టెస్ట్ మ్యాచ్‌లకు రిటైర్‌మెంట్ ప్రకటించి విరాట్ కోహ్లీ(Virat Kohli) అందరికీ షాక్ ఇచ్చారు. అది కూడా ప్రతిష్టాత్మక ఇంగ్లండ్ సిరీస్‌కి ముందు కావడంతో అభిమానులు నిరాశ చెందారు. అయితే కొద్దిరోజుల క్రితమే బిసిసిఐ ఇంగ్లండ్ పర్యటనకు జట్టుకు ప్రకటించింది. కోహ్లీ కంటే ముందే రోహిత్ శర్మ రిటైర్‌మెంట్ (Retirement) ప్రకటించాడంతో కొత్తగా ప్రకటించిన జట్టులో కెప్టెన్సీ బాధ్యతలను శుభ్‌మాన్ గిల్‌కు అప్పగించారు. దీంతో కోహ్లీ, రోహిత్ వంటి సీనియర్లు లేకుండా ఇంగ్లండ్ పర్యటనకు వెళ్తున్న యువ జట్టు ఎలా రాణిస్తుందా అని అంతా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. జూన్ 20 నుంచి ఈ సిరీస్ ప్రారంభం అవుతుంది.
అయితే కోహ్లీ రిటైర్‌మెంట్‌పై ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ మాంటి పనేసర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంగ్లండ్ పర్యటనకు కోహ్లీ వస్తాడని అందరిలా తాను అనుకున్నానని కానీ కోహ్లీ (Virat Kohli) రిటైర్‌మెంట్ (Retirement) తనని ఆశ్చర్యపరించిందని పేర్కొన్నారు. ఇంగ్లండ్ వంటి కఠినమైన సిరీస్ నుంచి కోహ్లీ కావాలనే బయటపడ్డాడని అన్నారు. ‘‘కోహ్లీ చాలా కాలంగా వైడ్ ఆఫ్ స్టంప్ సమస్యతో బాధపడుతున్నాడు. టెస్టు క్రికెట్‌లో పదే పదే ఆ బంతులకే ఔట్ అవుతున్నాడు. అదే అతని మైండ్‌లో ఉండొచ్చు. సెలక్టర్లు కూడా కోహ్లీతో ఓ విషయం చర్చించి ఉంటారని అనుకుంటున్నాను. తొలి రెండు టెస్టులు రాణించకపోతే.. మిగిలిన మూడు టెస్టులకు దూరంగా ఉండాలని సెలక్టర్లు చెప్పి ఉండొచ్చు. ఇవన్నీ ఆలోచించి కోహ్లీ రిటైర్‌మెంట్ ప్రకటించాడు’’ అని పనేసర్ పేర్కొన్నారు.