Home తాజా వార్తలు నగరంలో మంత్రి కిషన్‌రెడ్డి జన ఆశీర్వాద యాత్ర

నగరంలో మంత్రి కిషన్‌రెడ్డి జన ఆశీర్వాద యాత్ర

Kishan Reddy jana ashirwad yatra in warangal

 

వరంగల్: ఓరుగల్లు నగరం శుక్రవారం కషాయమయంతో దద్దరిల్లింది. ప్రధాన సెంటర్లలో బిజెపి జెండాలు, బ్యానర్లు, ఫ్లెక్సీలతో ముస్తాబైంది. కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖామంత్రి జి.కిషన్‌రెడ్డి చేపట్టిన జన ఆశీర్వాద యాత్రకు అనూహ్య స్పందన వచ్చింది. శుక్రవారం ఉదయం వరంగల్‌లోని నాయిడుపంపుకు చేరుకున్న మంత్రికి బిజెపి శ్రేణులు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. బిజెపి నేత గంట రవికుమార్ ఆధ్వర్యంలో అండర్‌బ్రిడ్జి వద్ద పెద్ద సంఖ్యలో జనం తరలివచ్చారు. భారీ ర్యాలీ నిర్వహించారు. అడుగడుగున పూలు చల్లుతూ పుష్పాభిషేకం చేశారు.

అంతేకాదు భారీ గజమాలను క్రేన్ సహాయంతో ఓపెన్‌టాప్ జీపుపై ఉన్న మంత్రి కిషన్‌రెడ్డికి వేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. బిజెపికి అనుకూల నినాదాలతో ఓరుగల్లు దద్దరిల్లింది. ప్రతిఒక్కరు పార్టీ జెండాలు చేతబూని మంత్రి వాహనం వెంట సాగారు. పోస్టాఫీసు వద్ద స్థానిక కార్పొరేటర్ చింతాకుల అనిల్, బిజెపి రాష్ట్ర నాయకులు కుసుమ సతీష్‌ల ఆధ్వర్యంలో బోనాలతోఘనంగా స్వాగతం పలికారు. ఈసందర్భంగా సికెఎం హాస్పటల్‌లో కోవిడ్ వాక్యిన్ సెంటర్‌ను మంత్రి కిషన్‌రెడ్డి సందర్శించారు. అనంతరం ప్రతిఒక్కరు కరోనా కట్టడికి వ్యాక్సిన్ వేసుకోవాలని, మాస్క్ ధరించాలని, భౌతిక దూరం పాటించాలన్నారు.

శ్రీభద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న మంత్రి కిషన్‌రెడ్డి
శ్రావణమాసం శుక్రవారం కావడంతో శ్రీభద్రకాళి మాతను మంత్రి కిషన్‌రెడ్డి దర్శించుకున్నారు. ఈసందర్భంగా దేవాలయ అర్చకులు, ఈఒ అధికారులు మంత్రికి పూర్ణ కుంభంతో స్వాగతం పలికి పూజలు నిర్వహించి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేసి శాలువాతో సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి కిషన్‌రెడ్డి వెంట మాజీ ఎంఎల్‌ఎ ధర్మారావు, అర్బన్ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ, విజయచందర్‌రెడ్డి, ఘంటా రవికుమార్, సిద్ధం నరేష్, కార్పొరేటర్లు, పెద్ద ఎత్తున బిజెపి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, అభిమానులు పాల్గొన్నారు.

Kishan Reddy jana ashirwad yatra in warangal