ధర్మారం: జాతీయ స్థాయిలో దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయతీ స్వశక్తికరణ్ పురస్కారం అందుకున్న ధర్మారం తెలంగాణ రాష్ట్ర పేరు ప్రతిష్టలు ఇనుమడింప చేసి ఆదర్శంగా నిలిచిందని, ఈ అవార్డు తమపై మరింత బాధ్యతను పెంచిందని తెలంగాణ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. జాతీయ స్థాయిలో అవార్డు పొందిన ఎంపిపి ముత్యాల కరుణశ్రీబలరాంరెడ్డి, జడ్పీటీసీ పూస్కూరి పద్మజా జితేందర్‌రావు, ఎంపిడిఓ భీమా జయశీలను మండల పరిషత్ ఆవరణలో గురువారం నాడు ఘనంగా సన్మానించారు. పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి ఈశ్వర్ మాట్లాడుతూ, ధర్మారం మండలం అన్ని రంగాల్లో సంపూర్ణ ప్రగతి సాధించి పెద్దపల్లి జిల్లాకు, రాష్ట్రానికి పేరు తెచ్చిపెట్టిందని ఈ విజయం వెనుక కృషి చేసిన ప్రతి ఒక్కరిని మంత్రి ఈశ్వర్ అభినందించారు.
జాతీయ స్థాయిలో తెలంగాణకు 12 అవార్డులు రాగా, తాను ప్రాతినిథ్యం వహిస్తున్న జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలు మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో నాలుగు అవార్డులు గెలుచుకోవడం తనకు జీవితంలో ఎనలేని తృప్తినిచ్చిందని మంత్రి ఈశ్వర్ అన్నారు. ప్రతి ఒక్కర్ని సమన్వయ పరిచి సక్రమమైన పద్ధతిలో గ్రామాలను అభివృద్ధి చేయడం ద్వారా అవార్డు సాధ్యమైందని, సీఎం కేసిఆర్ ఓ బృహత్తరమైన ప్రణాళికతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేపడుతూ తమను ప్రొత్సాహిస్తున్నారని, సీఎం వెన్నుతట్టి ప్రొత్సాహించడంతోనే తాను హుషారుగా పనిచేసి ఎంపిపిలు, జడ్పీటీసీలు, సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, ఉపసర్పంచ్లు, అధికారులను సమన్వయ పరుస్తూ అభివృద్ధి వైపు మళ్ళీంచడం జరిగిందని తద్వారా మనకు వచ్చిన అవార్డు మనందరిపై మరింత బాద్యతను పెంచిందని మంత్రి ఈశ్వర్ అన్నారు.
కొత్త రాజకీయాల్లోకి వచ్చిన రెండేళ్ళలోనే అవిరాల కృషి చేసిన ఎంపిపి ముత్యాల కరుణశ్రీ బలరాంరెడ్డి, జడ్పీటీసీ పూస్కూరి పద్మజా జితేందర్‌రావు, ఎంపిడిఓ బి జయశీలను మంత్రి ఘనంగా సన్మానించి ప్రత్యేక మెమెంటోలను అందించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటి చైర్మన్ గుర్రం మోహన్‌రెడ్డి, మేడారం, పత్తిపాక సింగిల్ విండో చైర్మన్లు ముత్యాల బలరాంరెడ్డి, నోములు వెంకట్‌రెడ్డి, జిల్లా పరిషత్ కోఆప్షన్ సభ్యులు ఎండి సలామోద్దిన్, మండలంలోని అన్ని గ్రామాల సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, మండల స్థాయి అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.