Home జాతీయ వార్తలు వ్యాక్సినేషన్‌లో కేరళ, బెంగాల్ ఆదర్శం

వ్యాక్సినేషన్‌లో కేరళ, బెంగాల్ ఆదర్శం

Kerala and bengal reported negative vaccine wastage

 

ఏ ఒక్క టీకా చుక్కా వృధా కాలేదు

న్యూఢిల్లీ : వ్యాక్సిన్ల డోసుల్లో ఏ ఒక్క చుక్కా వృధాగా పోనివ్వకుండా కేటాయించిన దానికంటే ఎక్కువ మందికి టీకాలు వేయడంలో కేరళ, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలు ఆదర్శంగా నిలుస్తున్నాయి. మే నెలలో కేరళ తమకు కేటాయించిన కోటా కంటే అధికంగా 1.10 లక్షల డోసులను ప్రజలకు వేసింది. పశ్చిమబెంగాల్ కూడా 1.61 లక్షల డోసులను అధికంగా ప్రజలకు అందించ గలిగింది. నిజానికి వ్యాక్సిన్ వయల్‌లో వృధాను పరిగణన లోకి తీసుకుంటే పది డోసులు ఉంటాయి. కేంద్రం లెక్క ప్రకారం 1.1 శాతం ఇందులో కలిసి ఉంటుంది. అంటే సాధారణంగా ఒక వయల్ నుంచి 8 నుంచి 9 డోసులు ఇవ్వగలరు. అయితే కేరళ, బెంగాల్ రాష్ట్రాలు ఈ వృధాను కూడా వినియోగించుకుంటున్నాయి. ఇలా ఒక వయల్ నుంచి పూర్తిగా 10 డోసులు ఇవ్వగలుగుతున్నాయి. అనుభవజులైన వైద్య సిబ్బంది, నర్సులు ఇందులో కీలక పాత్ర వహిస్తున్నారు. టీకా డోసుల వినియోగంలో కేరళ వైద్య సిబ్బంది పనితీరుపై ఇటీవల ప్రధాని మోడీ కూడా ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే.

ఝార్ఖండ్‌లో మూడో వంతు వృధా
దేశ వ్యాప్తంగా అత్యధిక టీకా వృధా ఝార్ఖండ్ రాష్ట్రంలో నమోదైంది. కేంద్ర ప్రభుత్వం గణాంకాల ప్రకారం ఝార్ఖండ్ లో వ్యాక్సిన్ వృధా 33.95 శాతం ఉంది. అంటే మొత్తం డోసుల్లో మూడో వంతు నిరుపయోగమౌతున్నాయి. ఆ తర్వాత ఛత్తీస్‌గఢ్‌లో 15.79 శాతం, మధ్యప్రదేశ్‌లో 7.35 శాతం, డోసులు వృధాగా పోతున్నాయి. ఇక ఢిల్లీ, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర గుజరాత్ లోనూ ఈ వృధా 3 శాతం కంటే ఎక్కువగా ఉండడం గమనార్హం. సాధారణంగా వయల్ తెరిచిన తరువాత నాలుగు గంటల్లో వినియోగించాలి. లేదంటే ఆ డోసులతో ఉపయోగం ఉండదు. అయితే నలుగురైదుగురు వచ్చినా వయల్ ఓపెన్ చేసి టీకాలు ఇస్తుండడంతో ఆ రాష్ట్రాల్లో వృధా అధికంగా ఉంటోంది.

Kerala and bengal recorded negative wastage of covid vaccines