Home నల్లగొండ గడపగడపకు అంగన్‌వాడీ

గడపగడపకు అంగన్‌వాడీ

Knowledge of 22 topics for better health

తల్లీపిల్లల సంరక్షణ కోసం ’ఇంటింటికీ’ టీచర్‌లు
మెరుగైన ఆరోగ్యం కోసం 22అంశాలపై అవగాహన
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 4166 కేంద్రాల్లో అమలు
గర్బిణీ, పిల్లలకు అందుతున్న సంరక్షణ సలహాలు

మన తెలంగాణ/నల్లగొండ : ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రోజుకో రీతిలో ప్రజోపయోగకర పథకాలు ప్రవేశపెడుతూ ప్రశంసలు పొందుతోంది. అన్ని వర్గాలకు క్షేత్ర స్థాయిలో ఉపయోగకర పనులను ప్రభుత్వమే చేపడుతూ తాజాగా మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. ఇంత కాలం గర్బిణీస్త్రీలు, బాలింతలు, చిన్నారులకు కేసీఆర్ కి ట్టు లాంటి ప్రతిష్టాత్మక కార్యక్రమాలు చేపడుతూనే తాజా గా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆద్వర్యంలో ‘ఇంటింటికీ అంగన్‌వాడీ’ కార్యక్రమాన్ని చేపట్టింది. గర్బిణీస్త్రీలు, బా లింతలు, చిన్నారుల ఆరోగ్య సంరక్షణ విషయంలో సమాచారం సేకరించేందుకు గాను అంగన్‌వాడీ సేవలను వినియోగించుకోవాలని ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నల్ల గొండలో 2093, సూర్యాపేటలో 1209, యాదాధ్రి భువ నగిరిలో 864 అంగన్‌వాడీ కేంద్రాలు మొత్తం 4166 అంగ న్‌వాడీ కేంద్రాలు ఉండగా 43ఖాళీలు ఉండగా ప్రస్తుతం 4123మంది అంగన్‌వాడీ టీచర్‌లు తమ సెంట ర్‌ల పరిధిలోని గడగడపకు వెళ్తున్నారు. తల్లులు, గర్బిణీ లు, బాలింతలు, పిల్లలు ఉన్న గృహాలను సందర్శించి వారి ఆరోగ్య వివరాలను సేకరించడంతో పాటు మెరుగైన ఆరోగ్యంకు సంబందించిన జాగ్రత్త చర్యలకు తగు సలహాలు, సూచనలు అందివ్వనున్నారు. ఇందుకోసం మహిళాభివృద్ది, శిశు సంక్షేమ శాఖ ఆద్వర్యంలో ‘గృహ సందర్శన’ పేరిట ప్రత్యేకంగా ముద్రించిన కౌన్సిలింగ్ పుస్తకాలను అంగన్‌వాడీ కేంద్రాల వారిగా పంపిణీ చేశారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 4166 అంగన్‌వాడీ కేంద్రాల పరి ధిలోని ఇప్పటికే ఇంటింటికి అంగన్‌వాడీ కార్యక్రమంలో భాగంగా గృహాలను సందర్శించి వివరాలు సేకరిస్తూ తగు సూచనలు చేస్తున్నారు.
సరికొత్త విధానంతో..మహిళాభివృద్ది, శిశు సంక్షేమ శాఖ ఆద్వర్యంలో గతంలో కూడా గృహ సందర్శన విధానం ఉన్నా స్పష్టమైన ఆధారాలం టూ ఏమీ ఉండేవి కావు. తాజాగా సరికొత్త విధానంతో భాగంగా అంగన్‌వాడీ టీచర్‌లు గడపగడపకూ వెళ్ళి నిర్వహించే గృహ సందర్శన కార్యక్రమాన్ని పారదర్శకంగా నిర్వహించాలన్న ఉద్దేశ్యంతో ప్రభుత్వం ప్రత్యేకంగా పుస్తకాలు ముద్రించి అంగన్‌వాడీ కేంద్రాలకు అందజేసింది. దీంతో పగడ్బందీగా రూపొందించిన ఈ విధానం ద్వారా టీచర్‌లు ఈ పాటికే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో గృహాలను సందర్శిస్తూ వివరాలు సేకరించడంతో పాటు సూచనలు అందజేస్తున్నారు.
