Friday, March 29, 2024

అంగరంగ వైభవంగా మల్లన్న కల్యాణం

- Advertisement -
- Advertisement -

Komuravelli Mallikarjuna Swamy Kalyanam

కొమురవెళ్లి: భక్తుల కొంగుబంగారం, కోర్కెలు తీర్చే కొమురవెళ్లి మల్లికార్జున స్వామి కల్యాణం కొమురవెళ్లిలోని తోట బావి వద్ద అంగరంగ వైభవంగా నిర్వహించారు. మార్గశిర మాసం చివరి ఆదివారం పురస్కరించుకుని వీర శైవ ఆగమ శాస్త్రం ప్రకారం మల్లన్న, గొల్ల కేతమ్మ,మేడలమ్మల వివాహాన్ని మహారాష్ట్ర బృహన్మఠాదీశుడు సిద్ధగురు మణికంఠ శివాచార్యులు పర్యవేక్షణలో ఘనంగా జరిపించారు. రాష్ట్ర ఆ ర్థిక శాఖా మంత్రి తన్నీరు హరీశ్‌రావు ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు, తలంబ్రాలను మంత్రి మల్లారెడ్డి, ఎస్సీ ఎస్టీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, జడ్పీ చైర్‌పర్సన్ రోజా శర్మ, స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఎఫ్‌డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, కొమురవెళ్లి ఆలయ చైర్మన్ దువ్వల మల్లయ్యతో కలిసి సమర్పించారు. అంతకు ముందు కొమురవెళ్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ సార్ల లత కిష్టయ్య, వార్డు మెంబర్లు బట్టలు, బియ్యం అందజేశారు. స్వామి వారికి కల్యాణంలో భాగంగా ముందుగా ఆలయ అధికారులు, అర్చకులు గుమ్మడికాయ బలిహారం తరువాత చిత్రకట్టను విధించారు.

అనంతరం మల్లన్న మూల విరాట్ దర్శనం కల్పించారు. కొమురవెళ్లి మలికార్జున స్వామికి కన్యాదానం కింద రూ. లక్షా 1116 లను మంత్రి హరీశ్‌రావు సమర్పించారు. అనంతరం మల్లికార్జున స్వామి తరుపున మేడలమ్మ కేతమ్మలకు రూ. లక్షా 1016లను మంత్రి మల్లారెడ్డి సమర్పించారు. స్వామి వారి కల్యాణానికి భక్తులు వేలాది సంఖ్యలో హాజరై వేడుకలను తిలకించారు. కరోనా నిబంధనల మేరకు.. ప్రతి ఒక్కరూ మాస్క్, భౌతిక దూరం పాటించారు. ఆలయ నిర్వాహకులు పక్బందీ చర్యలు చేపట్టారు. భక్తులు ప్రశాంతంగా స్వామి వారి దర్శనం చేసుకునే విధంగా క్యూలైన్లు ఏర్పాటు చేశారు. సిద్దిపేట సీపీ జోయల్ డెవిస్ ఆదేశాల మేరకు హుస్నాబాద్ ఏసీపీ మహేందర్ రెడ్డి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బోడకుంట్ల వెంకటేశ్వర్లు, కొమురవెళ్లి ఎంపీపీ కీర్తన, జడ్పీటీసీ సిద్ధప్ప, ఎంపీటీసీలు కవి, కనకరాజు, కొయ్యడ రాజమణి శ్రీనివాస్, పాల్గొన్నారు.

 

Komuravelli Mallikarjuna Swamy Kalyanam

Komuravelli Mallikarjuna Swamy Kalyanam

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News