Home తాజా వార్తలు అనుబంధం, ఆత్మీయత అంతా ఒక బూటకం…

అనుబంధం, ఆత్మీయత అంతా ఒక బూటకం…

assets

 

ఆస్తి కోసం హైదరాబాద్‌లో వదిన, ఆమె తల్లి, మునగాలలో బీమా సొమ్ము కోసం బాబాయి హత్య

మునగాల/చాంద్రాయణగుట్ట : ఆస్తులను దక్కించుకునేందుకు ఓ వ్యక్తి తన వదిన, ఆమె తల్లిని, బీమా మొత్తాన్ని దక్కించుకునేందుకు సొంత బాబాయిని దారుణంగా చంపిన ఘటనలు రాష్ట్రంలో వేర్వేరు ప్రాంతాలలో చోటుచేసుకున్నాయి. హైదరాబాద్‌లోని చాంద్రాయణగుట్టలో శుక్రవారం ఉదయం ఇంటి వివాదంలో వదినను, ఆమె తల్లిని కత్తితో గొంతు కోసి అతిదారుణంగా హతమార్చాడు. చాంద్రాయణగుట్ట తాళ్లకుంట నివాసి మహ్మద్ హుస్సేన్ (65), భార్య షహజాది బేగం (60), కుమార్తె ఫరీదా బేగం (32), ఆమె కుమార్తెలు ఇమ్రా ఫాతిమా (11), తయ్యబా (6)లతో కలిసి ఉంటున్నారు. పిల్లలు స్థానిక పాఠశాలలో చదువుకుంటున్నారు. ఫరీదా బేగం భర్త మెహతాబ్ ఖురేషీ ప్రస్తుతం దుబాయ్‌లో ఉంటున్నాడు. మెహతాబ్ ఖురేషీ, అతని సోదరుడు రహమాన్ ఖురేషీలు దుబాయ్‌లో పనిచేసే సమయంలో ఇరువురు కూడ బెట్టిన డబ్బును ఫరీదా బేగంకు పంపించేవారు.

ఆ డబ్బుతో ఆమె ఎనిమిదేళ్ళ క్రిందట చాంద్రాయణగుట్ట జిఎంకాలనీలో వంద గజాల ఇంటిని కొనుగోలు చేసి తన తల్లి షహజాది బేగం పేర రిజిస్టర్ చేయించింది. మూడేళ్ళ క్రిందట రహమాన్ ఖురేషీ స్వదేశానికి వచ్చాడు. ఖరీదు చేసిన వంద గజాల ఇంటిలో తనకు భాగం ఇవ్వాలని వదిన ఫరీదా బేగంను కోరాడు. అందుకు ఆమె అతని భాగానికి వచ్చే భూమి ఖరీదు చేసిన డబ్బును ఇచ్చింది. అయినప్పటికీ రహమాన్ ఆ ఇంటిని కాజేయలనే దురుద్దేశంతో శుక్రవారం ఉదయం 8.30 గంటల ప్రాంతంలో మహ్మద్ హుస్సేన్ మనవరాళ్ళను ఇద్దరిని పాఠశాలకు పంపించి ఛాయ్ తాగేందుకని సమీపంలోని హోటల్‌కు వెళ్ళాడు.

తిరిగి 8.50 గంటల ప్రాంతంలో ఇంటికి రాగా రహమాన్ ఖురేషీ, మరో వ్యక్తి పరుగు పరుగునా ఇంట్లోంచి బయటకు వెళ్ళటం గమనించాడు. ఇంట్లోకి వెళ్ళి చూడగా అతని భార్య షహజాది బేగం, కూతురు ఫరీదా బేగంల గొంతు కోసి, రక్తపు మడుగులో మరణించిన దృశ్యాలను చూశాడు. కాగా రహమాన్ ఖురేషీ తన వదిన ఫరీదా బేగం, ఆమె తల్లి (అత్తమ్మ) షహజాది బేగంలను గొంతు కోసి హత్యచేసి నేరుగా చాంద్రాయణగుట్ట పోలీసుస్టేషన్‌కు వెళ్ళి లొంగిపోయాడు. విషయం తెలుసుకున్న ఫలక్‌నుమా ఎసిపి మహ్మద్ మజీద్, చాంద్రాయణగుట్ట ఇన్‌స్పెక్టర్ రుద్ర భాస్కర్, ఎస్సై శివతేజ సంఘటనా స్థలానికి చేరుకొని క్లూస్ టీమ్స్ రప్పించి ఆదారాలు సేకరించారు. మృతదేహాలను ఉస్మానియాకు తరలించారు.
బీమా కోసం డ్రామా ..!

