంచి పనులను జీర్ణించుకోలేక పుట్టగతులు ఉండవనే భయంతో కాంగ్రెస్ పిచ్చిపిచ్చి ఆరోపణలు చేస్తూ, ఇష్టమొచ్చినట్లు అడ్డగోలుగా అవాకులు చెవాకులు పేలుతూ ఉంటే ప్రజల దగ్గరికే పోదాం, ప్రగతి ఆగొద్దు, పెరుగుదల ఆగొద్దు, సంక్షేమం ఆగొద్దు అనే ఉద్దేశంతో ఇప్పుడు ఎన్నికలకు రావాల్సి వచ్చిందని పేర్కొన్నారు. అధికారుల మనోస్థయిర్యం దెబ్బతినేలా కాంగ్రెస్ పిచ్చి ప్రేలాపనలు చేసింది. అన్ని సెక్షన్ల ప్రజలకు మంచి పనులు జరగడం కోసం చిల్లర మల్లర రాజకీయాలు, ఆరోపణలు వద్దనుకుని ప్రజల ఆశీర్వాదం కోసం తానే ఈ ఎన్నికలను తెచ్చానని స్పష్టం చేశారు. ఇక నిర్ణయించాల్సింది, తీర్పు చెప్పాల్సింది ప్రజలేనని అన్నారు. మరో ఐదేళ్ళు బ్రహ్మాండంగా పనిచేయాలన్న ఉద్దేవంతో ప్రజల తీర్పుతో మీ ముందుకు వచ్చామని అన్నారు.

తెలంగాణను కాకులు, గద్దలకు అప్పజెప్పవద్దు
ఈ నాలుగేళ్ళలో కడుపు, నోరు కట్టుకుని, అవినీతి లేకుండా చేస్తే రాష్ట్ర సంపద పెరిగిందని, దాన్ని ప్రజలకు సంపద రూపంలో పంచామని, చిత్తశుద్ధి, నిజాయితీతోనే ఇది సాధ్యమైందని కెసిఆర్ వ్యాఖ్యానించారు. రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టి నిబద్ధతతో పనిచేస్తున్నందువల్లనే పెట్టుబడులు వస్తున్నాయని, మూతపడిన పరిశ్రమలను తెరిపిస్తున్నామని తెలిపారు. ఇప్పుడు రాష్ట్రంలో గుడుంబా బట్టీలు, భూకబ్జాలు, పేకాట క్లబ్బులు, కర్పూ లాంటివి లేవని, ప్రజలు ప్రశాంతంగా జీవిస్తున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రాన్ని కాకులు, గద్దలకు అప్పజెప్పదవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజలకు మంచి చేస్తుంటే ఆ పార్టీలకు మంట, పైరవీకారులకు కడుపు మంట అని అన్నారు. ఏ పార్టీ హయాంలో కాగజ్‌నగర్‌లో పరిశ్రమలు మూతపడ్డాయో, ఏ పార్టీ తెరిపించే ప్రయత్నం చేస్తుం దో ప్రజలకు తెలుసునని, నిజానిజాలు, వాస్తవాలను ఆలోచించాలని, ప్రజలే సాక్షమని, నిజం వైపే నడవాలని కోరారు. కాంగ్రెస్ వస్తే కరెంటు తిప్పలు తప్పవని, ఇక్కడ తాబేదారులను పెట్టుకుని కాంగ్రెస్ ఆడిస్తోందని ఆరోపించారు.

తెలంగాణ ఓ సింహం, బెబ్బులి
ఎలాగైనా అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో రాజకీయ పార్టీలు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాయని, ప్రజలను గందరగోళంలో పడేసే ప్రయత్నం చేస్తున్నాయని వ్యాఖ్యానించిన కెసిఆర్ తెలంగాణ ప్రజలను ఆగమాగం చేయడం మోడీ, అమిత్‌షాల వల్ల కాదని, మోడీ అయ్య వల్ల కూడా కాదని అన్నారు. తెలంగాణ ఒక సింహం, ఒక బెబ్బులి అని వ్యాఖ్యానించారు. తెలంగాణ గడ్డమీద ప్రతీ ఒక్కరికీ స్థలం ఉందని, ఆ తహజీబ్, సంస్కారం ఈ గడ్డ ప్రత్యేకత అని అన్నారు. ఆత్మగౌరవంతో బతికే, బతికించే రాష్ట్రమన్నారు. నాలుగున్నరేళ్ళుగా రంజాన్, క్రిస్మస్, దసరా లాంటి అన్ని మతాలకు చెందిన పండుగలు జరుగుతున్నాయని, పర్వదినం సందర్భంగా కొత్త బట్టలు పెట్టడం కూడా ఇక్కడి సంస్కృతిగా కొనసాగుతోందన్నారు. ఆ మంచి లక్షణాలను ఇక్కడి నుంచి నేర్చుకోవాలని మోడికి హితవు పలికారు. “మీ బుర్రలో (మజబీ) చెడ్డ ఆలోచనలు ఉన్నాయి” అని మోడీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

