Home తాజా వార్తలు చంద్రబాబు కహానీ ఖతం

చంద్రబాబు కహానీ ఖతం

డిపాజిట్లు కూడా దక్కకుండా ఓడిపోతాడు

ఎపి హోదాకు టిఆర్‌ఎస్ మద్దతిస్తుంది

ఆంధ్రా ప్రజలు మంచివారే…
10 మంది కిరికిరి గాళ్లతోనే పంచాయతీ
బాబుది దరిద్రపు బుద్ధి
తెలంగాణ ఊటీ వికారాబాద్
ప్రజల అభీష్టం, అభిమతం గెలవాలి
వెలుగు జిలుగుల అభివృద్ధి పథంలో తెలంగాణ

డబుల్ ఇళ్లకు ఈ బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తాం
త్వరలో హెల్త్ ప్రొఫైల్
రంజిత్‌రెడ్డిని గెలిపిస్తే 111ను ఎత్తివేస్తాం
కొత్త మున్సిపాలిటీ చట్టాన్ని తీసుకొస్తా
చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ బహిరంగ సభలో సిఎం కెసిఆర్

 

మన తెలంగాణ/హైదరాబాద్: హైదరాబాద్ కళావిహీనంగా మారుతుందని చంద్రబాబు శాపనార్థాలు పెడుతున్నాడని, చంద్రబాబు క హానీ ఖతం అయ్యిందని, డిపాజిట్ రాకుండా ఓడిపోతున్నాడని కెసిఆర్ ఆరోపించారు. దీనికి సంబంధించిన సర్వే రిపోర్టు కూడా తన దగ్గర ఉందని ఆయన తెలిపారు. వికారాబాద్‌లో చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ బహిరంగ సభలో పాల్గొన్న సిఎం కెసిఆర్ మాట్లాడుతూ ప్రత్యేకహోదాకు టిఆర్‌ఎస్ మద్ధతు ఇస్తుందని జగన్‌మోహన్‌రెడ్డి ఓ సభలో చెప్పారని, జగన్‌మోహన్‌రెడ్డి, కెసిఆర్ నీకు చెవిలో చెప్పిండా అని వెటకారంగా బాబు మాట్లాడుతున్నాడని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము మా మేలుతో పక్క వారి మేలు కూడా కోరుకుంటామని కెసిఆర్ పేర్కొన్నారు. చెవిలో చెప్పే బాధ తనకు లేదని, చీకటి పనులు బాబు లాగా చెయ్యమని, మంది గోతులు తియ్యమని, ఆ కుట్రలు తెలంగాణకు రావని కెసిఆర్ పేర్కొన్నారు. తాము బాగుండాలి ఇతరులు కూడా బ్రతకాలనీ తాము కోరుకుంటామని కెసిఆర్ తెలిపారు. ఆంధ్రా సిఎం చంద్రబాబు తనను రోజూ తిడుతున్నాడని కెసిఆర్ ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం వస్తే కరెంట్ ఉండదని, చీకట్లో మగ్గుతున్నారని, నీళ్లు ఉండవని, పరిపాలన చేసుకోవడం రాదనీ, ఒక ముఖ్యమంత్రి కట్టె పట్టుకొని ప్రజలను బెదిరించారని కెసిఆర్ పేర్కొన్నారు.

