Home తాజా వార్తలు మళ్లీ ఆంధ్రోళ్ల పాలనా?

మళ్లీ ఆంధ్రోళ్ల పాలనా?

దాచిదాచి దయ్యాలపాలా, చంద్రబాబుకు అప్పగిద్దామా?

 అమరావతికి, ఢిల్లీకి గులాములు కావాలా
 మన నిర్ణయాలు మనమే తీసుకోవాలా
 ప్రజలు ఆలోచించాలి..
 ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన దొంగ చంద్రబాబు నాయుడుతో కాంగ్రెస్ పొత్తా
 రాష్ట్రాన్ని తెలంగాణ ద్రోహి చేతిలో పెట్టడానికి ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయి
 నిజామాబాద్ సభలో అశేష ప్రజానీకాన్ని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో కెసిఆర్ నిప్పులు

kcr

మన తెలంగాణ/నిజామాబాద్/హైదరాబాద్ : కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రాన్ని తెలంగాణ ద్రోహి అయిన చంద్రబాబు చేతిలో పెట్టడానికి ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని తెలంగాణ రాష్ట్ర సమితి(టిఆర్‌ఎస్) అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ధ్వజమెత్తారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన దొంగ చంద్రబాబు అని తీవ్రస్థాయిలో విరుచుపడ్డారు. చంద్రబాబు నాయుడితో పొత్తా మీ బతుకులకు, నవ్వెటోని ముందు జారిపడతామా..? అని మండిపడ్డారు.  కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను దాచిదాచి దయ్యాలపాలు చేసినట్లు..చంద్రబాబుకు అప్పగిద్దామా..? అని ప్రశ్నించారు. ఈ విషయంలో ప్రజలు ఆలోచించాలని కోరారు. బుధవారం ఇందూరులోని గిరిరాజ్‌కళాశాల మైదానంలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సిఎం కెసిఆర్ ప్రసంగించారు. సిగ్గు లేకుండా చంద్రబాబుతో పొత్తు కలుస్తున్నామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారని, థూ…మీ బతుకులు చెడ..ఎవడైతే తెలంగాణ నాశనం చేసిండో…తెలంగాణ ద్రోహి..చెడిపోయి చంద్రబాబుతో పొత్తా..? అని మండిపడ్డారు. అడుక్కుంటే మేం ఇస్తాం కదా నాలుగు సీట్లు..అని ధ్వజమెత్తారు. మళ్లీ ఆంధ్రోళ్లకు అధికారం అప్పగిస్తారా..? అని ప్రశ్నించారు. తెలంగాణ కోసం ఇంతమంది చనిపోయింది ఇందుకేనా..? చావు నోట్ల తల పెట్టి నేను తెలంగాణ తెచ్చింది ఇందుకేనా అన్నారు. చంద్రబాబు తెలంగాణలో రాజకీయ అస్థిరత తేవాలని చూశారని మండిపడ్డారు. ఏడు మండలాలను గుంజుకున్న దుర్మార్గుడు చంద్రబాబు అని, మనకు కరెంట్ ఇవ్వకుండా రాక్షసానందం పొందిన రాక్షసుడు చంద్రబాబేనని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణకు కరెంట్ ఇవ్వని రాక్షసుడు చంద్రబాబు, తెలంగాణ ప్రాజెక్టులు ఆపాలని చంద్రబాబు కేంద్రానికి 36 లేఖలు రాశారని చెప్పారు. చంద్రబాబు రూ.500 కోట్లు ఇస్తాడంట, మూడు హెలికాప్టర్లు పెడతారంటా….