Home ఛాంపియన్స్ ట్రోఫీ చెలరేగిన ఉతప్ప

చెలరేగిన ఉతప్ప

17 పరుగుల తేడాతో సన్‌రైజర్స్‌పై గెలుపు     ఛేదనలో వార్నర్‌సేన ఓటమి

కోల్‌కతాకు  మరో విజయం

ఐపిఎల్ 10వ సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ జైతయాత్ర కొనసాగుతోంది. 17 పరుగుల తేడాతో వార్నర్‌సేనపై కోల్‌కతా జట్టు గెలుపు సాధించి ముచ్చటగా మూడో విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సీజన్‌లో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో మూడు మ్యాచ్‌ల్లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో గంభీర్‌సేన అగ్రస్థానంలో నిలిచింది. గత సీజన్‌లో ఐపిఎల్ టైటిల్ విజేతగా నిలిచిన సన్‌రైజర్స్ ఈ సీజన్ ఆరంభ మ్యాచ్‌లో తొలి విజయాన్ని సాధించింది. అయితే రానురాను పేలవ ప్రదర్శనతో హైదరాబాద్ జట్టు వెనుకబడుతూ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలోకి జారిపోయింది. 

Uttappa

కోల్‌కతా: ఐపిఎల్ 10 సీజన్‌లో భాగంగా కోల్‌కతా వేదికగా శనివారం ఇక్కడ ఈడెన్ గార్డెన్స్‌లో సన్‌రైజర్స్ హైదరా బాద్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ మరో విజయాన్ని సొంతం చేసుకుంది. తాజాగా హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ఆటగాళ్లు మనీశ్ పాండే, ఉతప్ప విజృంభణతో కోల్‌కతా 17 పరుగుల తేడాతో గెలిచి ముచ్చటగా మూడో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఈ మ్యాచ్‌లో విజయంతో గంభీర్‌సేనకు 2 పాయింట్లు దక్కాయి. తాజాగా ఆడిన మ్యాచ్‌తో కలిపి మొత్తం 6 పాయింట్లు లభించగా, పాయింట్ల పట్టికలో కోల్‌కతా అగ్రస్థానంలో నిలిచింది. ఈ సీజన్‌లో ఇరుజట్లు నాలుగు మ్యాచ్‌లు ఆడగా, మూడు మ్యాచ్‌లు కోల్‌కతా గెలవగా హైదరాబాద్ రెండు మ్యాచ్‌లు గెలిచింది. 173 పరుగుల లక్షంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ లక్ష ఛేదనలో పేలవ ప్రదర్శనతో పరాజయాన్ని పలకరించింది.

నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసి కోల్‌కతా చేతిలో వార్నర్‌సేన ఓటమి పాలైంది. టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన కోల్‌కతా జట్టులో ఓపెనర్లుగా దిగిన నరేన్ (6) పరుగులకే చేతులేత్తేయగా, మరో ఓపెనర్‌గా కెప్టెన్ గౌతమ్ గంభీర్ (15) పరుగులకే నిష్క్రమించాడు. గత మ్యాచ్‌లో మాదిరిగా విజృంభిస్తాడనుకుంటే కేవలం స్వల్ప స్కోరుకే పరిమితమై రషీద్ ఖాన్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయి రెండో వికెట్‌గా పెవిలియన్‌కు చేరాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన ఉతప్ప, మనీశ్ పాండే కోల్‌కతా ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టేందుకు తీవ్రంగా శ్రమించారు.

వీరిద్దరూ కలిసి మూడో వికెట్‌కు 34 బంతుల్లో 50 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. సన్‌రైజర్స్ బౌలర్లు విసిరిని బంతులను ఆచితూచి ఆడుతూ నెమ్మదిగా స్కోరుబోర్డులో వేగాన్ని పెంచేశారు. ఒక దశలో వీరిద్దరి దూకుడుకు హైదరాబాద్ బౌలర్లు కటింగ్, భువనేశ్వర్ కుమార్ కళ్లెం వేశారు. ఉతప్ప (39 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్) 68 పరుగులు సాధించి హాఫ్ సెంచరీ నమోదు చేయగా, కటింగ్ బౌలింగ్‌లో రషీద్ ఖాన్‌కు క్యాచ్ ఇచ్చి మూడో వికెట్‌గా వెనుదిరిగాడు. ఆ తరువాత మనీశ్ పాండే (35 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్) 46 పరుగులు చేసి అర్థ సెంచరీకి చేరువలో ఉండగా భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో వార్నర్ క్యాచ్ ఇవ్వడంతో మనీశ్ కూడా చేతులేత్తేశాడు. మిగతా ఆటగాళ్లలో సూర్య కుమార్ యాదవ్ (4) పరుగులు చేయగా, గ్రాండ్‌హోం ఖాతా తెరవకుండానే పెవిలియన్ బాటపట్టాడు. కాగా, యూసఫ్ పటాన్ (21), వోక్స్ (1) పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. హైదరాబాద్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ మూడు వికెట్లు తీసుకోగా, ఆశీష్ నెహ్రా, కటింగ్, రషీద్ ఖాన్ తలో వికెట్ తీసుకున్నారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో కోల్‌కతా నైట్‌రైడర్స్ 6 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. దీంతో ప్రత్యర్థి జట్టు సన్‌రైజర్స్‌కు 173 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ మ్యాచ్‌లో కోల్‌కతా ఆటగాడు ఉతప్పకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.