బీమా సొమ్ము కోసం సొంత బాబాయిని బొలెరో వాహనంతో తొక్కించి దారుణంగా హత్య చేసి ఆపై రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు చిత్రీకరించిన విషయం పోలీసుల విచారణలో వెలుగుచూసింది. కేవలం బీమా మొత్తాన్ని దక్కించుకునేందుకు సొంత బాబాయిని చంపేశామని ముగ్గురు నిందితులు ఒప్పుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. పోలీసుల వివరాల ప్రకారం సూర్యాపేట జిల్లా మునగాల మండల పరిధిలోని తాడువాయి గ్రామానికి చెందిన ముంజల సైదులు (30) గత నెల 24న ఆర్థరాత్రి మండల పరిధిలోని ఇందిరా నగర్ స్టేజీ సమీపంలోని 65 నంబర్ జాతీయ రహదారి వెంట ఉన్న వాహనాల పార్కింగ్ రోడ్డుపై వరుసకు కుమారుడైన ముంజల రమేష్ మరో ఇద్దరు స్నేహితులు గంధం మహేష్, మాతంగి శోభన్‌బాబు కలిసి తమకున్న బొలెరో వాహనంతో తొక్కించి చంపి రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వాహనం ఢీకొన్నట్లుగా చిత్రీకరించారు. ఈక్రమంలో బాబాయి సైదులు మృతిపై ముంజల వెంకటేశ్వర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మృతుడుకి తల్లిదండ్రులు, భార్య లేకపోవడంతో జులాయిగా తిరుగుతూ తాగుడికి బానిసయ్యాడు. మృతుని అన్న కొడుకైన ముంజల రమేష్ లారి డ్రైవర్‌గా జీవనం సాగిస్తూ ఫైనాన్స్ ద్వారా నాలుగు లారీలను విక్రయించారు. నెలలు గడవక ముందే ఫైనాన్స్ చెల్లించక పోవడంతో లారీలను ఫైనాన్స్ వారు సీజ్ చేశారు. అనంతరం తన బాబాయి పేరు మీద మరో రెండు లారీలను విక్రయించారు. మూడు నెలల వ్యవధిలోనే ఈ లారీలను కూడా పైనాన్స్ వారు తీసుకెళ్ళారు. దీంతో అప్పుల పాలైన రమేష్ అప్పులు తీరాలంటే తన బాబాయి పేరు మీద 50లక్షల ఇన్సూరెన్స్ చేయాలని నిర్ణయించుకున్నాడు.

ఈ నేపథ్యంలో గత ఏడాది జూలై నెలలో రూ.12,575 బీమా మొత్తాలు చెల్లించాడు. కాగా నామినీగా రమేష్ తల్లి సావిత్రమ్మను పెట్టారు. రమేష్ పథకం ప్రకారమే తమ బాబాయిని చంపాలని నిర్ణయించున్నప్పటికీ తనకు ధైర్యం చాలకపోవడంతో స్నేహితులైన గంధం మహేష్, మాతంగి శోభన్‌బాబులు సహాయం తీసుకున్నాడు. ఇందుకుగాను ఒక్కొరికి రూ. 5లక్షలు ఇస్తానని ఒప్పందం కుదుర్చుకున్నాడు. అనుకున్నట్లుగానే బాబాయిని హతమార్చారు. కాగా పోలీసుల దర్యాప్తులో నిందితులు బీమా కోసం డ్రామా ఆడినట్లు వెలుగుచూసింది.

Killing for assets