ప్రత్యేక హోదాపై కేశవరావు మాట్లాడారు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని అనేకసార్లు కేశవరావు రాజ్యసభలో మాట్లాడారని, టిఆర్‌ఎస్ ఎంపిలు లోక్‌సభలో మాట్లాడారని కెసిఆర్ తెలిపారు. తాను కూడా అదే స్టాండ్‌మీద ఉన్నానన్నారు. ఏపిలో కూడా జగన్‌మోహన్ రెడ్డి ఎంపి సీట్లను గెలవబోతున్నాడని, తెలంగాణలో టిఆర్‌ఎస్, ఎంఐఎం కలిసి అన్ని సీట్లను గెలుచుకోబోతుందని కెసిఆర్ పేర్కొన్నారు. కచ్చితంగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా తీసుకురావడానికి టిఆర్‌ఎస్ ఎంపిలు కృషి చేస్తారని కెసిఆర్ పేర్కొన్నారు. తాము పక్కోళ్లు బాగా ఉండాలని కోరుకుంటామని, సన్యాసిలాగ చెడిపోవాలని కోరుకోమని చంద్రబాబును ఉద్ధేశించి కెసిఆర్ విమర్శించారు. చంద్రబాబు లాంటి దరిద్రం బుద్ధి తమకు లేదని, తాము అల్ఫులం కాదన్నారు. చంద్రబాబుకు తెలివిలేదని తనకు తెలివి ఉందని కెసిఆర్ పేర్కొన్నారు. తనకు లెక్కలు తెలుసనీ, తమకు ఉదారస్వభావం ఉందన్నారు. గోదావరిలో 100 టిఎంసీలు తమకు వాటా రావాల్సి ఉందని, వాటిని కచ్చితంగా వాడుకుంటామని కెసిఆర్ తెలిపారు.

వికారాబాద్‌కు హవా లాకో మరీజోం కా దవాగా పేరు

హవా లాకో మరీజోం కా దవా అన్న సామెత వికారాబాద్ ప్రాంతానికి ఉండేదన్నారు. దేశంతో పాటు, రాష్ట్రంలో ఈ సామెత నానుడిని కెసిఆర్ పేర్కొన్నారు. వికారాబాద్‌లోని అనంతగిరి కొండలను ఊటీగా పిలిచేవారన్నారు. 1985లో ఎమ్మెల్యే అయిన తరువాత ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు గుట్టపై ఉన్న గెస్ట్‌హౌజ్‌లో ఉంటే చెట్ల నుంచి అద్భుతమైన వాసన వచ్చేదన్నారు. అక్కడే ఉండిపోవాలనిపించే ప్రదేశమని ఆయన పేర్కొన్నారు. సమైక్య రాష్ట్రంలో ఈ ప్రాంతాన్ని చెడగొట్టారని ఆయన ఆరోపించారు. ఆ పునర్‌ః వైభవం రావాలని దానికోసం ప్రయత్నాలు ప్రారంభం అయ్యాయని కెసిఆర్ పేర్కొన్నారు. ఇక్కడ ప్రదేశానికి ముగ్ధుడైన నిజాం నవాబు టిబి ఆస్పత్రి ఇక్కడే ఏర్పాటు చేశారని కెసిఆర్ పేర్కొన్నారు. దానిని మళ్లీ పునరుద్ధరించే కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చింది, పోరాటంలో అందరూ భాగస్వామ్యం అయ్యారు, చాలామందికి రాష్ట్రం వచ్చే నమ్మకం లేదని, ఇది సాధ్యం కాదన్న మాటను ఎక్కువగా అనేవారని కెసిఆర్ పేర్కొన్నారు. కానీ చిత్తశుద్ధితో రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడు చాలా పార్టీలు వస్తాయి, చాలా సమావేశాలు పెడతారని కెసిఆర్ పేర్కొన్నారు. చాలామంది నాయకులు సహజంగానే వస్తారని, చాలా విషయాలు చెబుతారని అందరూ చెప్పేవి సావధానంగా విని ఊరికి పోయిన తరువాత గ్రామంలో దానిపై చర్చ పెట్టాలన్నారు. ఎన్నికల్లో గెలవాల్సింది నాయకులు కాదు, వ్యక్తులు కాదని, ప్రజలు గెలవాలన్నారు. ప్రజల అభీష్టం, ప్రజల అభిమతం గెలిచినప్పుడే పరిపక్వత సాధిస్తామన్నారు. ఆ పరిపక్వత దశ మనదేశంలో రావాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నికలు వచ్చాయంటే జమాబందీ మాట్లాడడం, ఆగమాగం చేయడం ఓట్లు దండుకుని పోవడం తప్ప పనిచేయరని కెసిఆర్ ఆరోపించారు. 5 సంవత్సరాల క్రితం కరెంట్ ఎలా ఉండేదని, ఇప్పుడు ఎలా ఉందని కెసిఆర్ ప్రశ్నించారు. 5 సంవత్సరాల క్రితం కాలిపోయే మోటార్లు, ట్రాన్స్‌ఫార్మర్లు పేలిపోయాయని, చాలా బాధలు పడ్డామన్నారు. వేసిన పంటలు పండుతాయో లేదో తెలియదని పరిస్థితులు ఉండేవని కెసిఆర్ ఆరోపించారు. రాత్రిపూట బావులు కాడికి పోయి పాములు, తేలు కరిచి రైతులు చచ్చిపోయిన పరిస్థితి ఉండేదన్నారు. నేడు పరిస్థితి మారిందని కరెంట్ ఉంటే వార్త కాదనీ, కరెంట్ పోతనే వార్త అని కెసిఆర్ తెలిపారు.

