Home జిల్లాలు కిల్ (హిమ) క్రిములు!

కిల్ (హిమ) క్రిములు!

liceజిల్లాలో జోరుగా ఐస్ వ్యాపారం
శుద్ధిలేని నీటితో తయారీలు
విచ్చలవిడిగా అమ్మకాలు
ఏ శాఖకూ పట్టని నియంత్రణ
కనీసం తొంగిచూడని ఆహార కల్తీ నియంత్రణ శాఖ
సంగారెడ్డి ప్రతినిధి : భానుడి భగభగ…వేడిమితోఉక్కపోత…శరీరమంతా చెమట లు… ఈ సమయంలో చల్లని పానీయాలు ఎంతో హాయినిస్తాయి. మండుటెండలో బయట తిరిగే వారికి మార్కెట్‌లో లభ్యమవుతున్న చల్లని పానీయాలు కొంత ఉపశమనాన్ని కలిగిస్తున్నాయి. కానీ చల్లదనం కోసం అందులో వేసే మంచు (ఐస్) గడ్డలే ప్రాణానికి హాని తలపెడుతున్నాయి. డబ్బులు పెట్టి మరీ రోగాల ను కొంటున్నామన్న విషయాన్ని ఎవరూ గుర్తించ లేకపోతున్నారు. వేసవిలో ఎండ వేడిమి నుంచి ఉపశమనం కోసం చల్లదనాన్ని ఆశ్రయించడం సహజమే. కానీ ఆ సహజత్వాన్నే కొందరు వ్యాపారు లు సొమ్ము చేసుకుంటున్నారు. జిల్లాకేంద్రమైన సంగారెడ్డితో పాటు పటాన్‌చెరు, రామచంద్రపురం, మెదక్, సిద్దిపేట, తూప్రాన్, గజ్వేల్, జహీరాబాద్, నర్సాపూర్ తదితర ప్రాంతాల్లో ఐస్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. నాణ్యతా ప్రమాణాలకు నీళ్లొదిలి అక్రమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. కాసులకు కక్కుర్తి పడి కలుషిత నీటితో మంచు గడ్డలు తయారు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న శీతల పానీయాల దుకాణాల్లో ఐస్ వాడుతున్నారు. ఈ ఐస్ ఎక్కడి నుంచి తెచ్చారో, ఎలా తయారు చేశారో ఇవేమీ పట్టించుకోకుండానే మనం పానీయాలను సేవిస్తు న్నాం. ఐస్ తయారీ వ్యాపారంపై ఏ ఒక్క శాఖ కూడా ఇప్పటివరకు దాడులు నిర్వహించిన దాఖలాలు జిల్లా చరిత్రలోనే లేవు. ఆహార కల్తీ నియంత్రణ అధికారులు పట్టించుకోకపోవడం వల్ల ఐస్ వ్యాపారం జోరుగా సాగుతుంది. రోగాలు ప్రజలకు అంటగడుతూ వ్యాపారులు మాత్రం లక్షలు ఆర్జిస్తున్నారు. కొన్ని ఐస్ ఫ్యాక్టరీల వద్ద అపరిశుభ్రత తాండవిస్తోంది. దుమ్ము,దూళి మద్య ఐస్‌ను తయారు చేస్తున్నారు.
నిబంధనలు ఏం చెబుతున్నాయంటే : ఐస్ తయారీకి శుద్ది చేసిన నీటిని ఉపయోగించాలి. కానీ ఏ ఒక్కరు కూడా అలా చేయడం లేదు. ఉప్పు నీరు, బోరునీటిని ఉపయోగిస్తున్నారు. వడపోయకుండా నేరుగా పెట్టెల్లోనే నీటిని నింపి ఐస్ తయారు చేస్తు న్నారు. పెట్టెలను శుభ్రం చేయకుండానే మళ్లీమళ్లీ వాడుతున్నారు.వివిధ ప్రాంతాల్లో అనుమతులు లేకుండానే ఐస్ ఫ్యాక్టరీలు కొనసాగుతున్నాయి. అందులో తయారు చేసిన ఐస్‌ను శీతల పానీయాల దుకాణాలకు సరఫరా చేస్తున్నారు. పెళ్లిళ్లు, ఇతర శుభ కార్యాలకు కూడా ఈ ఐస్‌ను సరఫరా చేస్తు న్నారు. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్‌ను కమర్షియల్ కాకుండా డొమిస్టిక్ కరెంట్‌ను వాడుతున్నారు. దీంతో విద్యుత్ శాఖ ఆదాయానికి కూడా గండి పడుతోంది.
