Home ఎడిటోరియల్ పల్లె ఆత్మకు ప్రాణం పోస్తున్న కెసిఆర్

పల్లె ఆత్మకు ప్రాణం పోస్తున్న కెసిఆర్

KCR who lives in the village spirit

అవును.. అందమైన ఆరుద్ర తెలంగాణ నేలపై మళ్లీ కనువిందు చేస్తున్నది. గత పాలకుల నిర్లక్ష్యం మూలంగా అవసాన దశకు చేరిన ఆరుద్ర.. రెండు దశాబ్దాల తర్వాత పునర్వైభవానికి పునాది వేసుకుంటున్నది. రైతులు రసాయన ఎరువులను విచ్చలవిడిగా వాడటం మూలంగా ఆరుద్ర అంతరించే దశకు చేరుకున్నది. ఈ రసాయన విధ్వంసం మూలంగానే అందమైన అరుద్రలు, భూమిని గుల్లచేసి సారవంతం చేసే ఎర్రలు, ఇతర వ్యవసాయ మిత్రులన్నీ అంతరించిపోయినయి. అందుకే ఇయ్యాల విత్తు నాటితే, మొక్క పెడితే పెరగాలంటే ఎరువులు లేకుంటే కష్టమనే స్థితికి వచ్చింది వ్యవసాయం.

ఇవే కాదు పత్తి, వరి, పొగాకు, జొన్నలాంటి పంటలను పట్టిపీడించే పచ్చ పురుగును, నులిపురుగు, రసం పీల్చే పురుగును తినే కాకులు, చిలుకలు, బురకపిట్టలు, పావురాలు, తోకపిట్టలు, పాలపిట్టలాంటి పక్షులన్నీ పురుగుల మందు పిచికారీల మూలంగా అంతరించిపోయే దశకు చేరుకున్నయి. దీంతో కీటకాలు రసాయనాలకు అలవాటుపడి హైడోసేజ్ మందులు పిచికారీ చేస్తే తప్పా.. పంటను విడిచిపెట్టని పరిస్థితి. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో హైడోసేజ్ మందులు పిచికారీ చేస్తూ.. రైతులు చనిపోవడం, శ్వాసకోశ వ్యాధులతో ఇబ్బందులు పడటం మూలంగా వ్యవసాయం ఇబ్బందికరంగా మారింది. ఒకవైపు రైతుల ఆరోగ్యంపై తీవ్ర దుష్ప్రభావం చూపుతున్న ఈ రసాయన ఎరువులు.. మరోవైపు ఆర్థికంగా తీవ్ర నష్టాలను మిగిల్చుతున్నది. పల్లెలకు సంజీవనిలా ఉండాల్సిన వ్యవసాయం.. పాలకుల అవగాహనరాహిత్యం, నిష్క్రియా పరత్వం మూలంగా మరణశయ్యగా మారింది. అందుకే పల్లెలనిండా మొండిగోడలు.. పట్నం అడ్డాల నిండా కూలీల గుంపులు కనిపిస్తున్నయి.

ఇన్ని అనర్ధాలు జరిగినా సీమాంధ్ర పాలకులు ఏనాడు సీరియస్ గా తీసుకున్నపాపాన పోలేదు. పైపెచ్చు కార్పోరేట్ ఎరువుల కంపెనీలతో లాలూచీ పడటం మూలంగా భూములన్నీ రసాయనకూపాలుగా తయారైనయి. రసాయన ఎరువులు భూసారాన్ని కండ్లముందటే కాట్నంలో తగులబెడుతుంటే చోద్యం చూసిన గత పాలకులు.. రైతు ఆత్మహత్యలను రాజకీయాలకు వాడుకొని ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేసిండ్రు. ఇలా పాలకులకు వ్యవసాయంలో క్షేత్రస్థాయిలో జరుగుతున్న సాధకబాధకాలపైన, లోటుపాట్లపైన అవగాహన, ఆలోచన లేకపోవడం వల్ల బంగారంలాంటి భూములన్న తెలంగాణ బంజరు నేలగా మిగిలిపోయింది.