విద్యుత్ వినియోగంలో తెలంగాణ నెంబర్‌వన్

విద్యుత్ తలసరి వినియోగంలో తెలంగాణ నెంబర్‌వన్ అని భారతదేశ విద్యుత్ సాధికారిక సంస్థ ప్రకటించిదన్నారు. ఇండియాలో 29 రాష్ట్రాలుంటే తెలంగాణ రాష్ట్రమే నెంబర్‌వన్ అయ్యిందని ఆ సంస్థ సర్టిఫికెట్‌ను ఇచ్చిందన్నారు. 5 సంవత్సరాల క్రితం ఆగమాగంగా ఉన్న తెలంగాణను అభివృద్ధి పథంలో తీసుకురావడానికి చాలా కష్టపడ్డామన్నారు. ప్రత్యేక రాష్ట్రం వస్తే ఆగమాగం అవుతుందన్న తెలంగాణ నేడు వెలుగు జిలుగులతో అభివృద్ధి పథంలో పయనిస్తుందన్నారు. ఇది మనందిరికీ గర్వకారణమన్నారు. భారతదేశంలో పవర్‌సప్లయి చేసే రాష్ట్రంగా తెలంగాణ నిలిచి అప్పటి సమైక్య పాలకుల నోరు మూయించామన్నారు. అదే విధంగా 29 రాష్ట్రాలు ఇండియాలో ఉంటే, 24 గంటలు ఉచితంగా కరెంట్ ఇచ్చే రాష్ట్రం తెలంగాణనేనని కెసిఆర్ పేర్కొన్నారు. ఒక్క తెలంగాణలో మాత్రమే 24 గంటల పాటు ఉచిత కరెంట్‌ను సరఫరా చేస్తున్నామని కెసిఆర్ పేర్కొన్నారు. ఏ రాష్ట్రం కూడా ఉచిత కరెంట్ ఇవ్వడం లేదన్నారు. పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో ఇవ్వరని, ప్రధానమంత్రి మోడీ రాష్ట్రమైన గుజరాత్‌లో కూడా ఉచిత కరెంట్‌ను ఇవ్వడం లేదన్నారు. ఇలాంటి ఎన్నో పథకాలను మన ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు.

ఖాళీ జాగా ఉన్నా కట్టుకోవడానికి డబ్బులు సాయం చేస్తాం

పేదవాళ్లు కడుపునిండా నాలుగు పూటలు తినాలన్నదే మన ప్రభుత్వ ఉద్ధేశమన్నారు. బిర్యానీ లేకున్నా ఫర్వాలేదు, పప్పు లేదా పులుసుతోనైనా కడుపునిండా తినేలా చూసే బాధ్యత ప్రభుత్వం ఉందన్నారు. అందులో భాగంగా ఎవ్వరూ బాధపడకుండా, ఒంటరి మహిళ, వృద్ధులు, వికలాంగులు బాధపడవద్దన్న ఉద్ధేశ్యంతో రూ.200 ఉన్న పింఛన్‌ను రెండు వేలకు పెంచామన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పింఛన్‌లను పెంచుతామని హామిఇచ్చామని, త్వరలో పెరిగిన పింఛన్లు అందుతాయన్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్లను మెల్లగానే కడుతున్నామని, ఈ బడ్జెట్‌లో వాటికి నిధులు కేటాయిస్తామని ఆయన హామినిచ్చారు. డబుల్ బెడ్ రూం ఇళ్లు అందరికీ అందకపోతే ఖాళీ జాగా ఉన్న వారికి డబ్బులు సాయం చేస్తామని, కచ్చితంగా దానిని కూడా అమలు చేస్తామని కెసిఆర్ పేర్కొన్నారు. మహిళలు ప్రసవానికి వెళితే కెసిఆర్ కిట్ పథకం కింద రూ.12 వేలు ఇస్తున్నామని కెసిఆర్ పేర్కొన్నారు.

