Saturday, April 20, 2024

పురఎన్నికల్లో కెటిఆర్ అంతాతానై

- Advertisement -
- Advertisement -

Ktr criticism on bjp in election campaign ending today

యావత్ దేశమూ ఆసక్తితో ఎదురుచూస్తున్న, చర్చిస్తున్న జిహెచ్‌ఎంసి ఎన్నికలు ముగిశాయి. నాల్గవ తారీఖు మధ్యాహ్నానికి గెలుపు వాసనలు కొద్దిగా తెలుస్తాయి. ఇవిఎంలయితే మధ్యాహ్నానికే గెలుపు గుర్రం ఏదో తెలిసిపోయేది. బ్యాలట్ పేపర్లు కనుక కౌంటింగ్ ఆలస్యం కావచ్చు. వారం రోజులుగా అన్ని పార్టీలు శక్తివంచన లేకుండా కృషి చేశాయి. భారతీయ జనతా పార్టీ అయితే స్థానిక గుర్రాల్ని కాదని భారత దేశంలోని నలుమూలల నుండి గుర్రాల్ని ప్రచారంలో దించాయి. హేమాహేమీలైన ఫడ్నవీస్, నడ్డా, ఆదిత్యానంథ్ దాస్, అమిత్ షా, స్మృతి ఇరాని తదితరులు జంటనగరాల్లో బిజెపి గెలుపు కోసం తీవ్ర ప్రయత్నాలే చేశారు. వ్యాక్సిన్ పరిశీలన పేరుతో చివరికి ప్రధాని మోడీ కూడా హైదరాబాద్ వచ్చి వెళ్ళారు. మరుసటి రోజు కాని, ఆయన వచ్చిన రోజు అన్ని ఛానల్స్‌లోనూ, పత్రికల్లోనూ అంతటా ఆయన న్యూసే కన్పించింది. ఇది కూడా ఖచ్చితంగా ప్రచారంలో భాగమే. దుబ్బాక గెలుపే వాళ్ళను అలా పరిగెత్తేలా చేసింది. ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షులైన బండి సంజయ్ అయితే వారం రోజుల పాటు కునుకు లేకుండా శ్రమించాడు. కార్యకర్తల్ని కూడా కదనరంగంలో పరుగులు తీయించాడు. ఆయన చేసిన కాంట్రవర్సీలు అన్నీఇన్నీ కావు.
చివరికి యుద్ధ వాతావరణమే అలుముకుంది. ఆయన అలా మాట్లాడడం బహుశా ఆ పార్టీ ఎత్తుగడల్లో ఒక భాగం కావచ్చు. సర్జికల్ స్ట్రైక్ పాత బస్తీపై అంటూ ఆయన చేసిన ప్రకటన అల్లకల్లోలాన్నే సృష్టించింది. ఎంఐఎం పార్టీలో అగ్గి మంటల్ని రగిలించింది. ఆ ఆవేశపు , ఆందోళన మధ్య ఆ పార్టీ అక్బరుద్దీన్ చివరికి పి.వి. నరసింహారావు, ఎన్టీ రామారావు విగ్రహాల్ని కూడా దురాక్రమణ క్రింద తొలగించాలని ఘాటుగా స్పందించి వాతావరణాన్ని మరింత రగిల్చాడు. ఆ పార్టీ ఎంఎల్‌ఎ అయిన ముంతాజ్ ఖాన్ అధికారమనేది ఎంఐఎం వాకిట్లో గుమస్తా లాంటిది తలచుకొంటే టిఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని కూల్చగలమని కూడా ప్రకటించాడు. ఈ ప్రకటన మైత్రి బంధంతో కొనసాగుతున్న టిఆర్‌ఎస్‌కు కాస్తా ఇబ్బంది కూడా కల్గించింది. ఇక ఈ ఎన్నికలు ప్రచారంలో ఎందుకనో ఏమో కాంగ్రెస్ కాస్తా వెనుబడిపోయిందని నిర్మొహమాటంగా చెప్పవచ్చు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి, విహెచ్ హనుమంతరావు, దయాకర్ తదితరులు కొద్దో గొప్పో పార్టీ విజయానికి కృషి చేశారు. మరి ప్రజలు వారికి ఫలాలు ఇచ్చారా లేదా అన్నది 4వ తారీఖున చూడాలి.
ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను దాదాపు 15 సంవత్సరాల పాటు పాలించిన తెలుగుదేశం పార్టీ పరిస్థితి నేడు మరింత విచిత్రంగా వుంది. రాష్ట్రం విడిపోయాక ఆ పార్టీ జాతీయ పార్టీగా తనకు తాను ప్రకటించుకొంది. నేటికీ ఆ పార్టీకి కొద్దోగొప్పో అభిమనులున్నారు. చంద్రబాబు రాకపోయినా ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ నందమూరి తారక రామారావు గారంటే తెలంగాణలో చాలా మందికి వల్లమాలిన అభిమానం. కరణం, ఫత్వారీ వ్యవస్థల్ని రద్దు చేసి ఆయన తెలంగాణ ప్రజల హృదయాల్లో నిలిచిపోయారు. ఈ తరం తెలంగాణ ప్రజలకు రామారావు కీర్తి గురించి బహుశా తెలియకపోవచ్చు. అలాంటి తెలుగుదేశం పార్టీ ఈ సారి 104 స్థానాల్లో తన అభ్యర్థుల్ని నిలబెట్టింది. మరి ఈ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు కాని, ఆ పార్టీ వారసుడు లోకేశ్ కాని, లోకేశ్ మామ, అగ్ర హీరో బాలకృష్ణ కానీ ఎక్కడగా తెలుగుదేశం అభ్యర్థుల విజయానికి కృషి చేయలేదు. జంట నగరాల ఓటర్ల మొహం అయినా చూడలేదు. ఆ రోజుల్లో కెసిఆర్ అభ్యర్థిని ఎమ్మెల్యే ఎన్నికల్లో కొనాలని విఫల ప్రయత్నం చేసిన నారా చంద్రబాబు నాయుడు, కెసిఆర్ అంటే భయమో, లేదా బిజెపికి వ్యతిరేకంగా ప్రచారం చేయడం ఇష్టం లేకనో చంద్రబాబు ఈ ఎన్నికల్లో మొహం చాటేశాడు. కరోనా కష్టకాలంలోనూ నగరం వరదల్లో మునిగిపోయినా చంద్రబాబు హైదరాబాదులో ఉంటూనే కనీసం పట్టించుకోకపోవడం కూడా కారణం కావచ్చు. చంద్రబాబును నమ్ముకొని ఎన్నికల్లో దిగిన 104 గుర్రాలు చతికిలపడ్డాయి. తెలుగుదేశం పార్టీ తెలంగాణ అధ్యక్షులు రమణ, తదితర చోటా మోటా నాయకులు గుర్రాల్ని పరిగెత్తించాలని తమ శక్తి కొద్దీ ప్రయత్నించారు. చంద్రబాబు దిశ, దశ నిర్దేశనం చేయకపోవడం ఆ పార్టీని ఆత్మహత్యకు గురిచేసింది. వేలాది వాహనాలలో, అంతకన్నా ఎక్కువ కార్యకర్తలతో నగరంలోని ఎన్టీఆర్ భవన్ వొకప్పుడు పసుపు జెండాల రెపరెపలతో ఆ దారిలో అందర్నీ ఆకర్షించేది. అందర్నీ ఇబ్బందులకు గురిచేసేది.
మరి ఈ రోజు ఆ పార్టీ శోక సముద్రపు భవంతిలా నిట్టూరుస్తుంటుంది. ఏదీ తల్లి నిరుడు కురిసిన… మనకు గుర్తుకు తెస్తుంటుంది. పాపం.. జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో ఆ పార్టీ ఎందుకు పోటీ చేసిందో ఎవరికీ అర్థం కావడం లేదు. ఆ పార్టీకి చెందిన ఓ నాయకుడు ఇందుకు ఓ కథ చెప్పాడు. అది విన్న నాకు విచిత్రం అన్పించింది. ఈ ఎన్నికల్లో తమకు పడ్డ ఓట్ల శాతాన్ని చూపించి అదే తమ బలం అని, రండి కలుద్దాం అని చంద్రబాబు బిజెపిని స్నేహానికి ఆహ్వానిస్తాడట. చాలా వింతగా అన్పించింది ఆయన విశ్లేషణ. ఏమో గుర్రం ఎగురావాచ్చు.. ఈ పోలింగ్ రోజంతా టివి 5 లో ఓ స్లోగన్ అందర్నీ ఆకర్షించింది. ఓటు వేయని వారు గాడిదతో సమానం అన్నది ఆ స్లోగన్. మరి ఈ రోజు పోలింగ్‌లో చంద్రబాబు, లోకేశ్, బాలకృష్ణలు మరి ఓటు వేసినట్లు లేదుగా! పోన్లే వాళ్ళకు మినహాయింపు ఇద్దాం. 2016లో జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో తెలుగుదేశం ఒక్క స్థానంలో మాత్రమే గెలుపొందింది. మరి ఈ మారో!!