ఈ విషయాలపై చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలని అన్నారు. కాంగ్రెసోళ్ల నిర్ణయాలు అన్నీ ఢిల్లీలోనే జరుగుతాయని, మన ఆత్మగౌరవాన్ని కాపాడుకుందామని, ఢిల్లీకి గులాంగిరీ చేయొద్దని చెబుతున్నానని పేర్కొన్నారు. అమరావతి గులాములు…లేకపోతే ఢిల్లీ గులాములు కావాలా..? లేక తెలంగాణలో మన నిర్ణయాలు మనమే తీసుకుని మన బతుకులు మనమే బాగుచేసుకుందా మా..? ప్రజలు ఆలోచించాలని   అన్నారు. కాంగ్రెస్, టిడిపి నేతలు ఏ మొహం పెట్టుకుని ఓట్లు అడుతున్నారని సిఎం కెసిఆర్ ప్ర శ్నించారు. కిరణ్‌కుమార్‌రెడ్డి అసెంబ్లీలో తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వనని అంటే, కాంగ్రెస్ సన్నాసులు మంత్రి పదవులోల ఉండి కూడా ఒక్క రూ నోరు తెరవలేదని మండిపడ్డారు. తెలంగాణలో రైతులకు ఆదుకునేందుకు ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం రెండవ విడత చెక్కులు పంపిణీ చేయకుండా అడ్డుకోవాలని కాంగ్రెస్ నేతలు కేసులు వేస్తున్నారని అన్నారు. రైతుబం ధు పథకం, రైతు భీమా పథకాలు అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు. పంటలకు 24 గం టల ఉచిత కరెంట్, రైతులకు సబ్బిడీ రుణా లు, ట్రాక్టర్లు పంపిణీ చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని, ఇలా దేశంలో ఎక్కడా లేని పథకాలు అమలు చేస్తూ రాష్ట్రాన్ని నెంబర్‌వన్‌గా నిలబెడుతుంటే చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు కేసులు వేస్తున్నాయని కెసిఆర్ మండిపడారు.
నా నోరూ చెడ్డదే…తెల్లారే వరకు తిడతా
కాంగ్రెస్ పార్టీ నేతలు తనపై చేస్తున్న విమర్శలు, తిడుతున్న తిట్లపై సిఎం కెసిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టిపిసిసి అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తనను బట్టెబాజ్ గాడు అన్నడు, ముఖ్యమంత్రిని స్థానంలో ఉన్న తనను అలా తిట్టొచ్చా అని ప్రశ్నించారు. ఎవరిది చెడ్డ నోరో చెప్పాలంటూ ప్రజలను ఉద్దేశించి అన్నారు. తన నోరు కూడా చెడ్డదే అని, నోరు తెరిచానంటే తెల్లారే వరకు తిడతా అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఉద్యమంలో ఉన్నప్పుడు మాట్లాడాను, ఇప్పుడు చల్లబడ్డానని అనుకుంటున్నారని, కానీ ఉన్నత పదవిలో ఉన్నందుకు బాధ్యతతో ఉన్నానని చెప్పారు. అయినా ఈ చిల్లర వ్యక్తులతో తనకు పంచాయతీ లేదని అన్నారు.
బిజెపి హామీలపై ఫైర్
తెలంగాణలో ఎన్నికల నేపథ్యంలో బిజెపి ఇస్తున్న హామీలపై సిఎం కెసిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బిజెపి నేతలు తాము అధికారంలోకి వస్తే ఇండ్ల కిరాయిలు కడుతామంటూ, ఎన్నికల ముందు నోటికొచ్చిన హామీలు ఇస్తున్నారని అన్నారు. 2014లో బిజెపి అధికారంలోకి వస్తే విదేశాల నుంచి నల్లధనం తీసుకువచ్చి, ప్రతి ఒక్కరి బ్యాంకు ఖాతాలో రూ.15 లక్షలు జమచేస్తామని చెప్పారని, ఆ హామీ ప్రకారం ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తే మేమే ఇళ్ల కిరాయిలు కట్టుకుంటామని అన్నారు. ప్రజలను గొర్రెలు అనుంటున్నారా..? అమాయకులు అనుకుంటున్నారా.?ప్రజలెవరూ మోసాలకు గురికావొద్దని మనవి చేశారు. చెప్పెటోడు చెవిటోడు అయినా, వినేటోడికి ఇజ్జత్ ఉండాలి కదా..? అని కెసిఆర్ వ్యాఖ్యానించారు.