రానున్న రోజుల్లో పంటి, ముక్కు, చెవి డాక్టర్లు గ్రామానికి వస్తారు…

చరిత్రలో ఎప్పుడైనా అనుకున్నామా కంటివెలుగు కార్యక్రమం పెట్టి, గ్రామాలకు డాక్టర్లు వచ్చి ప్రతి మనిషి పరీక్ష చేసి అద్దాలు ఇస్తారని, ఎవరం కలగనలేదన్నారు. ఇండియాలో ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి పథకాలు అమలవుతున్నాయా అని కెసిఆర్ ప్రశ్నించారు. పక్కన ఉన్న కర్ణాటకలో ఇలాంటి ప్రోగ్రాం ఎక్కడైనా ఉందా అని కెసిఆర్ పేర్కొన్నారు. ఇలా ఎక్కడలేని కార్యక్రమాలను మనం ఇక్కడ అమలు చేస్తున్నామని కెసిఆర్ పేర్కొన్నారు. కంటి వెలుగు ఒక్కటే కాదనీ, రానున్న రోజుల్లో పంటి, ముక్కు, చెవి డాక్టర్లు ప్రతి గ్రామానికి వస్తారని కెసిఆర్ తెలిపారు. ఎవరికీ ఏం బాధ ఉన్నా చెక్ చేస్తారని కెసిఆర్ తెలిపారు. ఆ తరువాత పాథలాజికల్ టీం వచ్చి ప్రతి వ్యక్తి రక్త నమూనాలను సేకరించి షుగర్, బిపిలకు సంబంధించి డాటాను సేకరిస్తామని కెసిఆర్ తెలిపారు. 100 శాతం తెలంగాణ రాష్ట్ర హెల్త్ ప్రొఫైల్ సేకరించి భద్రపరుస్తామని కెసిఆర్ పేర్కొన్నారు. ఆ దిశగా రాష్ట్రం అడుగులు వేస్తుందన్నారు. వికారాబాద్ గడ్డమీద తాను గర్వంగా ఈ విషయాలను చెబుతున్నానన్నారు.

పాలమూరు ఎత్తిపోతల పథకం నుంచి లక్ష్మీదేవి రిజర్వాయర్ ద్వారా…

వికారాబాద్‌కు కొన్ని సమస్యలు ఉన్నాయని కెసిఆర్ తెలిపారు. వికారాబాద్‌ను జిల్లా చేయాలనుకున్నా ఎవరూ చేయలేదని టిఆర్‌ఎస్ ప్రభుత్వమే జిల్లాను చేసిందని కెసిఆర్ పేర్కొన్నారు. వికారాబాద్‌కు సాగునీరు రావాలని దానికోసం పాలమూరు ఎత్తిపోతల పథకం నుంచి లక్ష్మీదేవి రిజర్వాయర్ ద్వారా నీరు అందిస్తామని కెసిఆర్ పేర్కొన్నారు. దీనికి సంబంధించిన పనులు జరుగుతున్నాయన్నారు. ఈ ప్రాంతంలో కూడా ప్రతి నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు నీరు అందించే బాధ్యత తనపై ఉందని కెసిఆర్ తెలిపారు. ఒకటిన్నర, రెండు సంవత్సరాల్లోనే దానిని సాధిస్తామని, ఎక్కువ సమయం తీసుకోమని ఆయన పేర్కొన్నారు. ఇది 100 శాతం జరుగుతుందని ఈ జిల్లా ప్రజలు దిగులు చెందాల్సిన అవసరం లేదన్నారు.

