Friday, April 19, 2024

ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తున్నారు.. వారిపై దాడులు చేస్తే ఉపేక్షించం

- Advertisement -
- Advertisement -

 

మన తెలంగాణ/హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో సామాజిక, భౌతిక దూరం పాటించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఫేస్‌బుక్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. కనిపించని శత్రువు కరోనా మహమ్మారితో 130 కోట్ల భారతీయులు, ప్రపంచము పోరాడుతుందన్నారు. ఇందులో అంతిమ విజయం ప్రజలదే అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ విపత్కర సమయంలో ప్రతి ఒక్కరిలో ఆత్మ విశ్వాసం, పట్టుదల, అంకితభావం సేవాభావాలు ఉండాలన్నారు. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్లపై, వైద్య సిబ్బందిపై దాడులు చేయడం, వారిని అవమానించడం బాధాకరమన్నారు. ఈ విషయంలో ఆ రాష్ట్ర డిజిపి, ప్రధాన కార్యదర్శులను, దాడి చేసిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు కిషన్ రెడ్డి తెలిపారు.

ఇటువంటి దాడులు చేయడం సిగ్గుచేటని వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమని ఆయన పేర్కొన్నారు. కుటుంబ సభ్యులను కూడా కలవకుండా పోలీసులు, డాక్టర్లు కరోనాపై పోరాటం చేస్తున్నారని వారందరికీ, దేశ ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. 80 శాతం కేసులు ఢిల్లీ మర్కజ్ సమావేశం వల్లే పెరిగాయని, ఆ సభల్లో పాల్గొన్న వారు మీ కుటుంబాల కోసమైనా బయటకు వచ్చి ప్రభుత్వాలకు సహకరించాలని కోరారు. కోవిడ్19ను దాచుకుంటే దాగే జబ్బు కాదన్నారు. దీనివల్ల కుటుంబ సభ్యులు మనకి దూరం అయ్యే అవకాశం ఉందన్నారు. అదే ప్రభుత్వానికి సహకరిస్తే వారికి మెరుగైన వైద్యం అందుతుందని అన్నారు. కరోనా వైరస్‌కు కుల, మత, ప్రాంత భేదాలు ఉండవన్నారు. పార్టీలు రాజకీయాలు చేసే సమయం ఇది కాదని గుర్తించి, చేతులు కలిపి పోరాటానికి కలిసి రావాలని కోరారు. దేశంలో ఎవరూ ఆకలితో పస్తులు ఉండరాదని కేంద్రం ఒక లక్షా 70 వేల కోట్లతో ప్రతి ఒక్కరినీ ఆదుకుంటుందన్నారు. ప్రజల ప్రాణాలను కాపాడటం ప్రభుత్వ లక్ష్యమన్నారు. దేశంలో ఏ మారుమూల పల్లె నుంచి అయినా కష్టమొస్తే 1930కి ఫోన్ చేయాలని, అదే ఈశాన్య రాష్ట్రాలకు చెందిన వారు అయితే 1944 నెంబర్ కు కాల్ చేసి సేవలు పొందవచ్చని ఆయన తెలిపారు. ఈ సమయంలో సోషల్ మీడియా ద్వారా కొంత మంది అసత్య ప్రచారాలు చేయటం సరికాదని, వారు దీనిని మానుకోవాలని కిషన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

భారీగా విరాళాలు
కిషన్‌రెడ్డి చేసిన అభ్యర్ధనకు పలువురు ప్రముఖులు సానుకూలంగా స్పందించి పిఎం కేర్స్ నిధికి విరాళాలను ప్రకటించారు. వారిలో సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గానికి చెందిన అనిల్ కుమార్ చెలమశెట్టి రూ.5కోట్లు, అపర్ణ కనస్ట్రక్షన్స్ డైరెక్టర్ సివి రెడ్డి రూ.2 కోట్లు, చైతన్య గ్రూప్ విద్యా సంస్థల చైర్మన్ బిఎస్.రావు రూ.1.50 కోట్లు అందజేశారు.

Kishan Reddy Serious over Doctors Pelted with stones

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News