Home తాజా వార్తలు క్రైస్తవ మిషనరీల సేవలు మరువలేం

క్రైస్తవ మిషనరీల సేవలు మరువలేం

KTR Appreciates Christian Community For Services

 

నేను చిన్నప్పుడు చదివింది ఆ స్కూళ్లలోనే
సిఎం కెసిఆర్ సిసలైన సెక్యులర్, అన్ని మతాలను గౌరవిస్తారు
త్వరలో క్రైస్తవ భవన నిర్మాణం పూర్తి
క్రైస్తవ సలహా మండలి ఏర్పాటుకు ప్రణాళిక : మంత్రి కెటిఆర్

మనతెలంగాణ/ హైదరాబాద్: దేశ స్వాతంత్య్రానికి ముందు నుంచి క్రైస్తవ మిషనరీలు సమాజానికి సేవలు అందిస్తున్నాయని రాష్ట్ర మున్సిపాలిటీ, ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు చెప్పారు. శుక్రవారం బంజారాహిల్స్‌లో బిషప్, క్రైస్తవ ప్రముఖులతో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో కెటిఆర్ మాట్లాడుతూ సమాజానికి క్రైస్తవులు అందిస్తున్న సేవలను ప్రశంసించారు. ప్రపంచంలోని పేదదేశాల్లో క్రైస్తవ మిషనరీలు విద్యా, వైద్య రంగాల్లో అందిస్తున్న సేవలు మరవలేనివన్నారు. క్రైస్తవ మిషనరీలు కొన్ని దశాబ్దాలుగా వైద్య, విద్యా వ్యాప్తికి తమవంతు సేవలు అందిస్తున్నాయని చెప్పారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు హిందూధర్మాన్ని బలంగా నమ్ముతారని ఆయన చెప్పారు. అయితే తాను నమ్మిన హిందూ ధర్మంతో పాటు ఇతర మతాల నమ్మకాలను, ఆచార వ్యవహారాలను సిఎం కెసిఆర్ గౌరవిస్తారని కెటిఆర్ చెప్పారు.

ప్రపంచంలో ఎక్కడ విపత్తులు సంభవించినా అక్కడి క్రైస్తవ సమాజం సేవలు అందించేందుకుముందుంటాయని ఆయన తెలిపారు. విపత్తుల వేళకూడా విశేష సేవా, సహాయం అందిస్తున్నాయని మంత్రి గుర్తు చేశారు. రాష్ట్రంలో క్రైస్తవ సలహామండలి ఏర్పాటుకు ప్రణాళిక సిద్దం చేయాలని మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను కెటిఆర్ కోరారు. సిఎం కెసిఆర్‌కు కొప్పుల ఈశ్వర్ అత్యంత సన్నిహితుడు కాబట్టి ఈ పని ఆయన చేస్తేనే త్వరగా అవుతుందన్నారు. క్రైస్తవ భవన్‌ను త్వరగా పూర్తి చేస్తామని కెటిఆర్ హామీ ఇచ్చారు. కెసిఆర్ పాలనలో అన్నివర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. తెలంగాణలోని పల్లెలు పట్టణాలు అభివృద్ధి దిశలో ముందుకు వెళ్లుతున్నాయని చెప్పారు. స్వరాష్ట్రం ఏర్పడిన అనంతరం అభివృద్ధికి, సంక్షేమానికి ముఖ్యమంత్రి కెసిఆర్ అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారని గుర్తు చేశారు.

దేశానికి తెలంగాణ ధాన్యాగారంగా మారిందని కెటిఆర్ ఆనందం వ్యక్తం చేశారు. అన్నివర్గాల ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్షమని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎస్‌సి, ఎస్‌టి, మైనారిటీ విద్యార్థుల కోసం 940 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేశామని ఆయన గుర్తు చేశారు. గురుకులాల్లో 5లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారని ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం కూడా ఉందని చెప్పారు. ఒక్కో విద్యార్థిపై రాష్ట్ర ప్రభుత్వం రూ.1.20 లక్షలు ఖర్చుచేస్తుందన్నారు. క్రైస్తవ సమాజానికి, వారు అందిస్తున్న సేవలకు టిఆర్‌ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అభివృద్ధి అనేది సమగ్రంగా, సమ్మిళితంగా, అన్నివర్గాల ప్రజలకు అందుబాటులో ఉండాలనేదే రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశమన్నారు. అయితే మనకంటే ఆలస్యంగా స్వాతంత్య్రం పొందిన చైనా కంటే భారతదేశం వెనుకబడి ఉందన్నారు. చైనా ఆర్థిక శక్తిగా ఎదిగిందని చెప్పారు.