మానవీయ కోణంతోనే సంక్షేమ పథకాలు
ప్రజలే కేంద్ర బిందువుగా, సమస్యల పరిష్కారమే ప్రధాన ఎజెండాగా టిఆర్‌ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలుచేస్తోందని, దేశంలోనే ఇలాంటి పథకాలు మరే రాష్ట్రంలోనూ లేవని కెసిఆర్ వ్యాఖ్యానించారు. రాష్ట్రం ఏర్పడిన కొత్తలో మొదటి ఏడాది మొత్తం ఆంధ్రప్రదేశ్‌తో విభజన పంచాయతీ, అధికారుల కొరత, కేంద్రం సహకారం లేకపోవడం, ఏడు మండలాల విలీనం తదితరాలకే సరిపోయిందని, ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో కూడా తెలియదని, అలా మొదలైన ప్రయాణం ఇప్పుడు దేశంలోనూ, ప్రపంచంలోనూ కనీవినీ ఎరుగని రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, కంటివెలుగు, అమ్మ ఒడి, ఆరోగ్యలక్ష్మి, కెసిఆర్ కిట్, పరమపదవాహనం లాంటి అనేక పథకాలతో నెంబర్ వన్ స్థానంలో నిలిచిందని, ప్రతీ ఏటా సుమారు రూ. 43 వేల కోట్లను సంక్షేమానికే ఖర్చు పెడుతున్నామని తెలిపారు.

కెసిఆర్ బతికున్నంత వరకు, సిఎంగా కొనసాగినంతవరకు, టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఉన్నంతవరకు ఈ సంక్షేమ పథకాలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. మానవీయ కోణం, ఆత్మీయ స్పర్శ ఉన్నందునే ఈ పథకాలు వచ్చాయని, 58 ఏళ్ళ సమైక్య రాష్ట్రంలో ఇలాంటి పథకాలే లేవన్నారు. వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసి రైతాంగాన్ని ఆదుకుంటున్న ప్రభుత్వం రైతుబంధు పేరుతో పంట పెట్టుబడి సాయం చేయడంతో పాటు కుటుంబ పెద్ద చనిపోతే ఆ కుటుంబం రోడ్డున పడరాదన్న ఉద్దేశంతో బీమా ద్వారా ఐదు లక్షల పరిహారం అందించే పథకాన్ని కొనసాగిస్తున్నామని తెలిపారు. కోటి ఎకరాలకు సాగునీరు ఇచ్చి రైతులకు ఇప్పుడున్న అప్పులన్నీ తీరిపోయి బ్యాంకు ఖాతాల్లో ఐదారు లక్షల రూపాయలు ఉన్నప్పుడే బంగారు తెలంగాణ అని కెసిఆర్ వ్యాఖ్యానించారు.

సింగరేణి కార్మికులకు అండగా
సింగరేణి కార్మికులకు ఎల్లవేళలా ప్రయోజనం చేకూర్చేందుకే తాను కృషి చేస్తానని, డిపెండెంట్ ఉద్యోగాలకు సంబంధించి విధానపరమైన నిర్ణయం తీసుకుంటే కాంగ్రెస్ కోర్టుకు వెళ్ళి స్టే ఉత్తర్వులు తీసుకొచ్చిందని, ఆ తర్వాత వేరే పేరుతో కొనసాగిస్తున్నామని కెసిఆర్ తెలిపారు. సింగరేణి స్థలాల్లో కార్మికులు కట్టుకున్న స్వంత ఇళ్ళకు పట్టాల సమస్య ఉందని, ప్రభుత్వ ఉత్తర్వు వెలువడినా ఎన్నికల నియమావళి కారణంతో అమల్లోకి రాలేదని, ఎన్నికలు పూర్తయిన తర్వాత తానే స్వయంగా వచ్చి పట్టాలు ఇస్తానని తెలిపారు. గిరిజనుల పోడు భూములకు కూడా ఇదే తరహా సమస్య ఉందని, వారికి కూడా రైతుబంధు, రైతుబీమా సౌకర్యం వర్తించేలా తానే ఆయా జిల్లాల్లో ఒకటి రెండు రోజులు మకాం వేసి అధికారులను అక్కడికి పిలిపించి ఒక శాశ్వత పరిష్కారం కనుగొంటామని హామీ ఇచ్చారు.

