Home హైదరాబాద్ కొత్వాల్ గూడ, గండిపేటలు ఇక విహార కేంద్రాలు

కొత్వాల్ గూడ, గండిపేటలు ఇక విహార కేంద్రాలు

Kothwalguda and Gandipeta are world and tourist centers

మన తెలంగాణ/ సిటీబ్యూరో: విశ్వనగరానికే మకుటాయమానంగా కొత్వాల్‌గూడ, గండిపేటలను ప్రపంచస్థాయి పర్యాటక, విహార కేంద్రాలుగా తీర్చిదిద్దాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అత్యంత సుందరంగా, ఆహ్లాదకరంగా, వినోదాలకు నెలవుగా, కనువిందుగా దేశంలోనే పప్రథమమైనదిగా కొత్వాల్‌గూడలో నైట్ సఫారీ పార్కును, గండిపేటను పర్యాటక కేంద్రంను అభివృద్ధి పరచాలని ప్రభుత్వం హెచ్‌ఎండిఎను ఆదేశించింది. ఈ మేరకు సోమవారం రాష్ట్ర పు రపాలక శాఖ మంత్రి కె. తారకరామారావు హెచ్‌ఎండిఎ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం కొత్వాల్ గూడలో నైట్‌సఫారీని సింగపూర్‌లోని నైట్‌సఫారిని తలదన్నేలా అభివృద్ధిపరచాలని అథారిటీ అధికారులకు మంత్రి సూచించారు. హైదరాబాద్ నగరమనగానే వినోదాలకు, పర్యాటకానికి పెట్టిందిపేరుగా రూపొందించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు మంత్రి అధికారులకు తెలిపారు. కాగా గతంలో కొత్వాల్ గూడలో పర్యావరణ ఉద్యానవనంను ఏర్పాటుచేయాలని నిర్ణయించినప్పటికీ ప్రస్తుతం నైట్ సఫారీని అభివృద్ధి చేయాలని మంత్రి ఆదేశించారు. సింగపూర్‌లో 40 హెక్టార్‌లో ఏర్పాటు చేసిన నైట్ సఫారీ తరహాలోనే కొత్వాల్ గూడలో 125 ఎకరాల్లో నైట్ సఫారీని తీర్చిదిద్దాలని అందులో కనీసంగా 140 జాతులకు చెందిన జంతుజాలంను ఏర్పాటుచేయాలని భావిస్తున్నారు. ఈ సఫారి నమూనాలు దేశంలోనే ఐకాన్‌గా నిలబెట్టేలా ఉండాలని వారికి సూచించారు. ఈ స్థలానికి ఓ వైపు ఔటర్ రింగ్ రోడ్, మరోవైపు హిమాయత్‌సాగర్‌లు ఉన్నాయని, నైట్ సఫారీకి ఇది అత్యంత అనువైన ప్రాంతమని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. గండిపేట్ జలాశయం సుందరీకరణకు ప్రణాళికలను సిద్దంచేస్తున్నట్టు, ఇది నగరవాసులకే కాకుండా దేశ విదేశీయులకు విహారాల విడిదిగా మారుతుందని మంత్రి కెటిఆర్ వెల్లడించారు. ఈ సమావేశానికి హాజరైన సింగపూర్ నైట్ సఫారీ అభివృద్ది చేస్తున్న సంస్థ ప్రతినిధులు బెర్నాడ్ హారిసన్, అలెక్జాండర్ స్టింగల్‌లు, హెచ్‌ఎండిఎ అధికారులతో కలిసి కొత్వాల్‌గూడలో ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించారు. వారు నైట్ సఫారీకి అనువైన ప్రాంతంగా పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ వచ్చే సెప్టెంబర్ నాటికి నమూనాలు, ప్రతిపాదనలు పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో నగర మేయర్ బొంతు రామ్మోహన్‌రావు, పురపాలక ముఖ్యకార్యదర్శి అరవింద్‌కుమార్, హెచ్‌ఎండిఎ కమిషనర్ చిరంజీవులు, మెంబర్ ఇంజనీర్ బిఎల్‌ఎన్‌రెడ్డి తదితరులు ఉన్నారు.