Home తాజా వార్తలు యువతి గొంతుకోసి చంపాడు

యువతి గొంతుకోసి చంపాడు

 

Killing the throat with a knife

ఇద్దరికీ 2011 నుంచి పరిచయం
బికాం పూర్తిచేసి బ్యాంకు ఉద్యోగం కోసం
కోచింగ్ తీసుకుంటున్న శిరీష
జాబ్ వేటలో ఉన్న సాయిప్రసాద్
గురువారం ఉదయం యువతిని ప్రగతి
రిసార్ట్‌కు తీసుకువెళ్లి కాటేజీ నెంబర్ 11ను
బుక్ చేసిన నిందితుడు
పెళ్లికి నో అనడంతో బాత్‌రూమ్‌లో గొంతు
కోసి పొట్టలో పొడిచి చంపిన ఘాతుకం

మన తెలంగాణ / చేవెళ్ళ / శంకర్‌పల్లి : యువతిని రిసార్ట్‌కు తీసుకెళ్లిన ఓ యువకు డు పెళ్లికి అంగీకరించకపోవడంతో కత్తితో గొంతు కోసి చంపిన దారుణ ఘటన రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం శంకర్‌పల్లిలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. నిందితుడు యువతిని నమ్మించి హైదరాబాద్ నగ ర శివారులోని ప్రగతి రిసార్ట్‌కు తీసుకువెళ్ళి తన వెంట తెచ్చుకున్న కత్తితో గొంతు కోసి, కడుపులో పొడిచి దారుణంగా హత్య చేసి అక్కడి నుంచి పారిపోయాడు. చివరకు పోలీసులకు చిక్కి కటాకటాలపాలయ్యాడు. శంకర్‌పల్లి మండల పరిధిలోని ప్రగతి రిసార్ట్‌లో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి శంషాబాద్ డిసిపి పద్మజ తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా కొత్తూర్ మండలం కుమ్మరిగూడ గ్రామానికి చెందిన పీర్లగూడెం శిరీష(21) డిగ్రీ(బీకాం) పూర్తి చేసింది. నగరంలోని దిల్‌సుఖ్‌నగర్ ప్రాంతంలోని టైమ్స్ ఇనిస్టిట్యూట్‌లో బ్యాంక్ ఉద్యోగాల పరీక్షల కోసం ప్రైవేట్‌గా కోచింగ్ పొందుతున్నది. అదే విధంగా రంగారెడ్డి జిల్లా కొత్తూర్ మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన రొయ్యల సాయిప్రసాద్ కొత్తూరులోని ఎన్‌టిడిఎఫ్ కళాశాలలో డిప్లోమా పూర్తి చేసి జాబ్ కోసం వెతుకుతున్నాడు. కాగా వీరద్దరికి 2011 నుంచి పరిచయం ఏర్పడింది. ఇద్దరి మధ్యలో పరిచయం ఉండడంతో శిరీష తనను ప్రేమించాలని, పెళ్లి చేసుకోవాలని వేధించి వెంటపడేవాడని, శిరీష పెళ్లికి ఒప్పుకోకపోవడంతో శిరీషను చంపాలని నిర్ణయించుకుని హత్య చేసినట్లు నిందితుడు వెల్లడించినట్లు డిసిపి వివరించారు.
హత్య జరిగిందిలా ! నిందితుడు రొయ్యల సాయిప్రసాద్ తన పథకం ప్రకారం ఈ నెల 10వ తేది ఉదయం శిరీషను శంషాబాద్‌కు పిలిపించాడు. అక్కడి నుంచి ఆన్‌లైన్‌లో శంకర్‌పల్లి మండల పరిధిలోని ప్రగతి రిసార్ట్‌లో కాటేజ్ నంబర్.11 రూమ్‌ను బుక్ చేశాడు. ఇరువురు శంషాబాద్ నుంచి ప్రగతి రిసార్ట్‌కు చేరుకున్నారు. రెండు గంటల పాటు బాగానే మాట్లాడుకున్నారని, ఆతర్వాత పెళ్లి చేసుకోవాలని శిరీషపై ఒత్తిడి చేయడంతో ఆమె నిరాకరించడంతో కోపం పెంచుకున్న నిందితుడు సాయిప్రసాద్ తన వెంట తెచ్చుకున్న కత్తితో శిరీషను బాత్‌రూంలోకి తీసుకెళ్లి గొంతు కోసి, కడుపులో విచక్షణరహితంగా పొడిచాడు. దీంతో శిరీష అక్కడికక్కడే మృతిచెందింది. హత్య చేసిన నిందితుడు ఏమి తెలియనట్టుగా మెల్లగా ప్రగతి రిసార్ట్ నుంచి జారుకున్నాడు. ప్రగతి రిసార్ట్ సిబ్బంది రాత్రి 8 గంటల సమయంలో కాటేజ్ నంబర్.11 రూమ్‌ను పరిశీలించి చూడగా అందులో శిరీష రక్తపు మడుగులో పడి ఉండడాన్ని గమనించి రిసార్ట్ ఇంచార్జి హరిబాబు వెంటనే శంకర్‌పల్లి పోలీసులకు సమాచారం అందించారు. శంకర్‌పల్లి సిఐ శశాంక్‌రెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించి మృతురాలి శిరీషకు సంబంధించి సెల్‌ఫోన్‌లో ఉన్న సమాచారంతో కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతురాలి తండ్రి పీర్లగూడెం ఈశ్వర్ అక్కడికి చేరుకుని సాయంత్రం నుంచి ఫోన్ చేస్తున్నా లిప్ట్ చేయడంలేదని పోలీసులకు చెప్పాడు.
నిందితుని అరెస్ట్, రిమాండ్ హత్య జరిగిన సంఘటన ఆధారంగా క్లూస్ టీం సిబ్బంది సేకరించిన పలు ఆధారాలతో చేవెళ్ల ఏసిపి డి. స్వామి ఆధ్వర్యంలో మూడు బృందాలు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులు సేకరించిన వాటిలో సిసి టీవి ఫుటేజి ద్వారా మృతురాలు శిరీషతో పాటు వచ్చిన నిందితుడు రొయ్యల సాయి ప్రసాద్ అని పోలీసులు నిర్థారించుకున్నారు. పోలీసులు గాలింపు చర్యలు చేస్తుండగా చిల్కూరు బాలాజి టెంపుల్ గేటు వద్ద సంచరిస్తుండగా అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు నిందితుడిని విచారించగా తానే హత్య చేసినట్లు అంగీకరించాడు. శుక్రవారం అతన్ని రిమాండ్‌కు తరలించినట్లు డిసిపి పద్మజ చెప్పారు. మృతురాలి తండ్రి ఈశ్వర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.