Home ఎడిటోరియల్ వరద బీభత్సం ఎవరి పాపం

వరద బీభత్సం ఎవరి పాపం

Cartoonకేరళలో గత సంవత్సరం వరద బీభత్సం జనజీవనాన్ని అతలాకుతలం చేసింది. అప్పుడు ఈ ప్రకృతి విపత్తు చాలా అరుదైన సంఘటనగా భావించారు చాలా మంది. మరోసారి ఇలాంటి పరిస్థితి రాదని అనుకున్నారు. కేరళ ప్రజలు ఆ విపత్తు నుంచి బయటపడి, మళ్ళీ బతుకులు బాగు చేసుకున్నారు. వరద బీభత్సం గుర్తుకు వచ్చినప్పుడు వణికిపోయినా మరోసారి అలా జరగదని భావించారు. కాని, ఈ సంవత్సరం కూడా అదే పునరావృతమైంది. జూన్, జులై నెలల్లో వర్షాలు పెద్దగా కురవలేదు. కరువు పరిస్థితులు ఏర్పడతాయేమో అని చాలా మంది భయపడ్డారు.

కాని ఆగస్టు నెలతో పాటు జలప్రళయం వచ్చి పడింది. ఇది వరుసగా రెండు సంవత్సరాలు వచ్చిన వరద. వర్షాకాలం వర్షాలు పడతాయి. కాని ఈ వర్షాకాలం దేశంలో చాలా రాష్ట్రాల్లో పెను బీభత్సాన్ని సృష్టించింది. ఇదంతా యాధృచ్ఛికంగా జరిగిన అరుదైన సంఘటన కాదు. ఆగస్టు నెల ఇలా ఎన్నడూ లేదు. రుతుపవనాలు వస్తున్నాయంటే ఎంతో ఆనందించే కాలం గతించిపోయిందా? రుతుపవనాలు వస్తే వరదలొస్తాయని భయపడే పరిస్థితులు వచ్చా యా? వాతావరణంలో తీవ్రమైన మార్పులు, అనావృష్టి, అతివృష్టి మామూలై పోయాయా? ప్రతి సంవత్సరం వర్షం పడితే భయపడే వాతావరణం ఏర్పడుతుందా? వాతావరణం మన అవగాహనకు అందని విధంగా మారిపోయిందా?

వివిధ రాష్ట్రాల్లో వరద పరిస్థితులు ఏర్పడ్డాయి. వరదలకు కారణాలపై చర్చలు, వాదోపవాదాలు నడుస్తున్నాయి. కేరళలో కొండచరియలు విరిగి పడడానికి, నేల జారిపోడానికి కారణం ప్రకృతి వనరులను, నీటి వనరులను, నేలను దుర్వినియోగపరచడమేనని చాలా మంది విశ్లేషించారు. అయితే ఈ విపత్తులకు కారకులు, బాధ్యులు ఎక్కడో ఉన్నారన్నట్లు మాట్లాడుతున్నారు. ఇసుక మాఫియా, మరో మాఫియా ఈ దుర్భర స్థితికి కారణమని చేతులు దులుపుకుంటున్నారు. అక్రమ తవ్వకాలతో ఈ పరిస్థితులు సృష్టించారని ప్రజల ప్రాణాలు, ఆస్తులు నష్టపోయే పరిస్థితులకు కారణమయ్యారని వాదిస్తున్నారు. నేలను నాశనం చేశారని, పచ్చదనం లేకుండా చేశారని, నదులను నాశనం చేస్తున్నారని ఇలా అనేక రకాల వాదనలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా ఎవరో తెలియని శక్తులు ఇదంతా చేస్తున్నాయనే వాదనే వినిపిస్తుంది. ఆ శక్తులను గుర్తించి, నిరోధించే ప్రయత్నాలు మాత్రం ఎక్కడా జరగడం లేదు.

ఇతరులను వేలెత్తి చూపించడం ద్వారా మన బాధ్యత నుంచి తప్పించుకోలేం. వాళ్ళెవరో చేసిన తప్పులకు మనం శిక్ష అనుభవిస్తున్నామనే వాదనతో కాలం వెళ్ళబుచ్చలేం. ఈ పరిస్థితులకు దారితీసిన కారణాలు స్పష్టంగా ఉన్నాయి. ఈ పరిస్థితులకు కొందరి స్వార్థ ప్రయోజనాలు కారణమన్నది కూడా నిజమే. కాని ఇతరులను నిందించే ఉత్సాహంలో మనం, సాధారణ ప్రజలుగా మన బాధ్యతలు ఎంతవరకు నిర్వర్తిస్తున్నామన్నది ఆలోచించడం లేదు. ఒకవైపు ఈ పరిస్థితులకు కారణమైన స్వార్థ శక్తులు ఉండనే ఉన్నాయి. మరోవైపు సాధారణ ప్రజలు కూడా దీనికి కారణమవుతున్నారు. అక్రమ గనుల తవ్వకాలు, అడవుల నరికివేతలు, ఎత్తయిన భవనాల నిర్మాణాలు వగైరా స్వార్థ శక్తుల కార్యక్రమాలను అడ్డుకోవలసింది ప్రభుత్వమే. ఆ పని ప్రజల చేతుల్లో లేదు. కాని నేటి పరిస్థితికి కారణం ఈ శక్తులు మాత్రమే కాదు, సాధారణ ప్రజల వైఖరి కూడా కారణమే.

