Thursday, April 25, 2024

రైళ్ల తయారీలో తెలంగాణ శకం

- Advertisement -
- Advertisement -

 దేశంలోనే ప్రైవేట్ రంగంలో రాష్ట్రంలో అతిపెద్ద రైల్వే కోచ్ ఫ్యాక్టరీ
 రంగారెడ్డి జిల్లా కొండకల్ గ్రామంలో 100 ఎకరాల్లో రూ.1000 కోట్లతో మేధా సంస్థ ఫ్యాక్టరీని నెలకొల్పడం రాష్ట్రానికి   గర్వకారణం
 హైదరాబాద్ మెట్రోకు ఇక్కడి నుంచే లోకోమోటివ్‌లు రావాలి
 కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీకి కేంద్రం చొరవ చూపాలి : మంత్రి కెటిఆర్

KTR bhoomi Puja for Railway Coach Factory

మన తెలంగాణ/హైదరాబాద్: దేశంలోనే అతిపెద్ద రైల్వే కోచ్ ఫ్యాక్టరీ తెలంగాణ రాష్ట్రానికి రావడం శుభపరిణామమని రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ అన్నారు. ఈ ఫ్యాక్టరీ రాకతో రైల్ కోచ్ తయారీలో రాష్ట్రం నూతన ఒరవడిని సృష్టించనుందన్నారు. పురోగామి రాష్ట్రం తెలంగాణ అని ఆయన అభివర్ణించారు. స్వయం సమృద్ధి చెందుతున్న రాష్ట్రంలో అంతర్జాతీయ సంస్థలు తమ పరిశ్రమలను నెలకొల్పేందుకు ముందుకు వస్తున్నాయని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత పారిశ్రామిక రంగంలో ఎంతో అభివృద్ధి సాధించామన్నారు. గురువారం రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం కొండకల్ గ్రామంలో సుమారు రూ.1000 కోట్లతో నెలకొల్పనున్న మేధా రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు, విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తో కలిసి మంత్రి భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ, తెలంగాణలో ఇప్పటికే విమానాలు, హెలికాప్టర్లు, ట్రాక్టర్లు, బస్సుల విడి భాగాలు తయారవుతున్నాయని, ఇప్పుడు రైల్ కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణం చేసుకుంటున్నామన్నారు. తెలంగాణకు చెందిన మేధా సర్వో కంపెనీ… ప్రపంచ స్థాయి రైల్ కోచ్ ఫ్యాక్టరీని స్థాపించడం గర్వకారణమని మంత్రి అన్నారు.

మేధా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ భారత దేశపు అతి పెద్ద ప్రయివేటు రంగ రైల్ కోచ్ ఫ్యాక్టరీగా అవతరిస్తుందన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. కొండకల్ శివారులో 100 ఎకరాల్లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నిర్మించనున్నారు. 2022 నాటికి ఈ ఫ్యాక్టరీ నిర్మాణ పనులు పూర్తి కానున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ కంపెనీ రావడం వల్ల ప్రత్యక్షంగా 2200 మంది (1000 మందికి ప్రత్యక్షంగా, మరో 1200 మందికి పరోక్షంగా) నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయన్నారు. ఇందులో సంవత్సరానికి వివిధ రకాల 500 కోచ్‌లు, మరో 50 లోకోమేటివ్ కోచ్‌లను తయారు చేసే లక్షం గా కంపెనీ పెట్టుకుందని వివరించారు.ప్రపంచవ్యాప్తంగా 5 ఖండాల్లో ఈ సంస్థ కార్యకలాపాలు విస్తరించాయన్నారు. ఇప్పటికే రైల్వేలో రూ.30 వేల కోట్లతో ప్రైవేటు సంస్థలను రాష్ట్రం ఆహ్వానిస్తోందన్నారు. హైదరాబాద్ మెట్రో విస్తరణకు ఇక్కడి నుంచే లోకోమోటివ్స్ రావాలని మంత్రి కెటిఆర్ అభిలాషించారు. ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ ఇక్కడి నుంచే లోకోమోటివ్స్ రావాలని ఆకాంక్షించారు. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం వరంగల్‌లోని ఖాజీపేట్‌లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటుకు కేంద్రం చొరవ తీసుకోవాలని సూచించారు. హైదరాబాద్ మెట్రో రైళ్ళను ఇప్పటి వరకు కొరియా నుంచి తెప్పించుకున్నామని, ప్రస్తుతం అవి మన రాష్ట్రంలోనే తయారుకాబోతున్నాయని తెలిపారు. మేధా సంస్థ దేశాన్ని ఆకర్సించే విధంగా అభివృద్ధి చెందినందుకు తెలంగాణ పౌరుడిగా తాను గర్వపడుతున్నట్లు ఆయను పేర్కొన్నారు. గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే రైళ్ళు అందుబాటులోకి వస్తే పౌరుల జీవన ప్రమాణాలు పెరుగుతాయని మంత్రి కెటిఆర్ వ్యాఖ్యానించారు. కాగా రాష్ట్రంలో ఇటీవలే కొత్త ఎలక్ట్రిక్ పాలసీ తీసుకొచ్చామన్నారు. ఈ రంగంలో పెట్టుబడులు పెడితే రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