మరి ఎంఐఎం పార్టీ! ఈ పార్టీ భారతదేశమంతా విస్తరించాలన్న పెద్ద సంకల్పంతో గత దశాబ్దం నుండి ఉరకలేస్తోంది. మొన్న ప్రతిష్ఠాత్మకంగా జరిగిన బీహార్ ఎన్నికల్లో ఈ పార్టీ 5 స్థానాల్లో నెగ్గి మంచి దూకుడు మీదుంది.ఆ హై ఎనర్జీతో ఈ సారి జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో రంకెలు వేసింది. ఎన్నడూ లేని విధంగా ఇతర పార్టీల్ని, ముఖ్యంగా తమ మిత్రపక్షం అయిన టిఆర్‌ఎస్‌ను కూడా తీవ్రంగా విమర్శించింది. అన్నదమ్ములిద్దరరూ ఒకరు బిజెపిపై, మరొకరు టిఆర్‌ఎస్ పార్టీని విమర్శిస్తూ ప్రచారం నిర్వహించారు. 2016లో ఈ పార్టీ 60 డివిజన్లలో పోటీ చేసి 44 స్థానాల్లో గెలుపొందగా ఈ ఏడు 51 స్థానాల్లో పోటీ చేసి గతం కన్నా ఎక్కువ స్థానాల్లో గెలుపొంది మేయర్, డిప్యూటీ మేయర్ స్థానాల్ని కైవసం చేసుకోవాలని కల కంటోంది. హిందూ, ముస్లిం ఓటర్లను పోలరైజ్ చేసుకునేందుకు ఈ ఎన్నికల్లో బిజెపి, ఎంఐఎం పార్టీలు శక్తివంచన లేకుండా వొకరిపై ఒకరు విద్వేషాల్ని రెచ్చగొట్టాలని ప్రయత్నించారు. అసదుద్దీన్, అక్బరుద్దీన్‌తో పాటు ఆ పార్టీ ఎంఎల్‌ఎలు కూడా ఆ పార్టీ విజయానికి రేయింబవళ్లు కృషి చేశారు. మరి వారికి ఫలితాలు ఎలా వస్తాయో చూడాలి.
గ్రేటర్ హైదరాబాద్‌కు భారతదేశంలోనే అత్యంత ప్రత్యేకత ఉంది. ఇక్కడ భారతదేశంలోని అన్ని రాష్ట్రాల నుండి వచ్చిన ప్రజలు ఎంతో అన్యోన్యంగా కలసిమెలసి జీవనం సాగిస్తున్నారు. భిన్నత్వంలో ఏకత్వం మనకిక్కడ కన్పిస్తుంది. వొకరి జీవనంలో ఇంకొకరు జోక్యం చేసుకోరు. అత్యంత సామరస్యంగా ఇక్కడ జీవిస్తారు. అనేక కారణాలతో తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలుగా విడిపోయినా ఆంధ్రప్రదేశ్ నుండి ఇక్కడుంటున్న లక్షలాది కుటుంబాలు ఇక్కడే స్థిరపడి తెలంగాణ బిడ్డలుగా కలసి పోయారు. విడిపోక ముందు కొన్ని కొన్ని స్వల్ప ఘర్షణలు జరిగినా కూడా ఇక్కడ ఎలాంటి ఏ చిన్న సంఘర్షణ కూడా జరగలేదు. కెసిఆర్ అన్నట్లుగానే అందర్నీ తమ బిడ్డలుగానే గుండెల్లో పెట్టుకొని కాపాడుతున్నారు. ఆ విషయంలో కెసిఆర్ ఎన్నటికీ గ్రేట్. హ్యాట్సాఫ్!
ఇక తెలంగాణ రాష్ట్ర సమితిని అందరూ ముద్దుగా టిఆర్‌ఎస్ అనే పిలుస్తుంటారు. ఈ పార్టీ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చేసిన కృషి, సాగించిన యుద్ధం తెలంగాణ చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతుంది. ఆ పార్టీ సారథి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రెండు సార్లు జరిగిన సాధారణ ఎన్నికల్లో కూడా టిఆర్‌ఎస్ పార్టీ విజయబావుటా ఎగుర వేసింది. ఒక్క దుబ్బాక ఉప ఎన్నిక తప్ప 6 సంవత్సరాలలో జరిగిన అన్ని ఉప ఎన్నికల్లో కూడా టిఆర్‌ఎస్ పార్టీ నెగ్గుతూ వస్తోంది. ప్రతిపక్షాలు ఎన్ని మాటలు మాట్లాడినా, ఎన్నెన్ని విమర్శలు చేసిన కెసిఆర్ మైక్ పట్టుకొని ఒక్కసారి మాట్లాడితే ఆ మాటలు తూటాలై శత్రుపక్షాలను తుద ముట్టిస్తాయి. ఆ మాటల్లో, ఆ సభల్లో అంతటి వేడి, వాడి దాగి వుంటాయి. పైకి ఎవరెన్ని విమర్శలు చేసినా, ఆఖరుకు వాళ్ళంతా కెసిఆర్ ముందు బళాదూరే! అంతటిశక్తి వున్న బక్క పల్చని మహా పర్వతం కెసిఆర్. మరి ఇప్పడు జరిగిన ఎన్నికల్లో విజయ బావుటా ఎగరేసే బాధ్యత కెసిఆర్, కల్వకుర్తి తారకరామారావు భుజస్కంధాలపై వుంచారు.
