Thursday, April 25, 2024

 రేవంత్‌తో కోమటిరెడ్డి భేటీ..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ అసంతృప్త నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి గాంధీ భవన్‌కు వచ్చారు. నేరుగా రేవంత్ రెడ్డితో సమావేశం అయ్యారు. పిసిసి చీఫ్ గా రేవంత్ రెడ్డిని నియమించిన తర్వాత ఆయన తాను ఇక గాంధీ భవన్ మెట్లెక్కనని సవాల్ చేశారు. అ ప్రకారం అప్పటి నుండి గాంధీభవన్ కు రావడం లేదు. కానీ, ఇప్పుడు మాత్రం అనూహ్యంగా గాంధీ భవన్‌కు రావడమే కాదు. నేరుగా రేవంత్‌తో సమావేశం జరిపారు. తమ మధ్య విభేదాలేమీ లేవన్నట్లుగా ఆయన వ్యవహరించడం కాంగ్రెస్ వర్గాలను సైతం ఆశ్చర్య పరిచింది. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల కొత్త ఇంచార్జ్‌గా మాణిక్ రావు ధాక్రే నియమితులైన తర్వాత తొలిసారి హైదరాబాద్ వచ్చి రెండు రోజుల పాటు సీనియర్ నేతలతో సమావేశాలు నిర్వహించారు.ఆ సమావేశాలకు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కూడా ఆహ్వానించారు.

కానీ ఆయన తాను గాంధీ భవన్‌కు రానని, బయట కలుస్తానని సమాచారం ఇచ్చారు. దానికి తగ్గట్లుగా తర్వాతి రోజు ఎంఎల్‌ఎ క్వార్టర్స్‌లో మాణిక్ రావు ధాక్రేతో సమావేశం అయ్యారు. కానీ రెండో సారి మాణిక్ రావు థాక్రే రాష్ట్ర పర్యటనకు వచ్చే సరికి ఆయన గాంధీ భవన్‌లో ప్రత్యక్షమయ్యారు. కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశంలో పాల్గొనేందుకు తాను గాంధీ భవన్‌కు వచ్చానని కోమటిరెడ్డి చెప్పుకున్నారు. నిజానికి ఇటీవల నియమించిన ఏ కాంగ్రెస్ కమిటీలోనూ ఆయనకు చోటు దక్కలేదు. కానీ ఎన్నికల కమిటీ సమావేశంలో పాల్గొనేందుకు వచ్చానని చెప్పుకున్నారు. మాణిక్ రావు థాక్రేనే తనను రావాలని ఫోన్ చేశారని కోమటిరెడ్డి చెబుతున్నారు. కోమటిరెడ్డి వ్యవహారాశైలి కాంగ్రెస్ నేతలతో పాటు ఆయన అనుచరుల్లోనూ పజిల్ గా మారింది.

ఆయన కాంగ్రెస్ పార్టీలోనే ఉండాలని నిర్ణయించుకున్నారా? లేకపోతే కొత్త వ్యూహం ఏదైనా అమలు చేస్తున్నారా? అన్న చర్చలు ప్రారంభమయ్యాయి. పైగా తాను కాంగ్రెస్‌కు దూరంగా లేనని రోజు వారీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నానని చెప్పుకొచ్చారు. కానీ ఇటీవల తిరుమల పర్యటనలో తాను రాజకీయాలకు దూరంగా ఉన్నానని, ఎన్నికలకు రెండు నెలల ముందు ఏ పార్టీలో చేరుతానో చెబుతానని ప్రకటించారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఇటీవలి కాలంలో తీవ్రమైన ప్రకటనలు చేశారు. అందుకే రెండు సార్లు హైకమాండ్ ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అయితే ఆ మాటలు తాను అనలేదని మార్ఫింగ్ అని చెప్పుకొచ్చారు. ఇటీవల సీనియర్లు రేవంత్ కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తే వారికి మద్దతు పలికారు. ఆయన బిజెపిలో చేరుతారన్న ప్రచారం విస్తృతంగా సాగుతోంది.

అయినప్పటికీ ఆయన మళ్లీ గాంధీభవన్‌కు రావడంతో రాష్ట్ర కాంగ్రెస్ కొత్త ఇంచార్జ్ నుంచి ఆయనకు భరోసా లభించి ఉంండవచ్చని కాంగ్రెస్ వర్గాల అభిప్రాయంగా ఉందని తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News