Saturday, April 1, 2023

రైతుల పోటీ పార్లమెంట్

- Advertisement -
- Advertisement -

Kisan Parliament meeting at Jantar Mantar

 

పార్లమెంట్ భవనంలో వర్షాకాలపు సమావేశాలు జరుగుతున్నాయి. జులై 22 నుండి మొదలైన ఈ సమవేశాలు ఆగస్టు 13 దాకా కొనసాగుతాయి. మరో విశేషమేమిటంటే దేశ రాజధాని నగరంలో మరో పార్లమెంట్ కూడా మొదలైంది. దాని పేరు కిసాన్ సంసద్. డిల్లీలో గత ఏడాది నవంబర్ 26 నుండి కొత్త వ్యవసాయ చట్టాల రద్దు కోసం ఆందోళన చేపట్టిన రైతులు ఈ సమాంతర పార్లమెంట్ ను నడుపుతున్నారు. నిజ పార్లమెంట్ భవనానికి కొద్ది దూరంలో జంతర్ మంతర్ వద్ద కిసాన్ సంసద్ సమావేశాలు సాగుతున్నాయి. డిల్లీ లెఫ్టనెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ కొన్ని నిబంధనలతో వీటిని ఆగస్టు 9 దాకా జరుపుకొనేందుకు అనుమతిని ఇచ్చారు. కేవలం 200 మంది హాజరుకు మాత్రమే అనుమతి ఉన్నందున ముందే పాల్గొనేవారిని ఎంపిక జరిగి కట్టుదిట్టమైన పోలీసు భద్రతల నడమ ఇది సాగుతోంది. ప్రతి రైతు సంఘం నుండి ఐదుగురు చొప్పున నలబై సంఘాల నుండి రెండు వందల సభ్యులను ఎంపిక చేసుకున్నారు. వారంతా తమ గుర్తింపు కార్డులతో యూనియన్ జెండాలని చేబూని సభాస్థలికి బయలుదేరారు. వారంలోని పని దినాల్లో మాత్రమే వీటిని జరుపుకోవాలి.

తొలిరోజు సమావేశాలు పోలీసుల అలసత్వంతో ఆలస్యంగా ఆరంభమయ్యాయి. రైతులు ఆందోళన కొనసాగిస్తున్న ఢిల్లీ సరిహద్దులైన తిక్రి, సింఘూ, ఘాజిపూర్ కేంద్రాల్లోంచి కిసాన్ సంసద్ లో పాల్గొనే రైతులను తిక్రి వద్దకు రప్పించి వారిని నాలుగు బస్సులలో పోలీసు సెక్యూరిటీతో జంతర్ మంతర్ వద్దకు తరలించారు. దాంతో రైతు పార్లమెంట్ పగలు పన్నెండున్నరకు మొదలైంది. అంతే కాకుండా వేదిక చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేసి చివరకు పాత్రికేయులకు కూడా అనుమతిని నిరాకరించారు. ఈ వినూత్న సమావేశాలను వార్తల్లొకి ఎక్కించేందుకు వచ్చిన మీడియాను దూరం ఉంచడంతో రైతులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. చివరకు పాత్రికేయులకు సభాస్థలి వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రెస్ గ్యాలరీలోకి అనుమతి లభించింది. గత ఎనిమిది నెలలుగా సాగుతున్న రైతుల ఆందోళనలో పాల్గొంటూ మరణించినవారికి కిసాన్ సంసద్ తొలుత రెండు నిమిషాల మౌనం పాటించి నివాళిని అర్పించింది. ఒక రోజులో జరిగే మూడు సమావేశాలకు గాను ఆరుగురిని ఎంచుకొని వారిని సభాపతిగా, ఉపసభాపతిగా నియమించుకున్నారు.

భాజపాకి చెందిన లోక్ సభ సభ్యురాలు మీనాక్షి లేఖి ఇటీవల ఒక పాత్రికేయ సమావేశంలో రైతులను కించపరుస్తూ మాట్లాడిన విషయాన్ని చర్చించి సభ దానిని ఏకగ్రీవంగా ఖండించింది. ఢిల్లీలో కొత్త వ్యవసాయ చట్టాల రద్దుకోసం నిరసన చేస్తున్న వాళ్లంతా రైతులు కాదు, వాళ్లు వీధి గూండాలు అన్న ఆమె మాటలను సభ తీవ్రంగా తప్పు పట్టింది. చివరకు విమర్షలతో దిగివచ్చిన ఆమె పత్రికలు తన మాటలను వక్రించి రాసాయన్నా టీవీ కెమెరాల్లో ఆ మాటలు రికార్దయి ఉన్నాయి. శిరోమణి అకాలీదల్ కు చెందిన మాజీ కేంద్ర మంత్రి హర్సిమ్రత్ కౌర్ బాదల్ పార్లమెంట్లో ఢిల్లీలో రైతుల ఆందోళన ప్రస్తావన తెచ్చినప్పుడు అక్కడ మరణించిన వారి సంఖ్య తెలియదని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ అనడం పట్ల సభ్యురాలు తీవ్ర విస్మయాన్ని ప్రకటించారు. ఈ విషయాన్నిఘోర తప్పిదంగా పరిగణించిన కిసాన్ సంసద్ మంత్రి క్షమాపణలకు డిమాండ్ చేసింది .ఈ సందర్భంగా ఆల్ ఇండియా కిసాన్ సంఘ్ ప్రధాన కార్యదర్శి హన్నన్ మొల్లహ్ 600 మంది రైతులు చనిపొయినా, 8 నెలలుగా ఆందోళనలో ఉన్నా ప్రభుత్వం మాత్రం నిర్లక్ష్యంగానే ఉందని సభలో ప్రస్తావించారు. 26వ తేదీన జరిగిన కిసాన్ సంసద్ పూర్తిగా మహిళల నిర్వహణలో జరిగింది.

