Home తాజా వార్తలు కల్వకుర్తిలో నీరు పారుతుంటే సంతోషంగా ఉంది: కెసిఆర్

కల్వకుర్తిలో నీరు పారుతుంటే సంతోషంగా ఉంది: కెసిఆర్

KCR Telangana Elections

 

నాగర్‌కర్నూలు: ప్రజాస్వామ్యంలో ప్రజలు గెలువాలని సిఎం కెసిఆర్ పిలుపునిచ్చారు. నాగర్ కర్నూల్‌లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో కెసిఆర్ మాట్లాడారు.  తెలంగాణ రాష్ట్రం రాకపోతే మర్రి జనార్థన్ రెడ్డి ఎంఎల్‌ఎగా లేకపోతే… కెసిఆర్ ముఖ్యమంత్రి కాకపోతే నాగర్ కర్నూల్ జిల్లా అయ్యేదా అని ప్రజలను అడిగారు. నాగర్ కర్నూల్ జిల్లాకు ఇంజినీరింగ్, మెడికల్ కాలేజీ రావాల్నిందేనన్నారు. మర్రి జనార్థన్ రెడ్డి లక్ష మెజార్టీతో గెలిపించి తనకు కానుకగా ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 58 ఏళ్లు పాలించిన కాంగ్రెస్, టిడిపి వాళ్లు ఒకవైపు ఉన్నారని, పదిహేను సంవత్సరాలు కోట్లాడి తెలంగాణ సాదించి.. నాలుగు ఏళ్లు పాలించిన టిఆర్‌ఎస్ మరో వైపు ఉందన్నారు. దేనికి ఓటు వేస్తారో ప్రజలే ఆలోచించుకోవాలన్నారు.

గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు కరెంటు ఎలా ఉంది? టిఆర్‌ఎస్ పాలనలో కరెంట్ ఎట్ల ఉందో మీరే చూడాలని, కష్టపడి పని చేస్తేనే 24 గంటల కరెంటు ఇస్తున్నామని చెప్పారు. కల్వకుర్తిలో నీరు పారుతుంటే సంతోషంగా ఉందన్నారు. హైదరాబాద్‌ను ప్రపంచపటంలో పెట్టానంటున్న ఎపి సిఎం చంద్రబాబునాయుడు కరెంటు ఎందుకు ఇవ్వలేదని కెసిఆర్ ప్రశ్నించారు. ఊరూరా కంటివెలుగు శిబిరాల ద్వారా కంటి పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఆడపిల్ల పుడితే రూ.13 వేలు, మగ పిల్లాడు పుడితే రూ.12 వేల ఇస్తున్నామని చెప్పారు. బిజెపి పాలిత రాష్ట్రాల్లో వెయ్యి రూపాయల పెన్షన్ ఇస్తున్నారా అని పిఎం నరేంద్ర మోడీని కెసిఆర్ ప్రశ్నించారు.

ఏ ఒక్క బిజెపి పాలిత రాష్ట్ర్రాలలో పేదలకు ఆరు కిలోల బియ్య ఇస్తున్నారా? కంటి వెలుగు, రైతు బంధు, రైతు బీమా ఉందా అని మోడీని అడిగారు. మోడీ ఏది పడితే అది మాట్లాడితే తెలంగాణ ప్రజలు వినడానికి ఏమైనా తెలివితక్కువ వాళ్లా అని ఎద్దేవా చేశారు. ప్రధాని మోడీకి ప్రజలే బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. గత పాలకులు డబ్బా ఇండ్లు కట్టారని, అందుకోసమే తాము డబుల్ బెడ్ రూమ్‌లు ఇస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇండ్ల పేరిట పేదలపై ఉన్న రూ.4 వేల 316 కోట్లు అప్పు మాఫీ చేశామని స్పష్టం చేశారు.

తాము మాత్రం ఇండ్లు కట్టుకునేందుకు వంద శాతం ఉచితంగా ఐదు లక్షల రూపాయలు ఇస్తామని పేర్కొన్నారు. గుంట భూమి ఉన్న రైతుకు కూడా బీమా వర్తింపజేస్తున్నామని కెసిఆర్ గొప్పగా చెప్పారు. ఇప్పటి వరకు 3400 కుటుంబాలకు రైతు బీమాతో ప్రయోజనం కలిగిందన్నారు. నెల రోజుల్లో ఇంటింటికి మంచినీరు అందిస్తామని హామీ ఇచ్చారు. మిషన్ భగీరథ పథకంపై 11 రాష్ట్రాల వాళ్లు ప్రశంసలు కురుపించారని తెలిపారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వంలో భూకబ్జాలు, లంబకోణాలు, కల్తీ విత్తనాలు లేవని కెసిఆర్ తెలిపారు. శాంతిభద్రతలను కాపాడామని, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సెక్రటేరియట్ చుట్టూ పైరవీకారులు మందలుండేవని, ఇప్పుడు నిర్మూలించామన్నారు.