Home తాజా వార్తలు ఫస్ట్.. ‘తెలంగాణ’ స్పెల్లింగ్‌ నేర్చుకో సారూ..!

ఫస్ట్.. ‘తెలంగాణ’ స్పెల్లింగ్‌ నేర్చుకో సారూ..!

KTR criticising Digvijay Singh

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీ చీఫ్ రాహుల్‌ గాంధీపై ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కెసిఆర్‌ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ కేంద్ర మాజీ మంత్రి దిగ్విజయ్‌సింగ్‌ చేసిన ట్వీట్‌పై మంత్రి కెటిఆర్‌ ఘాటుగా స్పందించారు. కెసిఆర్‌ వ్యాఖ్యలను ఖండించడం కన్నా ముందు దిగ్విజయ్‌ ‘తెలంగాణ’ స్పెల్లింగ్‌ నేర్చుకోవాలని సూచించారు. దిగ్విజయ్‌సింగ్‌ చేసిన ట్వీట్‌లో తెలంగాణను ఆంగ్లంలో ‘Telangana’కు బదులు ‘Telengana’ అని రాశారు. ఇలా రాయడాన్ని కెటిఆర్‌ తప్పుబడుతూ రిట్వీట్‌ చేశారు. అలాగే తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ కాదన్నారు. అది మీ జాగీర్ కాదని, తెలంగాణ ప్రజలు మీ ఢిల్లీ సుల్తానులకు బానిసలనుకుంటున్నారా? అంటూ కెటిఆర్ తీవ్రంగా స్పందించారు. అసలేం జరిగిందంటే… కెసిఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ ను విమర్శించడంపై దిగ్విజయ్‌ విమర్శిస్తూ ట్వీట్ చేశారు. కెసిఆర్ మాటలను తాను తీవ్రంగా ఖండిస్తున్నానని, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పైనే ఇలాంటి అవమానకర వ్యాఖ్యలేంటని ప్రశ్నించాడు. తెలంగాణ ప్రజలే కెసిఆర్ బుద్ధి చెబుతారని దిగ్విజయ్‌ ట్వీట్ చేశారు. దీనిపై స్పందించిన కెటిఆర్ తెలంగాణ స్పెల్లింగ్ విషయంలో దిగ్విజయ్‌సింగ్‌కు చూరకలంటించారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.