దేశంలో మౌలిక వసతుల కల్పన లేకపోతే ఎంత అభివృద్ధి జరిగినా స్థిరమైన, ధీర్ఘకాలిక ప్రయోజనాలు ఉండవన్నారు. అందుకే తెలంగాణ ప్రభుత్వం ఇన్నోవేషన్‌ను ప్రోత్సహిస్తూ మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యత ఇస్తోందని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఉత్పాదక రంగాల్లో పెట్టుబడులు పెట్టడంతో స్థిరమైన అభివృద్ధి సాధించి జిఎస్‌డిపిలో దేశాని కంటే ముందువరుసలో ఉందని చెప్పారు. ఆరుసంవత్సరాల టిఆర్‌ఎస్ పాలనలో అద్భుతమైన ప్రగతి సాధించామనడానికి జిఎస్‌డిపి కొలమానమన్నారు. తెలంగాణ వస్తే శాంతి భద్రతల సమస్యలు వస్తాయని ఆనాడు కొంతమంది అసత్యప్రచారం సేస్తూ ప్రజలను రెచ్చగొట్టారని కెటిఆర్ గుర్తు చేశారు. దేశ, రాష్ట్ర అభివృద్ధిలో క్రైస్తవ మిషనరీల పాత్ర ఉందని చెప్పారు. నేను పుట్టింది మిషనరీ ఆసుపత్రిలోనే నేను ఏడు పాఠశాలలు మారినా ఎక్కువగా చదువుకుంది మిషనరీ స్కూళ్లలోనే అని కెటిఆర్ తెలిపారు.

కరోనా సమయంలోను మిషనరీ ఆసుపత్రులు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని చెప్పారు. మహాత్మగాంధీ 150 జయంతి సందర్భంగా సిఎం కెసిఆర్ దేశాభివృద్ధి కోసం కేంద్రానికి పలు సూచనలు చేశారు. దేశప్రధానికి చెప్పిన అభివృద్ధి ఫార్మాలనే సిఎం కెసిఆర్ రాష్ట్రంలో అమలు చేసి అభివృద్ధి సాధిస్తుంటే కేంద్ర మాత్రం అనుసరించడం లేదన్నారు. వైవిధ్యాల సమాహారమైన మనదేశంలో ప్రతి 150 కిలోమీటర్లకు భాష, యాస మారుతుందన్నారు. కరోనా ప్రారంభంలో పిపిఇ కిట్లను కూడా విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నామన్నారు. ప్రస్తుతం మనదగ్గర అవసరానికి మించిన పిపిఇకిట్లు, మందులు ఉన్నాయని తెలిపారు.

క్రైస్తవుల సంక్షేమానికి ప్రాధాన్యత

మంత్రి కొప్పుల ఈశ్వర్
క్రైస్తవ మతపెద్దల సూచనల మేరకు ప్రభుత్వం వారికి సహకరిస్తుందని రాష్ట్రం సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని క్రైస్తవులు ప్రార్థనలు చేశారని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమనేత కెసిఆర్ సిఎంగా ఉండటంతో అభివృద్ధి వేగవంతం అవుతుందని, అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి, సంక్షేమం అందుతుందన్నారు. కెటిఆర్ చెప్పినట్లు క్రైస్తవ సలహామండలి విషయాన్ని సిఎం కెసిఆర్ దృష్టికి తీసుకు వెళ్లి ఏర్పాటుకు కృషిచేస్తానని హామీ ఇచ్చారు.

మైనారిటీ సంక్షేమశాఖ నుంచి 24 రెసిడెన్షియల్ పాఠశాలలను ప్రారంభించుకుంటే అందులో ఎనిమిది వేల మంది క్రైస్తవ పిల్లలు చదువు కుంటున్నారన్నారు. క్రైస్తవుల ఆస్తులను కాపాడేందుకు ప్రత్యేక శ్రద్ధవహిస్తామని మంత్రి కొప్పుల ఈశ్వర్ హామీ ఇచ్చారు. మంచి నాయకత్వం ఉంటేనే మంచి ఆలోచనలు వస్తాయనడానికి తెలంగాణ ప్రభుత్వం ఉదాహారణ అన్నారు. అభివృద్ధిలో దేశానికి తెలంగాణ రోల్‌మోడల్‌గా ఉందన్నారు. ఈ సమావేశంలో నామినేటెడ్ ఎంఎల్‌ఏ స్టీఫెన్ సన్, శాసనమండలి సభ్యుడు రాజేశ్వర్ రావు, సికింద్రాబాద్ బిషప్ తుమ్మ బాల తదితరులు పాల్గొన్నారు.

KTR Appreciates Christian Community For Services