ఈ పరిశ్రమ కోసం 2017 అక్టోబర్‌లోనే మేదా సర్వో డ్రైవ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకున్న విషయాన్ని ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ గుర్తు చేశారు. ఇందుకుగానూ టిఎస్‌ఎఐసి ఇప్పటికే రైతుల నుంచి వంద ఎకరాల స్థలాన్ని సేకరించిందన్నారు. 1984లో ప్రారంభమైన మేధా కంపెనీ ప్రస్తుతం రూ. 2100 కోట్ల టర్నోవర్ సాధించడం గర్వకారణమని మంత్రి కొనియాడారు. రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లా పరిధిలోని 106 ఎకరాల్లో ఏర్పాటు చేసే ఈ ఫ్యాక్టరీలో స్థానికులకు ఎక్కువ ఉద్యోగ అవకాశాలు కల్పించాలని మంత్రి అన్నారు. స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే పరిశ్రమలకు ప్రోత్సాహకాలు అందించాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి పేర్కొన్నారు. టిఎస్….ఐపాస్ ద్వారా వృత్తి నైపుణ్యతపై శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకొనున్నట్లు మంత్రి తెలిపారు. మేధా కంపెనీ కొండకల్, వెల్మల్ గ్రామాలను దత్తత తీసుకొని సామాజిక కార్యక్రమాలను చేపట్టాలని ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ సూచించారు.
స్థానిక శాసనసభ్యుడు కాలే యాదయ్య మాట్లాడుతూ, చేవెళ్ల నియోజక వర్గంలో పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. మరిన్ని పరిశ్రమలు ఇక్కడ నెలకొల్పేందుకు చొరవ తీసుకోవాలని అన్నారు. పరిశ్రమల్లో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని అన్నారు. 111 జిఒను సడలించి 87 గ్రామాలకు లబ్ది చేకూర్చేలా చూడాలని ఆయన మంత్రి కెటిఆర్‌కు విజ్ఞప్తి చేశారు.
అనంతరం మేధా కంపెనీ ఎక్సిక్యూటివ్ డైరెక్టర్ అశోక్ రెడ్డి మాట్లాడుతూ మేధా రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో వచ్చే నాలుగు సంవత్సరాల్లో వెయ్యి కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. ప్రత్యక్షంగా మరో వెయ్యి మందికి ఉపాధి కల్పించడం జరుగుతుందన్నారు. 500 రైల్వే కోచ్‌లు, 50 లోకో మేటివ్ ఇంజన్లు తయారు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిఎస్ ఐఐసి చైర్మన్ గ్యాదరి బాలమల్లు, చేవేళ్ల ఎంపి రంజిత్ రెడ్డి , మెదక్ ఎంపి ప్రభాకర్ రెడ్డి, ఎంఎల్‌సి మహేందర్ రెడ్డి , మెదక్ నియోజకవర్గ శాసనసభ్యుడు భూపాల్ రెడ్డి ,వికారాబాద్ నియోజకవర్గ శాసనసభ్యుడు ఆనంద్ , రంగారెడ్డి మెదక్ జెడ్‌పిచైర్ పర్సన్లు, పరిశ్రమలు, ఐటి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయెష్ రంజన్, రంగారెడ్డి, సంగారెడ్డి కలెక్టర్లు అమోయ్ కుమార్, హన్మంతరావు , టిఎస్‌ఐఐసి ఎండి వెంకట నర్సింహారెడ్డి, మేధా కంపెనీ ఎం.డి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

KTR bhoomi Puja for Railway Coach Factory

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News