Home ఆంధ్రప్రదేశ్ వార్తలు కోడెల ఆత్మహత్య

కోడెల ఆత్మహత్య

kodela-siva-prasad

సోమవారం ఉ.10గం. తర్వాత హైదరాబాద్‌లోని స్వగృహంలో ఫ్యాన్‌కు ఉరివేసుకున్న ఎపి అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు

ఉ.10.55గం.కు బసవతారకం కాన్సర్ ఆసుపత్రిలో చేర్చిన వ్యక్తిగత సహాయకులు, కుటుంబసభ్యులు
ప్రాథమిక చికిత్స చేసి ఆయన మరణించినట్లు ధ్రువీకరించిన వైద్యులు n ఆత్మహత్యగా నిర్ధారించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు ..కోడెల మృతిపట్ల సిఎం కెసిఆర్ దిగ్భ్రాంతి, మంత్రి కెటిఆర్ సంతాపం

మన తెలంగాణ/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ స్పీకర్, టిడిపి నేత డాక్టర్ కోడెల శివప్రసాదరావు సోమవారం ఉదయం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై వెస్ట్‌జోన్ పోలీసులు అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన కోడెల ఆత్మహత్యను దర్యాప్తు చేపట్టేందుకు టాస్క్‌ఫోర్స్, క్లూస్ టీం, డాగ్‌స్వాడ్ బృందాలు రంగంలోకి దిగాయి. కోడెల ఆత్మహత్యకు పాల్పడడం వెనుక ఉన్న బలమైన కారణాలను వెలికితీసే దిశగా దర్యాప్తు సాగుతోంది. కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య పాల్పడే ముందు వరకు ఏం జరిగిందన్న విషయాలపై ఆయన వ్యక్తిగత సహాయకులను పోలీసులు ప్రశ్నించారు. వివరాల్లోకి వెళితే. ఎపి మాజీ స్పీకర్ కోడెల తన భార్య శశికళతో కలిసి ఉదయం 10 గంటలకు టిఫిన్ చేశారు. అనంతరం మొదటి అంతస్థులో ఉన్న తన బెడ్‌రూమ్‌కు వెళ్లారు. కొద్ది సేపటి తర్వాత ఆయన భార్య శశికళ బెడ్ రూమ్‌కు వెళ్లగా లాక్ చేసి ఉండటంతో తలుపులు తెరవాలంటూ ఆమె కేకలే వేసినప్పటికీ గదిలో నుంచి సమాధానం రా లేదు. దీంతో ఆమె వెంటనే గన్‌మెన్‌ను పిలిచి విషయం చెప్పడంతో వెంటనే గన్‌మెన్ వెనుక డోరు బద్దలు కొట్టి లోపలికి వెళ్లగా కోడెల ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించారు.

