Home తాజా వార్తలు మహా గణపతి నిమజ్జనం పూర్తి

మహా గణపతి నిమజ్జనం పూర్తి

Khairatabad Ganesh Nimajjanam completed

హైదరాబాద్: ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనం కొద్దిసేపటి క్రితం పూర్తి అయింది. చివరిసారి భారీ కాయుడిని దర్శించుకునేందుకు లక్షలాది మంది భక్తులు ట్యాంక్ బండ్ కు తరలివచ్చారు. తొమ్మిది రోజుల పాటు అశేష భక్తుల పూజలు అందుకున్న ఖైరతాబాద్‌ స‌ప్త‌ముఖ కాల‌స‌ర్ప గణనాథుని క్రేన్‌ నంబర్‌ 6వద్ద నిమజ్జనం చేశారు. మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, ఎంఎల్ఎ చింతల రామచంద్రారెడ్డి, జిహెచ్‌ఎంసి కమిషనర్‌ డాక్టర్‌ జనార్దన్‌ రెడ్డి, త‌దిత‌రులు మహా గణపతి వద్దకు వచ్చారు. ప్ర‌త్యేక‌ పూజలు నిర్వహించిన అనంతరం గణేషుని గంగమ్మ ఒడికి చేర్చారు. ఈ భారీ గణపయ్య నిమ‌జ్జ‌నం కోసం 400 ట‌న్నుల సామ‌ర్థ్యం క‌లిగిన ప్ర‌త్యేక క్రేన్ ను అధికారులు ఏర్పాటు చేశారు. ఇక ఆదివారం గణపతి నిమజ్జనం దృష్ట్యా నగరవ్యాప్తంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ట్యాంక్ బండ్, ఎన్ టిఆర్ మార్గ్ లలో సాధారణ వాహనాలను అనుమతించడం లేదు. జియో ట్యాగింగ్ ద్వారా విగ్రహాల మానిటరింగ్ జరుగుతుంది. ట్యాంక్ బండ్ సహా ఇతర 35 ప్రాంతాల్లో నిమజ్జన ఏర్పాట్లు చేశారు అధికారులు. ప్రజలు అసౌకర్యాలకు గురికాకుండా నిమజ్జన రూట్లలో వెళ్లకుండా ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని పోలీసులు సూచిస్తున్నారు.