కెటిఆర్ కూడా ఒకనాటి కెటిఆర్ కాదు. నాటికి, నేటికి ఎంతో పరిణితి చెందిన పరిపూర్ణ వ్యక్తి. తొలి రోజుల్లో అక్షర కూర్పుల్లో పొరబాట్లు, తడబాట్లు వుండేవి. కానీ ఈ రోజు తండ్రితో దాదాపు సమంగా మాటాడేస్తున్నాడు. అలసిపోనితత్వం, ఆగ్రహం చెందని గుణం ఆయన స్వంతాలు. పలుకుల్లో పంచ్‌లుంటాయి, మంత్రోచ్ఛరణలా మనసుల్ని కట్టిపడేస్తాయి. ఎన్నికలు ప్రకటించిన నాటి నుండి కాలికి బలపం కట్టుకొని తిరిగారు. పగలు, రేయి కూడా ఒకే ఉత్సాహం, పార్టీని అంతా తానై నడిపించారు. ఆయన రోడ్ షోలకు ఇసుకేస్తే రాలనంత జనం, సభల్లో ఒకే చప్పట్లు, ఈలలు, కేకలు కనిపించాయి. కెసిఆర్‌ని కొన్ని సందర్భాల్లో మరిపించారు. సింహం ఒక్కటే వస్తుంది మరి గుంపలు గుంపులుగా వచ్చేదెవరు? అంటూ సభకొచ్చిన వారి నోటి నుంచే ఇతర పక్షాల్ని పందులు అంటూ అన్పించిన చమత్కారం ఆయనది. అదే విధంగా కేంద్రం నుండి ఎవరెవరో వస్తున్నారంటే వెల్‌కం రండి అయితే, వట్టి చేతుల్తో రాకుండా కాస్తా నిధుల్ని తీసుకురండి అంటూ బిజెపి నాయకులపై చమత్కారాల్ని విసిరేవారు. ఒకడేమో సమాధుల్ని కూలుస్తానంటాడు, ఇంకొకరు మసీదులు కూలుస్తానంటాడు. ఇదేం పంచాయితీ అంటూ బిజెపి, ఎంఐఎం పార్టీల్ని సుతిమెత్తగా విమర్శించేవారు. ప్రతి సభలోనూ కేంద్రం, రాష్ట్రంపట్ల చూపుతున్న సవతి తల్లి ప్రేమను ఎండగట్టడం, హైదరాబాద్‌కు మంజూరు చేసిన ఐటిఆర్ కేంద్రాన్ని కేంద్రం కేన్సిల్ చేయడం, ఇంత పెద్ద వరదలొచ్చినా కేంద్రం నుండి చిల్లి గవ్వ సహాయం కూడా చేయకపోవడం, నగరంలోని శాంతి భద్రతలు ఆయన మాటల్లో బాగా ద్యోతకమయ్యేవి. సభకు వచ్చినవాడు ఎంతో ఆసక్తిగా వినడం కన్పించింది. ఇక ఆయనకు తోడుగా తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా ప్రచార పర్వంలో చురుకైన పాత్ర వహించాడు. సభల నిర్వహణలో కెసిఆర్ సభ విజయంవంతం చేయడంతో ఆయన శ్రమను మరవలేము. ఇలా ఒక క్రమ పద్ధతిలో, పకడ్బందీ వ్యూహాలతో టిఆర్‌ఎస్ ప్రచార పర్వాన్ని దిగ్విజయంగా పూర్తి గావించింది. ఒక్క సభ ద్వారా కెసిఆర్ తన వాగ్ధాటిని ప్రదర్శించగల్గినా కెటిఆర్ మాత్రం ఏ మాత్రం టెంపో తగ్గకుండా ప్రచారాన్ని నిర్వహించి అందరి మన్ననల్ని అందుకున్నారు. ఓటర్లలో టిఆర్‌ఎస్ పైన విశ్వాసాన్ని దాదాపు రెట్టింపు చేశారు. ఆయన శ్రమ వృథా కాకుండా టిఆర్‌ఎస్ విజయం బావుటా ఎగురవేయడం ఖాయమని అత్యధికులు అభిప్రాయపడుతున్నారు.