ఇందులో దేశంలోని వ్యవసాయంలో మహిళల పాత్ర గురించి విశేష చర్చ జరిగింది. ఢిల్లీలో కొనసాగుతున్న రైతుల ఆందోళనలోనూ స్త్రీల పాత్ర, భాగస్వామ్యం గురించి ప్రముఖంగా మాట్లాడడంతో ఆ రోజు సమావేశానికి వన్నె తెచ్చిందనాలి. ఇదే వేదికపై చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ల గురించి కూడా ప్రస్తావన రావడం మరో విశేషంగా భావించాలి. జనాభాలో సగం ఉన్న ఆడవాళ్లు అన్ని రంగాల్లో రాణిస్తున్నప్పుడు పాలనలో వారి భాగస్వామ్యాన్ని ఎందుకు నిరాకరిస్తున్నరని ప్రశ్నించారు. గత 24 ఏళ్లుగా కేవలం చర్చకే పరిమితమైన మహిళా బిల్లును వెంటనే అమోదించాలని సభ ఏకగ్రీవంగా తీర్మానించింది. దేశంలో తొలిసారిగా మహిళలు స్వయంగా ఒకరోజు పార్లమెంట్ ను నిర్వహించడం ఒక అరుదైన సంఘటనగా మిగులుతుంది. మగ వారిలాగే ఇందులో పాల్గొన్న మహిళలు సైతం వివిధ ఆందోళన కేంద్రాల్లోంచి వచ్చారు. ఈ సమావేశాల్ని చూడడానికి చాలా ప్రాంతాలనుండి మహిళలు తరలివచ్చారు.

కిసాన్ సంసద్ సందర్శకులను విశేషంగా ఆకర్షిస్తోంది. స్వరాజ్ ఇండియా అధ్యక్షులు యోగేంద్ర యాదవ్ తో పాటు కొందరు నిజమైన పార్లమెంట్ సభ్యులు ఈ సభలను తిలకించిన వారిలో ఉన్నారు. రైతు పార్లమెంట్ జరిగినన్ని రోజులు కర్నాటక నుండి రోజూ 200 మంది రైతులు హాజరయ్యేలా ఆ ప్రాంత రైతులు నిర్ణయం తీసుకున్నారు. మొదటి రోజు బినాయ్ థామస్ నాయకత్వంలో కేరళ నుండి 13 మంది కన్నూరు రైతులు ఇందులో పాల్గొన్నారు. కిసాన్ సంసద్ చుట్టూ పోలీసుల మొహరింపు చూస్తుంటే ఎమర్జెన్సీ కాలాన్ని, పాకిస్తాన్ సరిహద్దుని తలపిస్తోందని కర్నాటక నుంచి వచ్చిన రైతు మంజు కిరణ్ వాపోయారు. 200 మందిని పంజరంలో వేసినట్లు ఉందని జస్బీర్ కౌర్ అన్నారు. రైతుల పార్లమెంట్ దేశంలోని సామాన్యుల, రైతుల సమస్యలని చర్చిస్తుంటే ప్రజాప్రతినిధులతో నిండిన పార్లమెంట్ కార్పోరేటర్ల లాభాల కోసం ఆలోచిస్తున్నాయని కేరళ నుంచి వచ్చిన కె వి బిజు వ్యాఖ్యానించారు. రైతు పార్లమెంట్ ను ప్రతిరోరజూ జాతీయ గీతాన్ని ఆలపించి సభ ముగిస్తున్నారు.

మరో 15 రోజులు సాగే ఈ రైతుల పార్లమెంట్ లో రోజూ 200 మంది కొత్త సభ్యులు పాల్గొనడం వల్ల ఎన్నో అంశాలు చర్చలోకి వచ్చి ఇది ఒక సుధీర్ఘ, విభిన్న నిరసన కార్యక్రమంగా నిలిచిపోతుందని పత్రికలు పేర్కొంటున్నాయి. సమాంతరంగా కొనసాగుతున్న కిసాన్ సంసద్ లో చర్చించిన అంశాలు, కోరిన డిమాండ్లు,కొత్త వ్యవసాయ చట్టాల రద్దుపై ముక్తకంఠంతో ఎత్తిన గొంతు నుంచి పార్లమెంట్ గోడలు దాటి ప్రభుత్వం చెవిలో పడాలని సందర్శకులు కోరుతున్నారు. జనవరి 26న గణతంత్ర వేడుకల్లో మాదిరి ఎలాంటి అల్లర్లకు తావు లేకుండా కిసాన్ సంసద్ పూర్తి కావాలని ఢిల్లీ పొలీసులు తగిన భద్రతా ఏర్పాట్లలో ఉన్నారు. అధికారిక పార్లమెంట్ గుర్తించేలా రైతు నిర్వహణలోని ఈ సమావేశాలు శాంతియుతంగా ముగిసి సత్ఫలితాలు సాధించాలి.

                                                                                  బి.నర్సన్
                                                                               9440128169

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News