ఒక్క తెలంగాణనే కాదు దేశవ్యాప్తంగా పాలకుల అవగాహన శూన్యత మూలంగా వ్యవసాయం తీవ్రమైన సంక్షోభాన్ని, దుర్భిక్షాన్ని ఎదుర్కోంటున్నది. అందుకే రైతు ఆత్మహత్యల లెక్కల్లో ఒక్కో రాష్ట్రం పోటీ పడుతుంది. కానీ.. తెలంగాణ ఇప్పుడు తన మూలాన్ని గుర్తించే క్రమంలో విజయవంతం అయ్యింది. స్వయంగా రైతే ముఖ్యమంత్రి కావడం వల్ల తెలంగాణ నేల సస్యశ్యామలం అవుతున్నది. పోయిన భూసారాన్ని పటిష్టం చేసే అనేక చర్యలకు ప్రభుత్వం పూనుకున్నది. వ్యవసాయాన్ని అభిలాషించే వ్యక్తుల సమూహంగా తెలంగాణ మారింది. అందుకే ఇయ్యాల తెలంగాణ వలస ప్రజానీకం వరుసబెట్టి తిరిగివస్తున్నరు.

కెసిఆర్ భూసార అవస్థాపన కార్యక్రమం :
సంస్కృతంలో ఒక నీతిమాట ఉంది సుతప్తమపి పానీయం శమయత్యేవ పావకమ్ అంటే సలసల కాగుతున్న నీళ్లు కూడ నిప్పును చల్లర్చుతాయి. నీటి స్వభావం నిప్పును ఆర్పడం అది మరిగించినంత మాత్రానా పోదు. అట్లగే తెలంగాణలో ప్రతిపక్షాలకు ఎంత విడమరిచి చెప్పినా.. వాళ్ల ఆలోచన వికృత ధోరణిని మారదు. కెసిఆర్ ప్రభుత్వం ఎంత మంచి అభినివేశంతో కార్యక్రమాలను రూపొందించినప్పటికి వారు విమర్శలు ఆపడం లేదు. కానీ ప్రజలు కెసిఆర్ ఆలోచనను, ప్రభుత్వ సదుద్దేశాలను ఆకలింపు చేసుకోవలసిన అవసరం ఉంది.

గొర్రెల పంపిణీ పథకం ఒక సామాజిక ప్రయోగం. ఇందులో గొల్ల కుర్మలను అభివృద్ధి చేయాలనే ఆశయంతో పాటు గొర్రెలు విస్తరంగా అభివృద్ధి చెందితే వచ్చే విసర్జిత జీవ ఎరువు ద్వారా రసాయనిక ఎరువుల నుంచి భూమిని రక్షించాలనే ఒక మహోన్నతమైన ఆశయంతో పాటు.. ఒక ఉన్నతమైన వైజ్ఞానిక ఆలోచన దాగుంది.

గొర్రెలతో పాటు బర్రెల పంపిణీ పథకం కూడా రేపు ఈ బృహత్కార్యంలో పాలుపంచుకోబోతున్నది. ఇప్పటికే కోళ్ల పరిశ్రమలో ప్రగతిపథంలో దూసుకుపోతున్న తెలంగాణ.. గొర్రెలు, బర్రెల పంపిణీ ద్వారా మరింత జీవ ఎరువును ఉత్పతి చేసి భూసార పునఃస్థాపనకు తోడ్పడితే రైతుకు ఉపశమనం దొరికినట్టే. ఇక బర్ల పాలద్వారా వచ్చే ఆదాయం కుటుంబ పోషణకు తోడ్పాటునందించడంతో పాటు.. పాలకల్తీతో ఇబ్బందిపడే ప్రజలకు ఉపశమనం కలుగుతుంది. ఇది చెప్తే చిన్నగా కనిపించినా.. దీని ప్రభావం గ్రామీణ ప్రజల జీవితాల్లో పెనుమార్పులు తీసుకొస్తుందనడంలో సందేహం లేదు.