84 గ్రామాల ప్రజలకు 111 జీవోతో ఇబ్బందులు

111 జీవోను ఎత్తివేయాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య తనతో చాలాసార్లు విజ్ఞప్తి చేశారని కెసిఆర్ పేర్కొన్నారు. 84 గ్రామాల ప్రజలకు ఈ జీవో వలన ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. చేవెళ్ల ఎంపి అభ్యర్థి డాక్టర్ రంజిత్‌రెడ్డిని లక్ష మెజార్టీతో ఈ నియోజకవర్గ ప్రజలు గెలిపించాలని, ఎంత భారీ మెజార్టీ ఇస్తారో అంత తొందరగా ఈ జీఓను ఎత్తివేస్తానని కెసిఆర్ హామినిచ్చారు. రంజిత్‌రెడ్డి నాయకత్వంలోనే ఈ జీఓను ఎత్తివేస్తానని కెసిఆర్ పేర్కొన్నారు. కబరస్థాన్, ఈద్గాలకు స్థలం కావాలన్న డిమాండ్ వికారాబాద్‌లో ఉందని దానికి ఇబ్బంది లేదని కెసిఆర్ తెలిపారు. వికారాబాద్ జిల్లాను చార్మినార్ జోన్‌లో కలపాలన్న డిమాండ్ 100 శాతం ఉందని, ఎన్నికల కోడ్ ఎత్తివేయగానే ఆ జీఓను కూడా విడుదల చేస్తామన్నారు. వికారాబాద్‌కు మిషన్ భగీరథ ద్వారా తాగునీరు సరఫరా కాబోతుందన్నారు. సాగునీరు ద్వానా నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు నీరు అందిస్తామని కెసిఆర్ పేర్కొన్నారు. తెలంగాణ రైతాంగం సోదరులకు తాను మనవి చేసేది ఒక్కటే అని, రైతులు చాలా కష్టాల్లో ఉన్నారని కెసిఆర్ పేర్కొన్నారు. వాళ్ల బాధను దూరం చేస్తానన్నారు. లంచాలు ఇచ్చే బాధలు పోవాలని, జూన్ నెల తరువాత నూతన రెవెన్యూ చట్టాన్ని తీసుకువస్తామన్నారు. పూర్తి యాజమాన్య బాధ్యత (కంక్లూజివ్ యాక్టు)ను అమలు చేస్తానన్నారు. దీనిపై అధికారులు కసరత్తు చేస్తున్నారన్నారు. రెండునెలలు ఓపికపట్టాలని, లంచాలు ఎవరికీ ఇవ్వొద్దని కెసిఆర్ మరోసారి విజ్ఞప్తి చేశారు.

కొత్త పంచాయతీ రాజ్ చట్టంతో పాలనలో ఒరవడి

తాను కూడా రైతు బిడ్డేనేనని, తనకు కూడా రైతు కష్టాలు తెలుసనీ అందుకే దేశంలో ఎక్కడా లేని పథకాలను అమలు చేశానని కెసిఆర్ తెలిపారు. రైతుబంధు, రైతుబీమాల వలన రైతుల్లో ధీమా పెరిగిందన్నారు. రైతుబంధు పథకం కింద గతంలో ఎకరానికి రూ. 4 వేలు ఇచ్చే వారమని ప్రస్తుతం దానిని రూ.5వేలకు పెంచామని కెసిఆర్ తెలిపారు. రైతుబీమా పావు, అర ఎకరం రైతు చనిపోయినా ఎలాంటి ఫైరవీ లేకుండా బీమా సొమ్ము రైతు ఖాతాలో జమ అవుతుందన్నారు. ఇలాంటి పథకాలు ప్రపంచంలో ఎక్కడా లేవన్నారు. దీనివలన రైతులకు లాభం జరిగిందని ఆయన తెలిపారు. కొత్త పంచాయతీ రాజ్ చట్టం తెచ్చుకుందామని, పంచాయతీలో కూడా అడ్డగోలుగా ఉన్న లంచాలు బంద్ కావాలని, ఇష్టం ఉన్నట్టు లే ఔట్లకు పర్మిషన్‌లు ఇవ్వకుండా బంద్ కావాలన్నారు. ప్రజలను పట్టి పీడించే దందాలు బంద్ కావాలని కెసిఆర్ పేర్కొన్నారు. కొత్త చట్టాన్ని పటిష్టంగా తీసుకొచ్చామన్నారు. త్వరలో మున్సిపల్ ఎన్నికలకు వెళ్లపోతున్నామని, మున్సిపల్ కొత్త చట్టాన్ని తీసుకురావాలని నిర్ణయించామని కెసిఆర్ పేర్కొన్నారు. మున్సిపాలిటీల్లోనూ చాలా అవినీతి జరుగుతుందని, ఈ సమస్య సమూలంగా రూపుమాపడానికి పటిష్టమైన చట్టాన్ని తీసుకువస్తామన్నారు. పంచాయతీరాజ్, రెవెన్యూ, మున్సిపాలిటీల్లో పేరుకుపోయిన అవినీతి వలన ప్రజలు నిత్యం దోపిడీకి గురవుతున్నారని కెసిఆర్ ఆరోపించారు. ఇదంతా నిర్మూలన కావాల్సిన అవసరం ఉందన్నారు.

