Home ఆదిలాబాద్ దయ నీయస్థితిలో కొమురం భీం గ్రామాలు

దయ నీయస్థితిలో కొమురం భీం గ్రామాలు

Komuram-Bheem

ఆదిలాబాద్: నాటి నిరంకుశ నైజాంతో కొమురం భీంతో కలసి పోరాటంలో పాల్గొన్న గ్రామాలు నేడు దయ నీయస్థితిలో కొట్టు మిట్టాడుతున్నాయి. నెలల తరబడిగా విద్యుత్ సరఫరా లేక అంధకారంలోనే విష కీటకాల మధ్య ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. గాలివాన వలన గత నాలుగు రోజుల క్రితం హత్తి అటవీ ప్రాంతంలో విద్యుత్ స్తంభం తీగలు నేలకొరిగాయి. మరమ్మతు పనులు చేసి, విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని ఆయా గ్రామాల ప్రజలు ట్రాన్స్‌కో అధికారులకు విన్నవించినప్పటికీ పట్టించుకోవడం లేదని గ్రామపెద్ద ఆత్రం పావు తెలిపారు. గత నాలుగు రోజులుగా కొమురం భీం పోరాట గ్రామాలైనా బాబేజరి, గోండుగూడ, పొలాంగూడ, శివగూడ, పాటగూడ, చాల్‌బడి, టోకెన్‌మోవడ్ గ్రామాల ఆదివాసులు అంధకారంలోనే మొగ్గుతున్నారు. ట్రాన్స్‌కో అధికారుల నిర్లక్ష వైఖరికి ఆయా గ్రామాల ప్రజలు విసుగుచెంది శనివారం 12 కిలోమీటర్లు కాలినడకన వచ్చి మరమ్మతు పనులకు పూనుకున్నారు. ట్రాన్స్‌కో అధికారులే నిపుణులైనా విద్యుత్ సిబ్బందికే మరమ్మతు పనులు చేయాల్సి ఉన్నప్పటికీ ఏమి తెలియని ఆమాయక ఆదివాసులు ప్రైవేట్ విద్యుత్ హెల్ఫర్ సాయంతో మరమ్మతు పనులను చేశారు. విద్యుత్ స్తంభం పడిపోయిన ప్రాంతంలో 100 ఆడుగుల లోయ ఉంది. గిరిజనుడు చెట్టుపై ఎక్కి ప్రమాదకరంగా విద్యుత్ మరమ్మతు పనులు చేయాల్సి వచ్చింది. మరమ్మతు సమయంలో ఎవరికైనా ఏమైన ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహించారని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి కొమురం భీం పోరాట గ్రామాలకు నిరంతరంగా విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.