పొగొట్టుకున్న చోటే.. రాబట్టుకుంటున్నది: –
అవును.. తెలంగాణ వ్యవసాయం పొగొట్టుకున్నది సర్కారు సాయంతో తిరిగి రాబట్టుకుంటున్నది. పురాతన పద్ధతుల్లోకి అధునాతనంగా మారబోతుంది. కల్తీలులేని ఉత్పత్తులకు కేరాఫ్ అడ్రస్ గా నిలువబోతున్నది. అందుకు తెలంగాణ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నది. ఉత్పత్తి పెంచాలనే సదుద్దేశంతో ట్రాక్టర్లు, పనిమొట్లను ఇస్తున్న ప్రభుత్వం.. రసాయన ఎరువులను దూరం చేయాలని, ఆనాటి గ్రామీణ జీవన సౌందర్యానికి పునఃసృష్టి చేయాలని తపన పడుతున్న కెసిఆర్ సర్కారును అభినందించకతప్పదు. ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే రుణమాఫీ చేసిన కెసిఆర్. ఓల్డేజీ హెచ్చుతగ్గులతో మోటర్లు కాలిపోవడం, రాత్రిపూట త్రీఫేజ్ కరెంటు ఇవ్వడం వల్ల రైతులు ప్రమాదాల బారిన పడటం మూలంగా.. ఎవుసం అంటేనే బెంబేలెత్తిపోయిన పరిస్థతి. ఇట్లాంటి సందర్భంలో రైతుకు కొండంత ఆసరాగా 24 గంటల కరెంటునిచ్చిండు. ప్రతిరైతుకు విధిగా పట్టాదారు పాసుపుస్తకాలు ఉండాలనే తలంపుతో పాసుపుస్తకాల పంపిణీని పూర్తిచేసింది ప్రభుత్వం.

రైతుకు ఆధునిక పద్ధతులు ఎప్పటికప్పుడు అందించేందుకు ప్రతి ఐదు వేల ఎకరాలకు ఒక ఎఇఒ (అగ్రికల్చర్ ఎక్స్ టెన్షన్ ఆఫీసర్)ను నియమించింది. పంటల పెట్టుబడి కోసం రైతుబంధు పథకం పెట్టి ఎకరానికి 8 వేల రూపాయలను అందిస్తున్నది. ఇవే కాదు దేశ చరిత్రలో ఏ ప్రభుత్వం ఆలోచించని విధంగా ప్రతిరైతుకు బీమా ఉండాలనే ఉన్నత ఆశయంతో రైతుబీమా పథకం ప్రవేశపెట్టింది. ఇక నిత్యం నీటి సౌకర్యం ఉండాలని భావించి మిషన్ కాకతీయ పథకం చేపట్టి వేలాది చెరువులను పునరుద్ధరించింది. భారీ ప్రాజెక్టులను చేపట్టి తెలంగాణ పల్లెలను మరో కోనసీమగా మార్చబోతున్నది. ఇవే కాదు విత్తనాలు, ఎరువుల కొరతను తీర్చి నిత్యం అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకున్నది. ఇవన్నీ ఇయ్యాల తెలంగాణ వ్యవసాయ ముఖచిత్రాన్ని మార్చుతున్నయి. ఈ అద్భుత పనితీరువల్ల తెలంగాణలో గణనీయమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. నిత్యం పొట్టకూటికోసం వలసలు పోయే పాలమూరు ఇయ్యాల రివర్స్ మైగ్రేషన్ అవుతున్నది. ఒక్క పాలమూరు మాత్రమే కాదు నల్లగొండ, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ లాంటి జిల్లాలల్లోనూ రివర్స్ మైగ్రేషన్ నమోదవుతుండటం కెసిఆర్ నిర్విరామ కృషికి దక్కిన గౌరవంగా భావించవలసిందే.