బిజెపికి ఘాటైన జవాబు
తెలంగాణను విమర్శిస్తున్న బిజెపికి కెసిఆర్ ఘాటైన సమాధానం ఇచ్చారు. తెలంగాణలో అభివృద్ధి లేదని, కేంద్ర ప్రభుత్వ పథకాలను వద్దంటున్నాడంటూ తనపైన ఆ పార్టీ ఆరోపణలు చేస్తోందని, నిజాయితీగా ఆ పార్టీ అధికారంలో ఉన్న 19 రాష్ట్రాల్లో తెలంగాణ తరహా సంక్షేమ పథకాలు అమలవుతున్నాయేమో చూపాలని సవాల్ విసిరారు. బిజెపి అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలోనూ వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్, కల్యాణలక్ష్మి, రైతుబంధు, రైతుబీమా, కెసిఆర్ కిట్ లాంటి అనేక పథకాలు లేవని, టిఆర్‌ఎస్‌ను విమర్శించే ముందు ఆ రాష్ట్రాల్లో ఇవి ఎందుకు లేవో ఆ పార్టీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కనీసం ఐదు వందల రూపాయల పింఛన్నయినా ఇస్తున్నారా అని ప్రశ్నించారు. అన్ని సెక్షన్ల ప్రజలో సుభిక్షంగా, సుఖంగా ఉండాలన్నదే టిఆర్‌ఎస్ లక్షమన్నారు.

జాతీయ పార్టీలన్నీ ఝూటాకోర్‌లే

జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బిజెపిలు అబద్ధాలకోరులని, కళ్ళముందు కనిపిస్తున్న సత్యాన్ని సైతం రాజకీయ ప్రయోజనాల కోసం చూడలేవని అన్నారు. ప్రధాని మోడీ సైతం తెలంగాణలో కరెంటు లేదంటూ నిజామాబాద్ వేదికగా అబద్ధపు వ్యాఖ్యలు చేశారని, మహబూబ్‌నగర్ జిల్లాలో ఉన్న తాను అర్ధగంటలో హెలికాప్టర్‌లో వస్తానని, ప్రజల మధ్యనే తేల్చుకుందామని సవాలు విసిరితే పారిపోయారని వ్యాఖ్యానించారు. బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా సైతం అల్పస్థాయిలో మోరీలు లేవు, కమ్యూనిటీ హాళ్ళు లేవంటూ అబద్ధాలే మాట్లాడారని అన్నారు. ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే వినడానికి తెలంగాణ ప్రజలు గొర్రెల్లా కనిపిస్తున్నారా అని ప్రశ్నించి తెలంగాణలో ఇది నడవదని వ్యాఖ్యానించారు.

కొట్లాడి సాధించుకున్న బెబ్బులి తెలంగాణ అని, అబద్ధాలు చెప్తే మౌనంగా విని ఊరుకునేంత పిచ్చివాళ్ళు కాదని, ఓటు రూపంలో ఏం బుద్ధి చెప్పాలో అది చెప్తారని అన్నారు. బిజెపి 19 రాష్ట్రాల్లో అధికారంలో ఉందని, ఏ ఒక్క రాష్ట్రంలోనైనా వ్యవసాయ రంగానికి 24 గంటల విద్యుత్‌ను ఉచితంగా ఇస్తోందా, కనీసం 24 గంటలు సరఫరా చేస్తోందా, కల్యాణలక్ష్మి ఇస్తోందా, రైతుబంధు రైతుబీమా లాంటి పథకాలను అమలుచేస్తోందా అని కెసిఆర్ ప్రశ్నించారు. ఆ రెండు పార్టీలు ఈ దేశానికి పట్టిన చీడ అని వ్యాఖ్యానించిన కెసిఆర్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఫెడరల్ ఫ్రంట్‌పై దృష్టి పెడతానని, తానే క్రియాశీలక పాత్ర పోషిస్తానని అన్నారు.

KCR Speech about Vote In public Blessing Meetings

Telangana Latest News