Home ఎడిటోరియల్ సంపాదకీయం: కీలకమైన ‘బ్రిక్స్’ సమ్మిట్

సంపాదకీయం: కీలకమైన ‘బ్రిక్స్’ సమ్మిట్

Sampadakeeyam-Logoఈ వారాంతంలో (15,16 తేదీలు) ‘బ్రిక్స్’ 8 వ వార్షిక అగ్రనాయక సమావేశానికి భారతప్రభుత్వం గోవాలో ఆతిథ్యమిస్తున్నది. ప్రాదుర్భావ ఆర్థికవ్యవస్థలుగా వర్గీకరించబడిన ఐదు దేశాలతో (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) కూడిన ఈ ఆర్థిక సహకార సంస్థ ఆశించినంత వేగంగా అడుగులు వేయటంలేదు. సభ్యదేశాల్లో కొన్నింటిమధ్య ఇతరేతర అంశాలపై భిన్నాభిప్రాయాలు ద్వైపాక్షిక సంబంధాలను ఇబ్బంది పెడుతున్నాయి. ప్రపంచ ఆర్థిక మహామాంద్యం ప్రభావంతో ఈ దేశాల ఆర్థిక వ్యవస్థలు ఎదురుదెబ్బలు తిన్నాయి. ఇదే సందర్భంలో భారత్-రష్యా వార్షిక అగ్రనాయక సమావేశం కూడా అక్కడే జరగనుంది. ఈ రెండు సమావేశాలకు దేని ప్రాముఖ్యత దానికుంది.
ముందుగా బ్రిక్స్‌ను పరిశీలిస్తే, అమెరికాలో 2008లో గృహ రుణాల సంక్షోభం (సబ్-ప్రైమ్) ద్రవ్యవ్యవస్థను కుప్పకూల్చి, అది ఆర్థికరంగంలో మహామాంద్యంగా పరిణమించిన ప్రభావం, బ్రిక్స్ దేశాల అభివృద్ధి వేగాన్ని ఆటంకపరిచింది. క్రూడ్ ఆయిల్ ధరలు అతిదారుణంగా పడిపోవటం బ్రెజిల్‌ను కృంగ దీసింది. దాన్నుంచి ప్రజల్లో బయలుదేరిన అసంతృప్తి రాజకీయ కల్లోలం సృష్టించింది, అధికారం మితవాదుల చేతిలోకి వెళ్లింది. రష్యా ఆర్థిక వ్యవస్థను పడిపోయిన క్రూడ్ ధరలు, సిరియా సంక్షోభంలో జోక్యం కృంగదీశాయి. సిరియా పక్షాన జోక్యం అంతర్జాతీయ ప్రతిష్ట పెంచినా, అమెరికా-పశ్చిమ దేశాలు విధించిన ఆంక్షలు ఇబ్బంది కరంగా తయారైనాయి. భారత్ వృద్ధిరేటు గణనీయంగా (7.6శాతం) ఉన్నట్లు కనిపిస్తున్నా ఎగుమతులు తగ్గిపోవటంతో ఎగుమతికొరకు ఉత్పత్తులు చేసే పరిశ్రమల్లో మాంద్యం ఏర్పడి లక్షలాదిమంది ఉపాధి కోల్పోయారు. వస్తూత్పత్తి రంగం పరిస్థితి గడ్డుగా ఉంది. చైనా ద్రవ్యసంక్షోభానికి గురైంది. వినిమయవస్తువుల ఎగుమతులు తీవ్రంగా పడిపోయాయి. అదే సమయంలో రెండు ముఖ్యమైన విషయాల్లో – అణు సరఫరా గ్రూపులో భారత్ సభ్యత్వం, పాకిస్థాన్ సీమాంతర ఉగ్రవాదంపై భారత్ ప్రతిదాడులు, జైష్-ఎ-మహమ్మద్ అధిపతి మసూర్ అజార్‌పై ఐరాస నిషేధం విధింపును చైనా అడ్డుకోవటం – రెండు దేశాల మధ్య తీవ్రమైన వివాదాంశాలుగా మారాయి. ఈ విషయాల్లో నిర్ణీత సూత్రాలు పాటించాలంటోంది చైనా. అదే సమయంలో రష్యా-పాకిస్థాన్ సైనిక విన్యాసాల అంశం, రక్షణ రంగంలో భారత్ అమెరికాకు అతి సన్నిహితం కావటం భారత్-రష్యాల మధ్య చికాకుగా తయారైంది.
సభ్యదేశాల మధ్య ఈ తరహా విభేదాల పరిష్కారాన్ని ద్వైపాక్షిక చర్చలకు పరిమితం చేయగలిగితేనే ఉమ్మడి సహకార వేదికలు ప్రయోజనకరమవుతాయి. బ్రిక్స్ సమావేశం ముందు పెద్ద ఎజండానే ఉంది. స్టాండర్డ్ అండ్ పూర్స్, మూడీస్ ఇన్వెస్టార్స్ సర్వీసెస్ వంటి క్రెడిట్ రేటింగ్ నిర్ణాయక సంస్థలు పశ్చిమదేశాల పట్ల పక్షపాతంతో వ్యవహరిస్తు న్నందున సొంత రేటింగ్ ఏజన్సీని నెలకొల్పుకోవాలని బ్రిక్స్ ఆలోచిస్తోంది. అలాగే తమ మధ్య వాణిజ్య వివాదాల పరిష్కారానికి ఉన్నత ప్రమాణాలు కలిగిన ఆర్బిట్రేషన్ వ్యవస్థను ఏర్పాటు చేసుకునే సమస్య దానిముందుంది. 2015 జులైలో ఉఫాలో జరిగిన అగ్రనాయక సమావేశం ఆమోదించిన డిక్లరేషన్‌లో పొందుపరిచిన అనేక అంశాలకు నిర్దిష్టత ఇవ్వాల్సి ఉంది. ఆర్థిక సహాయ సహకారమే పరస్పర వృద్ధికి సోపానం అనే సూత్రంపై కేంద్రీక రించినపుడే బ్రిక్స్ ఆదర్శవంతమైన ఆర్థిక సహకార సంస్థగా నిలుస్తుంది, గెలుస్తుంది.
ఇక, రష్యా-భారత్ శిఖరాగ్ర సభ డిసెంబర్‌లో జరగాల్సి ఉండగా ఫుతిన్-నరేంద్రమోడీ సౌలభ్యంకొరకు ముందుకు జరిపారు. రష్యా సాంప్రదాయకంగా భారత్‌కు అత్యంత విశ్వసనీయమైన మిత్రదేశం. అయితే భారతప్రభుత్వ విధానాలు అనేక సంవత్స రాలుగా అమెరికా వైపు మొగ్గుతూ, అవి రక్షణ సహకారం దాకా విస్తరించాయి. రష్యా కూడా పెట్టుబడిదారీ పంధా చేబట్టి ప్రభుత్వరంగ సంస్థలను వేలంవేస్తున్నందున రష్యా ఇయిల్ క్షేత్రాల్లో భారత్ పెట్టుబడుల పెరిగే అవకాశం ఉంది. ఇరుదేశాల మధ్య ఆయిల్ పైపులైన్ కొరకు ఒప్పందం జరగవచ్చు. రక్షణరంగంలో బంధం మరింత పటిష్టం చేసుకుంటే అది ‘మేక్ ఇన్ ఇండియా’కు ఊతమిస్తుంది. కాబట్టి ఈ రెండు సమావేశాలు ఫలప్రదం కావాలని ఆశించుదాం!