Thursday, April 25, 2024

కేరళ సిఎం విజయన్‌కు చిక్కులు

- Advertisement -
- Advertisement -

Kerala gold smuggling case

బంగారం స్మగ్లింగ్ కేసులో సిఎం, స్పీకర్, ముగ్గురు మంత్రులకు ప్రమేయం
ఎన్నికలకు ముందు బాంబు పేల్చిన స్వప్న సురేశ్

కొచ్చి: సరిగ్గా ఎన్నికలకు ముందు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ చిక్కుల్లో పడ్డారు. 30 కెజిల బంగారం స్మగ్లింగ్ కేసులో ముఖ్యమంత్రి విజయన్‌కు సంబంధం ఉందని ప్రతిపక్షాలన్నీ దుమ్మెత్తి పోస్తున్న విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని ఈ కేసులో నిందితురాలయిన స్వప్నసురేశ్ కూడా తమ దర్యాప్తు సందర్భంగా వెల్లడించినట్లు ఈ కేసును దర్యాప్తు చేస్తున్న కస్టమ్స్ శాఖ కేరళ హైకోర్టుకు తెలియజేసింది.ఈ స్మగ్లింగ్‌లో ముఖ్యమంత్రి పినరయి విజయన్ పాత్ర కూడా ఉందని, ఆయన నిండా మునిగారని కస్టమ్స్ అధికారులు తెలిపారు. సిఎం పినరయి విజయన్‌తో పాటుగా ముగ్గురు మంత్రుల పేర్లను కూడా స్వప్న సురేశ్ విచారణ సందర్భంగా బైటపెట్టారు. ముగ్గురు మంత్రులతో పాటుగా స్పీకర్‌కు కూడా ఇందులో పాత్రధారి అని ఆమె వెల్లడించారు. ఇదే విషయాన్ని కస్టమ్స్ అధికారులు శుక్రవారం కేరళ హైకోర్టుకు వెల్లడించారు. ‘ సిఎం విజయన్ అరబ్బీ భాషలో మాట్లాడలేరు.

అందుకే కాన్సులేట్ జనరల్‌కు, సిఎం విజయన్‌కు మధ్య సంధానకర్తగా స్వప్న సురేశ్ వ్యవహరించారు.ఈ డీల్‌లో సిఎంతో సహా మంత్రులకు కోట్లాది రూపాయలు కమిషన్‌గా ముట్టిందని దర్యాప్తు సందర్భంగా స్వప్న సురేశ్ వెల్లడించారు’ అని కస్టమ్స్ అధికారులు హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. తిరువనంతపురంలో యుఎఇ మాజీ కాన్సులేట్ జనరల్‌తో విజయన్‌కు సన్నిహిత సంబంధాలున్నాయని,పెద్ద ఎత్తున అక్రమ నగదు రవాణాలు జరిగాయని స్వప్న సురేశ్ ఇంతకు ముందు చెప్పిన విషయం తెలిసిందే. కాగా కాన్సులేట్ సహాయంతో ముఖ్యమంత్రి, స్పీకర్‌ల ప్రోద్బలంతో పెద్ద ఎత్తున విదేశీ కరెన్సీ అక్రమ రవాణా చోటు చేసుకున్నట్లు ఆమె స్పష్టంగా తమకు చెప్పినట్లు కూడా కస్టమ్స్ అధికారులు తెలిపారు.

తిరువనంతపురంలోని యుఎఇ కాన్సులేట్‌లో మాజీ ఫైనాన్స్ హెడ్ ఒకరు మస్కాట్‌కు సుమారు కోటీ 30 లక్షలకు సమానమైన 1,90,000 అమెరికన్ డాలర్లను అక్రమంగా తరలించడానికి సంబంధించి కేసు నమోదైన విషయం తెలిసిందే. తిరువనంతపురంలోని యుఎఇ కాన్సులేట్ కార్యాలయానికి వస్తున్న పార్సిళ్లలో 15 కోట్ల విలువైన 30 కెజిల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు గతంలో గుర్తించారు. ఈ వ్యవహారం కేరళ రాష్ట్రాన్ని కుదిపేసింది. జాతీయ భద్రత నేపథ్యంలో ఈ కేసును ఎన్‌ఐఒకు అప్పగించారు. ఈ వ్యవహారంలో కేరళ ఐటి శాఖలో పని చేస్తున్న స్వప్న సురేశ్ ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. ఆమెతో పాటుగా ఈ కేసుకు సంబంధించి మరికొందరిని ఇప్పటికే అరెస్టు చేశారు కూడా.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News