Thursday, April 18, 2024

విమానం బ్లాక్‌బాక్స్ లభ్యం

- Advertisement -
- Advertisement -

బ్లాక్ బాక్స్ స్వాధీనం
ఏడాది క్రితమే ఎయిర్‌పోర్టును హెచ్చరించిన డిజిసిఎ, పెడచెవిన పెట్టిన విమానాశ్రయం అధికారులు
ప్రమాదస్థలిని సందర్శించిన హర్దీప్‌పురి
మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల తాత్కాలిక పరిహారం ప్రకటన

కేరళ ప్రభుత్వ సాయం మరో రూ.10 లక్షలు

Kerala Announces Rs 10 lakhs to Flight Crash victims Families

కోజికోడ్: కేరళలోని కోజికోడ్ విమానాశ్రయం రన్‌వేపై శుక్రవారం రాత్రి జరిగిన విమాన ప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతోంది. విమానంనుంచి బ్లాక్‌బాక్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు డిజిసిఎ వెల్లడించింది. ఇందులో ఉండే డిజిటల్ ఫ్లైట్ డేటా రికార్డర్ (డిఎఫ్‌డిఆర్), కాక్‌పిట్ వాయిస్ రికార్డర్(సివిఆర్)‌లలో నిక్షిప్తమైన సమాచారాన్ని విశ్లేషించనున్నారు. దీనిద్వారా విమానం ఎత్తు, స్థితి, వేగానికి సంబంధించిన వివరాలతో పాటుగా ప్రమాదం సమయంలో పైలట్ల మధ్య జరిగిన సంభాషణ వివరాలు కూడా లభ్యం కానున్నాయి. దీంతో ప్రమాదానికి గురయిన ఐఎక్స్ 1344 విమానంలో ఏం జరిగి ఉంటుందో తెలసుకునే వీలవుతుందని అధికారులు చెప్పారు. దుబాయినుంచి కోజికోడ్‌కు వస్తున్న ఈ విమానం రన్‌వేపై అదుపుతప్పి జారిపడడంతో రెండు ముక్కలయిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో పైలట్‌తో సహా 20మంది మృతి చెందగా వందమందికి పైగా క్షతగాత్రులు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

ఏడాది క్రితమే హెచ్చరించిన డిజిసిఎ
కాగా కేరళలోని కోజ్‌కోడ్ విమానాశ్రయంలో జరిగిన విమానప్రమాదానికి సంబంధించి అనేక కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. విమానాశ్రయానికి ముందునుంచే కొన్ని భద్రతాపరమైన లోపాలున విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు విమాన నియంత్రణ సంస్థ డిజిసిఎ గత ఏడాదే ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్‌కు నోటీసులు జారీ చేసింది. రన్‌వే, విమానాలు నిలిపే స్థలం (ఆప్రాన్)లో కొన్ని లోపాలున్న విషయాన్ని ఆ నోటీసుల్లో లేవనెత్తింది. గత ఏడాది జులై 2న ఇదే విమానాశ్రయంలో ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ల్యాండింగ్ సమయంలో విమానం వెనుక భాగం దెబ్బతింది. ఈ ఘటనపై డిజిసిఎ అధికారులు విచారణ జరిపి కొన్ని భద్రతాపరమైన లోపాలను కనుగొన్నారు.

ఈ మేరకు కోజికోడ్ ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ కె శ్రీనివాసరావుకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు డిజిసిఎ అధికారులు వెల్లడించారు. రన్‌వేపై పగుళ్లు ఉన్నాయని, అక్కడక్కడా నీళ్లు నిలిచిపోతున్నాయని, రబ్బరు ముక్కలు కూడా ఎక్కువగా ఉన్నట్లు అధికారులు గుర్తించినట్లు తెలిపారు. 2010లో మంగళూరు విమానాశ్రమంలో ఇదే తరహా ప్రమాదం జరిగి అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత కొద్ది రోజులకే ఈ తరహా ప్రమాదాలు కోజికోడ్ విమానాశ్రయంలో కూడా జరిగే అవకాశముందంటూ డిజిసిఎ అధికారులు గతంలోనే హెచ్చరించారు. డిజిసిఎ హెచ్చరించినట్లుగానే శుక్రవారం ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ల్యాండింగ్ సమయంలో అదుపు తప్పి లోయలోకి పడిపోయింది. ఈ ఘటనపై డిజిసిఎ ఇప్పటికే దర్యాప్తుకు ఆదేశించింది. కాగా కోజికోడ్ విమాన ప్రమాదంపై విచారణ నివేదిక అందగానే దిద్దుబాటు చర్యలు తీసుకుంటామని ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఎఐ) అరవింద్ సింగ్ ఢిల్లీలో చెప్పారు. సహాయక చర్యలు ముగిశాయని తెలిపారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు సేకరిస్తున్నామని చెప్పారు.
ప్రమాద స్థలాన్ని సందర్శించిన కేంద్ర మంత్రి