సర్టిఫికెట్‌లు ఇచ్చే విషయంలో కూడా లంచాలు

సర్టిఫికెట్‌లు ఇచ్చే విషయంలో కూడా లంచాలు ఇవ్వాలని కెసిఆర్ ఆరోపించారు. ఒకసారి ఎస్సీగా పుడితే చనిపోయేంత వరకు ఎస్సీగానే ఉంటాడని, దాని గురించి ప్రతి సంవత్సరం సర్టిఫికెట్ ఎందుకనీ కెసిఆర్ ప్రశ్నించారు. సర్టిఫికెట్‌లకు సంబంధించిన బాధలు కూడా పోవాలని కెసిఆర్ పేర్కొన్నారు. బ్యాంకు లోన్‌ల గురించి రైతులు బ్యాంకుల చుట్టూ తిరగకుండా నేరుగా వెబ్‌సైట్ ద్వారానే లోన్ వచ్చే ఏర్పాటు చేస్తున్నామన్నారు. నరేంద్రమోడీ, కాంగ్రెస్ నాయకులు ఇక్కడకు వచ్చినప్పుడల్లా తనపై అడ్డగోలు మాటలు మాట్లాడుతున్నారని ప్రజలు గమనించాలని కెసిఆర్ విజ్ఞప్తి చేశారు. ఈ మధ్యన కాంగ్రెస్, బిజెపిలు మ్యానిఫెస్టోను ప్రవేశపెట్టాయని అందులో తెలంగాణ ప్రభుత్వ ప్రవేశపెట్టిన పథకాలనే కాపీ కొట్టారని, ఇది మనకు గర్వకారణమన్నారు. రెండు పార్టీలకు జ్ఞానోదయం అవుతుందని, రాష్ట్రాలకు అధికారం బదిలీ చేస్తామని, విద్య, వైద్యానికి సంబంధించి పూర్తి అధికారాలను ఇస్తామని కాంగ్రెస్ తన మ్యానిఫెస్టోలో పెట్టిందని, జల, విద్యుత్ వినియోగాన్ని సమర్థవంతంగా వినియోగిస్తామని బిజెపి పేర్కొంటుందన్నారు.