కెసిఆర్ లోక కళ్యాణ యజ్ఞం :
కెసిఆర్ అందరిలాంటి పాలకుడు కాదు. లేదంటే ప్రభుత్వానికి దమ్మిడి ఆదాయం లేని, ఓట్లు రాల్చని హరిత హారాన్ని ఇంత దీక్షతో చేయడం ఏంటి..? సగటు మనుషులు ఎవరైనా అలానే ఆలోచిస్తారు. కానీ కెసిఆర్ ఆలోచనలో ఒక పరిపాలన తాత్వికత ఉన్నది. భావితరాలు బతుకులు బాగుండాలనే ఆపేక్ష ఉన్నది. మనం కోల్పోయింది మనతర్వాత తరంకూడ కోల్పోవద్దనే పెద్ద మనసు ఉంది. అందుకే సగటు పొలిటీషియన్లలో కెసిఆర్ ఒక సాధువులా కనిపిస్తాడు. ప్రపంచ కాలుష్య నగరాల్లో ఎప్పుడు కనిపించే మన తెలంగాణ పట్టణాలు రెండు మూడేండ్ల కాలంలో గణనీయంగా తగ్గిపోయినయి.. ఇంకా తగ్గబోతున్నయి. ఇది గణనీయమైన మార్పు. ప్రజల జీవితం అమాంతం మార్చేసే మార్పు. కాలుష్యం తగ్గడం అంటే గాలి స్వచ్ఛంగా మార్చడం మాత్రమే కాదు.. మనుషుల ఆయుప్రమాణాలు పెంచడం, అనారోగ్యాలతో కుటుంబాల్లో వచ్చే ఆర్థిక ఒడిదొడుకులను తగ్గించడం. అకాల వాతావరణ మార్పులను అరికట్టడం.. తీవ్రనష్టాలను తగ్గించడం. ఇలా కల్తీలేని తిండి, కాలుష్యంలేని పట్టణాలు, పల్లెలు, భారం కాని కుటుంబ పోషణను ప్రజలకు అందించాలనే ఎజెండాతోనే పరిపాలన నడుస్తున్నది. ఇవేకాదు నిత్యం కెసిఆర్ ఆలోచన తరంగాల నుంచి ప్రజల జీవితాలను ప్రభావితం చేసే వినూత్న పథకాలు జాలువారుతుంటాయి.

ఈ ఆలోచనా తరంగాల నుంచి పురుడుపోసుకున్నవే రుణమాఫీ, 24 గంటల కరెంటు, పంటపెట్టుబడి, రైతుబీమా ఇలా చెప్పుకుంటుపోతే అనేక పథకాలు రైతుల జీవితాలను శీఘ్రంగా ప్రభావితం చేస్తున్నాయి, చేశాయి కూడా. అందుకే ఇయ్యాల తెలంగాణ ఎవుసం మూడు పువ్వులు -ఆరు కాయలు అన్నట్టుగా ఉంది ఈ అద్భుత కార్యక్రమాల మూలంగా తెలంగాణ పొలాలిప్పుడు రైతన్నకు చేదోడువాదోడుగా మారుతున్నయి. పొలంగట్ల వెంబడి మళ్లీ బోడకాకర తీగ పారుతున్నది. వరికోసిన మడుల్లో ములక్కాయ మొలకెత్తుతున్నది, బాయిల కాడ బచ్చలిచెట్లు ఎగబాకుతున్నయి, ఎరువుల్లేని పొలాల్లో కలగుర చెట్లు ఏపుగా పెరుగుతున్నయి, రైజోబీయం బ్యాక్టీరియాను వేర్లలో దాచుకొని భూమిలో నత్రజనిని స్థాపించే లెగ్యూమనేసి కుటుంబానికి చెందిన కంది, పెసర, బబ్బెర్ల తోటలు బ్రహ్మాండంగా పెరుగుతున్నయి. కల్తీలేని పంటలు, మందుల పీచికారీలు లేని ఎవుసం సాక్షాత్కారం అవుతున్నది.

హరితహారంలో పెరిగే ప్రతి చెట్టు పక్షులకు ఆవాసంగా మారి లక్షల పక్షి సంపదకు ఆలవాలంగా మారబోతున్నది. ఈ పక్షులే వ్యవసాయ మిత్రులుగా మారి పంటలను పీల్చి పిప్పిచేసే కీటకాలను హరించివేయబోతున్నయి. ఇంటిముంగిట బర్లు, గొర్ల వ్యర్ధాల పెంట భూములకు ఎరువుగా మారబోతున్నది. ఒక్క మాటలో చెప్పాలంటే కెసిఆర్ ఐదేండ్ల పాలన తర్వాత తెలంగాణ ఎవుసం ఖర్చులు సగానికి సగం పడిపోతయి, ఉత్పత్తులు రెండురేట్లు పెరగబోతున్నయి, రైతన్న కష్టాలు నూటికి నూరు శాతం తగ్గబోతున్నయి. ఎవుసం దీపావళీ చిచ్చుబుడ్డిలెక్క వెలుగులు విరజిమ్ముబోతున్నది. ఇది తథ్యం. అందుకే రైతులంతా మల్లొక్కసారి రైతుపక్షపాత సర్కారుకు, రైతుల ముఖ్యమంత్రికి అండగా నిలబడవలసిన అవసరం ఉంది.