అటువైపునకు తొంగిచూడని అధికారులు : నిబంధనలకు విరుద్దంగా, నాణ్యతా ప్రమాణాలకు వ్యతిరేకంగా కొనసాగుతున్న ఐస్ ఫ్యాక్టరీలు, ఐస్ వ్యాపార కేంద్రాల వైపు ఏ శాఖ అధికారులు కూడా తొంగిచూడటం లేదు. ముఖ్యంగా ఆహార కల్తీ నియంత్రణ అధికారులు పలు దుకాణాలపై తనిఖీలు నిర్వహిస్తున్నా ఈ వ్యాపారంపై దృష్టి పెట్టకపోవడం పట్ల పలు అనుమానాలకు తావిస్తోంది. వీరిపై కేసులు, హెచ్చరికలు చేసిన దాఖలాలు మచ్చుకైనా ఇప్పటివరకు లేవు. ఏ శాఖకు కూడా వీటిపై నియంత్రణ లేకపోవడంతో ఐస్ వ్యాపారులు ఆడింది ఆట పాడింది పాటగా కొనసాగుతుంది.
వైరల్ ఇన్‌ఫెక్షన్ తప్పదు
– డా.పరుశరాం, ఫిజిషియన్, సంగారెడ్డి
శుద్ది చేయని నీటితో తయారు చేసిన ఐస్‌ను వాడటం వల్ల వ్యాధులు సంక్రమించే ప్రమాదముంది. ముఖ్యంగా వైరల్ ఇన్‌ఫెక్షన్లు త్వరగా వ్యాపిస్తాయి. టైఫాయిడ్ వంటి వ్యాదులు త్వరితగతిన రావడానికి ఆస్కారముంటుంది. డయారియా, వాంతులు, విరేచ నాలు వస్తాయి. కలుషిత నీటి తాగడం వల్లనే ఆరోగ్యానికి ముప్పు వాటిల్లుతుంది, అలాంటిది శుద్ది చేయని నీటితో ఐస్ తయారు చేయడంతో బ్యాక్టేరియా వుంటుంది. దీని వల్ల వ్యాధుల బారిన పడే ప్రమాదం వుంది.
తనిఖీలు ముమ్మరం చేయాలి :– ఎండి.షఫీ అహ్మద్‌ఖాన్, మానవ హక్కుల సంఘం రాష్ట్ర ప్రచార కార్యదర్శి
జిల్లా వ్యాప్తంగా జోరుగా కొనసాగుతున్న ఐస్ అమ్మకాలపై సంబంధిత అధికారులు నిఘా పెట్టాలి. ముఖ్యంగా ఐస్ తయారీ ఎలా చేస్తున్నారు, ఎక్కడ చేస్తున్నారు, ఏ నీటితో తయారు చేస్తున్నారో పరిశీలిం చాలి. ప్రస్తుత వేసవి కాలంలో చల్లదనం కోసం ఐస్‌ను ఎక్కువగా వాడుతున్నారు. కానీ శుద్దిలేని నీటితో ఐస్ తయారు చేయడం వల్ల రోగాల బారిన పడుతామన్న ఆలోచన ఎవరికీ రాదు. జిల్లాలో ఇష్టారాజ్యంగా కొనసాగుతున్న ఐస్ ఫ్యాక్టరీలపై, ఐస్ విక్రయాలపై అధికారులు తనిఖీలు నిర్వహించాలి. ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు తగు చర్యలు తీసుకోవాలి.