కోడెల ఆత్మహత్యకు పాల్పడ్డాడన్న విషయం తెలుసుకున్న వెంటనే గన్‌మెన్, వ్యక్తిగత సహాయకుల సహాయంతో కారులో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి 10.55 గంటలకు తరలించారు. ఈక్రమంలో అపస్మారక స్థితిలో ఉన్న కోడెల ప్రాధమిక చికిత్స అందించిన వైద్యలు 11:50 గంటలకు కోడెల మరణించినట్లు వైద్యు లు ధ్రువీకరించారు. కోడెల మరణించిన విషయాన్ని ఆసుపత్రి సిబ్బంది వెంటనే బంజారాహిల్స్ సిఐ కళింగరావు, ఎస్‌ఐ రామిరెడ్డిలకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే బసవతార కం ఆసుపత్రికి చేరుకున్నారు. తన బెడ్ రూంలో తా డు తో ప్యానుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోవడం వల్లే కో డెల మరణించినట్లు తొలుత పోలీసులు నిర్ధారణకు వ చ్చారు. అనంతరం పోలీసు అధికారులు కోడెల ఇంటికి వెళ్లి ఆయన ఆత్మహత్య చేసుకున్న గదిని క్షుణ్ణంగా పరిశీలించారు. గదిలో ఎలాంటి సూసైడ్ నోట్ దొరకలేదని పోలీసులు వివరిస్తున్నారు. అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులుడాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్, టాస్క్ ఫోర్స్‌ను రంగంలోకి దించి విచారణ చేపట్టారు.
ఆత్మహత్యే.. పోస్టుమార్టం రిపోర్టు
కోడెల మృతదేహానికి ఉస్మానియా ఆస్పత్రి మార్చురీలో రెండు గంటల పాటు పోస్టుమార్టం నిర్వహించారు. ఆయన ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆధారాలు లభ్యమయ్యాయని పోలీసులు పేర్కొన్నారు. శివప్రసాద్ మెడ భాగంలో తాడు బిగించుకున్న ఆనవాళ్లు ఉన్నట్లు నివేదికలో ఉందన్నారు. అయితే మెడ భాగంలో 8 అంగుళాల మేర తాడు ఆనవాళ్లు గుర్తించారు. మొత్తానికి కోడెల ఆత్మహత్య చేసుకున్నట్లు ఉస్మానియా వైద్యులు ప్రాథమిక నివేదికను పోలీసులకు అందించారు. కోడెల మృతదేహానికి ఉస్మానియా ఆస్పత్రిలో సోమవారం సాయంత్రం 6.10 గంటలకు పోస్ట్‌మార్టం పూర్తియింది. ఇద్దరు ప్రొఫెసర్లు, ఓ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్ట్‌మార్టం నిర్వహించగా, ఈ ప్రక్రియను పోలీసులు వీడియో రికార్డు చేశారు. అలాగే కోడెల మృతదేహాన్ని ఫోరెన్సిక్ బృందం పరిశీలించగా, ఆయన చెవుల దగ్గర నుంచి గొంతు మీదగా ఉరి వేసుకున్నట్లు గుర్తులు ఉన్నట్లు వెల్లడించారు.
ఎన్‌టిఆర్ భవన్‌కు కోడెల భౌతికకాయం
ఉస్మానియాలో పోస్ట్‌మార్టం అనంతరం భౌతికకాయాన్ని పార్టీ నేతలు, కార్యకర్తల సందర్శనార్థం నేరుగా ఎన్‌టిఆర్ ట్రస్ట్ భవన్‌కు తరలించారు. పెద్ద ఎత్తున టిడిపి నేతలు ట్రస్ట్ భవన్ చేరుకుని, కోడెలకు నివాళులు అర్పించారు. టస్ట్‌భవన్‌కు వచ్చిన నందమూరి బాలకృష్ణ, కేఈ కృష్ణమూర్తి,దేవినేని, ఫారూక్ వంటి నాయకులు కోడెల భౌతిక కాయానికి నివాళులర్పించారు. సోమవారం 9.30గంటలకు టిడిపి అధినేత చంద్రబాబునాయుడు ట్రస్ట్‌భవన్‌కు చేరుకుని నివాళలర్పించారు. ఈక్రమంలో సోమవారం రాత్రి అక్కడే ఉంచి, మంగళవారం ఉదయం 6గంటలకు హైదరాబాద్‌లో కోడెల పార్దీవదేహంతో టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, తనయుడు లోకష్ రోడ్డు మార్గంలో గుంటూరు బయల్దేరనున్నారు. సూర్యాపేట, విజయవాడ మీదగా మంగళవారం మధ్యా హ్నం గుంటూరులోని టిడిపి పార్టీ కార్యాలయంలో సందర్శకుల కోసం కొద్దిసేపు ఉంచి, అనంతరం నర్సరావుపేట తరలించనున్నారు. ఈక్రమంలో బుధవారం నాడు ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
