Home IPL 2019 ఆత్మవిశ్వాసంతో కోల్‌కతా

ఆత్మవిశ్వాసంతో కోల్‌కతా

KKRనేడు పంజాబ్‌తో సమరం

కోల్‌కతా: తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ఘన విజయం సాధించిన కోల్‌కతా నైట్‌రైడర్స్ బుధవారం కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగే మ్యాచ్‌కు ఆత్మవిశ్వాసంతో సిద్ధమైంది. మరోవైపు మన్కడింగ్ వివాదం నేపథ్యంలో పంజాబ్ జట్టు ఆత్మరక్షణలో పడింది. తొలి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై గెలిచినా ఆనందంగా కనిపించడం లేదు. కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్ వివాదంలో చిక్కుకోవడమే దీనికి ప్రధాన కారణంగా చెప్పొచ్చు. మరోవైపు కోల్‌కతా మాత్రం ఆరంభ మ్యాచ్‌లో భారీ లక్ష్యాన్ని సయితం అలవోకగా ఛేదించి జోరుమీదుంది. పంజాబ్‌తో జరిగే మ్యాచ్‌లో కూడా విజయమే లక్షంగా పెట్టుకుంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ఆటగాళ్లకు జట్టులో కొదవలేదు. తొలి మ్యాచ్‌లో నితీష్ రాణా, ఆండ్రి రసెల్ చిరస్మరణీయ బ్యాటింగ్‌తో కోల్‌కతా అద్భుత విజయాన్ని సాధించి పెట్టారు. సన్‌రైజర్స్‌పై రసెల్ ఆకాశమే హద్దుగా చెలరేగి పోయాడు. ఓటమి లాంఛనమే అనుకుంటున్న సమయంలో రసెల్ ఆడిన విధ్వంసక ఇన్నింగ్స్‌తో కోల్‌కతా సంచలన విజయాన్ని అందుకుంది. ఏమాత్రం ఆశలు లేని స్థితిలో మ్యాచ్‌ను సొంతం చేసుకోవడంతో కోల్‌కతా ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యిందని చెప్పాలి.

ఇక, పంజాబ్‌తో జరిగే మ్యాచ్‌లో కూడా గెలుపే లక్షంగా పెట్టుకుంది. తొలి మ్యాచ్‌లో కెప్టెన్ దినేశ్ కార్తీక్ విఫలమయ్యాడు. అయితే, ఈ మ్యాచ్‌లో సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు. క్రిస్‌లీన్, సునీల్ నరైన్, రాబిన్ ఉతప్ప, నితీష్ రాణా తదితరులతో కోల్‌కతా బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. ఇక, తొలి మ్యాచ్‌లో విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన రసెల్ ఈసారి కూడా జట్టుకు కీలకంగా మారాడు. కిందటి మ్యాచ్‌లో ఒక దశలో కోల్‌కతా చివరి మూడు ఓవర్లలో 53 పరుగులు అవసరమయ్యాయి. దీంతో మ్యాచ్ సన్‌రైజర్స్‌దేనని అందరు ఓ అంచనాకు వచ్చేశారు. ఈ సమయంలో రసెల్ కళ్లు చెదిరే బ్యాటింగ్‌తో జట్టుకు చిరస్మరణీయ విజయం అందించాడు. ఆకాశమే హద్దుగా చెలరేగిన రసెల్ 19 బంతుల్లోనే 4 ఫోర్లు, మరో నాలుగు భారీ సిక్సర్లతో అజేయంగా 49 పరుగులు చేశాడు. దీంతో కోల్‌కతాకు అద్భుత విజయం లభించింది. బ్యాట్‌తో బంతితో సత్తా చాటిన రసెల్ ఈసారి కూడా అదే జోరును కొనసాగించాలనే పట్టుదలతో ఉన్నాడు. అదే జరిగితే కోల్‌కతాకు పంజాబ్‌పై విజయం కష్టమేమి కాదు.

గేల్‌పైనే ఆశలు
మరోవైపు పంజాబ్ ఈ మ్యాచ్‌లో స్టార్ ఆటగాడు క్రిస్‌గేల్‌పై భారీ ఆశలు పెట్టుకుంది. రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో గేల్ విధ్వంసక ఇన్నింగ్స్ ఆడాడు. తొలి మ్యాచ్‌లోనే సత్తా చాటిన గేల్ ఈసారి కూడా అదే జోరును కొనసాగించాలని తహతహలాడుతున్నాడు. అయితే మరో ఓపెనర్ లోకేశ్ రాహుల్ మొదటి మ్యాచ్‌లో నిరాశ పరిచాడు. రాహుల్ 4 పరుగులకే వెనుదిరిగిన విషయం తెలిసిందే. కానీ, ఈ మ్యాచ్‌లో రాహుల్ చెలరేగడం ఖాయమని జట్టు యాజమాన్యం భావిస్తోంది. గేల్ మరోసారి జట్టు బ్యాటింగ్ బాధ్యతలను తనపై వేసుకోనున్నాడు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేయగలిగే సత్తా కలిగిన గేల్ చెలరేగితే పంజాబ్‌కు భారీ స్కోరు కష్టమేమి కాదు. సర్ఫరాజ్ ఖాన్, మయాంక్ అగర్వాల్, శామ్ కరణ్, పురాన్, అశ్విన్‌లతో పంజాబ్ బ్యాటింగ్ బలంగానే ఉంది. కాగా, తొలి మ్యాచ్‌లో మన్కడింగ్ వివాదంలో చిక్కుకోవడంతో పంజాబ్ ఆత్మరక్షణలో పడింది. ఈ మ్యాచ్‌లో జట్టు ఆట తీరు ఎలా ఉంటుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. కెప్టెన్ అశ్విన్ ఈ వివాదంలో ఇరుక్కోవడంతో జట్టుపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. అయితే పంజాబ్ మాత్రం ఈ మ్యాచ్‌లోనూ గెలిచి విమర్శకులకు గట్టి సమాధానం చెప్పాలనే పట్టుదలతో ఉంది. ఇటు కోల్‌కతా, అటు పంజాబ్‌లు విజయమే లక్షంగా పెట్టుకోవడంతో పోరు నువ్వానేనా అన్నట్టు సాగడం ఖాయమని చెప్పాలి.

KKR vs KXIP: 6th Match Indian Premier League at Kolkata