Friday, April 19, 2024

మాట నిలబెట్టుకున్నాం

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్/కరీంనగర్ ప్రతినిధి / గంభీరావుపేట : విద్య అనేది మన నుంచి దొంగిలించలేని ఒక అపురూపమైన వస్తువు అని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కె.టి.రామా రావు వ్యాఖ్యానించారు. సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన కెజి టు పిజి క్యాంపస్ ను బుధవారం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి మంత్రి కెటిఆర్ ప్రారంభించారు. అనంతరం ఇరువురు నేతలు క్యాంపస్‌లో కలియతిరిగి అత్యాధునిక వసతులతో ఏర్పాటు చేసిన డిజిటల్ లైబ్రరీతోపాటు వివిధ విభాగాలను పరిశీలించి విద్యార్థులలో ముచ్చటించారు. విద్యార్థులతో కలిసి మంత్రులు భోజనం చేశారు.

ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లా డు తూ, రాష్ట్రం సిధ్దించిన తర్వాత కెజి టు పిజి వరకు ఒకే ఆవరణ లో విద్యాసంస్థలు నెలకొల్పుతామని 2004లోనే సిఎం కెసిఆర్ చెప్పారని గుర్తు చేశారు. ఆనాటి మాట కెసిఆర్ నిలబెట్టుకు న్నారని చెప్పారు. సిఎం కెసిఆర్ నాయకత్వంలో భారతదేశం లో ఎక్కడా లేని విధంగా విద్యకు పెద్దపీట వేశామన్నారు. కెజి నుంచి పిజి వరకు ఉన్నత ప్రమాణాలతో బ్రహ్మాండమైన విద్యను అందిస్తున్నామని, మన పిల్లలను ప్రపంచంతో పోటీ పడే విధంగా తయారు చేయాలన్న లక్ష్యంతో ముందుకు పోతున్నాం కెటిఆర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో వెయ్యికి పైగా గురుకుల పాఠశాలలు స్థాపించామని చెప్పారు. గురుకుల విద్యార్థులకు ఒక్కొక్కరిపై రూ. లక్షా 20 వేలు ప్రభుత్వం ఖర్చు చేస్తుందని తెలిపారు.

విద్య ద్వారా సమకూరే జ్ఞానాన్ని ఎవరూ కూడా తస్కరించలేరని, అందుకే సిఎం కెసిఆర్ నాయకత్వంలో మన ఊరు – మన బడి పేరిట రాష్ట్రంలోని అన్ని పాఠశాలలను మూడు దశల్లో అభివృద్ధి చేస్తున్నామని కెటిఆర్ అన్నారు. తెలంగాణ పుట్టి ఎనిమిదిన్నరేండ్లు అవుతుందని, 75 ఏండ్ల స్వతంత్య్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరగని అభివృద్ధి, సంక్షేమాన్ని తెలంగాణలో అమలవుతున్నాయని చెప్పారు. ఈ ఘనత ముఖ్యమంత్రి కెసిఆర్‌కే దక్కుతుందన్నారు. వ్యవసాయం, సాగునీరు, విద్యుత్, విద్య, వైద్యం, పరిశ్రమలు, వాణిజ్య రంగాల్లో వేలు పెట్టి చూపే పరిస్థితి లేదన్నారు.

ప్రజల సర్వతోముఖాభివృద్ధి లక్ష్యంగా, అభివృద్ధే మా కులం, సంక్షేమమే మా మతం, జనహితమే మా అభిమతం అనే దిశగా ముందుకు పోతున్నామని కెటిఆర్ తేల్చిచెప్పారు. విద్యా ప్రమాణాలకు పెద్దపీట వేయాలన్న ఉద్దేశంతోనే మన ఊరు -మన బడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని మంత్రి పేర్కొన్నారు. నాయకుడికి మనసు ఉంటే ఎలాంటి పనులు జరుగుతాయనడానికి ఇలాంటి కార్యక్రమాలే నిదర్శనమని వ్యాఖ్యానించారు. డైనింగ్ హాల్ అద్భుతంగా నిర్మించారని అన్నారు. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్‌ను మనం గుర్తు చేసుకోవాలని, ఆయన పేరిట ఇప్పటికే ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం అని పెట్టుకున్నామని తెలిపారు. ఈ పాఠశాలకు ప్రొఫెసర్ జయశంకర్ పేరు పెట్టాలని మంత్రి కెటిఆర్ సూచించారు.