కాగా శనివారం కోజికోడ్ విమాన ప్రమాద ప్రాంతాన్ని సందర్శించిన కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి ప్రాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు తలా రూ.10 లక్షల తాత్కాలిక పరిహారాన్ని ప్రకటించారు. ప్రమాద స్థలాన్ని సందర్శించి సహాయక చర్యలు గురించి అడిగి తెలుసుకున్న మంత్రి అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని ప్రకటించారు. తీవ్రంగా గాయపడిన వారికి రూ.2 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ. 50 వేల సాయాన్ని కూడా ఆయన ప్రకటించారు. ఇది కాకుండా వివిధ ఏజన్సీల ద్వారా వచ్చే నష్టపరిహారం, విమానం బీమా తదితరాల ద్వారా అదనపు పరిహారం లభిస్తుందని ఆయన చెప్పారు. కాగా పదేళ్ల క్రితం మంగళూరు విమానాశ్రంలో పదేళ్లక్రితం జరిగిన ఇదే తరహా ప్రమాదంతో ప్రస్తుత ప్రమాదాన్ని పోల్చి చూడడం సరికాదని మంత్రి అన్నారు. అప్పుడు కూడా ప్రమాదానికి గురయింది ఎయిరిండియా బోయింగ్ 737 విమానమే. ఆ ప్రమాదంలో మొత్తం 158 మంది ప్రయాణికులు చనిపోవడం తెలిసిందే. ఎయిరిండియా చరిత్రలోనే అతిపెద్ద ప్రమాదం అది. మంగళూరు ప్రమాదంనుంచి పాఠాలు నేర్చుకున్నామని, పదేళ్ల క్రితం జరిగిన ప్రమాదంతో తాజా సంఘటనను పోల్చడం సరికాదని అన్నారు. పైలట్ కెప్టెన్ దీపక్ సాథే, కో పైలట్ అఖిలేష్ కుమార్‌లు అత్యంత అనుభవజ్ఞులని మంత్రి చెప్పారు.

కేరళ సాయం మరో రూ.10లక్షలు
కాగా మృతుల కుటుంబాలకు తలా 10 లక్షల రూపాయల పరిహారాన్ని అందించనున్నట్లు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ చెప్పారు. శనివారం గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్‌తో కలిసి వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించిన అనంతరం ముఖ్యమంత్రి కోజికోడ్‌లో ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో గవర్నర్ కూడా పాల్గొన్నారు. అనంతరం విజయన్ మీడియాతో మాట్లాడుతూ, ఇప్పటివరకు చనిపోయిన 18 మంది ప్రయాణికుల్లో ఏడుగురు మగవారు, మరో ఏడుగురు మహిళలు, నలుగురు చిన్నారులు ఉన్నట్లు చెప్పారు. విమాన ప్రయాణికుల్లో తమిళనాడు, తెలంగాణకు చెందిన కొంతమంది కూడా ఉన్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం 149 మంది మలప్పురం, కోజికోడ్‌లలోని వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని, వీరిలో 23మంది పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. 23 మందిని ప్రాథమిక చికిత్స అనంతరం డిశ్చార్జి చేసినట్లు ముఖ్యమంత్రి చెప్పారు. పోస్టుమార్టం ప్రక్రియ వేగంగా జరుగుతోందని, సాయంత్రానికల్లా పూర్తవుతుందని భావిస్తున్నట్లు చెప్పారు.

కాగా కరోనా భయాన్ని సైతం లెక్క చేయకుండా జోరున కురుస్తున్న వర్షంలో సైతం ప్రమాదంలో చిక్కుకున్న క్షతగాత్రులను కాపాడడానికి ప్రయత్నించిన సహాయక బృందాలను, స్థానికులను ముఖ్యమంత్రి అభినందించారు. స్థానికుల ధైర్యం, సమయస్ఫూర్తివల్లే అనేక విలువైన ప్రాణాలు రక్షించబడ్డాయని ఆయన అన్నారు. మృతి చెందిన వారిలో ఒకరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు రాష్ట్ర మంత్రి ఒకరు చెప్పారు. కాగా ప్రమాదం నుంచి ప్రాణాలతో బైటపడ్డ క్షతగాత్రులు ఆ షాక్‌నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదు. ‘విమానం షేక్ అవుతున్న విషయం తప్ప ఏం జరుగుతోందో మాకు అర్థమే కాలేదు. భయంతో ముందు సీట్లను గట్టిగా పట్టుకున్నామని వారు చెప్పారు. అదృష్టవశాత్తు విమానం కూలిపోగానే ఎమర్జెన్సీ డోర్ తెరుచుకోవడంతో మేమంతా రక్షణ కోసం బైటికి దూకేశామని ఈ ప్రమాదంలో గాయపడిన రంషాద్ చెప్పారు. రంషాద్‌కు గాయాలు కాగా, ఆయన భార్య, నాలుగేళ్ల కుమార్తె మాత్రం స్వల్ప గాయాలతో బైటపడ్డారు.

