Home తాజా వార్తలు ఐపిఎల్‌పై కరోనా పిడుగు

ఐపిఎల్‌పై కరోనా పిడుగు

అహ్మదాబాద్: సాఫీగా సాగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపిఎల్) ట్వంటీ20 టోర్నమెంట్‌పై కరోనా పంజా విసిరింది. కరోనా దెబ్బకు సోమవారం అహ్మదాబాద్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్‌ను వాయిదా వేయాల్సి వచ్చింది. కోల్‌కతాకు చెందిన ఇద్దరు క్రికెటర్లు వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్‌లకు కరోనా ఉన్నట్టు నిర్ధారణ అయ్యింది. వీరితో పాటు చెన్నై జట్టు బౌలింగ్ కోచ్ లక్ష్మీపతి బాలాజీకి కూడా కరోనా ఉన్నట్టు తేలింది. అంతేగాక అరుణ్‌జైట్లీ మైదానం సిబ్బంది కూడా కరోనా బారిన పడ్డారు. దీంతో మంగళవారం ఢిల్లీ వేదికగా ముంబై ఇండియన్స్‌సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ కూడా సందిగ్ధంగా మారింది. సోమవారం కోల్‌కతాబెంగళూరు మ్యాచ్‌ను నిర్వాహకులు వాయిదా వేశారు. ఇద్దరు క్రికెటర్లు కరోనా బారిన పడడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా కరోనా వల్ల ఒక మ్యాచ్‌ను వాయిదా వేయడం ఇదే తొలిసారి. కిందటి ఏడాది యూఎఇ వేదికగా జరిగిన ఐపిఎల్ టోర్నమెంట్ ఎలాంటి ఆటంకం లేకుండా విజయవంతంగా ముగిసింది. కానీ ఈసారి ఐపిఎల్ ఆరంభానికి ముందే కరోనా కలకలం సృష్టించింది. బెంగళూరు ఆటగాడు దేవ్‌దుత్ పడిక్కల్, ఢిల్లీ ఆటగాడు అక్షర్ పటేల్ తదితరులు కరోనా బారిన పడ్డారు. అక్షర్ పటేల్ చాలా మ్యాచ్‌లకు దూరం కావాల్సి వచ్చింది. పడిక్కల్ మాత్రం రెండో మ్యాచ్‌లో బరిలోకి దిగాడు.

ఇదిలావుండగా ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా కల్లోలం సృష్టిస్తోంది. పలు రాష్ట్రాలు దీని కోరల్లో చిక్కుకుని విలవిల్లాడుతున్నాయి. ఇలాంటి స్థితిలో ఐపిఎల్‌ను వాయిదా వేయాలనే డిమాండ్ రోజు రోజుకు పెరిగి పోతోంది. అయితే భారత క్రికెట్ బోర్డు మాత్రం ఐపిఎల్‌ను వాయిదా వేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. ఎట్టి పరిస్థితుల్లోనూ టోర్నీని కొనసాగిస్తామని స్పష్టం చేసింది. అయితే తాజాగా కోల్‌కతా క్రికెటర్లతో పాటు పలువురు గ్రౌండ్ సిబ్బందికి కరోనా సోకడంతో ఏకంగా మ్యాచ్‌ను వాయిదా వేయాల్సి వచ్చింది. పరిస్థితి ఇలాగే ఉంటే ఐపిఎల్‌ను కొనసాగించడం కష్టమేనని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. మరోవైపు మంగళవారం సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్‌ల మధ్య జరిగే మ్యాచ్‌పై కూడా అనుమానాలు నెలకొన్నాయి. పరిస్థితులను గమనిస్తే ఈ మ్యాచ్‌ను కూడా వాయిదా వేయక తప్పదు అనిపిస్తోంది. కానీ దీనికి నిర్వాహకులు ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. మ్యాచ్‌ను కొనసాగించేందుకే వారు మొగ్గు చూపుతున్నట్టు సమాచారం.
కలవరం మొదలైంది..
మరోవైపు కోల్‌కతా ఆటగాళ్లు వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్‌లకు కరోనా ఉన్నట్టు తేలింది. దీంతో వీరిద్దరూ సెల్ఫ్ క్వారంటైన్‌లోకి వెళ్లి పోయారు. తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ (సిఎస్‌కె) బౌలింగ్ కోచ్ లక్ష్మీపతి బాలాజీతో పాటు ఓ బస్సు క్లీనర్ కూడా కరోనా బారిన పడ్డారు. అంతేగాక చెన్నై సిఈఓ కాశీ విశ్వనాథన్‌కు కూడా కరోనా ఉన్నట్టు తేలడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. వీరితో పాటు ఢిల్లీ మైదానం సిబ్బందికి కూడా కరోనా ఉన్నట్టు పరీక్షల్లో తేలింది. ఇదిలావుండగా ఐపిఎల్‌పై కరోనా పంజా విసరడంతో ఇటు క్రికెటర్లు, అటు నిర్వాహకుల్లో ఒక రకమైన ఆందోళన మొదలైంది. పరిస్థితి ఇలాగే ఉంటే చాలా మంది క్రికెటర్లు టోర్నీ నుంచి తప్పుకున్నా ఆశ్చర్యం లేదు.
నేటి మ్యాచ్ డౌటే..!
ఇదిలావుండగా ఢిల్లీ మైదానం సిబ్బంది ఐదుగురు కరోనా బారిన పడడంతో మంగళవారం ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ జట్ల మధ్య జరిగే మ్యాచ్‌పై సందిగ్ధం నెలకొంది. కరోనా విజృంభణ నేపథ్యంలో ఢిల్లీ వేదికగా ఇకపై మ్యాచ్‌లను నిర్వహిస్తారా లేకుంటే వేరే మైదానాలకు మార్చుతారా అనేది ఇంకా తేలలేదు. ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే ఢిల్లీలో మ్యాచ్‌లు కొనసాగడంపై అనుమానాలు నెలకొన్నాయి. గ్రౌండ్ సిబ్బందికి కరోనా సోకడంతో మ్యాచ్ బరిలోకి దిగేందుకు క్రికెటర్లు సందేహిస్తున్నట్టు సమాచారం. పటిష్టమైన బయోబబుల్ విధానాన్ని అమలు చేస్తున్న క్రికెటర్లు, సహాయక సిబ్బంది కరోనా బారిన పడడంతో నిర్వాహకుల్లో ఒక రకమైన ఆందోళన నెలకొంది. దీంతో ఐపిఎల్ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది.

Kolkata Players test positive for Covid 19