Home కరీంనగర్ నలభై ఏండ్ల క‘న్నీటి’ గోసకు తెర

నలభై ఏండ్ల క‘న్నీటి’ గోసకు తెర

Kotha-Cheruvu
మన తెలంగాణ/కరీంనగర్ ప్రతినిధి : గత నలబై సంవత్సరాల క్రితం కొత్త చెరువు నామకరణంతో ఆ ప్రాంత ప్రజలు చెరువును నిర్మించుకున్నారు. నాటి నుండి నేటి వరకు ఆ ఊరు నీరు లేక ఎంతో తల్లడిల్లింది పోయింది. జగిత్యాల జిల్లాలోని కొడిమ్యాల మండలం చెప్యాల గ్రామంలో కాళేశ్వరం జలాలతో ఆ కొత్త చెరువుకు జలకళ సంతరించుకుంది. అపర భగీరథుడు సిఎం కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుతో కరీంనగర్ ఉమ్మడి జిల్లాకే తొలి ఫలితం దక్కింది. ఇప్పటికే మధ్యమానేరుతో పాటు లోయర్ మానేరు డ్యాంలోకి ఇప్పటికే నీరు చేరంది. ఎల్లంపల్లి నుండి గాయత్రి పంప్‌హౌజ్‌ల ద్వారా గ్రావిటీ కెనాల్‌లో ఎత్తిపోస్తున్న కాళేశ్వర జలాలు వరద కాలువ ద్వారా చెరువులను, కుంటలను కూడా అధికారులు నింపుతున్నారు. అందులో భాగంగానే కొత్త చెరువుకు గత నాలుగు రోజులుగా నారాయణపూర్ రిజర్వాయర్ నుండి మైసమ్మ చెరువుకు నీటిని ఎత్తిపోసి అక్కడి నుండి గ్రావిటీ కెనాల్ ద్వారా కొత్త చెరువును అధికారులు నింపారు. దీంతో ఆ చెరువుకు జలకళ సంతరించుకొంది. ప్రస్తుతం ఆ గ్రామంలో దాదాపు 7 వేలకు పైగా జనాభా ఉంటుంది. ఆ చెరువు క్రింద దాదాపు 60 ఎకరాలకు పైగా భూమి సాగు అయ్యే అవకాశం ఉంది.

ఎన్నో ఏండ్లుగా ఎదురుచూసిన గ్రామ ప్రజలకు, రైతులకు కాళేశ్వరం జలాలతో నిండుకుండలా కొత్త చెరువు మారడంతో వారిలో ఆనందం ఊగిసలాడుతోంది. చొప్పదండి శాసనసభ్యులు సుంకె రవిశంకర్ రైతులతో కలిసి చెరువు వద్ద శుక్రవారం జలహారతి ఇచ్చి పూజలు నిర్వహించారు. 40 ఏళ్లుగా నిండని చెరువు సిఎం కేసీఆర్ కృషి వల్లనే నిండిందని ఆ గ్రామస్తులు మురిసిపోతున్నారు. కొత్త చెరువుకు నీరు రావడంతో చెప్యాల రైతుల్లో ఎనలేని సంతోషం కనబడుతోంది. గత పాలకుల నిర్లక్షం మూలంగానే ఆ చెరువులోకి ఇన్నేండ్లు నీరు రాలేదని, రైతాంగాన్ని ఎవరూ పట్టించుకోలేదని ఆ గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నీ తానై నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుతో మా కన్నీటి గోస తీరిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టితో రాష్ట్రంలో సాగునీరు, త్రాగునీరు కోసం పరితపిస్తూ ప్రాజెక్టులు కట్టడం జరుగుతుందని, అందులో భాగంగానే మా కొత్త చెరువుకు జలకళ వచ్చిందని కొనియాడుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో రానున్న రోజుల్లో నీటికోసం కష్టాలు పడే రోజులు పోయాయని పేర్కొంటున్నారు. ఈ కొత్త చెరువుకు రెండువైపులా మత్తడి ఉంది, వీటి ద్వారా నీరు ఊరచెరువుకు, దేవుడి చెరువుకు వెళ్తుంది, ఈ మూడు చెరువుల్లోని నీటితో గ్రామంలో రైతులకు నీటి దూరం కానున్నాయని హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Kotha Cheruvu Water Level Filled With Kaleshwaram Water