పెన్షన్లపై కాంగ్రెస్ అర్రాస్ పాట పాడుతుంది
పెన్షన్ల విషయంలో కాంగ్రెస్ అర్రాస్ పాట పాడుతుందని సిఎం కెసిఆర్ మండిపడ్డారు. తమ ప్రభుత్వం రూ.వెయ్యి పెన్షన్ ఇస్తుంటే, కాంగ్రెసోళ్లు రూ.2 వేలు అంటున్నారని, తాము రూ.2,200 అంటే ఏం అంటారని ప్రశ్నించారు. రాష్ట్రంలో పేదలకు ఇచ్చే రూ.1000ల పింఛన్లను మరోసారి పెంచుతామని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు. ఎంత పెంచాలనే అంశాన్ని మేనిఫెస్టో కమిటీ నిర్ణయిస్తుందని తెలిపారు. ఆ వివరాలను త్వరలోనే ప్రజలకు ముందు ఉంచుతామని వెల్లడించారు. కాంగ్రెస్ పాలనలో రూ.200లుగా ఉన్న పింఛనును తమ ప్రభుత్వంఅధికారంలోకి వచ్చాక రూ.1000కు పెంచామని గుర్తు చేశారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం రూ.వెయ్యి పెన్షన్ ఇచ్చి కాంగ్రెస్‌చేత రూ.2000 ప్రకటించేలా చేసిందన్నారు. రూ.50.. 70.. 100 చొప్పున పింఛన్లు ఇచ్చి కాంగ్రెస్ నేతల నోటి నుంచి రూ.2000 ఇస్తామని ప్రకటించేలా చేసినందుకు తాను గర్వపడుతున్నాన్నారు. రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాల అమలులో దేశంలోనే నంబర్‌వన్‌స్థానంలో ఉండి రూ.42వేల కోట్లు ఖర్చు చేసి రూ.200గా ఉన్న పెన్షన్లను రూ.1000లు చేసినట్టు వివరించారు. రాష్ట్రంలోని వృద్ధులు, వికలాంగులు కేసీఆర్ మా పెద్ద కొడుకు అని ఆశీర్వదిస్తున్నారని,వారి దీవెన ఎప్పటికీ ఉంటుందన్నారు పేర్కొన్నారు. కులవృత్తులను ఆదరిస్తు గొల్ల కురుమలు, మత్సకారులు, గీత కార్మికులు, రజకులు, నాయి బ్రాహ్మణులు ఆదుకున్నామని పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్యంపై దృష్టి సారించి ఇప్పటికే కంటి చికిత్సల కోసం కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభిమచామని త్వరలోనే ముక్కు, చెవి సంభంద చికిత కోసం ఈఎన్‌టీ బృందాలు గ్రామాల కొస్తాయని ఆరోగ్య తెలంగాణకోసం ప్రతి ఒక్కరి హెల్త్ ప్రొఫైల్ రూపొందిస్తామనిచెప్పారు.
