Saturday, April 20, 2024

అన్ని విషయాలూ మీడియాతో చెప్పుకోలేం: ప్రధానితో వెంకట్‌రెడ్డి భేటీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కాంగ్రెస్ ఎంపి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి గురువారం ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. ఢిల్లీలో ఆయన ప్రధానితో భేటీ అయ్యారు. ఈ భేటీ గురించి ఆయన మాట్లాడుతూ అభివృద్ధిపై తాను ప్రధాని మోడీతో చర్చించానని వివరించారు. నియోజకవర్గంలో జాతీయ రహదారుల గురించి, ఎల్బీ నగర్ నుంచి మెట్రో రైల్‌ను పొడిగించాలని విజ్ఞప్తి చేసినట్టు తెలిపారు.అంతేకాదు, ఆయన మరో ఆసక్తికర వ్యాఖ్య చేశారు. కొన్ని అంశాలు మీడియాతో చెప్పలేనివి ఉంటాయని, కొన్ని మీడియాతో చెప్పకూడదని అన్నారు. అయితే, తాను మాట్లాడిన అంశాలపై ప్రధాని మోడీ సానుకూలంగా స్పందించారని వివరించారు. రెండు, మూడు నెలల్లో తాను అడిగిన అన్నింటిని మంజూరు చేసే అవకాశం ఉన్నదని తెలిపారు.

అందుకోసం తాను ప్రధాని మోడీకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్టు చెప్పారు. అలాగే, మొన్నటి వడగళ్ల వానతో తెలంగాణలో రైతులు నష్టపోయారని అన్నారు. ఈ అంశాన్ని కూడా ప్రధాని మోడీతో మాట్లాడానని వివరించారు. నష్ట పరిహారాన్ని పరిశీలించడానికి కేంద్రం నుంచి బృందాన్ని పంపాలని కోరానని తెలిపారు. రాజగోపాల్ రెడ్డి బిజెపిలోకి వెళ్లిన తర్వాత కోమటిరెడ్డి వ్యవహారం చర్చనీయాంశమైంది. కాంగ్రెస్ పార్టీలోనూ ఆయన వైఖరిపై కొంత వ్యతిరేకత వచ్చింది. అదీగాక, ఇటీవలి కాలంలో రాష్ట్ర బిజెపి నేతల కంటే ఎక్కువగా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డే ప్రధాని మోడీతో భేటీ అవుతున్నారని రాజకీయవర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రధానితో సమావేశమైన వార్త చర్చనీయాంశం అవుతున్నది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News