15 రోజుల్లో తండ్రి కానుండగా విమాన ప్రమాదం ఆ కోపైలట్‌ను మింగేసింది

మరో 15 రోజుల్లో తామొక శుభవార్త విననున్నామని భావిస్తున్న తరుణంలో విమాన ప్రమాద రూపంలో ఆ కుటుంబాన్ని విషాద ఛాయలు అలుముకున్నాయి. కోజికోడ్ విమాన ప్రమాదంలో మృతి చెందిన కోపైలట్ అఖిలేశ్‌శర్మ(32)మరో 15 రోజుల్లో తండ్రి కానున్నారు. ఆయన భార్య మేఘ(29) నిండు గర్భిణి అని అఖిలేశ్ సోదరుడు లోకేశ్‌శర్మ(24) తెలిపారు. తన సోదరుని మరణవార్తను వదినకు చెప్పలేదని లోకేశ్ తెలిపారు. అఖిలేశ్‌కు మరో తమ్ముడు, అక్క ఉన్నారు. వీరి స్వస్థలం ఉత్తర్‌ప్రదేశ్‌లోని మధుర. 2017లో ఎయిర్ ఇండియాలో చేరిన అఖిలేశ్, 2018లో మేఘను వివాహమాడారు.

మృత్యుంజయులు ఈ కవలలు

ఘోర విమాన ప్రమాదంనుంచి ప్రాణాలతో బయటపడి కవలలు మృత్యుంజయులుగా నిలిచిన విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. ఓ వెబ్‌సైట్ కథనం ప్రకారం ఈ కవలల కుటుంబం దుబాయ్ లో నివసిస్తోంది. తండ్రి దుబాయ్ లోనే ఉండిపోగా, తల్లి, తన నలుగురు బిడ్డలతో కలసి వందే భారత్ మిషన్ ద్వారా కేరళకు ఎయిరిండియా విమాన టికెట్లను బుక్ చేసుకున్నారు. అయితే దురదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో చిక్కుకోగా, ఏడేళ్ల కవలలు జైన్, జమిల్ కుండోట్ పారకల్ ప్రాణాలతో బయటపడిన అదృష్ట వంతులుగా నిలిచారు. వీరి సోదరి, సోదరుడు కూడా స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. జియాకు (10) ఫ్రాక్చర్ కావడంతో ఆర్థోపెడిక్ విభాగంలో చికిత్స పొందుతుండగా, జియాన్ (14) ఆరోగ్యం నిలకడగా ఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. అయితే తల్లి ఎలా ఉన్నారనేది దానిపై వివరాలు తెలియరాలేదు.

పుట్టెడు దుఃఖంలో తల్లిదండ్రులు

కాగా వృధ్ధాప్యంలో తమకు కొండంత అండగా ఉండాడనుకున్న తమ అభిమాన దీపక్ ఇక లేడన్న వార్త అతని తల్లిదండ్రులను శోకసంద్రంలో ముంచేసింది. కొంతకాలం క్రితం జరిగిన మరో ప్రమాదంలో ఈ వృద్ధ దంపతులు తమ మరో కుమారుడ్ని కోల్పోయారు. నా కొడుకు చాలా మంచి వాడు. అవసరమైన వారికి సాయం చేయడంలో ఎప్పుడూ ముందుండే వాడు’ అంటూ తల్లి నీలా సాథే దివంగత సాథేను గుర్తు చేసుకున్నారు. కళ్లనిండా నీళ్లతొ, విషణ్ణ వదనాలతో మీడియాతో మాట్లాడిన మాటలు హృదయాలను ద్రవింపజేశాయి. తమ కుమారుడు అన్ని విద్యల్లో ఆరితేరిన వాడని కన్నీటిపర్యంతమైనారు. మంచివారినే దేవుడు త్వరగా తీసుకెళ్తారని ఆమె వ్యాఖ్యానించారు. కాగా మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్‌పాండె శనివారం సాథె తల్లిదండ్రులను కలిసి వారిని ఓదార్చారు.

Kerala Announces Rs 10 lakhs to Flight Crash victims Families

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News