సరికొత్త విధానంతో పుస్తకాలుః ప్రభుత్వం ఆరోగ్య సంరక్షణకు సంబందించి వివరాలతో సరికొత్తగా రూపొందించిన గృహ సందర్శన కౌన్సిలింగ్ పుస్తకాల్లో ఒక్కో పుస్తకంలో 300పేజీలు ఉంటుండగా అందులోని అంశాలను సమగ్రంగా అధ్యయనం చేయడం ద్వారా సమాచారాన్ని అర్ధం చేసుకొని లబ్దిదారులకు కౌన్సిలింగ్ ద్వారా అవగాహనపర్చాల్సి ఉంటుంది. ప్రతి అంగన్‌వాడీ టీచర్ సాయంత్రం 4గంటల నుంచి 5గంటల వరకు కనీసం ఒక్క ఇంటినైనా సందర్శించి కౌన్సిలింగ్ నిర్వహించాలన్న ఖచ్చితమైన నిబందనలు విధించారు. మొత్తం 22అంశాలతో రూపొందించన పుస్తకంలో ఒక్కో అంశంపై సమగ్ర సమాచారం పొందుపర్చి ఉంది. టీచర్‌లు వీటన్నింటినీ క్షుణ్ణంగా చదవి అర్ధం చేసుకోవడం ద్వారా లబ్దిదారులకు వివరిస్తారు. ఇందులో పలు ఆరోగ్య సంరక్షణ చర్యలకు సంబందించి సమగ్రమైన వివరాలు ఉన్నాయి. గర్బిణీలు, బాలింతలు, పిల్లలకు సంబందించి నెలవారి ఆరోగ్య సూచనలు, తల్లిపాలు, శిశువు పెరుగుదలకు పోషకాహారం, తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలు లభించే వంటకాలు, పిల్లలు తొలిదశ మెదడుపై ప్రభావం, పిల్లల అభివృద్ది మైలురాళ్ళు, చిన్నపిల్లలు-ఆటవస్తువులు, పిల్లల్లో విటమిన్-ఏ లోపం నివారణ, పిల్లల్లో, తల్లుల్లో రక్తహీనత, ఐరన్‌లోపం,నీళ్ళ విరోచనాలు, నిమోనియా తదితర 22అంశాలకు సంబందించిన సమగ్రసమాచారాన్ని కౌన్సిలింగ్ పుస్తకాల్లో పొందుపర్చారు.
కౌన్సిలింగ్‌పై టీచర్‌లకు శిక్షణః ప్రత్యేక కౌన్సిలింగ్ పుస్తకాల్లో పొందుపర్చిన తల్లులు, బాలింతలు, గర్బిణీలు, పిల్లలకు సంబందించి 22అంశాల సంరక్షణ చర్యలకు సంబందించి శిక్షణ ఇచ్చారు. వారికి సంబందించిన వివరాలు ఎలా నమోదు చేయాలి, గృహ సందర్శనలో స్నేహపూర్వక వాతావరణం నెలకొల్పడంలో తీసుకోవాల్సి జాగ్రత్తలు తదితర విషయాలపై టీచర్‌లకు ఇప్పటికే సంబందిత సీడీపీఓలు, సూపర్‌వైజర్‌లు శిక్షణ పూర్తి చేయడం జరిగింది. గృహ సందర్శనలో సదరు మహిళ కౌన్సిలింగ్‌కు సహకరించకపోయినా, వివరాలు అందజేయడంలో విముఖత చూపినా వారిని కౌన్సిలింగ్‌కు ఎలా ఒప్పించాలో శిక్షణలో వివరించారు. గర్బిణీలు, బాలింతలు, పిల్లలను కౌన్సిలింగ్ చేసేందుకు అవసరమైన కేటగిరీల వారి సమాచారాన్ని పుస్తకాల్లో రూపొందించారు. సదరు పుస్తకాల్లో ఎడమ వైపు అంగన్‌వాడీ పేజీ, కుడివైపు గర్బిణీ, బాలింత, పిల్లల సమాచారంకు సంబందించిన పేజీ ఉంటుంది. గృహ సందర్శన చేసిన ప్రతిసారి ఒక పేజీ టీచర్ వద్ద ఉంచుకొని కౌన్సిలింగ్ ఇచ్చిన విషయాల ప్రింటెడ్ పేజీని లబ్దిదారులకు అందజేస్తారు. సందర్శన సమయంలో టీచర్ సంతకం, తేదీతో పాటు లబ్దిదారుల సంతకం విధిగా ఉండడం వల్ల సందర్శన పారదర్శకంగా కొనసాగుతుందని అధికారులు భావిస్తున్నారు.