ఎయిర్ కండిషనర్ ఆన్ చేస్తున్నప్పుడు నిజంగా మనకు ఎ.సి. ఇప్పుడు అవసరమా అని ఆలోచించేవారు ఎంతమంది? ప్లాస్టిక్ గ్లాసులు, కప్పులను వాడి పారేసే బదులు, మరలా మరలా వాడుకునే గాజు, పింగాణీ గ్లాసులు కప్పులు వాడడం మంచిదని ఎంతమంది ఆలోచిస్తుంటారు? ప్రతి రోజు మనం ఎంత మురికి నీటిని విడుదల చేస్తున్నామో ఎవరైనా ఆలోచిస్తున్నారా? బైకులు, కార్లలో వెళ్ళే బదులు ప్రజా రవాణాను ఉపయోగించడం మంచిదని ఎంత మంది ఆలోచిస్తున్నారు? మన రోజువారీ జీవితంలో చిన్న మార్పును కూడా మనం చేయడం లేదు. కాని మన జీవన విధానం వాతావరణంపై వేస్తున్న మార్పును మనం అంచనా వేయలేకపోతున్నాం. వాతావరణ మార్పుల గురించి మనం చర్చిస్తుంటాం. కాని ఈ చర్చలు కాలక్షేపానికి పరిమితమయ్యాయా? లేక సీరియస్‌గా మనం ఆలోచిస్తున్నామా? ప్రపంచ దేశాల నాయకులు మాత్రమే పరిష్కరించే సమస్యగా మరిచిపోతాం.

కాని ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు, వాతావరణ పరిస్థితుల తర్వాతైనా కళ్ళు తెరవడం అవసరం. ఈ వరదలు, కరువులు మన గుమ్మం వద్దకు వచ్చాయి. కరువు మన కిచెన్‌లో సరుకులు కనబడకుండా చేయవచ్చు. చివరకు ఒక బిందె నీళ్ళ కోసం ఇరుగు పొరుగు పోట్లాడుకునే పరిస్థితి రావచ్చు. ఈ వరద బీభత్సం నిరుపేదలను మాత్రమే కాదు సంపన్నులను కూడా భవిష్యత్తులో వదిలిపెట్టదు. చాలా చిన్న చిన్న పనులతో మనం వాతావరణ మార్పుల బీభత్సాన్ని తగ్గించవచ్చు. కాస్త చెమట పట్టినా ఓర్చుకుని, మరీ అవసరమైతే తప్ప ఎ.సి. ఆన్ చేయకుండా ఉండడం, సిటీ బస్సులోనో, లోకల్ ట్రైనులోనో మరో ప్రజా రవాణా వ్యవస్థనో ఉపయోగించి, స్వంత కార్లను, వాహనాలను అవసరమైతే తప్ప వాడకుండా ఉండడం, ప్లాస్టిక్ బ్యాగులను వాడకుండా ఉండడం, ప్లాస్టిక్ గ్లాసులు, కప్పులకు స్వస్తి చెప్పడం, అన్నింటికి మించి వాతావరణ మార్పుల గురించి మన పిల్లల్లో అవగాహన పెరిగేలా చేయడం. చాలా మంది పిల్లలకు ఈ విషయమై అవగాహన కల్పించే ప్రయత్నం చేయడం లేదు. భవిష్య తరాలకు ఈ అవగాహన పెంచడం, ఈ అలవాట్లు నేర్పడం చాలా అవసరం.

వర్షాకాలంలో వానలు కురుస్తాయి. కాని అవి విపరీతమైతే మన ప్రాంతాలు, నివాసాలు మునిగిపోతాయి. ఇలా ఎందుకు జరుగుతుందంటే, సముద్రాల వేడి పెరుగుతోంది. నీరు ఎక్కువ ఆవిరి అవుతోంది. వాతావరణంలో తేమ పెరుగుతోంది. మబ్బులను మోసుకు వచ్చే గాలులు క్రమం లేకుండా వీస్తున్నాయి. ఈ మబ్బులు ఎక్కడ కురుస్తాయో చెప్పలేని వాతావరణం ఏర్పడుతోంది. దీనికంతటికి కారణం మనమే. మన జీవనశైలి వల్లనే ఉష్ణోగ్రత పెరుగుతోంది. నేల వేడెక్కుతోంది. సముద్రాల్లో నీరు ఆవిరవుతోంది. ఈ విషయాలన్నీ పిల్లలకు చెప్పాలి. పెద్దల కన్నా వారు త్వరగా అర్ధం చేసుకుంటారు. నీటిని వృధా చేయడం, విద్యుచ్ఛక్తిని వృధా చేయడం, ప్లాస్టిక్ పారేయడం, స్వార్థంతో వ్యవహరించడం వల్ల స్వంత గోతినే తవ్వుకుంటున్నామన్నది అందరికీ అర్ధం కావాలి. మనిషి జీవితానికి అవసరమైన సదుపాయాలు కలిగి ఉండాలా? లేక విలాసాలతో జీవించాలా అన్నది తేల్చుకోవాలి. భవిష్య తరాల బాగు కోరుతున్నట్లయితే జీవితానికి అవసరమైన సదుపాయాలతో బతకాలి.

kerala rains

* ఆషా అయ్యర్ కుమార్ (డైలీ ఓ)