హైదరాబాద్ : తాను కాంగ్రెస్ ను వీడుతున్నట్టు జరుగుతున్న ప్రచారంలో ఎంతమాత్రం నిజం లేదని, తాను కాంగ్రెస్ ను వీడనని మునుగోడు ఎంఎల్ఎ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తేల్చి చెప్పారు. తాను ఎంఎల్ఎ పదవికి, కాంగ్రెస్ కు రాజీనామా చేస్తున్నట్టు కొన్ని మీడియా సంస్థల్లో వస్తున్న వార్తల్లో నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. తాను నాగార్జునసాగర్ నియోజకవర్గం నుంచి బిజెపి అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్టు కొందరు అవాస్తవ ప్రచారం చేస్తున్నారని ఆయన తెలిపారు. గతంలో తాను బిజెపికి అనుకూలంగా మాట్లాడిన విషయం నిజమేనని, అయితే తాను మాత్రం కాంగ్రెస్ ను ఎట్టి పరిస్థితుల్లో వీడనని ఆయన పేర్కొన్నారు. తన నియోజకవర్గమైన మునుగోడును అన్ని విధాల అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని ఆయన చెప్పారు. తనను ఎంఎల్ఎగా గెలిపించిన మునుగోడు ప్రజల రుణం తీర్చుకుంటానని ఆయన స్పష్టం చేశారు.