ఛేదనలో సన్‌రైజర్స్ ఓటమి..
ఈ సీజన్ ఆరంభంలో తొలి మ్యాచ్ గెలిచి విజయాల దిశగా పయనించిన సన్‌రైజర్స్ పేలవ ప్రదర్శనతో వరుసగా పరాజయలను చవిచూస్తోంది. కోల్‌కతా నిర్దేశించిన 173 పరుగుల లక్ష ఛేదనలో సన్‌రైజర్స్ తడబడింది. తొలుత ఓపెనర్లగా బరిలోకి దిగిన కెప్టెన్ డేవిడ్ వార్నర్ మరోసారి పేలవ ప్రదర్శనతో (30 బంతుల్లో 4 ఫోర్లు) 26 పరుగులకే నిష్క్రమించాడు. కుల్‌దీప్ యాదవ్ బౌలింగ్‌లో వోక్స్‌కు క్యాచ్ ఇచ్చి వార్నర్ తొలి వికెట్‌గా వెనుదిరిగాడు. మరో ఓపెనర్ శిఖర్ ధావన్ (23) పరుగులు చేసి వార్నర్ దారిలోనే పయనించాడు. దీంతో 10 ఓవర్లు ముగిసే సరికి హైదరాబాద్ జట్టు 61 పరుగుల వద్ద రెండు వికెట్లు కోల్పోయింది. అనంతరం బరిలోకి దిగిన హెన్రిక్స్ (9), సిక్సర్ల వీరుడు యువరాజ్ సింగ్ (1) క్రీజులో ఉన్నారు. కోల్‌కతా బౌలర్లలో కుల్‌దీప్ యాదవ్, యూసఫ్ పటాన్ తలో వికెట్ తీసుకున్నారు.

కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: 172/6 ( 20 ఓవర్లలో)
నరేన్ (బి) కుమార్ ; 6, గౌతమ్ గంభీర్ (బి) రషీద్ ఖాన్ ; 15, ఉతప్ప (సి) రషీద్ ఖాన్ (బి) కటింగ్; 68, మనీశ్ పాండే (సి) వార్నర్ (బి) భువనేశ్వర్ కుమార్ ; 46, యూసఫ్ పటాన్ నాటౌట్ ; 21, సూర్యకుమార్ యాదవ్ (సి) ఓజా (బి) నెహ్రా ; 4, గ్రాండ్‌హోం (బి) భువనేశ్వర్ కుమార్ ; 0, క్రిస్ వోక్స్ నాటౌట్ ; 1. ఎక్స్‌ట్రాలు: 11, మొత్తం: (20 ఓవర్లలో 6 వికెట్లు) 172 పరుగులు. వికెట్ల పతనం: 1-10, 2-40, 3-117, 4-153, 5-163, 6-170. సన్‌రైజర్స్ బౌలర్లు: భువనేశ్వర్ కుమార్: 4-0-20-3, నెహ్రా : 4-0-35-1, కటింగ్: 4-0-41-1, రషీద్ ఖాన్ : 4-0-29-1, హెన్రిక్స్ : 2-0-26-0, బిపూల్ శర్మ : 2-0-20-0.

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: 155/6 ( 20 ఓవర్లలో)
డేవిడ్ వార్నర్ (సి) వోక్స్ (బి) కుల్‌దీప్ యాదవ్ ; 26, శిఖర్ ధావన్ (సి) గ్రాండ్‌హోం (బి) పటాన్ ; 23, హెన్రిక్స్ (సి)&(బి) వోక్స్ ; 13, యువరాజ్ సింగ్ (సి) సబ్ (ఆర్ ధావన్) (బి) వోక్స్ ; 26, హుడా స్టంప్ ఉతప్ప (బి) నరేన్ ; 13, కటింగ్ (సి) గ్రాండ్‌హోం (బి) బోల్ట్ ; 15, ఓజా నాటౌట్ ; 11, బిపూల్ శర్మ నాటౌట్ ; 21 ఎక్స్‌ట్రాలు: 7, మొత్తం: (20 ఓవర్లలో 6 వికెట్లు) 155 పరుగులు. వికెట్ల పతనం: 1-46, 2-59, 3-65, 4-96, 5-112, 6-129, కోల్‌కతా బౌలర్లు : ఉమేశ్ యాదవ్ : 3-0-27-0, బోల్ట్ : 4-0-33-1, నరేన్ : 4-0-18-1, కుల్‌దీప్ యాదవ్ : 4-0-23-1, పటాన్ : 1-0-2-1, క్రిస్ వోక్స్ : 4-0-49-2.