ఇంతటి జన ప్రభంజనం ఏనాడూ చూడలేదు
తెలంగాణ ఉద్యమ సమయంలో అనేక సభలు పెట్టినప్పటికీ ఇంతటి జన ప్రభంజనాన్ని తానెప్పుడూ చూడలేదని సిఎం వ్యాఖ్యానించారు. నిజామాబాద్‌జిల్లా ప్రజలు తెరాసను తమ గుండెల్లో పెట్టుకున్నారన్నారు. నిజామాబాద్ జిల్లా తొలిసారి స్వతంత్రంగా జెడ్‌పి గెలిపించి గులాబీ జెండా ఎగురవేసిన ఖిల్లా అని కొనియాడారు. ఎంపి, ఎమ్మెల్యే స్థానాలన్నింటితో పాటు మేయర్, జెడ్‌పి ఛైర్మన్ అందరినీ గెలిపించి టిఆర్‌ఎస్‌కు అపూర్వ విజయం అందించారని కొనియాడారు. పౌరుషానికి ప్రతీక నిజామాబాద్‌జిల్లా అన్నారు. ఈ సభకు ఉమ్మడి నిజామాబాద్‌జిల్లా నుంచి భారీగా జనం తరలివచ్చారు. తెలంగాణ రాష్ట్రం టీఆర్‌ఎస్‌తోనే సుభిక్షంగా ఉంటుందని స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో ఒక్క సీటు కూడా వదలకుండా రెండు ఎంపిలు, 9 ఎంఎల్‌ఎ స్థానాల్లో గెలిపించిన జిల్లా నిజామాబాద్ జిల్లా అని పేర్కొన్నారు. 2014లో టిఆర్‌ఎస్ చేతుల్లో రాష్ట్రం ఉంటే బాగుంటుందని తమకు అధికారం ఇచ్చారని చెప్పారు.
భగీరథ పరుగులు పెడుతోంది
తెలంగాణ రాష్ట్రంలో మిషన్ భగీరథ పరుగులు పెడుతోందని కెసిఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్, టిడిపి ప్రభుత్వాల హయాంలో ఎండాకాలం వచ్చిందంటే మంచినీటి కోసం తిప్పలు పడాల్సిన పరిస్థితి ఉండేదని అన్నారు. నీటి విషయంలో భయంకరమైన పరిస్థితులు ఉండేవని, తెలంగాణలో ప్రతి ఎకరానికి సాగునీరు, ప్రతి ఇంటికి కృష్ణా, గోదావరి నీళ్లు రావాలనే సంకల్పంతో ముందుకెళ్తున్నాం చెప్పారు. 1.50 లక్షల కిలోమీటర్ల పైపులైన్లు 12 వేల రకాల అడ్డంకులు దాటుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా భగీరథ పరుగులు పెడుతుందని అన్నారు. రాబోయే రెండు మూడు నెలల్లో ఇంటింటికీ నీళ్లు ఇవ్వబోతున్నామని, ఇవన్నీ కూడా మీ కళ్ల ముందు ఉన్నాయని సిఎం చెప్పారు. అలాగే మన దవాఖానాలు మంచిగా చేసుకున్నామని, ప్రభు త్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం లభిస్తుందని అన్నారు. కెసిఆర్ కిట్, కల్యాణలక్ష్మీ, షాదీముబారక్, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సన్నబియ్యంతో భోజనం వంటి 452 కార్యక్రమాలు అమలు చేశామని చెప్పారు. ఇందూరు జిల్లాలో బీడీ కార్మికులకు పెన్షన్లు ఇస్తున్నామని తెలిపారు. ఆరోగ్యం బాగలేకపోయినా గతిలేక బీడీలు చేస్తున్నారని , వీరి గురించి ఏ ప్రభుత్వం ఆలోచన చేయలేదని చెప్పారు. నిజామాబాద్ జిల్లాలో 39 శాతం బీడీ కార్మికులు జిల్లాలోనే ఉన్నారని పేర్కొన్నారు. బాల్కొండ, మోర్తాడ్ సభలో తాను చెప్పిన విధంగా బీడీ కార్మికులకు రూ. వెయ్యి పెన్షన్ ఇస్తున్నామని అన్నారు.