దేశం గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది

గత అసెంబ్లీ ఎన్నికల్లో టిఆర్‌ఎస్ అభ్యర్థులను దీవించారని ఇంకా 5 సంవత్సరాలు మనదే పాలన ఉంటుందని, అదే సమయంలో దేశం గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో ముఖ్యమైన పాత్రను పోషించాలంటే కచ్చితంగా 16 ఎంపి స్థానాలను గెలుచుకోవాలని కెసిఆర్ పేర్కొన్నారు. అన్ని స్థానాలను గెలిస్తే దిశ, దిక్కు మార్చవచ్చన్నారు. కేంద్ర ప్రభుత్వానికి చాలా సమస్యలు విన్నవించామని దానికి వారు వంకర టింకరగా సమాధానం ఇచ్చారన్నారు. చాలా విషయాల్లో దేశం వెనుకబడి ఉందని, చాలా హీనస్థితిలో ఉందన్నారు. ప్రజల ప్రాథమిక హక్కులు కూడా తీరలేదన్నారు. నీళ్లు, కరెంట్‌ను వాడుకునే సోయి బిజెపి ప్రభుత్వానికి లేదన్నారు. మంచినీళ్లకు, తాగునీళ్లకు, సాగునీరు ఈరోజు దేశం బాధపడాల్సిన పరిస్థితిలో ఉందన్నారు. అందరికీ విద్య, వైద్య, రక్షణ లేదని కెసిఆర్ ఆరోపించారు. సగం దేశం చీకట్లో ఉందని, ఈ బాధలు పోవాలని కెసిఆర్ పేర్కొన్నారు. రైతులకు గిట్టుబాటు ధర రావాలని ఇవన్నీ కావాలంటే కేంద్రంలో గుణాత్మకమైన మార్పు రావాలని కెసిఆర్ పేర్కొన్నారు. కేంద్రంలో ఏర్పడబోయేది సంకీర్ణ ప్రభుత్వమేనని కెసిఆర్ తెలిపారు. బిజెపికి 150 సీట్లు, కాంగ్రెస్‌కు 100 సీట్ల లోపే వస్తున్నాయని కెసిఆర్ తెలిపారు. ప్రాంతీయ పార్టీలదే పెత్తనం చేస్తాయని కెసిఆర్ తెలిపారు. మనది కొత్త రాష్ట్రం మన హక్కులు మనకు రావాలి, కొన్ని ప్రాజెక్టులకు జాతీయ హోదా రావాలి, మనకు మంచి జరగాలని కెసిఆర్ తెలిపారు. అది జరగాలంటే మన పాత్ర ఉజ్వలంగా ఢిల్లీలో ఉండాలన్నారు. 16 ఎంపి అభ్యర్థులను గెలిపించి ఫెడరల్ ఫ్రంట్‌లో మనపాత్ర పెద్దగా ఉండాలన్నారు.

గంగా, జమున, తహజీబ్‌లాగా…

ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి వచ్చి హిందూ, ముస్లింలని మాట్లాడవచ్చా అని ఆయన ఆరోపించారు. ఈ దేశాన్ని విడదీసి ఎటు దారి తీస్తారని కెసిఆర్ ప్రశ్నించారు. ఈ దుర్మార్గాలు ఆగిపోవాలని కెసిఆర్ పిలుపునిచ్చారు. దేశాన్ని విభజించి పాలించే దుర్మార్గపు కూటమి ఇదనీ ఆయన పేర్కొన్నారు. ఇది దేశానికి మంచిది కాదన్నారు. గంగా, జమున, తహజీబ్‌లాగా కశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు, అన్ని వర్గాల, మతాల ప్రజలు కలిసిమెలిసి ఉండాలని కెసిఆర్ ఆకాంక్షించారు. దేశ సంపద పెరగనుందని, దీనివలన అభివృద్ధితో పాటు ఉద్యోగాలు వస్తాయన్నారు. రంజిత్‌రెడ్డి తెలంగాణ ఉద్యమకారుడని, 2001 నుంచి పార్టీకి అండదండగా ఉంటున్నారన్నారు. చాలాసార్లు ఉద్యమానికి, పార్టీకి అండగా నిలిచారన్నారు. ఆయన ఎన్నడూ పదవి అడగలేదని, ఈసారి మాత్రం పార్లమెంట్‌కు పోయి ప్రజలకు సేవ చేస్తానన్నారని ఈ నేపథ్యంలో ఆయనకు టికెట్ కేటాయించినట్టు కెసిఆర్ పేర్కొన్నారు. రంజిత్‌రెడ్డికి సంబంధించిన చాలా ఫౌల్ట్రీ ఫాంలు రంగారెడ్డి జిల్లా పరిధిలోనే ఉన్నాయన్నారు. ఆయన దగ్గర చాలా డబ్బు ఉందని, ఆయన సంపాదించుకోవడం కోసం రాజకీయాల్లోకి రాలేదన్నారు. ఆయన చాలా భాషలను అనర్గళంగా మాట్లాడుతారని కెసిఆర్ తెలిపారు. ఆయన పనితనం చూసి మరోసారి ఎన్నికల్లో డబుల్ ఓట్లతో గెలిపించుకుంటారన్నారు. ఎన్నికల తరువాత తానే స్వయంగా జిల్లాకు వచ్చి పోడు భూములు, రైతాంగ సమస్యలను పరిష్కరిస్తానన్నారు.

