Home తాజా వార్తలు టిఆర్ఎస్ దే జైకిసాన్

టిఆర్ఎస్ దే జైకిసాన్

KTR
అందరికి అదొక నినాదమే మాకు అదే విధానం

మోడీ వేడి తగ్గింది… కాంగ్రెస్ గాడి తప్పింది
కెసిఆర్ ఆలోచన దేశానికి ఆచరణగా మారింది
కాంగ్రెస్ నేత అనిల్ జాదవ్ టిఆర్‌ఎస్‌లో చేరిక సందర్భంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.రామారావు 

హైదరాబాద్: దేశంలో మోడీ వేడి తగ్గింది… కాంగ్రెస్ గాడి తప్పిందని టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.రా మారావు అన్నారు. కాంగ్రెస్‌కు జోష్ లేదు… బిజెపికి హోష్ లేదని వ్యాఖ్యానించారు. గత ఎన్నికల్లో మోడీ హవా ఉండేదని, ఆయన దేశాన్ని ఉద్దరిస్తారని ప్రజలు బిజెపిని మెజార్టీ సీట్ల లో గెలిపించారని గుర్తు చేశారు. అదిలాబాద్ జిల్లా నేతలు అనిల్ జాదవ్, గోసుల శ్రీనివాస్ యాదవ్‌లతో పాటు నాయకులు, కార్యకర్తలు బుధవారం తెలంగాణ భవన్‌లో కెటిఆర్ సమక్షంలో టిఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా కెటిఆర్ అనిల్ జాదవ్‌కు గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి,మాజీ మంత్రి జోగు రామన్న, ఎంఎల్‌సి శ్రీనివాస్‌రెడ్డి, ఢిల్లీలో ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలచారి, ఎంపి నగేష్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ, కేంద్రంలో ఒక్క పార్టీకే 280 మంది ఎంపిల బలం ఉన్పప్పుడు టిఆర్‌ఎస్ 15 గెలిచినా 16 గెలిచినా ఢిల్లీలో ఎవరికీ అవసరం లేదని, కానీ ఇప్పుడు దేవంలో ఆ పరిస్థితి లేదని పేర్కొన్నారు. దేశంలో మోడీ వేడి తగ్గింది…కాంగ్రెస్ ఎప్పుడో గాడి తప్పిపోయిందని అన్నారు. కాంగ్రెస్ పరిస్థితి గతంలో కన్నా ఘోరంగా తయారైందని చెప్పారు. ఎన్ని సర్వేలు చూసినా ఎన్‌డిఎకు 150-160 సీట్లు, యుపిఎకు 100-110 సీట్ల కంటే ఎక్కువ వచ్చే పరిస్థితి కనబడటం లేదని చెప్పారు. అందుకు ఈ ఎన్నికల్లో గెలిచే ఒక్కో ఎంపి ఎంతో కీలకం కాబోతున్నారని వ్యాఖ్యానించారు.

తెలంగాణ బిడ్డలు చైతన్యం చూపించాల్సిన సమయమిది కెటిఆర్ అన్నారు. మోడీ, రాహుల్ జోరు తగ్గింది, ఈ సమయంలో కీలెరిగి వాత పెట్టాలి…అదునుచూసి దెబ్బకొట్టాలని చెప్పారు. ఢిల్లీని శాసించి తెలంగాణకు రావాల్సినవి తెచ్చుకోవాలని పేర్కొన్నారు. కేంద్రంలో యాచించే పరిస్థితి ఉండొద్దంటే 16 మంది గులాబీ సైనికులను గెలిపించాలని అన్నారు. 16 సీట్లిస్తే కేంద్రంలో సర్కార్‌ను నిర్ణయిస్తారా..? అంటూ చాలామంది హేళనగా మాట్లాడుతున్నారని, ఇద్దరు ఎంపిలతో తెలంగాణ తెచ్చిన నేత కెసిఆర్ అని, మరి 16 మంది ఎంపిలను ఇస్తే మరికొందరిని తోడు చేసుకుని కేంద్రంలో పీఠంపై ఎవరు కూర్చోవాలో తెలంగాణ ప్రజలు నిర్ణయించే పరిస్థితి ఉండదా..? అని అడిగారు. అభ్యర్థి ఎవరైనా కెసిఆర్ సైనికుడే అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే రాహుల్‌కు లాభం..బిజెపికి ఓటేస్తే మోడీకి లాభం…టిఆర్‌ఎస్ ఓటేస్తే తెలంగాణకు లాభం అని పేర్కొన్నారు. దేశంలో వీళ్లద్దరే నేతలా…?ఇంకెవరూ లేరా..? అని ప్రశ్నించారు.

కెసిఆర్ ఆలోచన దేశానికి ఆచరణగా మారిందని చెప్పారు. తెలంగాణలో చేపట్టిన రైతుబంధును కాపీకొట్టి ప్రధాని నరేంద్ర మోడీ పిఎం కిసాన్ యోజన, ఎపి సిఎం అన్నదాత సుఖీభవగా తీసుకొచ్చారని విమర్శించారు. ఓట్లు పొందేందుకు కొందరికీ జైకిసాన్ నినాదం మాత్రమే అని, టిఆర్‌ఎస్‌కు జైకిసాన్ అంటే ఒక విధానం అని పేర్కొన్నారు. తెలంగాణ హక్కుల కోసం పేగులు తెగేదాక కొట్లాడే దమ్మున్న ఏకైక పార్టీ టిఆర్‌ఎస్ అని పేర్కొన్నారు. ఢిల్లీలో గులాంలు కావాలా…?తెలంగాణ గులాబీలు కావాలా..? ఆలోచించుకోవాలని అన్నారు. కాంగ్రెస్, బిజెపిలతో ఒరిగిందేమి లేదని, ఆ పార్టీల పాలనలో దేశం ఎలాంటి అభివృద్ది సాధించలేదని విమర్శించారు. దేశంలో ఇంకా పేదరికం ఉందని, రాష్ట్రంలో గిరిజనులు ఆనందంగా ఉన్నారంటే దానికి కారణం సిఎం కెసిఆర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఖాళీ అవుతోందని, పార్టీని నడిపే దమ్ములేక కాంగ్రెస్ నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన వారిని పార్లమెంట్ ఎన్నికల్లో నిలబెడుతున్నారని, కాంగ్రెస్ పార్టీ సంక్షోభంలో ఉందని కెటిఆర్ విమర్శించారు.

KTR Comments on BJP and Congress Parties