రెండు సార్లు ఆత్మహత్యా యత్నాలు
కోడెల రెండు వారాల కిందటే ఆత్మహత్యాయత్నం చేసినట్టు తెలుస్తోంది. ఒకసారి నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసినట్టు సమాచారం. మరోసారి విషపూరిత ఇంజక్షన్ వేసుకుని ఆత్మహత్యకు యత్నించడంతో సకాలంలో కుటుంబసభ్యులు గుర్తించడంతో అప్పట్లో ముప్పు తప్పిందన్నది సమాచారం.ఈ క్రమంలో సోమవారం ఉదయం కోడెల గదిలోకి వెళ్లిన తీరును గమనించిన ఆయన భార్య శశికళ వెంటనే గది తలుపులు తీయాలని కోరింది. అప్పటికే బట్టలు ఆరేసే తాడుతో.. బెడ్ రూమ్‌లో ఉరేసుకున్నారు.మానసికంగా డీలాపడిన ఆయన తీవ్ర మానసిక వేదనతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుని ఉంటారని పలువురు పేర్కొంటున్నారు.
కోడెల కుమారుడిపై ఫిర్యాదు
కోడెల మరణంపై ఆయన సమీప బంధువు(అల్లుడు) కంచేటి సాయి కోడెల కుమారుడు శివరామే ఆస్తికోసం ఈ హత్య చేశాడని ఆరోపిస్తూ సత్తెనపల్లి పోలీస్ స్టేషన్‌లో సోమవారం నాడు ఫిర్యాదు చేశారు. శివారామ్ తనను శారీరకంగా, మానసికంగా చాలాకాలం నుంచి తీవ్ర వేధింపులకు గురిచేస్తున్నారని శివప్రసాద్ తనతో అనేకసార్లు చెప్పినట్లు సాయి మీడియాకు తెలిపారు.
మూడు బృందాలతో దర్యాప్తు: సిపి
కోడెల మృతిపై హైదరాబాద్ సిపి అంజనీకుమార్ మాట్లాడుతూ.. ‘అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశాం. మూడు బృందాలతో దర్యాప్తు జరుపుతున్నాం. బంజారాహిల్స్ ఎసిపి ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతోంది. పోస్ట్‌మార్టం రిపోర్టు తర్వాత శివప్రసాదరావు మృతిపై క్లారిటీ వస్తుంది. అలాగే కోడెల నివాసంలో ఆధారాల సేకరణ నిమిత్తం అక్కడకు చేరుకుని క్లూస్ టీమ్, టెక్నికల్ టీమ్‌లు దర్యాప్తు చేస్తున్నాయి. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. వైద్యుల నివేదిక అనంతరం మృతిపై వివరాలు వెల్లడిస్తామని సిపి పేర్కొన్నారు.
ప్రత్యేకంగా సిట్ ఏర్పాటు
కోడెల అనుమానాస్పద మృతిపై బంజారాహిల్స్ ఎసిపి ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటు అయింది. సిట్ బృందం కోడెల నివాసంలో తనిఖీలు నిర్వహించి, ప్రత్యక్ష సాక్షులు, సెక్యూరిటీ, డ్రైవర్‌ను ప్రశ్నించారు. క్లూస్ టీమ్ కూడా పలు ఆధారాలను సేకరించింది. కోడెల శివప్రసాదరావు మృతిపై 174 సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు వెస్ట్ జోన్ డిసిపి శ్రీనివాసరావు తెలిపారు. కోడెలది అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేశామన్నారు. అయితే కుటుంబసభ్యుల సమాచారం ప్రకారం కోడెల ఆత్మహత్య చేసుకున్నట్లు చెబుతున్నారని, పోస్ట్‌మార్టం అనంతరం మృతికి గల కారణాలు తెలుస్తాయని ఆయన అన్నారు. తొలుత కోడెల కుమార్తె ఆయన గదిలోకి వెళ్లి చూడటంతో ఆత్మహత్య విషయం తెలిసిందని, ఘటనా స్థలంలో ముగ్గురు ఉన్నట్లుగా తెలిసిందని డిసిపి పేర్కొన్నారు. కోడెల మృతి బంజారాహిల్స్ ఎసిపి ఆధ్వర్యంలో కేసు విచారణ జరుగుతోందని తెలిపారు. కోడెల గదిలో ఎలాంటి సూసైడ్ నోటు లభ్యం కాలేదని పోలీసులు తెలిపారు. కోడెల మేనల్లుడు అనిల్‌కుమార్ చేసినఫిర్యాదు మేరకు తెలంగాణ, ఆంధ్ర పోలీసులు ఆకోణంలోనూ ఆ రా తీస్తున్నారు. ఇప్పటికే ఆధారాల సేకరణ, ప్రత్యక్ష సా క్షుల వాంగ్మూలాలు తీసుకున్నారు. ఘటనా స్థలంలో క్లూస్‌టీం, ఎఫ్‌ఎస్‌ఎల్ ఫింగర్ ప్రింట్స్ సేకరించారు.