తొలి కెజి టు పిజి క్యాంపస్

మన ఊరు- మన బడి’లో భాగంగా రాష్ట్రంలోనే తొలి కెజి టు పిజి క్యాంపస్ గంభీరావుపేటలో రూపుదిద్దుకున్నది. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఒకే చోట కెజి టు పిజి వరకు నాణ్యమైన ఉచిత విద్యను అందిస్తామన్న సిఎం కెసిఆర్ హామీ మేరకు మంత్రి కెటిఆర్ ప్రత్యేక చొరవ, కార్పొరేట్ సంస్థల సహకారంతో గంభీరావుపేటలో 6 ఎకరాల విస్తీర్ణంలో ఆధునిక సముదాయం నిర్మాణమైంది. రహేజా కార్ప్ ఫౌండేషన్, మైండ్‌స్పేస్ రిట్, యశోద హాస్పిటల్, ఎమ్మార్‌ఎఫ్, డీవీస్ ల్యాబ్, గివ్ తెలంగాణ, గ్రీన్‌కో సహకారంతో రూ. 3 కోట్లతో సకల వసతులతో దీనిని నిర్మించారు. మొత్తం 70 తరగతి గదుల్లో 3500 మంది తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ మీడియంలో అభ్యసించేందుకు ఆధునిక హంగులతో ఎడ్యుకేషన్ హబ్‌లా నిర్మాణాలు పూర్తి చేశారు. 250 మంది చిన్నారులకు సరిపడేలా అంగన్‌వాడీ కేంద్రం.. చిన్నారులకు ప్రీ ప్రైమరీ, క్రీడా మైదానంతో పాటు ప్రైమరీ, ఉన్నత పాఠశాల, జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాలతో పాటు పీజీ కళాశాలకు అనుగుణంగా భవన సముదాయాలు సిద్ధం చేశారు. అంతే కాకుండా ప్రాంగణంలో డిజిటల్ లైబ్రరీ, కంప్యూటర్ ల్యాబ్, స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రం, వెయ్యి మంది ఒకే సారి కూర్చొని తినేలా డైనింగ్ హాల్ ఏర్పాటు చేశారు.

రంగారెడ్డి జిల్లాలో సిఎస్ కలిసి ప్రారంభించిన మంత్రి సబిత

రాష్ట్రవ్యాప్తంగా మన ఊరు మన బడి మొదటి విడతలో పనులు పూర్తయిన పాఠశాలలను బుధవారం మంత్రులు, ఎంఎల్‌ఎ, స్థానిక ప్రజాప్రతినిధులు ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండల రాచాలూరు గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో మన ఊరు-మనబడి కార్యక్రమం కింద ఏర్పాటు చేసిన మౌలిక వసతులను రాష్ట్ర విద్య శాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్ పర్సన్ తీగల అనిత హరనాథ్ రెడ్డి, విద్య శాఖ సెక్రెటరీ వాకాటి కరుణ, విద్య శాఖ డైరెక్టర్ దేవసేన, జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లాలో 464 పాఠశాలలకు అన్ని సదుపాయాలు కల్పించిందని ఇది చారిత్రాత్మకమని మంత్రి సబిత అన్నారు.

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా నిజాంపేట ప్రభుత్వ పాఠశాలలో ఆధునీకరించిన అభివృద్ధి పనులను మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. నగరంలోని పద్మారావు నగర్‌లో మైలార్‌గూడ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, కంటోన్మెంట్‌లోని పికెట్, ఖైరతాబాద్‌లోని రాజ్‌భవన్ పాఠశాలలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మన ఊరు మన బడి కింద ఆధునీకరించిన పాఠశాలలను ప్రారంభించారు. జనగాం జిల్లాలో మొండిచింత ప్రాథమిక పాఠశాలలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఖమ్మం జిల్లా మామిళ్లగూడెం ప్రాథమిక పాఠశాలలో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, నిర్మల్ జిల్లా ఎల్లపెల్లి ప్రభుత్వ పాఠశాలలో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండల కేంద్రంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్, మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్‌లో మంత్రి మల్లారెడ్డి, కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం చింతకుంట గ్రామంలో మంత్రి గంగుల కమలాకర్, సూర్యాపేట జిల్లా చివ్వెంల మండల కేంద్రంలో మంత్రి జగదీష్‌రెడ్డి మన ఊరు మన బడి ఆధునీకరించిన ప్రభుత్వ పాఠశాలలను ప్రారంభించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News