చంద్రబాబు, ఉత్తమ్‌పై మాటల తూటాలు

రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే మళ్లీ టిఆర్‌ఎస్‌కే పట్టం కట్టాలని సిఎం కెసిఆర్ అన్నారు. నిజామాబాద్ జిల్లాలో తొమ్మిదికి తొమ్మిది సీట్లు టిఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించాలని అన్నారు. హిందు ముస్లింలు కలిసి పనిచేస్తే రాష్ట్ర స్వరూపమే మారిపోందని అన్నారు. గులాబి ఖిల్లాగా ఈ జిల్లాకు పేరుండాలి, గత విజయాన్నే ఈసారి కూడా ఇవ్వండని పిలుపినిచ్చారు. నాలుగున్నరేళ్ల తమ పాలనలో అన్ని రంగాలలో అభివృద్ది సాధించామని చెప్పారు. కాంగ్రెస్ నేతల బతుకే కేసులని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నేతల కోర్టు కేసులతో ఇబ్బం దులు పెట్టడాన్ని సహించలేకే ముందస్తు ఎన్నికలకు వెళ్లామని చెప్పారు. రైతు బంధు పథకం కింద నవంబర్‌లో నెలలో యాసంగి పంటకు ఎకరానికి రూ.4 వేల చొప్పున ఇస్తామని చెప్పామని, దీనిపై కాంగ్రెసోళ్లు కేసు వేశారని అన్నా రు. కడుపు కట్టుకుని, నోరు కట్టుకుని అవినీతికి దూరంగా ఉండి పనిచేసిన కారణంగా ఆర్థికంగా తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని ముఖ్యమ్ంరత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. అర్థాకలితో పనిచేసే హోంగా ర్డులు, అంగన్‌వాడీ వర్కర్లు, ఆశావర్కర్లు, కాంట్రాక్ట్ ఉద్యోగుల జీతాలు పెంచామని గుర్తు చేశారు. రాష్ట్రంలో నాలుగేళ్లలో 17.17 శాతం ఆర్థిక ప్రగతి నమోదైందని చెప్పారు. గడిచిన నాలుగైదు నెలల్లో 19.83 శాతం ఆర్థిక ప్రగతి ఉందని తెలిపారు. అవినీతి లేకుండా ఉండటం వల్లనే ఈ ప్రగతి సాధ్యమైంద న్నారు. 10 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో ఇసుక మీద తొమ్మిదిన్న కోట్ల ఆదాయం వస్తే, ఈ నాలుగేఊళ్లలో ఇసుక మీద రూ.1977 కోట్ల ఆదాయం వచ్చిందని చెప్పారు. ఉద్యోగుల విషయంలో కొందరు పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రభుత్వ ఉద్యోగులకు 43 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చిన ఘనత తమ ప్రభుత్వానిదే అని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఉద్యోగులకు మంచి పెంపు ఉంటుందని, ఆందోళన అవసరం లేదని చెప్పారు.
జానా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు
రెప్పపాటు విద్యుత్ కోత లేకుండా చేస్తానని తాను అసెంబ్లీలో ప్రకటించిన విషయాన్ని కెసిఆర్ మరోసారి గుర్తు చేశారు. అలా ప్రకటన చేసినట్లయితే గులాబీ గంపడలా కప్పుకుంటానంటూ ప్రతిపక్ష నేత జానారెడ్డి ప్రకటించిన విషయాన్ని ప్రస్తావించారు. ఆయన ఇప్పుడు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. తెలంగాణను 1956లో అన్యాయంగా ఆంధ్రాలో కలిపింది నెహ్రూ అని, నేడు తెలంగాణ ఉద్యమంలో కెసిఆర్ పాత్ర లేదని అంటున్నారని మండిపడ్డారు. గతంలో వరంగల్ ఉప ఎన్నికల్లో జైపాల్‌రెడ్డి ఇదే మాట అన్నారని, అప్పుడు సవాల్ విసిరానని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని గమనించిన ప్రజలు నాలుగు లక్షల ఓట్లకు పైగా మెజార్టీతో టిఆర్‌ఎస్ అభ్యర్థి దయాకర్‌ను గెలిపించారని అన్నారు.