Home తాజా వార్తలు కాంగ్రెస్ ఖతం

కాంగ్రెస్ ఖతం

Kollapur Congress MLA Harshavardhan Reddy

 
9 మంది ఎంఎల్‌ఎలు ఔట్
టిఆర్‌ఎస్‌కు హర్షం

కాంగ్రెస్‌ను వీడుతున్న మరో ఎంఎల్‌ఎ
కెటిఆర్‌ను కలిసిన కొల్లాపూర్ శాసన సభ్యుడు హర్షవర్ధన్

హైదరాబాద్: వరుస వలసలతో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కుదేలవుతోంది. అగ్రశ్రేణి ఎంఎల్‌ఎలు, మాజీ మంత్రులు, డిసిసిల అధ్యక్షులు కారెక్కుతుండడంతో హస్తం పార్టీ విలవిలలాడుతోంది. తాజాగా కొల్లాపూర్ శాసనసభ్యుడు హర్షవర్ధన్ కూడా హస్తానికి హ్యాండిచ్చేందుకు రంగం సిద్దం చేసుకున్నా రు. ఈ క్రమంలో బుధవారం టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్‌ను కలిసి కారెక్కేందుకు సుముఖతను వ్యక్తం చే శారు. కాంగ్రెస్ నుంచి ఇప్పటికే ఎనిమిది మంది శాసనసభ్యులు పార్టీనీ  వీడుతున్న ప్రకటించిగా తొమ్మిదివ వ్యక్తిగా ఆ జాబితాలో హర్షవర్ధన్ కూడా చేరిపోయారు. వీరితో పాటు మాజీ మంత్రి డి. కె. అరుణ, మాజీ ఎంఎల్‌ఎ సోయంబాపూరావులతో పాటు వివిధ జిల్లాలోని పార్టీ నేతలు సైతం కాంగ్రెస్‌కు గుడ్‌పై చెప్పిన విషయం తెలిసిందే. వీరే కాకుండా ఇంకా చాలా మంది కాంగ్రెస్ నేతలు టిఆర్‌ఎస్‌లో చేరేందుకు సిద్దమవుతున్నారు. పలు జిల్లాల డిసిసి అధ్యక్షులు సైతం కాంగ్రెస్‌ను వీడేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నారు. మరికొందరు నాయకులు బిజెపి తీర్థం పుచ్చుకునున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే పలువురు కాంగ్రెస్ నేతలతో బిజెపి రాష్ట్ర నాయకులు మంతనాలు కూడా జరిపారని సమాచారం.

ఒకటి, రెండు రోజుల్లో ఆ పార్టీలోకి కూడా పెద్దఎత్తున వలసలు ప్రారంభం కాబోతున్నాయని తెలుస్తోంది. ఇప్పటికే డికె. అరుణ బిజెపిలో చేరిన నేపథ్యంలో ఉమ్మడి మహబూబ్‌నగర్‌కు చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, వివిధ కార్పొరేషన్లకు చెందిన మాజీ చైర్మన్లు సైతం హస్తం పార్టీకి రాజీనామాలు చేసేందుకు సిద్దమవుతున్నారు. ఒకవైపు ఎంఎల్‌ఎలు, మరోవైపు బలమైన నేతలు కూడా పార్టీనీ వీడుతుండడంతో టిపిసిసి నేతలు ఆందోళన చెందుతున్నారు. ఈ వలసలను ఆపేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నప్పటికీ నేతలను కాపాడుకోలేకపోతున్నారు. ఇప్పటి వరకు ఆపరేషన్ ఆకర్ష్‌ను కేవలం టిఆర్‌ఎస్ మాత్రమే చేయగా, ఇప్పుడు బిజెపి కూడా మొదలుపెట్టింది. దీంతో కాంగ్రెస్ నేతలు ఇతర పార్టీల్లోకి చేరేందుకు ఉరుకులు, పరుగులు పెడుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ నేతలు అనిల్ జాదవ్, గోసుల శ్రీనివాస్‌యాదవ్ తదితరులు కూడా బుధవారం టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ సమక్షంలో ఆ పార్టీలో చేరారు.

ఈ పరిణామాలతో కాంగ్రెస్ పార్టీ అస్తిత్వానికే భంగం వాటిల్లే ప్రమాదం ఏర్పడింది. ఏళ్ళ తరబడి పార్టీలో బలమైన పునాదులు ఏర్పరచుకుని శాసించిన నేతలు కూడా కాంగ్రెస్‌ను వీడుతున్నారు. పెద్దఎత్తున కొనసాగుతున్న వలసలతో కాంగ్రెస్ శ్రేణుల్లో నెలకొన్న ఆత్మస్థైర్యం కూడా రోజురోజుకు సన్నగిల్లుతోంది. దీంతో రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైందని పార్టీ వర్గాల్లోనే వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే పార్లమెంట్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీకి ఫలితాల్లో ఆశాభంగం తప్పదన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్‌కు కంచుకోటగా వస్తున్న రాష్ట్రాల్లో ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌దే మొదటి స్థానం. అలాంటి పరిస్థితి నుంచి రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో ప్రస్తుతం కాంగ్రెస్ మనుగడే ప్రశ్నార్ధకంగా మారింది. పార్టీ నేతలు ఒక్కరొక్కరుగా జారిపోతుండడంతో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా బక్కిచిక్కిపోయినట్లుగా కనిపిస్తోంది.

పార్టీనీ వీడే యోచనలో సునీతా?

మెదక్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు, మాజీ మంత్రి సునీతా లకా్ష్మరెడ్డి కూడా ఆ పార్టీనీ వీడేందుకు సిద్దమవుతున్నట్లుగా రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. అయితే ఆమె చూపు టిఆర్‌ఎస్ వైపు కాకుండా బిజెపివైపు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే జిల్లాకు చెందిన కొందరు బిజెపి నేతల ఆమెతో చర్చలు జరిపారని సమాచారం. అయితే సునితా లకా్ష్మరెడ్డి త్వరలోనే తన అనుచరవర్గాలు, అభిమానులతో ప్రత్యేకంగా సమావేశమైన తరువాత రాజకీయ భవిష్యత్‌పై కీలక నిర్ణయం తీసుకోనున్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.

కాంగ్రెస్‌ను వీడడం లేదు : సునీతా

తాను కాంగ్రెస్‌ను వీడి బిజెపిలో చేరుతున్నట్లుగా వస్తున్న వార్తలు పూర్తిగా నిరాధారమైనవని మాజీ మంత్రి సునీతా లకా్ష్మరెడ్డి తెలిపారు. ఎవరూ కాంగ్రెస్‌ను వీడినా తాను మాత్రం ఇదే పార్టీలో కొనసాగుతానని స్పష్టం చేశారు. ఇలాంటి వార్తలు ఎలా వస్తున్నాయో తనకు అర్ధం కావడం లేదన్నారు.

ఫిరాయించిన ఎంఎల్‌ఎలకు నోటీసులు

కాంగ్రెస్ పక్షాన గెలిచి అధికార పార్టీలో చేరిన ఎంఎల్‌ఎలకు ఆ పార్టీ రాష్ట్ర క్రమశిక్షణ సంఘం నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు క్రమశిక్షణ సంఘం చైర్మన్ కోదండరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

Kollapur Congress MLA Harshavardhan Reddy Meets KTR