ఉపరాష్ట్రపతి సంతాపం
కోడెల శివప్రసాదరావు మృతిపట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సంతాపంతో పాటు విచారం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ‘ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మృతి విచారకరం. వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నాను’అని ట్విటర్‌లో పేర్కొన్నారు.
మెడకు గాయాలున్నాయి : సోమిరెడ్డి
ఆత్మహత్యకు పాల్పడిన కోడెల మెడపై గాట్లు ఉన్నాయని, ఈక్రమంలో ఆయన ఉరేసుకుని ఉండవచ్చని ఎపి మాజీ మంత్రి సోమిరెడ్డి పేర్కొన్నారు. కోడెల ఇంట్లో చూసిన విషయాలను బట్టి ఆ విధంగా తెలుస్తోందన్నారు. కోడెల శివప్రసాదరావు మృతిపై సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏది ఏమైనప్పటికి ఆయన ఇక లేరని ఆవేదన వ్యక్తం చేశారు. బసవతారకం ఆసుపత్రి వైద్యులు ఎంత శ్రమించినప్పటికి ఆయనను కాపాడలేకపోయారని, ఆసుపత్రిలో చేర్చిన కొద్దిసేపటికే ఆయన మరణించారని చెప్పారు.
శవపరీక్షల నిమిత్తం ఆయన మృతదేహాన్ని ఉస్మానియాకు తరలించారని, మరిన్ని విషయాలు రిపోర్టు వచ్చిన తర్వాత తెలుస్తాయని అన్నారు.
కోడెల భార్య, కుమార్తెలకు అస్వస్థత
కోడెల శివప్రసాద్ ఆత్మహత్య నేపథ్యంలో ఆయన భార్య శశికళ, కుమార్తెలు అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే ఇంటికి చేరుకున్న వైద్యులు.. వారిని పరిశీలించారు. ఇంట్లోనే వారికి చికిత్స అందిస్తున్నారు.
నాన్న అంటే తమకు ప్రాణమ ని, తమ మధ్య ఎలాంటి గొడవలూ లేవని కోడెల కుమార్తె విజయలక్ష్మి స్పష్టం చేశారు. కొడుకు, కూతురు అంటూ ఆరోపణలు చేసి ఆయన్ని ఎంత క్షోభ పెట్టారో మాటల్లో చెప్పలేనని అన్నారు. ప్రభుత్వం పెట్టిన వేధింపుల వల్లే ప్రాణం పోయిందన్నారు. మీ అందరికీ ఓ దండమని, మా బతుకు మమ్మల్ని బతకనివ్వండని రోదిస్తూ వేడుకున్నారు. ఆయన మానసికంగా ఎంత నరకం అనుభవించారో తమకు తెలుసని, ఆయ న ఎంత బాధపడ్డారో కూడా తమకు తెలుసునని, కనీసం ఇప్పుడైనా ఆయన ఆత్మశాంతికి భంగం కలిగించకండని భోరున రోదిస్తూ కోడెల కుమార్తె విజయలక్ష్మి విజ్ఞప్తి చేశారు.
కొన ఊపిరితో ఉన్నారు : బాలకృష్ణ
కోడెల ఆత్మహత్యకు యత్నించారన్న సమాచారం తెలిసిన వెంటనే బసవతారకం ఆస్పత్రికి వచ్చే సమయానికి కోడెల అపస్మారక పరిస్థితిలో ఉన్నారని నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ మీడియాకు తెలిపారు. బసవతారకం డాక్టర్లు బీపీ, పల్స్ చెక్ చేశారని చెప్పారు. వైద్యబృందం చివరి ప్రయత్నాలు చేసిందని.. కానీ ఫలితం లేకుండా పోయిందన్నారు. కోడెల మృతి బాధాకరమన్న ఆయన.. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.
చలించిన చంద్రబాబు
కోడెల శివప్రసాద్ ఆత్మహత్యపై చంద్రబాబు కన్నీరుమున్నీరయ్యారు.డాక్టర్‌గా ఉన్న వ్యక్తి ఫ్యాన్‌కు ఉరివేసుకుని చనిపోవడం ఊహించని పరిణామం అన్నారు.బాలకృష్ణ తనకు ఫోన్ చేసి కోడెల మరణ వార్త చెప్పగానే షాక్‌కు గురయ్యానని, ఆయన ఆత్మహత్యను జీర్ణించుకోలేకపోతున్నానని విషణ్ణవదనంతో మాట్లాడారు. పార్టీ కార్యాలయంలో టిడిపినేతలతో చంద్రబాబు భేటీ అయ్యారు. అనంతరం ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో చంద్రబాబు మాట్లాడారు. కోడెల మృతి తనను తీవ్రంగా కలచివేసిందని అన్నారు.

kodela siva prasad Commits Suicide