Friday, March 29, 2024

రెండేళ్లుగా శతకమే లేదు..

- Advertisement -
- Advertisement -

Kohli didn't score single century from 2 years

కోహ్లి ఖాతాలో చెత్త రికార్డు

సెంచూరియన్: రికార్డుల రారాజుగా పేరు తెచ్చుకున్న టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి తన కెరీర్‌లోనే అత్యంత చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. ఒకప్పుడూ వరుస సెంచరీలతో ప్రపంచ క్రికెట్‌లో పెను ప్రకంపనలు సృష్టించిన కోహ్లి రెండేళ్లుగా ఆశించిన స్థాయిలో బ్యాటింగ్ చేయలేక పోతున్నాడు. వన్డేలు, టెస్టుల్లో పదుల సంఖ్యలో సెంచరీలు బాదేసి మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టేలా కనిపించాడు. ఇప్పటికే వన్డేలు, టెస్టుల్లో కలిపి కోహ్లి తన ఖాతాలో 70 శతకాలను జమ చేసుకున్నాడు. అయితే గత రెండేళ్లుగా కోహ్లి అంతర్జాతీయ మ్యాచుల్లో ఒక్క సెంచరీ కూడా నమోదు చేయలేక పోయాడు. 2020లో కోహ్లి ఒక్క శతకం కూడా సాధించలేదు. తాజాగా 2021లో కూడా సెంచరీ సాధించడంలో విఫలమయ్యాడు. రెండేళ్ల కిందటి కోల్‌కతా వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లి చివరి శతకాన్ని సాధించాడు.

అప్పటి నుంచి మరోసెంచరీ సాధించడంలో కోహ్లి విఫలమయ్యాడు. 2021లో కోహ్లి 11 టెస్టులు ఆడాడు. ఇందులో 536 పరుగులు సాధించాడు. అయితే టెస్టుల్లో కోహ్లి అత్యధిక స్కోరు 72 పరుగులే కావడం విశేషం. వన్డేల్లో కూడా కోహ్లి అత్యధిక స్కోరు 66 పరుగులే. ఇక పది టి20 మ్యాచ్‌లు ఆడగా అందులో అత్యధిక స్కోరు 80 పరుగులుగా నమోదైంది. కాగా, సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో శతకం లోటు తీర్చుకుంటాడని ఆశించిన అభిమానులకు నిరాశే మిగిలింది. ఈ ఏడాది ఇదే చివరి అంతర్జాతీయ మ్యాచ్ కాగా ఇందులో కోహ్లి 35, 18 పరుగులే చేశాడు. దీంతో సెంచరీ లేకుండా కోహ్లి వరుసగా రెండో ఏడాదిని పూర్తి చేసుకున్నాడు.

సచిన్ రికార్డును అందుకోవడం కష్టమేనా?

మరోవైపు మాస్టర్ బ్యాట్స్‌మన్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న 100 శతకాల రికార్డును విరాట్ కోహ్లి బద్దలు కొట్టడం కష్టంగా కనిపిస్తోంది. టెస్టులు, వన్డేల్లో కలిపి సచిన్ రికార్డు స్థాయిలో వంద శతకాలు సాధించాడు. రెండేళ్ల క్రితం వరకు కోహ్లి ఈ రికార్డును బద్దలు కొట్టడం ఖాయమని విశ్లేషకులు భావించారు. కానీ ఇటీవల కాలంలో విరాట్ కోహ్లి పేలవమైన బ్యాటింగ్‌తో సతమతమవుతున్నాడు. ప్రతి సిరీస్‌లోనూ వరుస వైఫల్యాలు చవిచూస్తున్నాడు. వన్డేలు, టెస్టుల్లో శతకాలు సాధించడంలో విఫలమవుతున్నాడు. దీంతో సచిన్ రికార్డును అందుకోవడం కోహ్లికి కష్టమేననే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News