పోలింగ్ మాత్రం అందరిలో నిరాశనే మిగిల్చింది. అన్ని పార్టీల ఉపన్యాసాల హోరు మాత్రం జనాల్ని ప్రేరేపించి, ఓటింగ్ వైపు నడిపించలేకపోయాయి. 2016 కన్నా దాదాపు ఒకట్నిర శాతం అధికం మాత్రే పోలింగ్ కావడం చాలా దురదృష్టకరం. దీనికి అనేక కారణాలు కూడా తోడయ్యాయనే చెప్పవచ్చు. అధికార్లు, అభ్యర్థులలో కూడా లోపం దాగి వుంది. కార్పొరేటర్లు, ఎక్కువగా వీధి ప్రచారానికి ప్రాధాన్యత ఇచ్చారే కానీ, స్వయంగా ఇల్లు ఇల్లు తిరిగి ఓటర్లను అభ్యర్థించడం జరగలేదు. ప్రభుత్వం కూడా అత్యధిక ప్రాంతాల్లో ఓటర్ల స్లిప్పులు పంచడం జరగలేదు. నాదీ ఓ చిన్న ఘటన. నేనూ, మా ఆవిడ ఓటు వేద్దామని ఉత్సాహంగానే వెళ్ళాం తీరా అక్కడికెళ్లాక ఓటర్ల లిస్టులో నా పేరు గల్లంతయింది. 2018లో అయితే నేను మాదాపూర్‌లో వుంటే నా బూత్ శంకరపల్లిలో వుండేది.. అయినా వెళ్లి బాధ్యతగా ఓటు వేశాము. మరి ఈసారి ఎలా నా ఓటు గల్లంతయిందో? చాలా మంది విషయంలో ఇలానే జరిగిందని అక్కడి ఏజెంట్లు సెలవిచ్చారు.
ఓటర్లతో కూడా కొంత మేర బాధ్యతా రాహిత్యం కూడా కన్పించింది. ఎంత ప్రచారం చేసినా, ఎంత ఎడ్యుకేట్ చేసినా ఓటు వేయడానికి అశ్రద్ధ వహించారు. నాలుగు దశాబ్దాల క్రింత ఓటు వేయడం ఓ పండుగగా వుండేది. పల్లెల్లో అయితే పండుగలా వుండేది. ఈ రోజు అలాంటి ఉత్సాహం, ఉద్దేశం ఎక్కడా కన్పించలేదు. ఓటర్లలోని నిర్లక్ష్య భావం క్షమించరానిది. ప్రజాస్వామ్యానికే ఇది గొడ్డలిపెట్టు. అభ్యర్థులు, పార్టీలు నచ్చకపోతే నోటా మీదనైనా ఓటు వేయవచ్చు. ఎందుకిలా జరగుతోంది? రానురాను ఓటు వేసేందుకు ప్రభుత్వాలే ఓటర్లకు ఇన్సెంటివ్స్ ఈయాల్సి వస్తుందేమో! కరోనా ప్రభావం అని కూడా చెప్పలేము. బజార్లన్నీ కిక్కిరిసి పోతున్నాయి. గతంలోలా ఎక్కడ చూసినా ట్రాఫిక్ పెరిగిపోయింది. వాణిజ్య, వ్యాపారాలు ఊపిరిపోసుకున్నాయి. మరి దానిని సాకు చెప్పడం కూడా కరెక్టు కాదు. ఇటీవల కురిసిన వర్షాలు ఓటర్లపై కొంత ప్రభావాన్ని కొన్ని ప్రాంతాల్లో చూపించి వుండవచ్చు. కొన్ని పార్టీలు మత విద్వేషాలు రెచ్చగొట్టడం కూడా ప్రజల్లో కొంత భయానక వాతావరణాన్ని కల్పించిందని కొందరి ఉవాచ. దీనిని కూడా ఆలోచించాలి. ఇలాంటి పోలింగ్ శాతంతోనే 2016లో టీఆర్‌ఎస్ 99 స్థానాల్ని గెలిచింది. మరి అదే ఫలితాలు రావచ్చు. ఇంకొక్క రోజు వేచి చూద్దాం!

డా. సమ్మెట
విజయ్ కుమార్
8886381999

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News