అధికారులందరినీ నిందిస్తలేను

అధికారులందరూ లంచం తీసుకుంటున్నారని తాను ఆరోపించడం లేదని, అందరినీ తాను నిందిస్తలేనని, కొంతమంది చాలా దుర్మార్గంగా ప్రజలను పట్టి పీడిస్తున్నారని వారి గురించే తాను మాట్లాడుతున్నానన్నారు. దానికి సంబంధించి చాలా ఫిర్యాదులు తనకు అందుతున్నా యన్నారు. కాబట్టి లంచం నిర్మూలన కావాలని ఆయన పేర్కొన్నారు. డాక్టర్ శ్రీనివాస్ అనే వ్యక్తి భువనగిరి నుంచి తనకు ఎస్‌ఎంఎస్ ఇచ్చారని కెసిఆర్ తెలిపారు. రెండు ప్రభుత్వ కార్యాలయాల్లో లంచం ఇచ్చానని, లంచం ఇవ్వకపోతే తన పనిచేయనని చెప్పారని, దిక్కులేక తాను లంచం ఇచ్చానని, కెసిఆర్ మీరు పాపులర్ ముఖ్యమంత్రి అని, లంచం నిర్మూలనకు చర్యలు తీసుకోరా అని అతను ఎస్‌ఎంఎస్ పంపారని కెసిఆర్ తెలిపారు. తాను ఆ ఎస్‌ఎంఎస్‌ను చూసి సిగ్గుతో తలదించుకున్నానని కెసిఆర్ పేర్కొన్నారు. ఆ తరువాత చర్చ పెట్టి ఆలోచన చేసి అవినీతిని నిర్మూలించాలని తాను నిర్ణయించుకున్నట్టు కెసిఆర్ పేర్కొన్నారు. 100 శాతం మున్సిపాలిటీ, రెవెన్యూ, పంచాయతీల్లో అవినీతిపై రిలీఫ్ కలుగుతుందన్నారు. అందులో భాగంగానే కొత్త చట్టాలను తీసుకు వస్తామని, కొద్ది రోజులు ఓపిక పట్టుకోవాలని కెసిఆర్ సూచించారు.

 

పోలవరానికి అడ్డుపడ లేదు

ఆంధ్రప్రదేశ్ పోలవరం కట్టుకుంటే తాము అడ్డుపడ లేదని, తెలంగాణ ముంచుతాం అంటే అడ్డుపడ్డామని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు. ఈ సంవత్సరం కూడా తెలంగాణ, ఆంధ్రా వాడిన తరువాత 2,600 టిఎంసీల నీళ్లు సముద్రం పాలయ్యాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సముద్రంలో ఆ నీళ్లు కలవకుండా ఆంధ్రా వాళ్లు ఆ నీళ్లను వాడుకుంటామంటే తమకు ఇబ్బంది లేదన్నారు. తాము కోరేది ఒక్కటేనని, తమ రాష్ట్రానికి వచ్చే నీటి వాటా కచ్చితంగా తమకు దక్కాల్సిందేనని ఆయన పేర్కొన్నారు. రాజకీయాల కోసం అబద్ధాలు ఆడమని కెసిఆర్ చంద్రబాబును ఉద్ధేశించి వ్యాఖ్యానించారు. తమతో పాటు పక్కనోళ్లు కూడా తినాలన్నాదే తెలంగాణ రాష్ట్రం గుణమని ఆయన పేర్కొన్నారు. ఆంధ్రా ప్రజలు మంచివారేనని, వారితో తమకు పంచాయితీ లేదని, 10 మంది కిరికిరిగాళ్లు అక్కడ ఉన్నారని కెసిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబునాయుడు లాంటి పిడికిలి మందితో తప్ప మనకు వేరే వాళ్లతో కిరికిరి లేదన్నారు. మనకు కులం, మతం లేదని, అన్ని వర్గాల ప్రజలు బ్రతకాలన్నదే తమ అభిమతమన్నారు.